29.12.2011 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
గత మూడురోజులుగా ఆఫీసుపనిమీద మచిలీపట్నం వెళ్ళడం వలన ప్రచురించడానికి కుదరలేదు. మచిలీపట్టణములో శ్రీ సాయిబాబావారి గుడిలోనికి వెళ్ళి ఆయనని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ బాబావారి విగ్రహం నిలుచుని వుంటుంది. నేను ఆయన ముందుకు వెళ్ళి నమస్కరించుకుని కిందకు దిగినాను. ఆయన కుడిచేతిలో ఒక పువ్వు పెట్టబడి ఉంది. (కుడి అరచేయి పైకిఉండి అభయమిస్తున్నట్లుగా ఉంది, అరచేయి 4 వేళ్ళకు, బొటనవేలికి మధ్య కొంత ఖాళీ ఉంది, అందులో పువ్వు పెట్టారు) ఆ పువ్వు పడటానికి వీలులేని విధముగా పెట్టియున్నారు. నేను కిందకు దిగి నుంచున్నాను "బాబా ఆ పువ్వును కింద పడేలా చేయి" అని మనసులో అనుకున్నాను. మరల అనుకున్నాను, ఆ పువ్వు కిందపడటానికి ఆస్కారం లేకుండా పెట్టి ఉన్నారు, పడదు, అనుకొని బాబాకి అసాధ్యమన్నది లేదు అనుకున్నాను. మరలా రెండవసారి ఆయన విగ్రహం వద్దకు వెళ్ళాలనిపించినది. మరలా వెళ్ళి ఆయన అరచేతిని ముట్టుకుని నమస్కరించుకున్నాను. కాని అరచేతిని ముట్టుకున్నాను గాని పువ్వును తాకలేదు. బాబాకి నమస్కరించుతుండగా ఒక నిమిషములోనే బాబావారి చేతినుండి పువ్వు కిందపడింది. అక్కడ ఉన్న ఒకామె ఆ పువ్వును తీసి మరల ఆయన చెతిలొ పెట్టింది. కాని మరలా కింద పడింది. ఈ విధముగా అడిగినవెంటనే బాబా వారు పువ్వును కిందకు పడవేయడం నాకు చాలా ఆనందాన్ని కలుగచేసింది.
ఇక ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ 1993 18 వ. భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ - 1993
16.10.1993
నిన్నరాత్రి శ్రీ సాయికి నమస్కరించి తెల్లవారితే నా యింట శుభకార్యము (బారసాల). ఈ శుభకార్య భారము అంత నీమీద వేసినాను అని శ్రీ సాయికి విన్నవించుకొని నిద్రపోయినాను. శ్రీ సాయి కలలో నా స్నేహితుని రూపములో నాయింటికి వచ్చి శ్రీ శిరిడీ సాయి ప్రసాదమును నా చేతికి యిచ్చినారు. ఉదయము నిద్ర లేచి ఆలోచించినాను. శ్రీ సాయి ప్రసాదము కలలో పొందటము శ్రీ సాయి ఆశీర్వచనములు, మరియు అభయము అని నమ్మినాను.
17.10.1993
నిన్నటి రోజున నా మనవడి బారసాల శ్రీ సాయిదయవలన సవ్యముగా జరిగినది. నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి, కృతజ్ఞతలు తెలియచేసి, నా యింట భోజనానికి ఏరూపములో వచ్చినది తెలియచేయమని కోరినాను. శ్రీ సాయి కలలో చూపిన దృశ్యము నన్ను చాలా ఆశ్చర్యము పరిచినది. శ్రీ సాయి నా పెద తండ్రి పెద్ద అల్లుడు శ్రీ పేరి కృష్ణమూర్తి గారి రూపములో తెల్లని ఖద్దరు ప్యాంటు, చొక్క ధరించి, చేతిలో శ్రీ సత్యనారాయణస్వామి ప్రసాదము పట్టుకొని నన్ను చూస్తూ చిరునవ్వు నవ్వసాగారు. ఆనందముతో నిద్రలేచి ఆలోచించసాగినాను. బారసాలకు రెండు రోజుల ముందుగా బంధువులను, స్నేహితులను భోజనానికి పిలిచినాను. నేను శ్రీ పేరి కృష్ణమూర్తిగారి యింటికి పిలుపులకు వెళితే యింటికి తాళము ఉంది. ఆయన ఆఫీసుకు వెళ్ళినపుడు ఆయన బయటికి పనిమీద వెళ్ళినారు. నేను ఆయన స్నేహితునికి నేను వచ్చిన పని చెప్పినాను. అసలు శ్రీ కృష్ణమూర్తిగారు చాలా పట్టింపులు గల మనిషి. యింటికి వచ్చి పిలిస్తే గాని ఎవరి యింటికి భోజనానికి రారు. అటువంటిది ఒక స్నేహితుని ద్వారా కబురు అందుకొని నాయింటికి భోజనమునకు రావటము శ్రీ సాయి లీలగా భావించినాను.
21.10.1993
నిన్నటి రోజున శ్రీ సాయికి నమస్కరించి సాయినాధ నీ తత్వ ప్రచారానికి నడుము కట్టాలని యుంది ఆశీర్వదించు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యాలు నన్ను ఆశ్చర్యపరచినవి. అది ఒక భూగృహము. అక్కడ తపస్సు చేసుకొనేందుకు వీలుగా జింక చర్మాలు, జపమాలలు ఉన్నాయి. గది అంత బూజులు పట్టియున్నాయి. నేను నా భార్య ఆగదిని శుభ్రము చేస్తాము. ఇంకొక దృశ్యము లో శ్రీ సాయి శ్రీ ఐ.వీ.ఖాన్ గారి రూపము (ఎక్స్.హెడ్ ఆఫ్ ఎలెక్ట్రికల్ డిపార్ట్ మెంట్ - ఎన్.ఎఫ్.సీ.) లో దర్శనము యిచ్చి నన్ను తన యింటికి వచ్చి చిందర వందరగా పడియున్న పుస్తకాలను సరిగా సర్దమన్నారు. ఆ తర్వాత తన యింటి గుమ్మము దగ్గర ఉన్న బోర్ వెల్ నుండి నీరు ఎక్కువగా రావటములేదు. దానిని బాగుచేయమన్నారు.
పీ.ఎస్. 26.01.1996 శ్రీ సాయి ఆదేశానుసారము నా యింట శ్రీ సాయి ఆశీర్వచనాలతో సాయి దర్బారు నిర్మించినాను. అందులో జపము చేసుకొనేందుకు వీలుగా చాపలు వేసినాను. శ్రీ శిరిడీ సాయి లీలా అమృత భాండాగారములో చక్కగా పుస్కకాలు అమర్చి సాయి బంధువులకు అందించుచున్నాను. బోర్ వెల్ నిండి నీరు (అంటే శ్రీ సాయి తత్వ ప్రచారము) బయటకు తీసి సాయి బంధువులకు ఇస్తున్నాను.
22.10.1993
06.10.1993 నాడు "ఆర్థర్ ఆస్ బరన్" యింగ్లీషులో వ్రాసిన శ్రీ సాయి సత్ చరిత్రను తెలుగులో అనువాదము చేయాలి అని నిశ్చయించుకొన్నాను. శ్రీ సాయి ఆశీర్వచనాలు పొందినాను. 24.10.1993 విజయదశమి రోజున అనువాదము ప్రారంభించాలి. మరి ఆ పుస్తకానికి యింగ్లీషు పేరు "యింక్రెడిబుల్ సాయి బాబా". తెలుగులో అదే విధముగా అనువదించిన మంచి అర్థము రావటములేదు. అందుచేత ఆ పుస్తకానికి తెలుగులో ఏవిదమైన పేరు పెట్టాలి అని శ్రీ సాయిని తెలియచేయమని వేడుకొని నిద్రపోయినాను. కలలో ఓ అజ్ఞాతవ్యక్తి అన్నారు. "వాల్మీకి రామాయణానికి "కపిల గీత" కి ఏమని పేరుపెట్టినారు. అదేవిదముగా నీవు తెలుగులో అనువాదము చేసే పుస్తకానికి పేరుపెట్టు". నిద్రనుండి మెలుకువ వచ్చినది. శ్రీ సాయి పటముముందు నిలబడి శ్రీ సాయికి నమస్కరించి నా చేత తెలుగులో అనువాదముచేయించబడే పుస్తకానికి "ఆర్థర్ ఆస్ బరన్ సాయి రామ చరిత్ర" అని పేరుపెడతాను అని ప్రమాణము చేసినాను.
పీ.ఎస్. 22.10.1993 8 ఏ. ఎం. శ్రీ సాయి సత్చరిత్ర నిత్యపారాయణలో మూడవ అధ్యాయము చదివినాను. అది 24 వ పేజీ, 25 వ. పేజీలలో శ్రీ సాయిబాబాయొక్క మాటలు"సచ్చరిత్ర వ్రాయటము విషయములో నా పూర్తి సమ్మతినిచ్చెదను" నాకు ఉత్సాహమును కలిగించినది. నేను తెలుగులో అనువాదము చేయటానికి శ్రీ సాయి అనుమతించినారు అని భావించినాను. 25 వ. పేజీలో శ్రీ హేమాద్రిపంతు అన్న మాటలు భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయాలను, మఠములను, నదులలో మెట్లు నిర్మించుటకును - నన్నీ సత్ చరిత్ర వ్రాయమని నియమించిరి". నిజము అని అనిపించినది. భగవంతునికి భక్తునికి మధ్య సంబంధము, భగవంతుని లీలలను నా చేత (ఈ సాయి.బా.ని.స.) వ్రాయించుతూ ఉన్నారని నమ్ముచున్నాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment