29.05.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు
నా జీవితం సాయి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది - విక్రం ఈ రోజు మనము అసలు దేవుడంటేనే నమ్మకము లేని భక్తుడిని షిరిడీ రప్పించి, (పిచ్చుక) అతని మనసులో భక్తి భావాన్ని యెలా నింపారో శ్రీ విక్రం గారు చెప్పిన మాటలలోనే తెలుసుకుందాము. ఈ లీల శ్రీమతి ప్రియాంకాగారు బ్లాగులో కొన్ని నెలల క్రితం ప్రచురింపబడినది.
ఒక సాయి భక్తుడిగ, మనందరముఒకచోటకు చేరి, ఆయన లీలలను పంచుకునే అదృష్టం కలిగింది. ప్రజల హృదయాలలో భక్తి విశ్వాసాలను కూడా నింపుతున్నాము.
ఈ రోజు నేను నాకు బాబా మీద నమ్మకం యెలా యేర్పడిందో నా స్వీయ కథని చెపుతాను. అది 2001 సవంత్సరం వెనకటి మాట. నేను ముంబాయి లో యింజనీరింగ్ విద్యార్థిని. నేను జీవితంలో చాలా క్లిష్టమైన పరిస్థితినెదుర్కొంటున్నాను. నా ప్రొఫెసర్లలో ఒకాయనతో ఉన్న సమస్యల వల్ల, నేను ప్రతీసారి ఒక సబ్జెక్ట్ లో తప్పుతూ వస్తున్నాను. నేను అన్ని సుబ్జెక్ట్ల లోనూ పాస్ అయినా ఇది ఒక్కటే మిగిలిపోయి నేను గ్రాడ్యుయేట్ని కాలేకపోయాను.
మూడు సంవత్సరాలుగా ప్రయత్నం చేసినా సఫలీకృతుడని కాకపోవడంతో ఆశ వదలివేసుకున్నాను.
యెట్టి పరిస్థితులలోనూ ఆ ప్రొఫెసర్ నన్ను ఉత్తీర్ణుడిని కానివ్వటల్లేదు. ఈ సమయంలో నేను మీకు చెప్పేదేమిటంటే నేను భగవంతుడిని, బాబాతో సహా యేదేవుడినీ నమ్మేవాడిని కాదు.
నేను నాస్తికుణ్ణి. 2001 సంవత్సరంలో, నా కజిన్ (నాకన్న 5 సంవత్సరాలు చిన్నవాడు) నన్ను తనతో షిరిడీ రమ్మని బలవంతం చేశాడు. తను ఒక్కడే వెడదామనుకున్నడు గాని అతని తల్లితండ్రులు అతనిని ఒంటరిగా ముంబాయి నించి షిరిడీకి పంపడానికి ఒప్పుకోలేదు. ఆఖరికి నేను సరే అని షిరిడీ యాత్రలో తనని అనుసరించాను. మేము ఒక రోజు నాసిక్ లో కూడా ఆగుదామనుకున్నాము కనుక సెలవులలో సరదాగా వెళ్ళి గడిపినట్టు ఉంటుందని భావించాను.
మేము ఉదయానికి షిరిడీ చేరుకున్నాము. హోటలులో గది తీసుకున్నాము. స్నానం చేసి దర్శనానికి వెళ్ళాము. చక్కటి బాబా దర్శనం అయింది. అప్పటికీ నాలో భక్తి భావం కలగలేదు. కాని ప్రతీసారి నేను తప్పుతున్న పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యి గ్రాడ్యుయేట్ అవడం కోసం ప్రార్థించాను. అలా ప్రార్థించాక నాకు కొంచం నమ్మకం యేర్పడినట్టయింది. అది నా జీవిత దృక్పథంలో కొంత మార్పు వచ్చి నాలో కొంత స్థిరత్వం యేర్పడినట్లయింది.
దర్శనం అయాక మేము నాసిక్ బయలుదేరాము. అక్కడ ఒక రోజు ఉండి ప్రదేశాలు అన్ని చూసి చాలా సరదాగా గడిపాము. మరునాడు ఉదయం బస్సులో ముంబాయికి బయలుదేరాము. హటాత్తుగా నాకు అనారోగ్యం కలిగింది. ఒక్కసారిగా నాకు విపరీతమైన జ్వరం వచ్చి వాంతులు కావడం మొదలైంది. నా శరీరం కాలిపోవడం మొదలు పెట్టింది. నా కజిన్ కి యేమిచేయాలో పాలు పోలేదు.
యెలాగోలా నేను నిద్రకుపక్రమించాను. మేము రాత్రికి ముంబాయికి చేరుకున్నాము. నేను జ్వరంతో వణికిపోతున్నాను. నా కజిన్ నన్ను మాయింటికి తీసుకుని వెళ్ళాడు. మా అమ్మగారు నాకు కొంచెం పాలు, కొన్ని మందులు ఇచ్చారు. పొద్దున్నే వైద్యుడి దగరకు వెళ్ళాలి అనుకుంటూ వెంటనే నిద్ర పోయాను.
కాని నేను పొద్దున్నే లేచేటప్పటికి నాకు పూర్తిగా నయమయింది. క్రితం రాత్రి మాత్రమే నేను జ్వరంతో వణుకుతూ ఉన్నాను. ఇప్పుడు నా శరీరంలో యేవిథమైన జ్వరలక్షణాలు, నొప్పి లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నాను.
షిరిడీ లో బాబా దర్శనం గురించి పూర్తిగా మరచిపోయి, నేను మామూలుగా నా దైనందిన కార్యకలాపాలు సాగించాను. ఒక వారం తరువాత పరీక్షా ఫలితాలు వచ్చాయి. యేమి జరిగిందో మీరు ఊహించగలరా? నేను ఉత్తిర్ణుడినయ్యాను. నా స్నేహితుడు వచ్చి నేను పరీక్షలో ఉత్తిర్ణుడినయ్యానని చెప్పేటప్పటికి నా చెవులను నేనే నమ్మలేకపోయాను. నాకు అనుకూలంగా ఉంటుందని యేమాత్రం అనుకోలేదు కాబట్టి కళాశాలకు వెళ్ళి ఫలితాలు చూసుకొవాలని కూడా నాకు అనిపించలేదు.
అందుచేత, ఫలితాలను చూసుకోవడానికి కళాశాలకు వెళ్ళిన నాస్నేహితుడు, నాది కూడా చూసి నన్ను అభినందించడానికి వచ్చాడు. నేను వెంటనే చూడటానికి కళాశాలకు వెళ్ళాను. నేను నిజంగా పరీఖలో ఉత్తిర్ణుడినయ్యాను. మొదటగా నా మనస్సులోకి వచ్చినది "బాబా". నాలో కొంచెం అపరాథ భావం కలిగింది, నేను ఆ సమయంలో చాలా సంతోషించాను.
నేను సంతోషంగా యెందుకున్నానంటే, సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న పరీక్ష ఉత్తీర్ణుడవడం. అపరాథ భావం యెందుకంటే, తన భక్తుల యెడ బాబాగారి శక్తిని, ప్రేమని తక్కువగా అంచనా వేయడం. నేను మరొకసారి షిర్డీ వెళ్ళాలని వెంటనే నిర్ణయించుకున్నాను. నేను నా కజిన్ ని కలుసుకుని ఈ శుభవార్త చెప్పి, మరొకసారి షిరిడీ వెడదామని చెప్పాను. మేము షిరిడీ వెళ్ళాము. ఈ సారి నేను పూర్తి భక్తి నమ్మకంతో ప్రార్థించాను. యిటువంటి కష్ట సమయమునుంచి నన్ను బయటపడవేసినందుకు నేను బాబాకి యెంతో కృతజ్ణతలు తెలుపుకున్నాను. బాబాని నేను నా తండ్రిగా, తల్లిగా, సర్వం ఆయనే అని అంగీకరించాను. ఆయన నాకీసాయం చేసి నా హృదయంలో నమ్మకాన్ని, భక్తిని పుట్టించారు. నేను దానిని చివరివరకూ, యింకా యెప్పటికీ నిలుపుకుంటాను.
ఈ రోజు బాబా ఒక పిచికని (నన్ను) తనవైపు యెలా లాగుకున్నారో నాకు అర్థమయింది. ముంబాయికి తిరిగి వచ్చేముందు, బాబాగారు వాంతుల ద్వారా నా శరీరంలోని మాలిన్యాన్నీ, వ్యతిరేకభావాలనీ తొలగించి శుభ్రం చేశారు. ఆయనెంతటి గొప్పవారో నేను వర్ణించలేను. ఈ రోజు వరకు నేను ప్రతీదీ గుర్తుంచుకోగలను. నా ఫలితం తెలిశాక యెంత సంతోషాన్ని పొందానో.
మొదటగా నా మనసులోకి వచ్చినది బాబా వదనం. అప్పటినించి నేను మంచి జరిగినా, చెడు జరిగినా అంతా బాబాకే వదలివేస్తున్నాను. నాకు ఈ సహాయం చేసినందుకే కాదు, ఆయన నాతో ఉన్నందుకు, నా చుట్టు తన దివ్యమైన ప్రకాశంతో ఉంటూ నేను ప్రతీదానిలో విజయం సాథించడానికి ఆయనకి కృతజ్ణుడను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment