23.03.2016 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
శిక్షణా కేంద్రానికి
(Training Centre) వెడుతూ మధ్యలో బాబా వారిని దర్శించుకుందామని మధ్యలో దిగి షిరిడి
చేరుకున్న తన భక్తుడిని మరునాడు అనుకున్న సమయానికి శిక్షణా కేంద్రానికి బాబా వారు పంపించిన
అద్భుతమైన లీల చూడండి. ఇది శ్రీసాయి లీల మాస పత్రిక సెప్టెంబరు 1975 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది. దాని తెలుగు అనువాదం ఇప్పుడు మీకోసం.
ఓమ్ సాయిరామ్
సర్వాంతర్యామి
బాబా ఎక్కడ లేరు?
ఇక్కడ, అక్కడ అన్ని చోట్లా ఉన్నారు. అందుకే
ఆయన సర్వాంతర్యామి.
1969వ. సంవత్సరం
సెప్టెంబరులో శిక్షణ కోసం హైదరాబాదునుండి భుసావల్ కు ప్రయాణిస్తున్నాను. ఉదయం 9 గంటలకి మన్మాడ్ స్టేషన్ లో దిగేశాను. మన్మాడ్ స్టేషన్ రాగానే నాకు అప్పటికప్పుడే షిరిడీ
వెళ్ళాలనిపించి అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నాను. మరుసటి రోజు ఉదయం నేను శిక్షణా శిబిరానికి వెళ్ళాలి.
అందుచేత మన్మాడ్ లోనే దిగిపోయి నా సామనంతా క్లోక్
రూములో పడేసి, బయటకు వచ్చి షిరిడీ వెళ్ళే బస్సెక్కాను. ఆకాశమంతా దట్టంగా మబ్బులు పట్టి ఉంది. ఏక్షణంలోనయినా బ్రహ్మాండమయిన వర్షం కురిసేలా ఉంది
వాతావరణం.
మధ్యాహ్న ఆరతి చూసే భాగ్యాన్నిమ్మని
మనసులోనే బాబాని ప్రార్ధించుకున్నాను. బురదగా ఉన్న రోడ్డు మీద బస్సు వెడుతూ ఉంది. సన్నగా
పడుతున్న చినుకులు కనులకు విందు చేస్తున్నాయి.
బస్సు చెరకు తోటల మధ్యనుండి,
పండ్ల తోటల నుండి, గ్రామాలు, బజారులనుండి ప్రయాణించి
ఆఖరికి 11.30 కి షిరిడీ చేరుకుంది. నా ప్రార్ధనలను
మన్నించి బాబా సరైన సమయానికి నన్ను షిరిడీ చేర్చారు. తొందరగా స్నానం కానిచ్చి మందిరం హాలులోకి అందరితోపాటు
ప్రవేశించాను. ఆరతి సమయానికి బాబా తన దర్శన
భాగ్యం కలిగించినందుకు ఎంతో సంతోషించాను. ప్రసాదం
తీసుకుని, సంస్థానం వారు నిర్వహిస్తున్న భోజన శాలలో భోజనం చేశాను.
మంచి దివ్యమైన భోజనం చేసి బసకు తిరిగి వచ్చాను. 3 గంటలకు బాబానుంచి సెలవు తీసుకుని 4 గంటలకు మన్మాడ్
కి వెళ్ళే బస్సు ఎక్కాను. ఆ సమయంలో పెద్ద పెద్ద
ఉరుములతో వర్షం పడుతూ ఉంది. అంత పెద్ద వర్షానికి
రోడ్డు వెంటనే బాగుచేయాలన్నంతగా పాడయిపోయింది.
గతుకులు గుంటలు పడిన రోడ్డుమీద వళ్ళు హూనమయేలా ప్రయాణం సాగుతోంది. ఆఖరికి కోపర్ గావ్ నుండి మూడు కిలోమీటర్లు దాటి
వచ్చాము. మా ముందు 500 గజాల మేర రోడ్డు పూర్తిగా కొట్టుకుని పోయింది. భారీ వర్షానికి అక్కడ పెద్ద గొయ్యి తప్ప రోడ్డు
లేదు. భారీ వాహనాలు ఇటువైపు నుండి అటువైపుకు
వెళ్ళడం అసాధ్యం. ఆవిధంగా పాడయిపోయింది రోడ్డు. పోనీ పక్కనుండి వెడదామన్నా సాధ్యమయేలా కనిపించడం
లేదు. రోడ్డు దెబ్బతిన్న ప్రాతంలోని రెండు
ప్రక్కలా బాగా గుంటలు పడిపోయి వర్షపు నీటితో నిండి ఉన్నాయి. బురద బురదగా అడుగు వేస్తే జారిపోతూ ఉన్న రోడ్డు
మీద నడిచి కూడా అవతలి వైపుకు వెళ్ళలేని పరిస్థితి. మేమంతా ఇక్కడ చిక్కుకు పోయాము. మెల్ల మెల్లగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. మేమున్న ప్రాంతం ఒక నిర్జనారణ్యంలా కనిపిస్తోంది. నాలో నేను సాయి నామాన్ని జపించుకుంటూ ఉన్నాను. రేపు ఉదయానికల్లా నేను శిక్షణా శిబిరానికి వెళ్ళాలంటే
మన్మాడ్ లో భుసావల్ వెళ్ళే రైలు అందుకోవాలి.
ఆ రైలును అందుకోగలనా లేదా అని చాలా మధన పడుతున్నాను. ఈవిపత్తునుండి ఎలా బయట పడాలి? స్టేషన్ కు చేరే మార్గమేది? ఏమి చేయాలో ఏమీ పాలుపోని
పరిస్థితిలో ఉన్నాను.
7 గంటలకి పంచాయితీ
(PWD) వారి జీపు ఒకటి వచ్చింది. అది చూడటానికి
ఒక సర్కస్ కంపెనీ వారి జీపులాగ ఉంది. ఆ రోడ్లు
మీద ప్రయాణం చేయాలంటే సర్కస్ ఫీట్లు చేసుకుంటూ రావల్సిందే. ఆ జీపు డ్రైవరు నా దగ్గరకు వచ్చి నన్ను జీపులోకి
ఎక్కమన్నాడు. అతను ఇంకా కొంత మందిని రమ్మని,
జాగ్రత్తగా జీపు నడుపుతూ పట్టణానికి తీసుకుని వచ్చాడు. జీపులో కోపర్ గావ్ బస్ స్టాండుకు తీసుకుని వచ్చి
దింపాడు. డబ్బు ఇవ్వబోతే తీసుకోవడానికిష్టపడలేదు. “బాబా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు” అని చెప్పి వెళ్ళిపోయాడు.
కలవర పెడుతున్న నా మనసులో ఎన్నో ఆలోచనలు. ఎవరతను?
బాబాయే వచ్చారా? ఆయన బాబాయేనా? కోపర్ గావ్ నుంచి మరొక బస్సులో మన్మాడ్ చేరుకుని సమయానికి భుసావల్
వెళ్ళే ఎక్స్ ప్రెస్ ని అందుకోగలిగాను. మరునాడు
ఉదయం సమయానికి శిక్షణా శిబిరానికి చేరుకున్నాను.
ఇది దైవికమయిన
అద్భుతమ్ కాదా?
ఎ. శ్రీనివాసులు
సికిందరాబాదు
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment