24.09.2013 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధురక్షణాలు - 20
సాయి బంధువులారా! మన బ్లాగులో ప్రచురణకు ఈ రోజు సమయం కుదిరింది..ఈ రోజు మీకందించబోయే సాయితో మధురక్షణాలలో ఈ బాబా లీల చదవండి..ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 87వ.శ్లోక, తాత్పర్యం.
శ్రీవిష్ణుసహస్రనామం 87వ.శ్లోకం
శ్లోకం: కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః |
అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ||
పరమాత్మను భౌతిక సుఖములు కలిగించు పరిమళపుష్పములుగా ముఖ్యముగా మల్లెపువ్వుగా ధ్యానము చేయుము. ఆయన వర్షమున కధిపతియై జీవులకు సౌఖ్యము కలిగించుచున్నాడు. వాయువునందలి వీచు శక్తిగా అన్నిటిని పరిశుధ్ధము చేయుచున్నాడు. అమృతమయములకు చంద్రకిరణములే ఆయన భౌతిక శరీరము. ఆయన అన్నియూ తెలిసినవాడు. మరియూ అన్నిటియందు సామర్ధ్యము కలవాడు.
ఆకలితో ఉన్న తన భక్తులకోసం బాబా వేచిఉండుట.
అది 1962వ.సంవత్సరం. శ్రీవాడ్రేవు రామమూర్తిగారు తన స్నేహితులతో కలసి జమానపల్లినుండి షిరిడీ వెళ్ళారు. అక్కడ వారు ప్రతీరోజూ షిరిడీ సాయిబాబా క్యాంటీన్ లో భోజనం చేస్తూ ఉండేవారు. క్యాంటీన్ యజమాని రోజూ రాత్రి 9 గంటలకల్లా క్యాంటీన్ మూసివేసి తాళాలు వేసుకొని యింటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక రోజున వారంతా క్యాంటీన్ యజమానితో, తామందరూ సాకోరీ (షిరిడీనుండి 5 మైళ్ల దూరంలో ఉంది. అక్కడ బాపూసాహెబ్ జోగ్ సమాధిని, శ్రీఉపాసనీగారి ఆశ్రమం దర్శించుకోవడానికి) వెడుతున్నామని తాము వచ్చేటప్పటికి క్యాంటీన్ మూసివేయకుండా వేచి చూడమని చెప్పారు.
వారు చెప్పినదానికి క్యాంటీన్ యజమాని ఒప్పుకోకుండా, వారు 9 గంటలకల్లా రాకపోయినట్లయితే తాను ఎప్పటిలాగే క్యాంటీన్ మూసివేసి తాళాలు వేసుకొని వెళ్ళిపోతానని చెప్పాడు. వారు సాకోరి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 11గంటలయింది. క్యాంటీనతను చెప్పినట్లుగానే క్యాంటీన్ మూసేసి వెళ్ళిపోయాడు. షిరిడీ గ్రామమంతా చీకటిగా నిర్మానుష్యంగా ఉంది. వారు చాలా ఆకలితో ఉన్నారు. ఏదో విధంగా తినడానికేమయినా దొరికితే బాగుండునని ఎంతో ఆశతో ఉన్నారు. అనుకోకుండా క్యాంటీన్ ప్రక్కన పడుకున్న ఒక వ్యక్తి లేచి క్యాంటీన్ తలుపు తాళం తీశాడు. నలుగురికీ వేరుశనగపొడి, అన్నం పెరుగు వడ్డించాడు. అతను ఒక్కమాట కూడా మాట్లాడకుండా వారందరినీ భోజనం చేయమని సంజ్ఞచేశాడు. మంచి రుచికరమైన భోజనం చేసి వారు వెళ్ళిపోయారు. భోజనం వడ్డించిన వ్యక్తి మాట్లాడకుండా తన చోటకు వెళ్ళి నిద్రపోయాడు.
తరువాత వారంతా నిద్రించడానికి ద్వారకామాయికి వెళ్ళారు. వాడ్రేవు రామమూర్తిగారికి నిద్రలేమి ఉండటంతో మెలకువగా ఉన్నారు. యింతలో కొంతమంది వీరి వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు. కాని, గుఱ్ఱమంత ఎత్తు ఉన్న కుక్క ఎక్కడినుంచో వారి రక్షణ కోసం వచ్చింది. ఆ కుక్క ఎక్కడినుండి వచ్చిందో ఆయనకర్ధం కాలేదు. ఆయనకి చాలా భయం వేసింది. ఆ కుక్క వీరు సామానుల చుట్టూరా తిరుగుతూ వాడ్రేవు రామమూర్తిగారి దగ్గరకు వచ్చి తన పాదాన్ని ఆయనమీద పెట్టింది. ఆయనకది నిజమైన మనిషి చేయిలా అనిపించింది. అది కుక్కని తెలుసు. కాని తనమీద పడినది మనిషి చేయి. అంత చీకటిలోనూ ఆ చేతివంక చూడటానికి చాలా ప్రయత్నించారు గాని, చాలా చీకటిగా ఉన్నందువల్ల అది సాధ్యం కాలేదు. తెల్లవారుఝామున 3 గంటలకు షిర్దీ సంస్థానం వారు లేచి లైట్లు వేశారు. దాంతో ఆకుక్క వెళ్ళిపోయింది. ఆవిపత్కర సమయంలో తామందరినీ దొంగలబారిని పడకుండా రక్షణగా వచ్చినది సాయినాధుడే తప్ప మరెవరూ కాదనిపించింది.
మరుసటిరోజు వారు, రాత్రివేళ తామందరికీ భోజనాలు ఏర్పాటు చేసినందుకు క్యాంటీన్ యజమానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళారు. క్యాంటీన్ యజమాని తనకా విషయమేమీ తెలియదని అంతా వివరంగా చెప్పమన్నాడు. అంతా విన్న తరువాత అతను బయట నిద్రించే వ్యక్తిని పిలిచి "రాత్రి నువ్వు వీరందరికీ, భోజనాలు ఏర్పాటు చేశావా" అని అడిగాడు. అప్పుడా వ్యక్తి లేదని తల అడ్డంగా ఊపుతూ , "మీరు క్యాంటీన్ కి తాళాలు వేసుకొని పట్టుకెళిపోతే నాకదెలా సాధ్యమవుతుంది" అని తన యజామానితో ప్రశ్నార్ధకంగా అన్నాడు. అందరూఆశ్చర్యంతో స్ఠాణువులైపోయారు. అంత రాత్రివేళ తమకోసం రుచికరమయిన భోజనాలు ఏర్పాటు చేసి తమ అందరి ఆకలిని తీర్చినది సాయినాధుడేనని అర్ధమయింది.
క్యాంటీన్ యజమాని వారినెంతో అభినందించాడు. ఈ సంఘటనతో, తామందరికి సాయినాధుని దర్శనం లభించినందుకు, ఆయన తామందరి ఆకలిని తీర్చినందుకు ఎంతో సంతోషంగా తమతమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్ళారు.
శ్రీసాయిలీలా స్రవంతి (తెలుగు)
శ్రీమతి భారం ఉమామహేశ్వరరావు
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment