16.12.2025 మంగళవారమ్
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబర్, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలకు తెలుగు అనువాదం ఈ రోజు మీకు అందిస్తున్నాను.
ఆంగ్ల రచయిత ; శ్రీ ధనేష్ జుకార్
తెలుగు అనువాదం ; ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్. 9440375411, 8143626744
శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో --- ఆయన లీల రచన - 3 వ. భాగమ్
మేము శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ ప్రారంభించి క్రమం తప్పకుండా సాయి ధామాన్ని దర్శించుకుంటున్నాము. మాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు షిరిడీకి వెళ్ళి వస్తున్నాము. ఆ విధంగా జరుగుతూ ఉండటం మాలో నమ్మకాన్ని బలపరచడానికా లేక మాలోని ప్రతికూల ఆలోచనలను దూరం చేయడానికా ఏమో! అంతా బాబాకు మాత్రమే తెలుసు. ఆయన యొక్క దయ స్పష్టంగా ఉంటుంది. దానిని తప్పు పట్టడానికి వీల్లేదు. శరణాగతి అంటే ఏమిటో మాకు అర్ధమయేలా చేశారు.
ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేనప్పటికీ, వివాహమయి అయిదు సంవత్సరాలయినా మాకు సంతానం కలగలేదు. ఆ తరువాత బాబా అనుగ్రహం వల్ల మాకు అదికూడా ఒక గురువారమునాడు మగపిల్లవాడు జన్మించాడు. గురువారం సద్గురు సాయికి ఇష్టమయిన రోజు. కొద్ది రోజుల తరువాత నాభార్య ప్రశాంతంగా ఒక విషయం చెప్పింది. తను సంతానం కోసం సాయిబాబాను ప్రార్ధించుకున్నానని చెప్పింది.
ఒక మానవ మాత్రుడిని దేవునిగా భావించి పూజించడమేమిటి అనే భావంతొ ఉన్న నా భార్యలో ఎంత మార్పు?
బాబాకు మా ప్రణామాలు అర్పించుకోవడానికి మనసునిండా కృతజ్ఞతా భావాలను నింపుకుని షిరిడీకి చేరుకొన్నాము.
జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఉంది. మా ఇద్దరిలో ఎంతో ఉత్తేజితమయిన శక్తి నిండి ఉంది. మేమెక్కడికి వెళ్ళినా మాకు సాయి భక్తులు ఎదురవుతూ ఉండేవారు మొదట్లో వారు మాకు అపరిచితులయినా, తొందరలోనే వారు మాకు ఆత్మీయులయేవారు. మొట్టమొదటగా వారు తమకు కలిగిన అనుభవాలను మాకు చెబుతూ ఉండేవారు. అవి విన్నప్పుడు మాలో నమ్మకం ఇంకా బలపడసాగింది. పాతస్నేహితులు క్రమక్రమంగా కనుమరుగై వారి స్థానంలో గురుబంధువులు వచ్చి చేరారు. వారు కేవలం మాకు స్నేహితులుగా కాకుండా మా కుటుంబ సభ్యులుగా మెలగేవారు.
మరొక ఆశ్చర్యకరమయిన విషయం జరగబోతూ ఉంది. మేము ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ ప్రతిచోటా బాబా మాకు ఆహ్వానం పలుకుతున్నారా అన్నట్లుగా సాయిబాబా మందిరం గాని, సాయిబాబా ఫొటో గాని మాకు దర్శనమిచ్చేది. ఈ మధురమయిన క్షణాలని నేను నా స్నేహితులతో చెప్పినపుడు వారు నమ్మేవారు కాదు. కాని నాకు మాత్రం అంతర్గతంగా ఒక ధీమా “మేమెక్కడికి వెళ్ళినా సాయి మాతో ఉన్నారు”.
ఆ విధంగా జరిగిన మరపురాని సంఘటన ఒకటి వివరిస్తాను.
సెలవులలో నేను, నాబార్య, మా అబ్బాయి ముగ్గురం ఊటీ వెళ్ళాము. మొట్టమొదటిసాయిగా అక్కడ మాకు ఆఫీసు బంగళాలో బస చేసే అవకాశం లభించింది. కాని అక్కడికి చేరుకోగానే అనుకోకుండా ఆఫీసు చైర్మన్ గారు రావడం వల్ల బంగళాకు దూరంగా ఉన్న ఒక హోటల్ లో మాకు బస ఏర్పాటు చేసి అక్కడకు వెళ్లమన్నారు. ఉన్నతాధికారుల ఇష్టాఇష్టాల గురించి మనసులోనే గొణుగుకుంటూ నిరాశతో దూరంగా హోటల్ లో ఇచ్చిన బసకు వెళ్ళడానికి అంగీకరించాము. మరి చేసేదేముంది.
ఆ రోజు సాయంత్రం గది కిటికీ తలుపు తెరవగానే ఎదురుగా అందమయిన కొండ మాకు స్వాగతం పలికింది. నిజం చెప్పాలంటే మేము దిగిన హోటల్ అందమయిన కొండల మధ్య ఉంది. ఒక కొండ పైన మిణుకు మిణుకు మంటూ చిన్న దీపం కనిపించింది. మెరుస్తూ వెలుగుతూన్న ఆ దీపం, బయట వీచే చల్లని గాలి తిమ్మెరలు మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఆ వెలుగుతూన్న దీపం ఏమిటో చూద్దామని ఆసక్తితో బయటకు వచ్చాము. ఆ దీపకాంతులు వెదజల్లుతున్న కొండ దగ్గరకు రాగానే అది ఒక దర్గా అని తెలిసింది.
గౌరవభావంతో ఆ దర్గాకు నమస్కారం చేసుకున్నాము. అంతలో తెల్లటి గడ్డం ఉన్న వృధ్ధుడు మా వద్దకు వచ్చాడు. మాతో మాట్లాడుతూ మేము హిందువులం అని తెలుసుకుని “మీరు హిందువులు కదా! మరయితే ఇక్కడ దర్గాకు ఎలా వచ్చారు?” అని అడిగాడు. అపుడు నేను “మేము అన్ని చోట్లకి వెడతాము. మా గురువు శ్రీ సాయిబాబా. ఆయన అన్ని మతాలు సమానమే అని బోధించారు” అని సమాధానమిచ్చాను. అపుడాయన కొంతసేపాగి, “సాయిబాబా ఎవరు?” అని ప్రశ్నించారు. ఆయన తన జీవితంలో ఎక్కువ కాలం ఊటీ, మైసూరులలో గడిపారు. అందుచేత అవిదాటి బయటి ప్రపంచం గురించి ఆయనకు తెలీదు. ముంబాయికి ఒకటి రెండు సార్లు వెళ్ళారు అంతే.
(సాయిబాబా అంటే తెలియదు అన్న వ్యక్తి దగ్గరకు బాబా ఎలా తీసుకువచ్చారు? చూద్దాం బాబా ఎక్కడన్నా కనిపిస్తారేమో)
(తరువాతి సంచికలో నా నిర్లక్ష్యాన్నిబాబా ఎలా సరి చేసారో వివరిస్తాను)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
.




0 comments:
Post a Comment