Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, November 21, 2017

భగవన్నామము యొక్క అపరిమితమయిన శక్తి

Posted by tyagaraju on 6:43 AM
   

    Image result for images of shirdisaibaba and rama


          Image result for images of rose

21.11.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
సాయి సుధ మాసపత్రిక అక్టోబరు, 1944 వ.సంవత్సరంలో ప్రచురింపబడ్డ శ్రీరామ మంత్రము, ఆరంభమునకు తెలుగు అనువాదమ్ ఈ రోజు ప్రచురిస్తున్నాను. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది. ఇప్పుడు ప్రచురిస్తున్న పౌరాణిక గాధ ద్వారా నామ జపానికి ఎంతటి శక్తి ఉందో మనం గ్రహించవచ్చు.
తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

భగవన్నామము యొక్క అపరిమితమయిన శక్తి

                       “శ్రీ రామ” మంత్రము యొక్క ఆరంభము
                   (ఓమ్ శ్రీరామ జయ రామ జయజయ రామ)
                     రచన : శ్రీ స్వామి శివానంద, ఆనంద కుటీర్

రామరావణ యుధ్ధం ముగిసిన తరువాత శ్రీరామచంద్రుల వారు లంకనుంచి అయోధ్యకు తిరిగి వచ్చారు.  ఒకరోజున శ్రీరామచంద్రులవారు రాజ దర్బారులో ఆశీనులయి ఉన్నారు.  ఆ సమయంలో శ్రీరామచంద్రమూర్తికి కొన్ని ముఖ్యమయిన సలహాలను యివ్వడానికి దేవర్షి నారదులవారు, విశ్వామిత్ర, వశిష్టులవారు యింకా ఎందరో రాజదర్బారులో సమావేశమయ్యారు.


సభలోనివారందరూ కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గూర్చి చర్చించుకుంటూ ఉన్న సమయంలో నారదులవారు లేచి “నామము (భగవంతుని నామము) గొప్పదా లేక ‘నామి’ (భగవంతుడు) గొప్పవాడా?  ఈ విషయం  మీద మీ అందరియొక్క అభిప్రాయాన్ని కోరుతున్నాను” అన్నాడు.  
                  Image result for images of sage narada and anjaneya and lord rama
అపుడా విషయం మీద సభలో వాడిగా వేడిగా చర్చ జరిగింది.  కాని ఎవరూ ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయారు.  ఆఖరికి నారదులవారు “ఖచ్చితంగా భగవంతుని కంటే భగవంతుని నామమే గొప్పది.  ఈ సభ పూర్తయేలోపే మీకు దానికి ప్రత్యక్షమయిన ఉదాహరణ చూపిస్తాను” అన్నాడు.

నారదులవారు హనుమంతుడిని ప్రక్కకు పిలిచి, “మహానుభావా, సభలో నువ్వు అందరికీ నమస్కరించు.  ఆ సమయంలో ఋషులందరికీ రాములవారికి నమస్కరించు.  కాని, విశ్వామిత్రులవారికి మాత్రం నమస్కరించకు.  ఆయన రాజర్షి మాత్రమే.  అందువల్ల అందరికీ యిచ్చినట్లుగా ఆయనకి గౌరవం యివ్వవద్దు.  వారందరితోను ఆయనను సమానంగా చూడవలసిన అవసరం లేదు” అన్నాడు.

హనుమంతుడు నారదుడు చెప్పినదానికి అంగీకారం తెలిపాడు.  ఇక సభలో ఉన్నవారందరికీ నమస్కరించే సమయం ఆసన్నమయింది.  హనుమంతుడు ఋషులందరికీ మోకరిల్లి నమస్కారం చేసాడు.  కాని విశ్వామిత్రులవారికి మాత్రం నారదుడు చెప్పిన ప్రకారం నమస్కరించలేదు.

అప్పుడు నారదుడు విశ్వామిత్రునితో “ ఓ ఋషిపుంగవా, హనుమంతుడు నీయందు ఎంత అమర్యాదకరంగా ప్రవర్తించాడో చూడు.  ఈ సభామండపంలో నీకు తప్ప అందరికీ నమస్కరించాడు.  హనుమంతునికి ఎంత గర్వం పొగరు ఉన్నాయో చూడు.  అతని ప్రవర్తనకి నువ్వు హనుమంతునికి తగిన శిక్షం వేయాల్సిందే” అన్నాడు.

 సభలో అందరిముందు హనుమంతుడు తనను అవమానించినందుకు విశ్వామిత్రులవారు కోపంతో రగిలిపోతున్నారు.  శ్రీరామచంద్రునితో “ఓ!  రాజా, నీదాసుడయిన హనుమంతుడు గొప్పగొప్ప ఋషులందరి మధ్యా నన్ను ఎంతగానో అవమానించాడు.  దానికి శిక్షగా  రేపు సూర్యుడు అస్తమించేలోగా నీవు హనుమంతుడిని సంహరించాలి.” అన్నాడు.  
         Image result for images of sage narada and viswamitra

విశ్వామిత్రుడు శ్రీరామచంద్రులవారికి గురువు.  అందువల్ల శ్రీరాములవారు తన గురువు ఆజ్ఞను పాటించక తప్పదు.  గురువు ఆజ్ఞను కాదనడానికి లేదు.  గురువు ఆజ్ఞ ప్రకారం తనే స్వయంగా తన నమ్మిన బంటయిన హనుమంతుడిని తన బాణంతో చంపాలి.  తను చేయగలిగినదేమీ లేదు.  

శ్రీరామచంద్రులవారి చేతిలో హనుమంతునికి చావు తప్పదన్న విషయం అయోధ్యానగరమంతా దావానలంలా వ్యాపించింది.

హనుమంతుడికి మనసు మనసులో లేదు.  చాలా గందరగోళ పరిస్థితిలో పడిపోయాడు.  అనవసరంగా నారదులవారి మాట పట్టుకుని లేనిపోని ఉపద్రవాన్ని చేజేతులారా తెచ్చుకున్నానని ఆందోళన పడసాగాడు. ఆ స్థితిలో నారదులవారి దగ్గరకు వెళ్ళి, “ఓ మహామునీ, ఇపుడు  మీరే నన్ను రక్షించాలి. నా ప్రభువయిన శ్రీరామచంద్రమూర్తి రేపు నన్ను చంపడం ఖాయం.  మీరు చెప్పిన ప్రకారమే నేను చెశాను.  ఇపుడు నేనేమి చేయను” అన్నాడు.  అపుడు నారదులవారు “హనుమా ! నిరాశ చెందకు.  నేను చెప్పినట్లు చెయ్యి.  రేపు బ్రాహ్మీ ముహూర్తంలోనే నువ్వు నిదురలేచి సరయూ నదిలో స్నామాచరించు.  నది ఒడ్డునే నిలబడి ముకుళిత హస్తాలతో “ ఓమ్ శ్రీరామ జయరామ జయజయ రామ” అనే మంత్రాన్ని పఠిస్తూనే ఉండు.  నీకెటువంటి ప్రాణహాని జరగదని నేను నీకు మాట యిస్తున్నాను” అన్నాడు.

మరుసటిరోజు ఉదయాన్నే బ్రాహ్మీముహూర్తంలో హనుమంతుడు మేల్కొన్నాడు.  సూర్యోదయానికి ముందే సరయూనదిలో స్నానం చేసాడు.  నారద మహర్షులవారు చెప్పినట్లుగానే తన ప్రభువయిన శ్రీరామచంద్రుని నామాన్ని ముకుళిత హస్తాలతో పఠించడం ప్రారంభించాడు హనుమంతుడు.


ఉదయాన్నే అయోధ్యానగర ప్రజలందరూ హనుమంతులవారు ఎదుర్కొనబోయే కఠిన శిక్షని వీక్షించడానికి తండోపతండాలుగా తరలివచ్చారు.  శ్రీరామచంద్రమూర్తి కూడా వేంచేసి హనుమంతునికి తగినంత దూరంలో నుంచున్నారు.  తన నమ్మిన బంటువయిపు జాలిగా చూసారు.  అయిష్టంగానే హనుమంతునివైపు బాణవర్షం కురిపించసాగారు.  
                   Image result for images of sage narada and anjaneya and lord rama
(ఈ సందర్భంగా శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రంలోని ఈ సన్నివేశాన్ని వీక్షించండి)

ఏఒక్క బాణం కూడా ఆయనను బాధించలేకపోయింది.  రోజంతా ఆయన మీద బాణవర్షం కురుస్తూనే ఉంది.  కాని ఏఒక్క బాణం ఆయనను గాయపరచలేకపోయింది.  రామరావణ యుధ్ధంలో కుంభకర్ణుడితో సహా వీరాధివీరులయిన రాక్షసులని శ్రీరామచంద్రులవారు తన భయంకరమయిన అస్త్రశస్త్రాలతో సంహరించారు.  అటువంటి అస్త్రాలను కూడా హనుమంతునిపై ప్రయోగించారు.  ఆఖరికి శ్రీరాములవారు తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ఉద్యుక్తులయ్యారు.  శ్రీరామచంద్రులవారు ఆగ్రహంతో ఉన్నారు.  హనుమంతుడు త్రికరణశుధ్ధిగా భక్తిభావంతొ రామమంత్రాన్ని గట్టిగా జపిస్తూ తన ప్రభువును సర్వశ్యశరణాగతి చేసారు.  శ్రీరామునివైపు నవ్వుతూ చూస్తూ నిలుచున్నారు ఆంజనేయస్వామి.  ప్రజలందరూ ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయి హనుమంతునికి జయజయ ధ్వానాలు చేసారు.  ఇక ఆసందర్భంలో నారదులవారు విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి “ఓ! మునివర్యా! మీ ఆగ్రహాన్ని కాస్త అదుపులో ఉంచుకొనండి.  రాములవారు ప్రయోగించిన ఏఒక్క బాణం హనుమంతుని ఏమీ చేయలేకపోయింది.  రామనామం యొక్క గొప్పతనాన్ని ఆఖరికి హనుమాన్ కూడా  అర్ధం చేసుకోకపోయినా ఏమయింది? ఒక్కసారి యోచించండి మునివర్యా.” అన్నాడు.  నారదుని మాటలకు విశ్వామిత్రునిలో చెలరేగిన ఆగ్రహం శాంతించింది.  తన బ్రహ్మాస్త్రంతో ఆంజనేయుని చంపబోతున్న రాములవారిని వారించి హనుమంతుని రక్షించాడు విశ్వామిత్రుడు.  హనుమంతుడు తన ప్రభువయిన శ్రీరామచంద్రులవారి పాదాలపై శిరసువంచి నమస్కరించాడు.  విశ్వామిత్రుడు తనపై చూపిన దయకు ఆయనకు నమస్కరించాడు.  విశ్వామిత్రుడు చాలా సంతోషించి హనుమంతుడిని దీవించారు.  శ్రీరామునిపై అతనికి ఉన్న అచంచలమయిన భక్తికి ఎంతగానో శ్లాఘించాడు.
                 Image result for images of sage narada and viswamitra
హనుమంతుడు అపాయంలో పడినపుడు మొట్టమొదటిసారిగా నారదులవారు ఈ మంత్రాన్ని ఉపదేశించారు.  ఈ సంసారబంధనంలో చిక్కుకుని అగ్నిజ్వాలలలో బాదలు పడుతున్నవారందరికీ ఈ రామనామ మంత్రం విమోచనాన్ని కలిగిస్తుంది.

“శ్రీరామ” అనగా రాములవారిని సంబోధించుట, ఆయనని మనసారా పిలవడం.  “జయరామ” అనగా ఆయనని ప్రశంసించడం.  “జయజయరామ” అనగా పూర్తిగా ఆయనకు శరణాగతులగుట.  ఈ మంత్రాన్ని మననం చేసుకుంటున్నపుడు మనలో ఈ భావాన్ని నిలుపుకోవాలి.  “ఓ రామా, నేను నీకు నమస్కరిస్తున్నాను.  నీకు నేను శరణాగతి చేస్తున్నాను” ఈ విధమయిన భావనతో రామమంత్రాన్ని జపించుకుంటూ ఉంటే త్వరలోనే శ్రీరామదర్శనం లభిస్తుంది.

శ్రీ సమర్ధ రామదాసు 13 కోట్ల సార్లు జపించగా ఆయనకు శ్రీరామచంద్రులవారు ప్రత్యక్ష దర్శననిచ్చారు.  రామనామంలో మహత్తరమయిన, బ్రహాండమయిన, అనూహ్యమయిన శక్తి యిమిడి ఉంది.  రామనామాన్ని ఆలపించండి.  మీరు మంత్ర జపం చేయవచ్చు లేక రాగయుక్తంగా మదురంగా పాడుకోవచ్చు.  ఈ మంత్రంలో పదమూడు అక్షరాలున్నాయి. (శ్రీ రామ జయ రామ జయ జయ రామ).  పదమూడు లక్షలు జపిస్తే ఒక పురశ్చరణ అవుతుంది.
                                  ----------------
నారాయణ్,  శ్రీరామమంత్రాన్ని జపించినవారందరిలాగానే నువ్వుకూడా ఈ జన్మలోనే ఈ మంత్రాన్ని ఎందుకు పఠించకూడదు,  తద్వారా భగవంతుడిని తెలుసుకునే జ్ఞానం నీకు లభిస్తుంది.

భగవన్నామమే నీకు జీవనాధారమగు గాక.  ఆ నామమే నీకు దారి చూపించి నీ లక్ష్యాన్ని నెరవేర్చి నిన్ను రక్షించు గాక.  నిశ్చలమయిన భక్తి, శ్రధ్ధ, విశ్వాసాలతో నిరంతరం నువ్వు చేసే నామస్మరణ ఈ జన్మలోనే నీకు భగవంతుని తెలుసుకునే జ్ఞానాన్ని లభింపచేయును గాక.
                                  -------------                    
ఈ రోజు శ్రీసాయి సత్ చరిత్ర నిత్యపారాయణ ప్రకారమ్ 30 అధ్యాయమ్ పారాయణ చేయాలి.  కాని మధ్యలో రెండురోజులు పారాయణ చేయలేకపోయాను.  దానివల్ల ఈ రోజు 27వ.అధ్యాయమ్ పారాయణ చేసాను.  అనుకోకుండా ఈ రోజునే నామము యొక్క మహత్యాన్ని ప్రచురించడం, ఇదే అధ్యాయంలో సందర్భానికి తగినట్లుగా  నామ మహిమ గురించిన ప్రస్తావన రావడం చాలా సంతోషమనిపించింది.  27వ.అధ్యాయంలో చెప్పబడిన నామ మహిమ గురించి కూడా ప్రచురిస్తున్నాను.  ---  త్యాగరాజు

శ్రీ సాయి సత్ చరిత్ర,  27 వ.అధ్యాయమ్ లో శ్రీ సాయిబాబా శ్యామాకు విష్ణుసహస్రనామ పుస్తకాన్ని ఇచ్చిన సందర్భంలో  :

నామం పాప పర్వతాలను పగలగొట్టుతుంది.  నామం దేహబంధనాలను తొలగిస్తుంది.  నామం దుర్వాసనలను సమూలంగా పెరకివేస్తుంది.  నామం కాలుని కంఠాన్ని దునిమి వేసి, జన్మ మరణాలనుండి తప్పిస్తుంది.  శ్రధ్ధగా నామస్మరణ చేస్తే, కష్టాలు అప్రయత్నంగా తొలగిపోతాయి.  నోటికి కష్టమనిపించినా నామంయొక్క ప్రభావం గొప్పది.  చిత్తశుధ్ధికి నామంకంటే సులభమైన మరొక సాధనం లేదు.  నామం జిహ్వకు భూషణం.  నామం పరమార్ధాన్ని పోషిస్తుంది.  నామ జపం చేయటానికి స్నానాదులు విధి విధానాలేవీ అవసరం లేదు.  నామం సకల పాపాలను నిర్మూలనం చేస్తుంది.  నామమెల్లప్పుడూ పావనమైనది.  అఖండ నామస్మరణ తీరానికి చేరుస్తుంది.  నామంకంటే వేరే ఇతర సాధనలేవీ అవసరం లేదు.  నామం మోక్షాన్ని కలిగిస్తుంది.  నామముయందు శ్రధ్ధగలవారి సర్వపాపాలు క్షాళనమౌతాయి.  సదా నామాన్ని జపించేవాడు, గుణవంతులలో గుణవంతుడు. 

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)






Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List