07.08.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
భివపురి శ్రీసాయిబాబా మందిరమ్ -2 వ.భాగమ్
మందిరం చుట్టుప్రక్కలంతా ప్రకృతిరమణియంగా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మందిరం చుట్టూతా పెద్దపెద్ద వృక్షాలతో శోభాయమానంగా కనువిందు చేస్తూ ఉంటుంది. రాత్రి అయేటప్పటికి ప్రశాంతమయిన వాతావరణం. ఎంతో నిశ్శబ్దంగా ఉండేది. ఆ ప్రశాంత వారావరణంలో అర్ధరాత్రివేళ మందిరం తలుపులు తెఱచుకున్న శబ్దం వినిపించేది.
బాబా బయటకు వచ్చి మందిరం ప్రాంగణంలో సంచరిస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి చెట్టుక్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. తెల్లవారుఝామున 3 గంటలకు మందిరం తలుపులు మూసుకున్న శబ్దం వినిపించేది. ఈ అధ్భుతాన్ని శ్రీ ప్రధాన్ గారు, ఆయన కుటుంబ సభ్యులే కాక వారింటికి వచ్చిన అతిధులు కూడా గమనించారు. అప్పటివరకు శ్రీ ప్రధాన్ గారి మనసులో ఉన్న సందేహాలన్ని ఈ సంఘటనలతో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయాయి. అప్పటినుండి సాయిబాబాపై భక్తివిశ్వాసాలు మరింతగా పెరిగాయి. వేలాది రూపాయలు ఖర్చుచేసి సుందరమయిన గర్భగుడి, దానిముందు విశాలమయిన హాలు, వరండా, అతిధి గృహం నిర్మించారు.
(కేశవ్ ఆర్.ప్రధాన్)
(భివపురి సాయిబాబా మందిరాన్ని యూట్యూబ్ లో ఈ క్రింద ఇచ్చిన లింక్స్ లో చూడండి.)
https://www.youtube.com/watch?v=7-8dJAjtJzU
https://www.youtube.com/watch?v=1FfSzlcUx_Y
(పైన ఇచ్చిన లింక్స్ పోస్ట్ చేశాను చూడండి)
శ్రీసాయిబాబా 1918 లో మహాసమాధి చెందారు. ప్రధాన్ గారు తాను నిర్మించిన మందిరంలో బాబాకు నిత్యపూజలు చేస్తూ వచ్చారు. 1924వ.సంవత్సరంలో ప్రధాన్ గారి కుమార్తెకి బొంబాయి, దాదర్ కు చెందిన శ్రీ ఎ.వి. గుప్త గారితో వివాహం జరిగింది. గుప్తగారు కూడా మంచి దైవభక్తి కలవారు. భివపురిలో జరిగే అన్ని కార్యక్రమాలలోను చాలా చురుకుగాను, ఉత్సాహంగాను పాల్గొనేవారు. తన స్నేహితులను ఎంతోమందిని భివపురి బాబా మందిరానికి ఆహ్వానించేవారు. ఆవిధంగా ఎంతోమంది భివపురి బాబా మందిరానికి వచ్చేవారు.
గుప్తాగారు 1936 వ.సంవత్సరంలో షిరిడీ వెళ్ళారు. అక్కడ సమాధిమందిర వైభవాన్ని చూసి ఎంతగానో ముగ్ధులయ్యారు. తొందరలోనే భివపురి మందిరాన్ని కూడా షిరిడీలోని మందిరమంత వైభవంగా రూపొందేలా చేయమని బాబాను చేతులు జోడించి వేడుకొన్నారు. మనఃస్ఫూర్తిగా ప్రార్ధించే తన భక్తుల కోర్కెలను సాయిబాబా తప్పక తీరుస్తూ ఉంటారు. శ్రీగుప్తాగారు ఆర్తితో అర్ధించిన కోర్కెను శ్రీసాయిబాబా వెంటనే నెరవేర్చారు. అప్పటినుండి భివపురి సాయి మందిరానికి ప్రఖ్యాతి కలిగి సాయిబాబా దర్శనానికి ఎందరో భక్తుల రాక మొదలయింది.
1939 వ.సంవత్సరంలో శ్రీ ప్రధాన్ గారు మరణించడంతో మందిరం బాధ్యతలన్నీ ఆయన అల్లుడి భుజస్కంధాలపై పడ్డాయి. మందిరానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిరాటంకంగా శాశ్వతంగా జరగడం కోసం ఏడుగురు సభ్యులతో ‘శ్రీ సద్గురు సాయినాధ్ సంస్థ’ అనే పేరుతో ఒక ట్రస్టీని అదే సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ ట్రస్టీ మందిరంలో జరిగే కార్యక్రమాలన్నీ సజావుగా జరిగేలా పర్యవేక్షిస్తూ ఉండేది.
రానురాను భక్తుల రాక మరింతగా పెరిగి బాగా రద్దీ ఏర్పడటంతో మందిరం సరిపోయేది కాదు. అందువల్ల మందిరాన్ని మళ్ళీ పునర్మించే పని మొదలుపెట్టారు. ఇటుకలతో గోడలు నిర్మించే వరకు పని పూర్తయింది. కాని, నిధుల కొరతవల్ల పై కప్పు నిర్మాణం ముందుకు సాగలేదు. ఇక మరొక దారి ఏదీ దొరకక, సాయిభక్తులయిన స్వర్గీయ శ్రీనారాయణ పురోహిత్ గారు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ ప్రారంభించారు. నాలుగురోజుల తరువాత శ్రీసాయిబాబా ఆయనకు కలలో దర్శనమిచ్చి, “నా ధుని ఏది? ధుని లేకుండా ఇది షిరిడీ ఎలా అవుతుంది? మందిరం ఎలా పూర్తవుతుంది?” అన్నారు. ఈ విధంగా ఆయనకు రెండు సార్లు కల రావడంతో ఈ విషయాన్ని పురోహిత్ గారు గుప్తగారికి చెప్పారు. తరువాత ట్రస్టీ సభ్యులందరితోను చర్చించి మందిరంలో ధునిని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. బాబా ఆదేశానుసారం ధుని ఏ ప్రదేశంలో నిర్మించాలో నిర్ణయించారు. ధుని నిర్మాణం జరిగింది. 07.04.1949, శ్రీరామనవమినాడు ఉదయం 10 గంటలకు శ్రీసాయి సత్ చరిత్ర వ్రాసిన శ్రీధబోల్కర్ గారి మనుమడు శ్రీ ఎ.ఆర్. వలవాల్కర్ గారు మొట్టమొదటిసారిగా ధునిని ప్రజ్వలింప చేశారు. ధుని పైకప్పుకి, చుట్టూ కట్టవలసిన యితర నిర్మాణాలకి అయే ఖర్చులన్నిటిని శ్రీకుమార్ సేన్ సమర్ధ్ గారు తాను భరిస్తానని చెప్పారు. షిరిడీలో ద్వారకామాయిలో నిరంతరం ధుని వెలుగుతున్నట్లే, ఇక్కడి ధుని కూడా నిరంతరం మండుతూనే వుంది. సంవత్సరమంతా ఈ మందిరంలో అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. శ్రీరామనవమి ఉత్సవాలు బాబా మహాసమాధి చెందిన రోజు, ఈ రెండు మరింత ప్రత్యేకంగా శొభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. శ్రీసాయిలీలా మాస పత్రికకు పూర్వం ఎక్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేసిన స్వర్గీయ ప్రొఫెసర్ డి.డి. పర్చూరే గారు కూడా సాయిభక్తుడు. ప్రత్యేకంగా నిర్వహింపబడే ఈ రెండు ఉత్సవాలకి ఆయన భివపురిలోనే ఉండేవారు. ఈ ఉత్సవాలలో ఆయన సాయిబాబా చరిత్రను, ఆయన బోధనలను కీర్తనల రూపంలో గానం చేసేవారు.
ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు ఈ మందిరాన్ని దర్శిస్తూ విరాళాలను కూడా అందచేస్తూ ఉండేవారు. వారిలో వున్న భక్తికి, వారు చేసిన ధన సహాయానికి ట్రస్టీ సభ్యులందరూ ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకునేవారు. ఈ మందిరానికి యింతటి అద్భుతమయిన చరిత్ర కారణంగా ఇది సాయిబాబావారి ఆధ్యాత్మిక కేంద్రంగా మంచిపేరు ప్రఖ్యాతులు గాంచింది. ఒకసారి దర్శనం చేసుకున్న భక్తులు, మరింత భక్తితో మరలా సాయిబాబా దర్శనం కోసం వస్తారంటే అందులో ఆశ్చర్యం లేదు.
ఇది చదివిన తరువాత మనకి కూడా ఒకసారి భివపురి వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకోవాలనిపిస్తోంది కదూ !
(సమాప్తమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment