13.12.2022 మంగళవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర – 1 వ.భాగమ్
(స్థితప్రజ్ణుడు 1 )
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744
శ్రీమద్భగవద్గీత అధ్యాయాలు – 18
పాఠకుల స్పందన....
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై...చాలా చక్కగా వివరించారు. బాబాగారు ఎప్పుడూ హిందువులని కాని ముస్లిమ్స్ ని కాని కించపరచలేదు. ఎవరి మతాన్ని వారు నమ్మి తోటి మతాలవారిని గౌరవించమనే చెప్పారు.
శ్రీ కృష్ణపరమాత్మ అర్జునునికి కురుక్షేత్ర
సంగ్రామంలో గీతా బోధన కావించాడని మనందరకు తెలుసు.
శ్రీకృష్ణుడు గీతను బోధిస్తుండగా ప్రత్యక్షముగా విన్నవారు నలుగురు.
అర్జునుడు, అర్జునుని రధముయొక్క టెక్కెముపై
కూర్చొని హనుమంతుడు కూడా విన్నారు. వ్యాసులవారు
విన్నారు. వ్యాసుని అనుగ్రహము వలన సంజయుడు
విన్నాడు.
శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునకు మార్గశిర
శుధ్ధ ఏకాదశినాడు గీతా బోధ చేసారు.
మొట్టమొదట గీతను బయట ప్రచారము చేసినవాడు
సంజయుడు.
ఈమధ్యనే ఫేస్ బుక్ లోని ఒక సమూహంలో ఒక
వ్యక్తి చేసిన వ్యాఖ్యానం…
భగవద్గీత చెప్పే సమయంలో అక్కడ యుధ్ధం
చేస్తున్నవారందరూ అలా నిలుచుండి వింటూ ఉండిపోయారా అని. ఇటువంటి సందేహమే నేను చదువుకునే రోజులలో నాకు కూడా
కలిగింది. అది ఎంత అజ్ణానమో తరువాత గ్రహించుకున్నాను. శ్రీకృష్ణపరమాత్మ గీతను బోధించే సమయంలో వినడానికి అర్హతలేని యుధ్ధము చేస్తున్నవారందరిని
మాయ కమ్మేసింది. అది కృష్ణ మాయ.
శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయమ్ అర్జున
విషాదయోగము. అందులోని శ్లోకాలు శ్రీ సాయి సత్చరిత్రలోని
ఘట్టాలకు అనువుగా ఉండవు కావున వదలి వేసాను.
ఇక రెండవ అధ్యాయమ్ సాంఖ్యయోగము నుండి ప్రారంభించి ఒక్కొక్క అధ్యాయము లోని శ్లోకాలకు,
శ్రీ సాయి సత్ చరిత్రలోని ఘట్టాలను అన్వయించడం జరిగింది. ఇప్పుడు మీరు చదవబోయే వివరణల ద్వారా బాబా స్థితప్రజ్ణుడని గ్రహించుకోగలరు.
ఉపనిషత్తుల ప్రస్తావన శ్రీ సాయి సత్ చరిత్ర
ఏ ఏ అధ్యాయాలలో ఉదాహరణలుగా ఇవ్వబడ్డాయో వాటిని కూడా ప్రస్తావిస్తాను.
ఈ రకంగానయినా మనమందరం భగవద్గీతా పారాయణ చేద్దాము...దయచేసి శ్లోకాలను, వాటి అర్ధాలను పూర్తిగా చదవండి.
శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 2 సాంఖ్యయోగము
శ్లోకమ్ - 55
శ్రీ భగవాన్ ఉవాచ…
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్ధ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ణస్తదోచ్యతే
శ్రీ భగవానుడు పలికెను. ఓ! అర్జునా మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా
తొలగిపోయి, ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైనవానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును
పొందినవానిని స్థితప్రజ్ణుడని యందురు.
శ్లోకమ్ - 56
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే
దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు
పొంగిపోనివాడును, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడును అయినట్టి మనశీలుడు (ముని) స్థితప్రజ్ణుడనబడును.
శ్లోకమ్ - 57
యః సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభమ్
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ణా ప్రతిష్టితా
దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల
పరిస్థితులయందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు
ద్వేషము మొదలగు వికారములకు లోనుకానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ణుడనబడును.
శ్లోకమ్ - 64
రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్
ఆత్మవశ్యైర్విధియేత్మా ప్రసాదమధిగచ్చతి
అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు
రాగద్వేష రహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్ననూ, మనశ్శాంతిని పొందును.
పైన వివరింపబడిన శ్లోకాలకు శ్రీ సాయి
సత్ చరిత్రలోని అధ్యాయమ్ 3
సాయిబాబా కష్టతరమయిన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ణాన మూర్తులు. వారు మానావమానములను లెక్కించినవారు కారు. అందరితో
కలసిమెలసి యుండెడివారు. ఆటలు గాంచెడివారు. పాటలను వినుచుండెడివారు. కాని సమాధిస్థితినుండి మరలువారు కారు. వారి అంతరంగము లోతయిన సముద్రమువలె ప్రశాంతము. ఒకచోటనే కూర్చుండి యున్నప్పటికిని ప్రపంచమందు జరుగు
సంగతులన్నియు వారికి తెలియును. ఎల్లప్పుడు
ఆత్మధ్యానమునందే మునిగి యుండెడివారు. వారు
ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు.
శ్రీ సాయి సత్ చరిత్ర. అధ్యాయమ్ – 4
భక్తులకొరకు బాబా పదునారేళ్ళ బాలునిగా
షిరిడీలోని వేపచెట్టుక్రింద అవతరించెను. బాబా
అప్పటికే బ్రహ్మజ్ణానిగా గాన్పించెను. బాబా
స్వప్నావస్థయందయినను ప్రపంచ వస్తువులను కాంక్షించెడివారు కాదు. ఆయన మాయను తన్నెను.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 5
బాబా లంగోటీని బిగించుకొని, పొడవాటి కఫ్నీని
తొడుగుకొని, నెత్తిపైని గుడ్డ కట్టుకొనేవారు.
ఒక గోనెముక్కపై కూర్చునెడివారు. చింకి
గుడ్డలతో సంతుష్టి చెందెడివారు. రాజ్యభోగము
కంటె దారిద్ర్యమే మేలని నుడివెడివారు. పేదవారికి
భగవంతుడు స్నేహితుడనేవారు. దినములో ఎక్కువ
భాగము వేపచెట్టునీడయందు, అప్పుడప్పుడు ఊరవతల నున్న కాలువ యొడ్డున గల తుమ్మచెట్టు నీడన
కూర్చొనెడివారు.
(స్థితప్రజ్ణుడు గురించి వివరణ ఇంకాఉంది)
(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment