01.01.2026 గురువారమ్
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
క్రొత్త సంవత్సరానికి స్వాగతమ్ పలుకుతూ సాయిబంధువులందరికీ బాబా వారు
తమ ఆశీస్సులను అందచేయాలని ప్రార్ధిస్తున్నాను. ఆయనకు కూడా మనమందరం
శుభాకాంక్షలు తెలుపుదాము...ఓమ్ సాయిరామ్
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు – అక్టోబర్, 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలకు తెలుగు అనువాదం ఏడవ భాగమ్ ఈ రోజు మీకు అందిస్తున్నాను.
ఆంగ్ల రచయిత ; శ్రీ ధనేష్ జుకార్
తెలుగు అనువాదం ; ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్. 9440375411, 8143626744
శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో --- ఆయన లీలల రచన - 7 వ.భాగమ్
ఇటువంటి లీలలు లెక్కలేనన్ని ఎన్నో విషయాలు, సాయిబాబా ఇంకా మనమధ్య అదృశ్యంగా ఉన్నారనే విషయాన్ని తెలియచేస్తాయి. సాయి ఎల్లప్పుడూ మనతోనే ఉంటారనీ, ఆయన అనుగ్రహం మనపై ఎల్లవేళలా ప్రసరిస్తూ ఉంటుందనే విషయాన్ని ఈ లీలలన్నీ మనకు గుర్తు చేస్తూ ఉంటాయి.
సాయిబాబా తన దయను మనపై కురిపిస్తూ ఉన్నారనీ, అనుక్షణం మన యోగక్షేమాలను చూస్తూ మనలను కనిపెట్టుకుని ఉంటారనే విషయం మనకు ఎన్నోసార్లు వెల్లడయింది.
కాని ఇపుడు ఈ వ్యాసం వ్యారడానికి గల ముఖ్యోద్దేశ్యం ప్రత్యేకించి ఒక పుస్తకం గురించి కాబట్టి దీనిలోని ప్రతి పదం బాబావారియొక్క అనుగ్రహం, దయ ఎంతగా వెల్లడి చేస్తూ ఉందో, దానిని మనం భక్తి భావంతో అర్ధం చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుందాము.
సంవత్సరాలు గడిచే కొద్దీ బాబా మీద నాకున్న భక్తి ఆయనకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను చదివేలా చేసింది. బాబా దయవల్ల నేను ఎన్నో భక్తి పాటలను వ్రాయగలిగాను. గొప్ప సంగీతకారులు వాటిని స్వరపరిచారు. పేరుగాంచిన గాయకులు వాటిని పాడారు. వాటినన్నిటినీ ఒక ఆడియో, సి డి రూపంలో తయారుచేసి ప్రేమతో బాబాకు అంకితమిచ్చాను.
ఇవన్నీ కాకుండ, నేనొక గొప్ప సాయిభక్తుడిని కాబట్టే తన గురించి వ్రాయడానికి బాబా నన్ను ఎన్నుకున్నారనే ఒక విధమయిన అహంకారం నన్ను చుట్టుముట్టే ప్రమాదం ఉందనే భయం కొద్ది సంవత్సరాలుగా నన్ను వెంటాడుతూ ఉంది. ఎవరెంత కాదనుకున్నా ఈ రకమయిన అహంకారం మనకు తెలియకుండానే మనలోకి నెమ్మదిగా ప్రవేశిస్తుంది. నేను ఎంతమంచి సాయి భక్తుడినో అని ఆలోచిస్తూ కొన్ని సంవత్సరాలు అహంకారంతో గడిపాననే విషయాన్ని వినయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. కాని అది ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు. ఈ అహంభావంనుండి బయట పడటం, గర్వాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ సాయి యొక్క దయ కరుణామయమైనది. ప్రతిరోజు శ్రీ సాయి సత్ చరిత్రను పారాయణ చేస్తూ ఉండటం వలన నాలో వినయం తిరిగి రావడానికి తగిన శక్తి లభించింది. శ్రీ సాయి సత్ చరిత్రలో వివరింపబడిన భక్తులు బాబాకు ఎంతటి సేవ చేసుకున్నారో, శరణాగతి చేసుకున్నారో చదివిన తరువాత నేనింకా ఏ స్థాయిలో ఉన్నానో నాకు శ్రీ సాయి సత్ చరిత్ర గుర్తు చేసింది. అటువంటి మహా భక్తులు శ్రీ సాయిబాబా వారికోసం తమ సర్వస్వాన్ని సమర్పించుకున్నారు. ఆ మహాభక్తులను చూసి మనం నేర్చుకోవలసినది ఎంతో ఉంది.
2018 వ.సం. నుండి శ్రీ సాయి సత్ చరిత్రలో వివరింపబడిన భక్తుల వారసులను కులుసుకునే మహద్భాగ్యం కలిగింది. శ్రీ సాయి సత్ చరిత్రలో పేర్కొన్న ఎన్నో పవిత్రమయిన ప్రదేశాలని సందర్శించి సాయిభక్తి ఎంత ప్రగాఢంగా వ్యాప్తమయి ఉందో అర్ధం చేసుకుంటాను.
(1985 వ.సం.లో శ్రీ ఆంటోనియో రిగోపోలస్ గారు ఆస్ట్రేలియానుండి షిరిడీకి సాయిబాబా మీద పరిశోధన చేయడానికి వచ్చారు. సాయిబాబాను ప్రత్యక్షంగా చూసి, ఆయనతో కలిసి ఇంకా జీవించి ఉన్న భక్తులను కలిసి వారిని ఇంటర్యూ చేసారు. ఆ ఇంటర్యూ విశేషాలను కూడా నేను ఇంతకుముందు అనువాదం చేసి ప్రచురించాను. త్యాగరాజు)
ఇప్పటికీ కొంతమంది అవగాహనా రాహిత్యంతో బాబా ఒక ముస్లిం ఒక ముద్ర వేసి కొంతమందిని తప్పుదోవ పట్టిస్తున్నారు. రెండు మూడు రోజుల క్రితం ఒకామె ఈ విధంగానే బాబా ముస్లిం అని చెప్పడం జరిగింది. శ్రీ సాయి ఎప్పుడూ అల్లా మాలిక్ అనేవారు అనే విషయాన్నే పట్టుకున్నారు తప్ప ఇక మిగిలిన విషయాల మీద ఎటువంటి అవగాహనా లేదు. శ్రీ సాయి సత్ చరిత్రలో పరమ శివుడు పార్వతికి చెప్పిన గురుగీత లోని విషయాలు, ఉపనిషత్తులు, శ్రీ మధ్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలను క్రోడీకరించి అయిదు సంవత్సరాల క్రితం బాబా నా చేత వ్రాయించుకున్నారు. అది శ్రీ మద్భగవద్గీత ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర. ఇదే బ్లాగులో ప్రచురించాను...త్యాగరాజు)
ఎవరయినా శ్రీ సాయి సమాధి మందిరంలోకి ప్రవేశించిన తరువాత అక్కడ గోడల మీద చూట్టూతా పెట్టబడి ఉన్న అప్పటి సాయిభక్తుల చిత్రపటాలను చూసినపుడు హృదయం ఎంతగానో ఉప్పొంగుతుంది. సాయిబాబాతో అప్పటి భక్తులందరూ సన్నిహితంగా మెలిగి జీవించి ధన్యులయ్యారు కదా అని ఆలోచిస్తూ ఉంటాను.
వారు ఎప్పుడూ క్రమం తప్పకుండా సాయిబాబా దర్శనం చేసుకుని అప్పుడప్పుడు సాయిబాబా వారు తమ స్వహస్తాలతో ఇచ్చిన ప్రసాదం తీసుకుని, ఆయన స్పర్శను అనుభవించగలిగిన అదృష్టాన్ని పొందగలిగారు. ఆ విధంగా సాయిబాబా జీవించి ఉన్న రోజులను తలచుకుంటూ ఆ కాలంలోకి వెళ్ళిపోయేది నా మనసు.
(ఇంకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)




0 comments:
Post a Comment