16.12.2025 మంగళవారమ్
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబర్, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలకు తెలుగు అనువాదం ఈ రోజు మీకు అందిస్తున్నాను.
ఆంగ్ల రచయిత ; శ్రీ ధనేష్ జుకార్
తెలుగు అనువాదం ; ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్. 9440375411, 8143626744
శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో --- ఆయన లీల రచన - 3 వ. భాగమ్
మేము శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ ప్రారంభించి క్రమం తప్పకుండా సాయి ధామాన్ని దర్శించుకుంటున్నాము. మాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు షిరిడీకి వెళ్ళి వస్తున్నాము. ఆ విధంగా జరుగుతూ ఉండటం మాలో నమ్మకాన్ని బలపరచడానికా లేక మాలోని ప్రతికూల ఆలోచనలను దూరం చేయడానికా ఏమో! అంతా బాబాకు మాత్రమే తెలుసు. ఆయన యొక్క దయ స్పష్టంగా ఉంటుంది. దానిని తప్పు పట్టడానికి వీల్లేదు. శరణాగతి అంటే ఏమిటో మాకు అర్ధమయేలా చేశారు.
ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేనప్పటికీ, వివాహమయి అయిదు సంవత్సరాలయినా మాకు సంతానం కలగలేదు. ఆ తరువాత బాబా అనుగ్రహం వల్ల మాకు అదికూడా ఒక గురువారమునాడు మగపిల్లవాడు జన్మించాడు. గురువారం సద్గురు సాయికి ఇష్టమయిన రోజు. కొద్ది రోజుల తరువాత నాభార్య ప్రశాంతంగా ఒక విషయం చెప్పింది. తను సంతానం కోసం సాయిబాబాను ప్రార్ధించుకున్నానని చెప్పింది.




