12.12.2011 సోమవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స.డైరీ 9 వ. భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ -- 1993
11.06.1993 శుక్రవారము
నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ - ఈ శేష జీవితము నీ సేవలో గడిపే భాగ్యము ప్రసాదించు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీ సాయి . డాక్టర్.. ఎన్. కె. రావు ఎక్స్. సీ. ఇ. ఎన్. ఎఫ్. సీ రూపములో దర్శనము యిచ్చి నీ యింట నా గురించి నిర్మించే గదిలో నాకు రోజ్ వుడ్ సిం హాసనం కూర్చోవటానికి కావాలి తయారు చేయించు అన్నారు .
పీ.ఎస్. 26.01.1996 ఈ రోజు శ్రీ సాయి ధ్యాన మందిరము సాయి దర్బారు నిర్వహించినాను. సాయి బంధు సుందరరావుగారు సాయి దర్బారులో శ్రీ సాయికి రోజ్ వుడ్ తో చక్కని సిం హాసనము చేయించి తెచ్చినారు.
నేను పది రోజుల క్రితము శ్రీ సాయికి కఱ్ఱ సిం హాసనము చేయించి తెమ్మనమని శ్రీ సుందరరావుగారిని కోరినాను. మరి శ్రీ సుందర రావుగారు రోజ్ వుడ్ రంగులో ఉన్న కఱ్ఱతో సిం హాసనము ఎలాగ చేయించ గలిగినారు. నా ఆలోచనలకు సమాధానము ఒక్కటే అనిపించినది. అది శ్రీ సాయికి భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని తెలుసు. ఆయనకు కావలసినది ఆయన భక్తుల మనసులో ప్రవేసించి చేయించుకోగలరు అనే విషయము.
24.06.1993 ఈ రోజు ఉదయము భోజనము చేసి నిద్ర పోయినాను. నిద్రలో ఒక భయంకరమైన కల వచ్చినది. నేను నా భార్య రోడ్డుమీద నదుస్తూ ఉంటే 119 నంబరు బస్సు వచ్చి నా భార్యను "ఢీ" కొట్టినది. నా భార్య రక్తముమడుగులో పడియున్నది. భయముతో నిద్రనుండి లేచినాను. వెంటనే శ్రీ సాయి సత్ చరిత్రలో ఏమైన సమాధానము దొరుకుతుందా అని వెతుకుతూ 119 పేజీలోని వాక్యాలు చదువుతుంటే భీమాజీ పాటిలు ప్రతి ఐదునిమిషాలకు రక్తము గ్రక్కుచుండినవాడు శ్రీ సాయి ముందు రక్తము కక్కలేదు అని ఉంది. కాని మధ్యాహ్న్నము ఒంటిగంటకు టెలిఫోన్ మ్రోగినది. టెలిఫోన్ ఎత్తినాను. 90 సంవత్సరాల వయసుగల నా మేనత్త నందంపూడి గ్రామములో మరణించినది అని నా బంధువులు తెలిపినారు. ఆమె శ్రీ సాయి భక్తురాలు. నా తండ్రిగారి వంశములోని ఆఖరి రక్తబందువు ఈ లోకము విడిచిపోయినది, అనే బాధ నాలో కొంచము సేపు ఆవరించినది. ఈ మరణవార్తను శ్రీ సాయి నాకు ముందుగా ఉదయము కలలోను శ్రీ సాయి సత్చరిత్ర 119 పేజీలోను తర్వాత టెలిఫోన్ ద్వారా తెలియచేయటము శ్రీ సాయికి ఉన్న ప్రత్యేకత అని భావించినాను.
26.06.1993 శనివారము
నిన్నరాత్రి కలలో శ్రీ సాయి చూపిన దృశ్యము వైరాగ్యభావాన్ని కలిగించినది. నేను యుక్త వయస్సులో యుండగా ఒక స్త్రీ అందాన్ని చూసి ఆమెను ఆరాధించేవాడిని.
ఆమెకు వివాహము అయినా ఆమెను నేను మర్చిపోలేని స్థితిలో యుండేవాడిని. నేటి రోజున ఆమె శరీరము అనారోగ్యముతో ముడతలు పడిపోయి ఆమె నోటిలోని పళ్ళు ఊడిపోయి శిరస్సుపైని శిరోజాలు రాలిపోయి చాలా అంద విహీనముగా యున్నది.
అది ఆమె నేటి పరిస్థితి. మరి శ్రీ సాయి ఈ పరిస్థితిని నాకు కలలో చూపించి "శరీరము శిధిలమై తుదకు నశించును" అన్నారు. ఉదయము నిద్ర లేచినాను కాని మనసులో ఆ స్త్రీమూర్తి రూపము కనిపించుతున్నది. స్నానము చేసిన తర్వాత శ్రీ సాయి సత్ చరిత్ర నిత్యపారాయణ 31 వ. అధ్యాయము ప్రారంభించినాను. విజయానంద్ విషయములో శ్రీ సాయి అన్న మాటలు "ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు, శరీరము శిధిలమై తుదకు నశించును. దీనిని తెలిసికొని నీ కర్తవ్యమును నీవు చేయుము". మరి నేను చేయవలసిన కర్తవ్యము ఏమిటి? అని ఆలోచించినాను.
28.06.1993 సోమవారము
నిన్న రాత్రి కలలో ఒక అజ్ఞాత వ్యక్తి అన్నారు, "సాయి మీద నమ్మకము చిన్నది అయిన అది భూమిలో చిన్న చిన్న వేళ్ళుగా బలంగా భూమిలోకి పాకి కొబ్బరి చెట్టును భూమిపై నిలబెట్టే విధముగా యుండాలి. ఆ చిన్న చిన్న నమ్మకాలు (కొబ్బరి చెట్టు వేళ్ళు) నీ జీవితాన్ని (కొబ్బరి చెట్టును)నిటారుగా నిలబడనిచ్చి పెను తుఫానులు వచ్చినా వంగకుండ యుండేలాగ చేస్తుంది. నీవు వేసిన కొబ్బరి చెట్టు ఫలాలు నీవు పొందకపోవచ్చును. నీ పిల్లలు ఆ ఫలాలు తిని సుఖముగా జీవించుతారు." నిద్రనుండి లేచి శ్రీ సాయికి నమస్కరించి ఈ కలకు అర్థము గురించి ఆలోచించినాను. శ్రీ సాయి సత్ చరిత్రలో శ్రీమతి బయిజాబాయి శ్రీ సాయి పై నమ్మకముతో శ్రీ సాయి సేవ చేసుకొన్నది. ఆమె శ్రీ సాయినుండి ఏ విధమైన ప్రతిఫలము ఆశించలేదు. ఆమె మరణానంతరము శ్రీ సాయి ఆమె కుమారుడు తాత్యా కోతేపాటిల్ ను దగ్గరకు చేరదీసి ఆతని ప్రాణాన్ని కాపాడటానికి తన ప్రాణాన్ని ధారపోసినారు. శ్రీ సాయిపై నమ్మకము అనే కొబ్బరి చెట్టును పాతిన స్త్రీమూర్తి బయిజాబాయి. ఆ చెట్టు ఫలాలు తిన్నది ఆమె కుమారుడు తాత్యా కదా అని ఆలోచుంచుతు తిరిగి నిద్రపోయినాను. తిరిగి తెల్లవారుజామున కలలో శ్రీ సాయి మా ఆఫీసులోని మేనేజరు విజయ చంద్ర రూపములో వచ్చి నన్ను ఫ్యాక్టరీలోని ఫర్నేసు (కొలిమి) దగ్గరకు తీసుకొని వెళ్ళి అక్కడ నా చిన్ననాటి స్నేహితురాలిని చూపించి ఈమెను నీవు వివాహము చెసుకోలేకపోయినావు. ఆ బాధ ఈ కొలిమిలోని వేడితో పొందిన బాధలాగ ఉన్నది కదూ అంటారు. ఒక్కసారి ఉలిక్కిపడి నిద్రలేచినాను. శ్రీ విజయ చంద్రకు నావ్యక్తిగత విషయాలు ఏమీ తెలియవు. మరి శ్రీ సాయి విజయ చంద్ర రూపములో నాగత చరిత్ర ఏవిధముగా చెబుతున్నారు? నిజ జీవితములో నా చిన్ననాటి స్నేహితురాలు ఈనాటి మేనేజరు విజయ చంద్ర యిద్దరు సాయి భక్తులే. అందుకే శ్రీ సాయికి అన్నీ తెలుసు.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment