20.09.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీవిష్ణుసహస్రనామం 86వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం : సువర్ణబిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః |
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ||
తాత్పర్యం: పరమాత్మను బంగారు వర్ణముగల కాంతియొక్క బిందువు గనూ, మరియూ సృష్టివాక్కుగా నుచ్చరింపబడుటకు కారణమైన బిందువుగనూ ధ్యానము చేయుము. ఆయన వాక్కుయను దేవతలకు అధిపతి గనుక, క్షోభింపచేయుటకు సాధ్యముకాదు. సృష్టియను సత్తు లేక అస్తిత్వముగానున్న మహా సరస్సువంటివాడు. భౌతికమగు మహా అగడ్త లేక కందకము ఆయనయే. అన్ని భూతములకు కారణమైన మహాభూతము ఆయనయే. అన్ని సంపదలకు మూలకారణమైన మహానిధిగా ఆయనయే యున్నాడు.
శ్రీసాయితో మధురక్షణాలు - 19
రజాకార్ల బారినుండి శ్రీకె.జగదీష్ మున్షీని కాపాడిన బాబా
1948 సంవత్సరములో జరిగిన సంఘటన ఇది. శ్రీకె. మున్షీగారు తన భార్యతో కలసి బెంగళురునుండి బొంబాయి వెళ్ళే రైలులో మొదటి తరగతి బోగీలో ప్రయాణం చేస్తున్నారు.
ఆబోగీలో ఆరుగురు ప్రయాణీకులు ఉన్నారు. వారిలో ఒక జంట వృధ్ధ దంపతులు, మిగిలినవారు పడుచు వయసులో ఉన్నారు. శ్రీ జె.కె.మున్షీగారు, ఆయన భార్య ఇద్దరూ పేకాట ఆడుకుంటున్నారు. వారిలో వృధ్ధుడు భగవత్ ప్రార్ధన చేసుకుంటున్నాడు. ఆయన భార్య మిగిలినవారిని పరిశీలిస్తూ కూర్చొని ఉంది. వారు బెంగళూరు నుండి బయలుదేరేముందు, ఈ మార్గంలో ప్రయాణం చేయవద్దని కొందరు వారికి సలహా యిచ్చారు. కారణం హైదరాబాదు రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలలో రజాకార్ల అల్లర్లు జరుగుతున్నాయి. అప్పట్లో వారు వయసులో ఉన్నందువల్ల వారు చెప్పిన సలహాని పెడచెవిన పెట్టారు. రైలు హైదరాబాదు వదలి షోలాపూర్ స్టేషన్ ని సమీపిస్తూండగా, అకస్మాత్తుగా గంగాపూర్ వద్ద ఎవరో బలవంతంగా రైలుని ఆపేశారు. అక్కడ రజాకార్లు, రైఫిల్స్, లాఠీలు, మారణాయుధాలు ధరించి గుమికూడి "ముస్లిం లందరూ దిగండి. హిందువులనందరినీ చంపండి" అంటూ అరుస్తున్నారు. ప్రయాణం జరుగుతున్నంతసేపూ భగవత్ ప్రార్ధన చేసుకుంటున్న వృధ్ధుడు అందరినీ బోగీ తలుపులు, కిటికీలు, మూసివేయమని ఆదేశించాడు. అందరూ ఆయన చెప్పినట్లేచేశారు. రైలునుంచి బలవంతంగా లాగివేయబడ్డ ప్రయాణీకులు ఎంత మొఱపెట్టుకున్నా వారిని కొట్టి, దోపిడీ చేశారు. ప్రయాణీకులంతా తమ తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రక్కనే ఉన్న పొలాలలోకి పరుగెత్తారు. వీరి బోగీని బలవంతంగా తెరవడానికి రజాకార్లు చాలా సార్లు ప్రయత్నించారు గాని, లాభం లేకపోయింది. ఇటువంటి విపత్కర సమయంలో కూడా ఆవృధ్ధుడు తన ప్రార్ధనను ఆపకుండ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ అల్లర్లు ఆవిధంగా దాదాపు 5 గంటలదాకా కొనసాగాయి. ఆఖరికి రైలు ఒకే ఒక బోగీతో షోలాపూర్ స్టేషన్ కు చేరుకొంది. బోగీలో ఉన్నవారందరూ కూడా రజాకార్ల బారినపడకుండా క్షేమంగా చేరుకొన్నారు. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజుల తరువాత, ఆవృధ్ధుడు తాను శ్రీషిర్దీ సాయిబాబాను ప్రార్ధించడం వల్లనే తాము రజాకార్ల బారిన పడకుండా క్షేమంగా చేరుకొన్నామని ఒక పత్రికకు ఆర్టికల్ పంపించాడు. అందులో ఆయన శ్రీజగదీష్ క్.మున్షీగారిని ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్నారు. ఆసమయంలో ఆయన భగవంతుడిని ప్రార్ధిస్తూనే ఉన్నారని చెప్పి, తనకు శ్రీషిరిడీసాయిబాబా ఎవరో తెలియదని కూడా శ్రీమున్షీ చెప్పారు.
తరువాత 1953వ.సంవత్సరంలో ఆయన కుటుంబంలో కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురయాయి. ఒక రోజున ఆయన అఫీసుకు వెడుతుండగా ఒక పటాలు తయారు చేసే దుకాణంలో శ్రీసాయిబాబా పటం తగిలించి ఉండటం చూశారు. ఆఫొటోలొ ఆయనకు 'నాయందెవరి దృష్టో వారియందే నాదృష్టి' అన్న వాక్యాలు కనిపించాయి. అప్పుడాయనకు గతంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. తన భార్యతో సంప్రదించి ఆవిడ అనుమతితో పూజ చేసుకోవడానికి సాయిబాబా పటం కొన్నారు. తన సమస్యలన్నిటినీ పరిష్కరించమని బాబాను వేడుకొన్నారు. కొద్ది రోజూలలోనే ఆయన సమస్యలన్నీ తీరిపోయాయి. ఆపరిణామంతో ప్రతిరోజూ క్రమం తప్పకుడా శ్రీసాయినాధుని పూజించడం ప్రారంభించారు.
ఒకసారి ఆయన రైలులో రాత్రిపూట సూరత్ నుంచి బొంబాయికి ప్రయాణం చేస్తున్నారు. రైలు సూరత్ స్టేషన్ నుంచి బయలుదేరిన వెంటనే ఆయనకు బ్లాడర్ లో రాయి ఉన్నందువల్ల విపరీతమయిన నొప్పి ప్రారంభమయింది. తరువాత ఆనొప్పి ఆయన కూర్చోవడానికి గాని, లేవడానికి కూడా లేనంతగా తీవ్రమయిపోయింది. మూత్రం నుంచి రక్తం కూడా పోవడం మొదలయింది. తోటి ప్రయాణీకుడు నిద్రలో ఉన్నాడు. రైలు పాల్ఘర్ చేరుకునేటప్పటికి నొప్పి యిక భరించలేనంతగా ఉండటంతో ఆయన తన తోటి ప్రయాణీకుడుని లేపి గార్డుని పిలవమని చెప్పారు. గార్డు వచ్చి ఆయన క్లిష్టపరిస్థితిని చూసి, రైలులో డాక్టర్లు ఎవరూ లేరని, అందుచేత పాల్ఘర్ లో దిగిపోయి అక్కడి డాక్టర్ చేత వైద్యం చేయించుకోమని సలహా యిచ్చాడు. గార్డు, స్టేషన్ మాస్టర్ ల సహాయంతో ఆయన పాల్ఘర్ స్టేషన్లో దిగిపోయారు. రైలు వెళ్ళిపోయింది. అంతరాత్రివేళ డాక్టర్ స్టేషన్ కు వచ్చి వైద్యం చేయడానికి నిరాకరించడంతో ఆయనను ఒక ఎడ్లబండిలో డాక్టర్ యింటికి పంపించారు. ఆక్లిష్ట పరిస్థితిలో ఆయన శ్రీసాయినాధుని సహాయం కోసం ప్రార్ధించారు. డాక్టర్ ఆయనకి నొప్పి తగ్గడానికి మందు యిచ్చారు. డాక్టర్ బొంబాయిలో ఉన్న ఆయన బంధువులకు కబురు పంపించారు. మరుసటిరోజు వారు వచ్చి ఆయనను బొంబాయికి తీసుకొని వెళ్ళారు. ఈసంఘటనలో శ్రీషిర్డీసాయిబాబా గారి ప్రత్యేకమయిన మహత్యం ఉందని గానీ ఆయన వల్లనే తనకు నయమయిందనీ ఆయన భావించలేదు.
1968 సం.లో ఆయన తండ్రి ఆయనను సత్యసాయిబాబా దగ్గరకు తీసుకొనివెళ్ళి పరిచయం చేశారు. సత్యసాయిబాబాగారు అన్న మాటలు "అతను శ్రీసాయిబాబాను 16సం.నుంచి నమ్ముతున్నాడని నాకు తెలుసు. ఒకసారి విపరీతమయిన నెప్పి వచ్చి రైలు నుంచి దిగిపోయాడు. శ్రీసాయిబాబాను సహాయం కోసం ప్రార్ధించాడు. అతనిని కాపాడినది శ్రీసాయిబాబాయే. సత్యసాయిబాబా అన్న ఆమాటలు శ్రీషిరిడీ సాయిబాబా వారి మహిమను చాటి చెప్పాయి.
1959సం.లో ఒక నెల వయసున్న ఆయన అమ్మాయికి విపరీతమయిన జ్వరం వచ్చింది. పాపని ఆస్పత్రిలో చేర్పించారు. 3వారాలపాటు వైద్యం చేశారు కాని, జ్వరతీవ్రత ఎక్కువగానే ఉంది. ఆయన, ఆయన భార్య చాలా కలత చెందారు. 1959సం. నవంబరు 14 వ.తారీకున యిద్దరు ప్రముఖ డాక్టర్లు ఆపాప బ్రతకడం కష్టం అని చెప్పారు. ఆపాప కనక బ్రతకకపోతే తానిక షిర్దీ సాయిబాబాను పూజించకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఆయన ఈనిర్ణయం తీసుకున్న తరువాత ఆపాప జ్వరం క్రమేపీ తగ్గి రాత్రి 7గంటలలకు నార్మల్ కి వచ్చింది. ఈ సంఘటన జరిగిన 3నెలల తరువాత పాప మంచి ఆరోగ్యంగా తయారయింది.
1960సం.మార్చి నెలలో వారు తమ 5నెలల పాపను తీసుకొని కారులో షిరిడీకి వెళ్ళారు. దారిలో ఆపాప మొట్టమొదటగా పలికిన పలుకులు " బా బా బా బా " శ్రీసాయిబాబా శ్రీజగదీష్ కె.మున్షీగారిని కాపాడి మార్గాన్ని చూపారు. ఆయన గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ పాత్రపోషించినవారు, రాజకీయనాయకుడు, రచయిత, విద్యావేత్త. వృత్తిరీత్యా ఆయన లాయరు. ఆయన రచయితయినా గాని , తరువాత రాజకీయాలలోకి ప్రవేశించారు. గుజరాతీ సాహిత్యంలో మంచిపేరున్నవారు. 1938సం.లో ఆయన భారతీయ విద్యాభవన్ ను స్థాపించారు.
ఆంబ్రోషియా ఇన్ షిరిడీ నుండి.
రామలింగస్వామి
షిరిడి.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment