14.12.2022 మంగళవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర – 2 వ.భాగమ్
(స్థిత ప్రజ్ణుడు - 2వ.భాగమ్)
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744
మొదటి భాగానికి పాఠకుల స్పందన...
శ్రీమతి శారద, విశాఖపట్నం
శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 2 సాంఖ్యయోగము
రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ ఒక సంస్థానముగా
రూపొందెను. వివిధములయిన హంగులు, అలంకారములు
పెరిగినవి. అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి,
రధము, పాత్రలు, వెండిసామానులు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి
బహూకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నియు ఎంత హెచ్చినప్పటికి సాయిబాబా వీనినేమాత్రము
లక్ష్యపెట్టక యధాపూర్వము నిరాడంబరులై యుండెడివారు.
శ్రీ సాయి సత్ చరిత్ర , అధ్యాయమ్ - 7
వారెల్లప్పుడూ శాంతముగాను, సంయమముతోను
ఉండెడివారు. ఎల్లప్పుడు పరిపూర్ణ వేదాంతత్త్వమును
బోధించుచుండువారు. వారు ప్రభువులను, భిక్షుకులను
ఒకేరీతిగా ఆదరించిరి. వారు సర్వజ్ణులయినప్పటికి
ఏమియు తెలియనివానివలె నటించుచుండిరి. సన్మానములన్నచో
వారికేమాత్రము ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ - 8
బాబా సామాన్య ఫకీరువలె సంచరించుచున్నప్పటికి
వారెప్పుడును ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు. కష్టములవలన క్రుంగిపోవువారు కారు. రాజైనను, నిరుపేదైనను వారికి సమానమే.
బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తెడివారు. మజ్జిగవంటి ద్రవపదార్ధములు, పులుసు కూరలు మొదలుగునవి
రేకుడబ్బాలో పోసుకొనెడివారు. అన్నము, రొట్టెలు
మొదలగునవి జోలెలో వేయించుకొనెడివారు. బాబాకు
రుచియనునది లేదు. వారు జిహ్వను స్వాధీనమంధుంచుకొనిర్. కాన, అన్ని పదార్ధములను రేకుడబ్బాలోను, జోలెలోను
వేసుకొనెడివారు. అన్ని పదార్ధములను ఒకేసారి
కలిపివేసి భుజించి సంతుష్టి చెందేవారు. పదార్ధముల
రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి
యనునది లేనట్లే కాన్పించుచుండెను.
ఫకీరు పదవియే నిజమయిన మహారాజ పదవియనీ,
అదియే శాశ్వతమని మామూలు సిరిసంపదలు క్షణభంగురాలనీ బాబా అనుచుండెడివారు.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్
, 9
సంతానము, ధనము, కీర్తి సంపాదించుటయందు
ఆపేక్ష వదలుకొని సన్యసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. పుత్రేషేణ, విత్తేషణ, లోకేషణ అను ఈషణ త్రయాలనుండి
విముక్తులైనవారే భిక్షాన్న సేవనానికర్హులు.
(సాయి సమర్ధుడు మహాసిధ్ధులని ప్రసిధ్ధి చెందినా, కోరికలచే బద్దులై ఉన్న మనం
వారి పాదాల వద్దకు చేరుకోము.)
శ్రీ సాయి సత్ చరిత్ర, అధ్యాయమ్ - 10
బాబా అంతరంగమున పరమ నిరీహులు, నిస్పృహులు
అయినప్పటికి బాహ్యమునకు లోకహితము కోరువానిగ కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులు. అంతరంగమున శాంతికి ఉనికిపట్టు. లోపల పరబ్రహ్మస్థితిలోనుండెడివారు.
బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగియుండెడివారు. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు. సిరిసంపదలను గానీ, కీర్తిప్రతిష్టలను గానీ లక్ష్యపెట్టక
భిక్షాటనముచే నిరాదంబరులై జీవించెడివారు. ఆత్మజ్ణానమునకు
ఆయన గని. దివ్యానందమునకు వారు ఉనికిపట్టు.
ప్రతిజీవియందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు, విరోధులు వారికి సమానులే. నిరభిమానము, సమానత్వము వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చెడివారు. కలిమిలేములు వారికి సమానము.
బాబా శాంతి, దాంతి, ఉపరతి, తితీక్షాదులతో
ఆత్మస్థితియందుండి, భక్తులను ప్రసన్న చిత్తులను చేసేవారు. ఎక్కడికీ వెళ్లక, ఒకే ఆసనంలో తల్లీనులై కూర్చునేవారు. వారికి కీర్తి కండూతి లేదు. ధనకాంక్ష అసలేలేదు. సాయి సన్యాసి వేషంలో ఉన్న ప్రత్యక్ష యతీశ్వరుడు.
(
శాంతి అనగా కామక్రోధాధి రాహిత్యము,
దాంతి అనగా బాహ్యేంద్రియ నిగ్రహము,
ఉపరతి అనగా ఇంద్రియ విషయాలను నిగ్రహించి విషయ వాసనలనుంచి నిగ్రహించుట, తితీక్ష
అనగా ఓర్పు , )
బాహ్యదృష్టికి బాబా ఇంద్రియవిషయములను
అనుభవించువాని వలె కన్పట్టినను, ఇంద్రియాభూతులలో వారికేమాత్రమభిరుచి ఉండెడిది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించునప్పటికి దేనియందు వారికి రుచి యుండెడిదే
కాదు వారు ప్రపంచమును చూచున్నట్లు గాన్పించినను వారికి దేనియందేమాత్రము ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతునివలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను.
(స్థితప్రజ్ణుడు గురించి ఇంకా ఉంది)
(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment