12.08.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శివాజీ నగర్ పూనా లో ఉన్న బాబా మందిరం యొక్క అధ్బుతమైన లీలను తెలుసుకుందాము.
శ్రీ సద్గురు సాయినాధ్ మందిర్ – శివాజీ నగర్ పూనా – 5
(తాయెత్తు) – 2 వ.భాగమ్
(మూల రచన మరాఠీ భాషలో శ్రీ ఎస్.ఎమ్. గార్జే గారు రచించారు. ఆయన రచన సాయిలీలా మాసపత్రిక జనవరి 1976 లో ప్రచురింపబడింది)
ఆంగ్ల భాషలో ఏప్రిల్, 1977 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన శ్రీసాయిలీలా మాస పత్రిక నుండి గ్రహింపబడింది.
ఈ మందిర నిర్వహణ బాధ్యతలను
నిర్వహించడానికి 1950 వ.సంవత్సరంలో ‘సాయిదాస మండలి’ అనే సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థకి సెక్రటరీగా శ్రీరంగనాధ్ గారు చాలా సంవత్సరాలు
ఆ పదవిలో ఉన్నారు.
ఆయన మణానంతరం శ్రీరామకృష్ణజీ
అనే చిన్న కాంట్రాక్టరు సెక్రటరీగా సేవలందించారు.
ఈ మందిర నిర్మాణంలో శ్రీరామకృష్ణన్ గారు ఎంతగానో శ్రమించారు. తనకు 75 సంవత్సరాల వయసు వచ్చినా మందిర నిర్వహణలో
ఎటువంటి అలసత్వం చూపించలేదు. ఆయన ఉత్సాహం
ఏవిధంగా ఉండేదంటే యువకులలో కూడా అంతటి ఉత్సాహం మనకి కనిపించదేమో అన్నంతగా ఉండేది. ప్రతిసంవత్సరం ఈ మందిరంలో దసరా, రామనవమి, గురుపూర్ణిమ
ఉత్సవాలు కూడా ఎంతో వైభవంగాను అట్టహాసంగాను నిర్వహింపబడుతూ ఉండేవి. శ్రీరామకృష్ణన్ గారు ప్రత్యేకమయిన శ్రధ్ధతో అది
చిన్నపనయినా పెద్ద పనయినా పర్యవేక్షిస్తూ ఉండేవారు. అందువల్లనే మందిరం ఎంతో అభివృధ్ధి
చెందింది. శ్రీరామకృష్ణన్ గారి నేతృత్వంలో
యువతరంవారందరూ స్వఛ్చందంగా మందిర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. పూనా నివాసి సాయిభక్తుడయిన శ్రీనానా సాహెబ్ అవస్తే
గారు వయసులో బాగా పెద్దవారు. ఆయనకు 80 సంవత్సరాల
వయసు ఉంటుంది. ఆయన మండలిలోని సభ్యులందరికీ
ఒక స్ఫూర్తి. శ్రీసాయిబాబా జీవించి ఉన్న రోజులలో
ఆయనను ప్రత్యక్షంగా దర్శించుకున్న అదృష్టవంతులలో ఆయన కూడా ఒకరు. శ్రీఅవస్తే గారి మార్గదర్శకత్వం, కార్యదక్షత
వల్ల ఈ మందిర నిర్మాణంలో ఎటువంటి పొరబాటులు జరగకుండా సవ్యంగా జరిగింది. శ్రీ అవస్తే గారు ప్రతి గురువారం సాయంత్రంవేళలలో
ఆరతికి హాజరవుతూ ఉండేవారు. శ్రీ అవస్తేగారు
మరణించడంతో మండలికి ఒక బలమయిన శక్తి మార్గదర్శకత్వం లేకుండా బలహీనమయినప్పటికీ మండలిలో
ఉన్న సభ్యులలో ఎవరికీ ఉత్సాహం, ఉత్తేజం ఏమాత్రం కొరవడలేదు.
ఈ మందిరానికి సంబంధించిన
ఒక అధ్భుతమయిన లీల ఒకటి చెప్పితీరాలి.
12.07.1961 వ.సంవత్సరంలో పాన్షెట్ డ్యామ్ పగిలి వరదనీరు పూనా నగరాన్ని ముంచేసింది. పూనానగరంలో అధికభాగంలోని ప్రాంతాలలోని ప్రజలను ఖాళీ
చేయించారు. వరదనీటి ధాటికి ఇళ్ళన్నీ పేకమేడల్లా
కూలిపోయాయి. శివాజీనగర్ లోని సాయిమందిరం నది
ఒడ్డునే వుంది. వరదనీటిలో ఈ మందిరం కూడా పూర్తిగా
మునిగిపోవడంలో ఆశ్చర్యం ఏమీలేదు.
(పాన్షెట్ డ్యామ్ పగిలిన దృశ్యాలు...1961)
పాన్షెట్ డ్యామ్ పగిలిపోవడం వల్ల వరద నీటిమట్టం మందిరం శిఖరం పైనుంచి 20 – 25 అడుగుల మేర నిలచివుంది. రసానే సత్రంలోని మట్టితో నిర్మించిన చిన్న చిన్న కట్టడాలు
పూర్తిగా వరదనీటిలో మునిగిపోయాయి. బాబా మందిరం
కూడా పూర్తిగా వరదనీటిలో మునిగిపోవడంతో మండలిలోని సభ్యులందరూ చాలా భయభ్రాంతులకు గురయ్యారు. వరదనీరు పూర్తిగా తగ్గుముఖం పట్టిన వెంటనే సభ్యులందరూ
కలిసి మందిర పునరుధ్ధరణ కార్యక్రమం చేపట్టారు.
మందిరంలోను చట్టుప్రక్కల వరదనీటివల్ల మట్టి బాగా దట్టంగా పేరుకుపోయింది. ఆ మట్టినంతా పూర్తిగా తొలగించి శుభ్రం చేయడానికి
రెండుమూడురోజులు పట్టింది. ఆశ్చర్యకరమయిన విషయం
ఏమిటంటే ఆపురాతన మందిరం ఎక్కడా చెక్కుచెదరలేదు.
మందిరం ప్రక్కనే ఉన్న ఔదుంబర వృక్షం వరదకు ముందు ఎలా వుండేదో ఆవిధంగానే వుంది. ఒక్క అంగుళం కూడా ప్రక్కకు ఒరగలేదు. మందిరంలో ఉన్న బాబా రంగుల చిత్రపటం కూడా చెక్కుచెదరకుండా
వరదకు ముందు ఏవిధంగా ఉందో ఆవిధంగానే ఉంది.
అన్ని రోజులుగా వరదనీటిలో పూర్తిగా మునిగిపోయినా గాని, పటంమీద ఎటువంటి మట్టి
పేరుకుపోలేదు. ఇదంతా బాబా వారి అధ్భుతమైన లీల
కాక మరేమీ కాదు. తరువాత జైపూర్ నుంచి అందమయిన
సాయిబాబావారి పాలరాతి విగ్రహాన్ని తెప్పించి ప్రతిష్టించారు. పాలరాతి విగ్రహంతోపాటుగా బాబావారి చిత్రపటానికి
కూడా ప్రతిరోజు పూజాదికాలు నిర్వహిస్తూ ఉన్నారు.
ఈ మందిరాన్ని దర్శించుకున్న ప్రతిసాయి భక్తుడు పెద్దవరదనుండి కూడా తప్పించుకుని
చెక్కు చెదరకుండా నిలచిన ఈ మందిరంయొక్క చరిత్రను తెలుసుకున్న తరువాత ఆధ్యాత్మికానందంలో మునిగిపోతాడు. శ్రీసాయిబాబా వారి ఈ అత్యధ్బుతమయిన లీలను తెలుసుకున్న తరువాత తన్మయత్వంతో ఆయన ఆశీర్వాదాలకోసం తహతహలాడుతారు. ఈ మందిరంమీద
ఎంతో భక్తిభావాలను ప్రకటిస్తారు. పూనాను దర్శించడానికి
వచ్చే ఏసాయి భక్తుడయినా సరే ఈ మందిరాన్ని తప్పక దర్శించాలని కోరుకుంటాడు.
(అయిపోయింది)
0 comments:
Post a Comment