Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, March 4, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –17 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 11:21 PM

 


05.03.2023 ఆదివారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


ఓమ్ శ్రీ సాయినాధాయనమః

శ్రీకృష్ణ పరబ్రహ్మణేనమఃశ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –17 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.

శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 7 – జ్ణాన – విజ్ణానయోగము

శ్లోకమ్ 21 కి కొనసాగింపు

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్   12

(శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 7 – జ్ణాన – విజ్ణానయోగము

శ్లోకమ్ 21  25.02.2023 ప్రచురించిన 16 వ. భాగంలో చిన్న పొరపాటు జరిగింది.  డాక్టరు పండితుని పూజ శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయం 11  కు బదులు 12  వ  అధ్యాయం అని ప్రచురింపబడింది.  ఈ పొరబాటును విశాఖపట్నంనుండి సాయి భక్తురాలు శ్రీమతి శారద గారు నా దృష్టికి తీసుకు వచ్చారు.  వారికి ధన్యవాదాలు.)

ములే శాస్త్రి పూర్వాచారపరాయణుడయిన బ్రాహ్మణుడు.  నాసిక్ నివాసి.  షట్ శాస్త్ర పారంగతుడు.  జ్యోతిషసాముద్రిక శాస్త్రములలో దిట్ట.  అతడు నాగపూరుకు చెందిన కోటీశ్వరుడగు బాపూ సాహెబ్ బూటీని కలుసుకోవడానికి షిరిడీకి వచ్చాడు.  మధ్యాహ్న ఆరతికి తనతో వచ్చెదరా అని ములేశాస్త్రిని బూటీ అడిగాడు.  సాయంకాలం బాబా దర్శనం చేసుకొంటానని శాస్త్రి సమాధానమిచ్చాడు.  ఆరతి ప్రారంభ సమయంలో బాబా నాసిక్ బ్రాహ్మణునినుంచి దక్షిణ తెమ్మని బూటీని పంపించారు.  బూటీ స్వయంగా దక్షిణ తీసుకురావడానికి ములేశాస్త్రి  దగ్గరకు వెళ్ళాడు.  బాబా ఆజ్ణ అతనికి చెప్పగానే ములేశాస్త్రి తనలో తాను “నేను అగ్నిహోత్రిని, బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును.  కాని, నేనాయన ఆశ్రితుడను కాను కదా?  వారికి నేనెందుకు దక్షణనీయాలి?”  సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీవంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడగటం వలన ములేశాస్త్రి కాదనలేకపోయాడు.,  తన అనుష్టానమును మధ్యలోనే ఆపి, బూటీతో మసీదుకు బయలుదేరాడు.  మడితో నున్న తాను మైలపడి పోవుదునునని భావించి, మసీదు బయటే దూరముగా నులుచుండి బాబా మీద పువ్వులను విసిరాడు.  హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తన గురువగు ఘోలప్ స్వామి కూర్చుని ఉన్నారు.  అతడు ఆశ్చర్యపోయాడు.  అది కలా నిజమా అని సందేహ పడ్డాడు.   తనను తాను గిల్లుకొని మళ్ళీ చూసాడు.  తాను పూర్తి జాగ్రదావస్తలోనే ఉన్నాడు.  భ్రాంతి అవడానికి వీలులేదు.  అయినచో ఏనాడో గతించిన తన గురువు అక్కడికెట్లు వచ్చారు?  అతనికి నోట మాట రాలేదు.  తుదకు సందిగ్ధములన్నిటిని విడిచిపెట్టి, మసీదులో ప్రవేశించి, తన గురువు పాదములపై పడి, లేచి చేతులు జోడించి నిలబడ్డాడు.  తక్కినవారందరు బాబా ఆరతి పాడుచుండగా ములేశాస్త్రి తన గురునామమును ఉఛ్ఛరించడం మొదలుపెట్టాడు.  తాను అగ్రకులమునకు చెందినవాడను, పవిత్రుడను అను అభిజాత్యమును విడిచిపెట్టి, తన గురుని పాదములపై పడి సాష్టాంగనమస్కారమొనర్చి,  కళ్ళు మూసుకొన్నాడు.  లేచి, కండ్లు తెరచి చూసేసరికి వానిని దక్షిణ అడుగుతూ సాయిబాబా కనిపించారు.  బాబావారి ఆనంద రూపమును, ఊహకందని వారి శక్తిని చూచి ములేశాస్త్రి మైమరచిపోయాడు.  మిక్కిలి సంతుష్టి  చెందాడు.  అతని నేత్రములు సంతోష భాష్పములచే నిండిపోయాయి.  మనఃస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నిచ్చాడు.  తన సందేహము తీరినదని, తనకు గురుదర్శనమైనదని చెప్పాడు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)

Saturday, February 25, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –16 వ.భాగమ్

0 comments Posted by tyagaraju on 10:23 PM

 


26.02.2023 ఆదివారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


ఓమ్ శ్రీ సాయినాధాయనమః

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః


శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –16 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.

శ్రీమద్భగవద్గీత – అధ్యాయమ్ – 7 – జ్ణాన – విజ్ణానయోగము

శ్లోకమ్ – 21యో యో యాం యాం తనుం భక్తః శ్రధ్ధయార్చితుమిఛ్చతి

తస్య తస్యాచలాం శ్రధ్ధాం తామేవ విదధామ్యహమ్

సకామ భక్తుడు ఏయే దేవతా వ్వరూపములను భక్తిశ్రధ్ధలతో పూజింప నిశ్చయించుకొనునో, ఆ భక్తునకు ఆయా దేవతలయందే భక్తిశ్రధ్ధలను స్థిరముగా కుదురుకొనునట్లు చేయుదును.

శ్రీ సాయి సత్ చరిత్ర – అద్యాయం – 11

డాక్టరు పండితుని పూజ

తాత్యాసాహెబ్ నూల్కర్ మిత్రుడయిన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనం కోసం షిరిడీకి వచ్చాడు. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చున్నాడు.  అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పారు.  డాక్టర్ పండిత్ బాబా చెప్పినట్లుగానే దాదాభట్ వద్దకు వెళ్ళాడు.  దాదాభట్ అతనిని  సగౌరవముగా ఆహ్వానించాడు.

బాబాను పూజించటానికి పూజాసామగ్రి పళ్ళెంతో దాదాభట్ మసీదుకు వచ్చాడు.  డాక్టర్ పండిత్ కూడా అతనితో కూడా మసీదుకు వచ్చాడు.  దాదాభట్ బాబాను పూజించాడు.  అంతకుమునుపెవ్వరును బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు.  ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూస్తూ ఉండేవాడు.  కాని అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజాపళ్ళెమునుండి చందనము తీసి బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసాడు.  

అందరికి ఆశ్ఛర్యము కలుగునట్లు బాబా ఒక్క మాటయిననూ అనకుండా ఊరుకున్నారు.  ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగాడు.  “బాబా మేమెవరమయినా మీనుదుటిపై చందనము పూస్తామంటే నిరాకరించేవారు కదా?  డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడేల ఊరకుంటిరి?”  అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చారు.  “నేనొక ముసల్మానుననీ, తానొక సద్మ్రాహ్మడుననీ ఒక మహమ్మదీయుని పూజించినచో తాను మైలపడిపోవుదుననే దురభిమానము లేకుండా  అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేసాడు.  అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది.  అతనికి నేనెట్లు అడ్దు చెప్పగలను”  దాదాభట్ ఆతరువాత డాక్టర్ పండిత్ ని ప్రశ్నించగా అతడు  బాబాను తన గురువుగా భావించి, తన గురువునకు ఒనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితినని అన్నాడు.

గమనించారు కదా.  డాక్టర్ పండిత్ కి అతని గురువు మీద ఎంతో భక్తి ఉంది.  బాబా అతని గురువు మీద అతనికి ఉన్న నమ్మకాన్ని ధృఢపరుస్తూ అతనిలో ఉన్న భావానికి అనుగుణంగా పూజను స్వీకరించారు.

దీనికి సంబంధించిన సంఘటనలు ఇంకా ఉన్నాయి. అన్నీ వివరిస్తే విస్తారమవుతుందనే ఉద్దేశ్యంతో ఒక్కొక్కటే వివరిస్తాను)

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)