08.02.2012 బుధవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులుఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1994 23.వ. భాగాన్ని చదువుకుందాము
సాయి.బా.ని.స. డైరీ - 1994 (23)
08.08.1994
నిన్నటిరోజున జీవితములో "నిజము పలకటములోను, అబధ్ధము పలకటములోను, గల వ్యత్యాసము గురించి ఆలోచించినాను. ఈ సమస్యకు నాకు పరిష్కారము లభించలేదు. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి ఈ సమస్యపై వివరణ యివ్వమని కోరినాను. శ్రీ సాయి దృశ్యరూపములో యిచ్చిన వివరణ వివరాలు.
"నీవు ఒక త్రాగుబోతు యింటికి వెళ్ళి ఆయింటి యిల్లాలు దగ్గర మీయింటి యజమాని పచ్చి త్రాగుబోతు అనే నిజము చెబితే ఆమె సంతోషించుతుందా లేక మీ యింటి యజమానిలో ఒక మంచి గుణము ఉంది అని ఆ మంచి గుణాన్ని చెబితే ఆమె సంతోషించుతుందా ఒక్కసారి ఆలోచించు. అలాగే మామిడి పళ్ళలో 90 శాతము పళ్ళు తియ్యగా ఉంటాయి.
10 శాతము మామిడి పళ్ళు పుల్లగా ఉంటాయి. ఆ పుల్ల మామిడిపళ్ళరుచిని గుర్తు పెట్టుకొని మామిడిపళ్ళు అన్నీ పుల్లగా ఉంటాయి అని అనగలమా ఆలోచించు".
అందుచేత జీవితములో నిజము అబధ్ధము అనెవి రెండు అంశాలు. వాటిని సరిగా అర్ధము చేసుకొని మనము మంచి మార్గములో పయనించాలి అంటారు శ్రీ సాయి.
12.08.1994
నిన్నరాత్రి శ్రీ సాయికి నమస్కరించి "సాయినాధ ఆధ్యాత్మిక రంగములోని విషయాలు చెప్పు తండ్రీ" అని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యాల సారాంశము.
ఆధ్యాత్మిక రంగ ప్రవేశానికి ఆటంకాలు.
1) పరస్త్రీ వ్యామోహము
2) ధన సంపాదనపై వ్యామోహము
3) కీర్తి ప్రతిష్ఠలపై వ్యామోహము
ఆధ్యాత్మిక రంగ ప్రవేశానికి శుభసూచనలు:
అనుక్షణము భగవంతుని తలచుకొంటూ -
రోజూ శ్రధ్ధ, సహనం అనే మానసిక దీపాలు వెలిగించటము.
25.08.1994
నిన్నటిరోజున గృహస్థ ఆశ్రమములోని తలనొప్పి గురించి ఆలోచించినాను. కుటుంబసభ్యులు నామాట వినటములేదు అనే బాధ ఎక్కువ కాసాగినది. రాత్రి నిద్రకు ముందు శ్రి సాయికి నమస్కరించి నా సమస్యకు సమాధానము ప్రసాదించమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యము దాని సారాంశము.
"నేను శ్రీ సాయి పూజ చేసుకొంటున్నాను. కొన్ని కాకులు వచ్చి నా నెత్తి మీద పొడుస్తున్నాయి. నేను భరించలేని తలనొప్పితో బాధ పడసాగినాను. యింతలో బయటనుండి కొన్ని కాకులు నా యింటిలోనికి రావటానికి ప్రయత్నాలు చేయసాగినవి. అపుడు నాయింట ఉన్న కాకులు నన్ను రక్షించటానికి ఐకమత్యముగా బయట కాకులతో దెబ్బలాడి వాటిని తరిమి వేసినవి." ఈ దృశ్యము ద్వారా నేను గ్రహించిన సందేశము - గృహస్థ ఆశ్రమములో తలనొప్పి యున్న కుటుంబ సభ్యులు ఐకమత్యముగా యుండటము ఆకుటుంబానికి శ్రీరామ రక్ష".
27.08.1994
నిన్నటిరోజున కుటుంబ వ్యవహారాలలో చాలా చికాకు పడినాను. మనసుకు ప్రశాంతత కరువు అయినది. జీవితముపై విరక్తి కలిగినది. రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి "శ్రీ సాయినాధ నాకుటుంబ సమస్యలు నీకు తెలుసు. దయ చేసి ధైర్యమును ప్రసాదించు తండ్రి" అని వేడుకొన్నాను. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి "అరబ్బు దేశములో పెండ్లికి "పైగాము" రాగానె ఆడపిల్లలు పెండ్లి చేసుకొని సంతోషముగా అత్తవారి యింటికి వెళ్ళిపోతారే. నీవు నీ కుమార్తె వివాహము చేసి రెండు సంత్సరాలు అయినా యింకా ఆపెండ్లి సంగతులు తలచుకొంటు బాధ పడటములో అర్ధము లేదు. అన్నీ సవ్యముగా జరుగుతాయి. ప్రశాంతముగా జీవించు" అన్న మాటలు నాకు ప్రశాంతత ప్రసాదించినది.
28.08.1994
నిన్న రాత్రి శ్రీ సాయి నా సమస్యలకు సమాధానముగా గతాన్ని మర్చిపోవాలి అనే సందేశము యిచ్చినారు. గతాన్ని మర్చిపోవటము అంత సులభముకాదు. నిజ జీవితములో గతాన్ని మర్చిపోయి ప్రశాంతముగా బ్రతకటము ఎట్లాగ అనేది చూపించమని శ్రీ సాయిని వేడుకొన్నాను. శ్రీ సాయి భోపాల్ నవాబు రూపములో దర్శనము యిచ్చినారు. భోపాల్ నవాబు పాడుబడిన భవనమునుండి బయటకు వచ్చినారు. ఆయన కుర్తా, పైజామా, నెత్తిమీద ఎఱ్ఱ రంగు కుచ్చు టోపీ ధరించి చాలా హుందాగా యున్నారు. ఆయన అధికారము పోగొట్టుకొన్నా ఆయనలోని హుందా తనము తగ్గలేదు. పాడుబడిన భవనము ఆయన గత చరిత్రను గుర్తు చేస్తున్నా ఆయనలో ఏమాత్రము చికాకు లేదు. ప్రశాంతమైన మనసుతో ఆపాడుబడిన భవనము ముందు యున్న తోటలో షికారుగా పచార్లు చేస్తున్నారు. ఈవిధముగా గతాన్ని మర్చిపోవాలి అనే సందేశాన్ని శ్రీ సాయి ప్రసాదించినారు.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment