18.12.2025 గురువారమ్
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబర్, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలకు తెలుగు అనువాదం నాలుగవ భాగమ్ ఈ రోజు మీకు అందిస్తున్నాను.
ఆంగ్ల రచయిత ; శ్రీ ధనేష్ జుకార్
తెలుగు అనువాదం ; ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్. 9440375411, 8143626744
నా నిర్లక్ష్యాన్ని సరిచేసిన బాబా
నేను నిత్యం పారాయణ చేస్తున్న శ్రీ సాయి సత్ చరిత్ర ఫోటోలు చూడండి.
గత సంవత్సరాలుగా పారాయణ గ్రంధం బైండు అట్ట ఊడిపోయి ఉంది. దానికి గమ్ టేపులు వేసి జిగురు పెట్టి అతికించి అలాగె పారాయణ చేస్తు ఉన్నాను. మళ్ళీ అన్నీ ఊడిపోయినా అలాగే పారాయణ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దానికి ఇక సరి చేయడానికి కూడా అనువుగా లేదు. వారం రోజుల క్రితం బాబా నా కలలో ఒక అపరిచిత వ్యక్తి రూపంలో కనిపించి పారాయణ పుస్తకం అట్టలను తీసి పక్కన పడేసి పుస్తకం ఉంచుకోమన్నారు.
రెండు రోజుల తరువాత నేను ఆ అట్టలను తీసేసి పుస్తకానికి మరొక అట్టను వేసాను. ఆ పని ఎప్పుడో చేసి ఉండవలసింది. ఏమిటో అలా చేయకుండా ఊడిపోయిన అట్టతోనే ఇబ్బంది అనుకోకుండా పారాయణ కొనసాగించాను. ఇప్పుడు కొత్తగా అట్ట వేసిన తరువాత చదవడానికి సౌకర్యంగా ఉంది. ధన్యవాదాలు బాబా. (త్యాగరాజు)
శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో --- ఆయన లీల రచన - 4 వ.భాగమ్
బాబా గురించి నేను ఆయనకు వివరిస్తుండగానే ఆయన కొడుకు, ఇంకా ఆయన మిగతా కుటుంబ సభ్యులు, బంధువులు మా వద్దకు వచ్చారు. ఆ దర్గాని, వాళ్ళు తాము స్వంతంగా నిర్మించుకున్నది అని చెప్పారు. మరుసటి రోజు మమ్మల్ని వాళ్ళింటికి టీ కి ఆహ్వానించారు.
మేము అలాగే వస్తామని చెప్పాము. తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన మాకూడా వచ్చారు. ఆయనతో మాట్లాడుతూ దారి మధ్యలో ఆయనతో నేను యధాలాపంగా “గత సంవత్సరాలనుండి నేటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినా సాయి భక్తులని కలుసుకుంటూ ఉన్నాను. అందువల్ల ఇక్కడ కూడా సాయిబాబాతో ఒక విధమయిన సంబంధం ఉందని నాకనిపిస్తోంది” అన్నాను. నేనన్న మాటలకి ఆయననుంచి ఎటువంటి స్పందనా లేదు.
మరుసటి రోజు సాయంత్రం మేము ఆయన ఇంటికి వెళ్ళాము. దానిని ఇల్లు అనేకంటే పెద్ద రాజభవనం అంటే తగినట్లుగా ఉంటుంది. భవనం ఆరుబయట ఫౌంటెన్స్ నాట్యం చేస్తూ కనపడ్డాయి. భవంముందు కార్లు నిలిపే ప్రదేశంలో వింటేజ్ రోల్స్ రాయస్ కార్లు తళతళ మెరుస్తూ ఉన్నాయి. మమ్మల్ని హాలులోకి తీసుకువెళ్లారు. ఆహాలును చూస్తే వారెంతటి ధనవంతులో చెప్పకనే చెబుతోంది. ఖరీదయిన సోఫాలు, హాలు మధ్యలో బిలియర్డ్స్ టేబులు ఉన్నాయి. ఆ వెంటనే ఆయన, వారి కోడలు మాకు టీ, బిస్కెట్లు తీసుకువచ్చారు.
ఆ పెద్ద హాలులో గోడమీద వారి పూర్వీకులయిన తాతముత్తాతల ఫోటోలు, గతించిన వారి ఇతర కుటుంబ సభ్యుల ఫోటోలు తగిలించి ఉన్నాయి. ఇంకా వారి తాతముత్తతలు వేటాడి చంపిన జంతువుల తలలు కూడా వారి శౌర్యానికి గుర్తుగా గోడకి అలంకరింపబడి ఉన్నాయి. ఆ హాలు చూడటానికి ఒక మ్యూజియం లా ఉంది. గోడల మీద విదేశీ ప్రముఖుల చిత్తరువులు, మన దేశానికి సంబంధించిన పేరుపొందిన ప్రముఖుల చిత్ర పటాలు అందంగా అమర్చారు. గోడల మీద అమర్చబడిన విదేశీప్రముఖుల చిత్రపటాలు, మనదేశపు పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖుల ఫోటోలను చూస్తూ ఉన్నాను.
అంతలో నా చూపులు ఒక చిన్న ఫోటో మీద పడ్డాయి. ఆ ఫోటో చూడగానే నా కళ్ళల్లోంచి అకస్మాత్తుగా కన్నీళ్ళు ఉబికి రాసాగాయి. ఆ ఫోటో ఆయనే నా సాయిబాబా.
కఫనీ ధరించి ఉన్నారు. భుజానికి గుడ్ద సంచి జోలి వేలాడుతూ ఉంది. మరొక చేతిలో మగ్గు పట్టుకుని షిరిడీలో భిక్ష కోసం వెడుతున్నట్లుగా ఉన్నారు. అన్ని పెద్ద పెద్ద చిత్రపటాల మధ్యలో చిన్న అరచేయంత పరిమాణం మాత్రమే ఉన్న ఫోటో.
ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యి గట్టిగా అరిచేసాను. “చూడండి---ఈయనే సాయిబాబా” అంటూ పెద్ద పెద్ద ఫోటోల మధ్యలో ఉన్న ఆ చిన్న ఫోటోని చూపించాను.
( బాబా చిన్న ఫోటో అక్కడికి ఎలా వచ్చింది?)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)







0 comments:
Post a Comment