29.06.2015 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
జీవిత కాలాన్ని పెంచిన బాబా
ఈ రోజు సాయిలీల మాసపత్రిక 2010 వ.సంవత్సరం మార్చ్ నెల లో ప్రచురింపబడిన బాబా లీల తెలుసుకుందాము. మానవ జీవితం ఎప్పుడయినా అంతమవలసిందే. భగవత్కృప ఎంత ఉన్నాగాని మానవుడు నూరు సంవత్సరాలకు మించి జీవించలేడు. ఏ కొద్దిమంది అదృష్టవంతులో తప్ప. కాని ఈ లీలలో బాబా తన భక్తురాలి ఆయుష్షుని పెంచారు. ఎందుకని పెంచారో ఈ లీల చదివితే మనకి అర్ధమవుతుంది. ఇక చదవండి.
1994వ.సంవత్సరంలో మా అమ్మగారికి గర్భాశయంలో కాన్సర్ ఉందని వైద్య పరీక్షలో నిర్ధారణ అయింది. 1998 నవంబరులో కాన్సర్ బాగా ముదిరిపోయింది. ఆవిడ పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తూ ఉండటంతో విశాఖపట్నంలో ఆమెకు వైద్యం చేస్తున్న వైద్యులు వెల్లూర్ కి తీసుకొని వెళ్ళమన్నారు.
మానాన్నగారు, మా మేనమామ మా అమ్మగార్ని వెల్లూర్ కి తీసుకొని వెళ్ళారు. అక్కడి వైద్యులు పరీక్షించి కాన్సర్ బాగా ముదిరిపోయిందని చెప్పారు. మా అమ్మగారు ఏమీ తినలేని, త్రాగలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రేగుల కదలిక కూడా ఆగిపోయింది. యిక ఆఖరిగా సర్జరీ ఒక్కటే చేయవలసి ఉంది. ఎప్పుడయినా సర్జరీ చేసిన తరువాత బ్రతికే అవకాశాలు కూడా చాలా తక్కువని వైద్యులు మా నాన్నగారితో చెప్పారు. సర్జరీ తప్ప వేరే మార్గం లేదు కనక మా నాన్నగారు సర్జరీకి అంగీకరిస్తున్నట్లుగా అవసరమైన కాగితాలన్నిటి మీదా సంతకాలు చేశారు. ఆసమయంలో నేను చికాగోలో ఉన్నాను. మా అమ్మగారి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తూ ఉండటంతో మా నాన్నగారు నన్ను వెంటనే భారతదేశానికి వచ్చేయమని చెప్పారు.
ఆరోజు నేను నా కాబోయే భార్యకి (ఆమెకి సాయి అంటే ఎంతో భక్తి) మా అమ్మగారి పరిస్థితి గురించి చెప్పాను. ఆప్పట్లో నా కాబోయే భార్య భారతదేశంలోనే ఉంది. ఆమె ఏమీ జరగదని ధైర్యం చెప్పింది. మా అమ్మగారి ఆరోగ్యం కోసం బాబాని ప్రార్ధిస్తాననీ, నన్ను కూడా బాబాని ప్రార్ధించమనీ చెప్పింది.
మా అమ్మని కాపాడమని మొదటిసారిగా నేను కన్నీళ్ళతో బాబాని ప్రార్ధించాను. బాబా వెంటనే నా మొఱ ఆలకించారు. మా అమ్మగారు ఆపరేషన్ థియేటర్ లో ఉండగా అద్భుతం జరిగింది. అప్పుడే ఆమెకి ప్రేగులలో కదలిక కలిగింది. వైద్యులు ఆశ్చర్యపోయారు. వారు బయటకు వచ్చి, ప్రేగులలో కదలిక వచ్చింది కాబట్టి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు. తిరిగి విశాఖపట్నం తీసుకొనివెళ్ళి అక్కడే వైద్యం చేయించమని చెప్పారు.
ఈసంఘటన జరిగిన నెలరోజులలోనే నా వివాహం జరిపించడానికి బాబా మా అమ్మగారికి తగిన శక్తిని ప్రసాదించారు. బాబా ఆశీర్వాద బలంతో, అనుకున్న ముహూర్తానికి నా వివాహం జరిగింది. బాబా ఆశీర్వాదంతో మా అమ్మగారు 15 నెలలు జీవించి జనవరి 2000 సంవత్సరం 23వ.తేదీన పరమపదించారు.
విశాఖపట్నంలో మా అమ్మగారికి వైద్యం చేస్తూ వచ్చిన వైధ్యుడు కూడా సాయి భక్తుడే. ఆవిడ ఆస్పత్రిలో ఉండగా, పారాయణ చేసుకోవడానికి మా అమ్మగారికి శ్రీసాయి సత్ చరిత్రనిచ్చారు. ఆఖరి క్షణం వరకు మా అమ్మగారు ఆస్పత్రిలో తన తలగడ క్రిందనే సత్ చరిత్రని ఉంచుకునేవారు. బాబా తన భక్తులను ప్రేమతో తన అక్కున చేర్చుకొని ప్రతి నిమిషం వారిని కాపాడుతూ ఉంటారు. తన భక్తులమీద ఆయన ప్రేమ అనంతం.
మన జీవితంలో ప్రతి క్షణం మనలని కాపాడుతూ మా అమ్మగారికి 15 నెలలు అదనంగా జీవితాన్ని ప్రసాదించిన బాబాకు కృతజ్ఞత తెలపడం అంటే, ఆ 'కృతజ్ఞత' చాలా అల్పమయిన మాట.
ఆయన పాదాలపై నాశిరసునుంచి, నన్ను, నాకుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండమని వినమ్రంగా వేడుకొంటున్నాను.
వెంకట్, న్యూజెర్సీ, అమెరికా.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment