08.01.2026 గురువారమ్
ఓం సాయి శ్రీ సాయి జయయయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక సెప్టెంబర్, అక్టోబర్ 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు.
నేను అనువాదం చేయడం మరచిపోయినా బాబా గుర్తు చేసారు. ఈ రోజు వాటిని ప్రచురిస్తున్నాను.
శ్రీ సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు
శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.
నమ్మకానికి పరీక్ష
ఫిరోజ్ షా గారి వాస్తవిక దృష్టి
మరాఠీ నుండి ఆంగ్లానువాదం.. షంషాద్ మీర్జా
తెలుగు అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్ -- 9440375411 & 8143626744
1917 వ.సం. లో బొంబాయి నుండి శ్రీ హార్మున్ జీ పద్మాజీ, పార్శీ దంపతులు షిరిడీ వచ్చి శ్రీ సాయిబాబావారి దర్శనం చేసుకొన్నారు. సాయిబాబాను ప్రత్యక్షంగా దర్శించుకుని ఆయన దీవెనలు అందుకున్న మహదానందాన్ననుభవించి బాబా ఫోటోతో బొంబాయికి తిరిగి వచ్చారు. ఆ ఫోటోని తమ గృహంలో ఎంతో భక్తిభావంతో ఒక బల్ల మీద పెట్టుకున్నారు.
వారి కుమారుడు ఫిరోజ్ షా అప్పట్లో ఇంకా చదువుకుంటున్నాడు. అతను ఆ ఫోటోని చూసి బాబా మీద మీకంత నమ్మకమేమిటని తల్లిదండ్రులని ప్రశ్నించాడు. “ఎంతోమంది సాధువులున్నారు. వారిలో ఎవరు నిజమయిన వారో దొంగ సాధువులో ఎవరికి తెలుసు” అన్నాడు. మనసులో ఇంకా ఆ సంశయంతోటే ఆ రోజు రాత్రి తన గదిలోకి నిద్రించడానికి వెళ్ళాడు. కాని బాబా ఫోటో, తన తల్లిదండ్రులకు ఆయన మీద ఉన్న నమ్మకం, అతని ఆలోచనలలో ఎన్నో సందేహాలు దోబూచులాడుతూ ఉన్నాయి.
మంచం మీద పడుకుని మనసులోనే మవునంగా బాబాతో సవాలు చేసాడు. “నువ్వే కనక నిజమయిన సాధువువయితె, దానిని నిరూపించే విధంగా నాకేదయినా నిదర్శనం చూపించు.”
అంతే, బాబా అతని సవాలుని స్వీకరించి, నిదర్శనం చూపించారు.
ఆ రోజు రాత్రి ఫిరోజ్ షాకి బ్రహ్మాండమయిన కల వచ్చింది. అతని ముందు బాబా కనిపించి సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ ”నేను నిజమయిన సాధువునో లేక దొంగ సాధువునో తెలుసుకోవాలనుకుంటున్నావా? రేపు ఉదయాన్నే నా ఫొటో ఉన్న బల్ల వద్దకు వెళ్ళు. ఆ ఫోటోని తీయడానికి ప్రయత్నించు. నువ్వు దానిని కనక లేవనెత్తగలిగినట్లయితే నేను దొంగ సాధువుని, నువ్వు లేవనెత్తలేకపోతే నేను సత్యం.”
ఉలిక్కిపడుతూ లేచాడు. తనకు వచ్చిన కల, కల కాదు ప్రత్యక్షంగా జరిగినట్లుగా ఉంది. కలో నిజమో తెలియనంత అనుభూతి. అతని హృదయ వేగం పెరిగింది. ఎపుడెపుడు తెలవారుతుందా అని ఆతృతతో ఆలోచిస్తూనే ఉన్నాడు.
తెల్లవారింది. ఒక్క ఉదుటున మంచం మీదనించి లేచి బల్ల దగ్గరకు వెళ్ళాడు. బల్ల మీద ఉన్న బాబా ఫోటోని తీయబోయాడు. ఉహూ…తీయలేకపోయాడు. అంత తేలికగా ఉన్న ఫోటోని తను లేవనెత్తలేకపోవడమా? తన శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించాడు. ఒక్క అంగుళం కూడా కదపలేకపోయాడు. కాని, విచిత్రం ఏమిటంటే ఆ ఫోటోని తన బలమంతా ఉపయోగించి లేపడానికి ప్రయత్నించినపుడు ఒక విధమయిన దైవిక శక్తి అందులో నిండిపోయినట్లుగా బల్ల మాత్రం పైకి లేచింది. ఫోటో మాత్రం పైకి ఒక్క అంగుళం కూడా లేవలేదు.
ఆ క్షణంలో ఫిరోజ్ షా లోఉన్న అనుమానం కాస్తా పటాపంచలయిపోయింది. అతని హృదయంలో బాబా మీద విశ్వాసం పొంగిపొరలింది. ఫోటోముందు శిరసు వంచి నమస్కరించి సాయిబాబాయే తన అసలయిన గురువు, మార్గదర్శకుడని అంగీకరించాడు.
(తరువాత ఫిరోజ్ షాకు బాబా ఊదీతో వైద్యం చేయుట)
(ముందు ముందు బాబా నాకు ఇచ్చిన అనుభవాలను కూడా ప్రచురిస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం ప్రచురించినట్లే గుర్తు. కాని ఎక్కడా దొరకలేదు. మరలా ప్రచురిస్తాను)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)




0 comments:
Post a Comment