04.10.2013 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబంధువులారా! నేను 30.09.2013 న బ్యాంకు సర్వీసునుండి రిటైర్ అయ్యాను. ఈ సందర్భంగా కొన్ని పనులవలన ప్రచురణకు ఆలశ్యం జరిగింది. ఈ రోజు శ్రీసాయితో మధురక్షణాలలో 21వ. లీలను అందిస్తున్నాను...ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 88వ.శ్లోకం, తాత్పర్యం..
శ్రీవిష్ణుసహస్రనామం 88వ.శ్లోకం
శ్లోకం: సులభః సువ్రతః సిధ్ధః శత్రుజిత్ శత్రుతాపనః |
న్యగ్రోధోదుంబరో శ్శ్వత్థశ్చాణూరాంధ్ర నిషూదనః ||
తాత్పర్యం: పరమాత్మను సులభముగా పొందవలెనన్నచో, పవిత్రమైన జీవితమును గడుపుచు, వ్రత నియమములాచరించుచూ, అశ్వత్థ వృక్షము క్రింద జీవించుచూ, మేడి పండును తిని, జమ్మి ఆకులు నానబెట్టిన నీటిని త్రాగుచుండవలెను. ఇట్టి నియమముతో కూడిన ధ్యానమును వ్రతముగా నాచరించువానికి పరమాత్మ వారి అంతశ్శతృవులను జయించి నిర్మూలించును. ఆయన ఆంధ్రుడైన చాణూరుడను వానిని సం హరించెను. పైన చెప్పిన వృక్షముల సాన్నిధ్యమున వ్రత నియమముల నాచరించుచూ, నారాయణుని ధ్యానము చేయువానికి అన్ని సిధ్ధులునూ లభించును.
శ్రీసాయితో మధురక్షణాలు - 21
తన భక్తుడిని రక్షించడానికి బాబా లాయరుగా ప్రవేశం
హైదరాబాదునుండి ప్రారంభింపబడిన ద్విభాషా మాసపత్రిక సాయిప్రభలో దీనికి సంబంధించిన బాబా లీల ప్రచురింపబడింది. శ్రీసాయి సత్ చరిత్రలో (33వ.అధ్యాయం) జామ్నేర్ లో టాంగావాలాగా బాబా కనిపించిన సంఘటన మనకు కనపడుతుంది. మన సమస్యలను తీర్చటానికి బాబా వివిధరూపాలలో వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి శ్రీసాయి భక్తుడయిన ఒక లాయరుగారు (శ్రీవేమూరి వెంకటేశ్వర్లుగారు) తన క్లయింటు కేసు వాదించడానికి రాలేకపోయిన సందర్భంలో రేపల్లె జిల్లా మున్సిఫ్ కోర్టులో శ్రీసాయినాధుడు శ్రీవేమూరి వెంకటేశ్వర్లుగారి రూపంలో వచ్చి కేసు వాదించారు.
1960 సంవత్సర ప్రాంతంలో గుంటూరు జిల్లా రేపల్లెలో శ్రీవేమూరి వెంకటేశ్వర్లు గారు మంచి ప్రాక్టీసు ఉన్న లాయరు. ఆయన శ్రీసాయిబాబాకు అంకిత భక్తులు. ఆయన తన హృదయాన్ని, ఆత్మను శ్రీసాయి చరణాలవిందాలకు సర్వశ్యశరణాగతి చేశారు. కోర్టుకు శలవులు వచ్చినప్పుడెల్లా, బాబాకు అంకిత భక్తునిగా ఆయన చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి సాయి తత్వాన్ని ప్రచారం చేస్తూ అందరిలోను బాబా మీద భక్తిని పెంపొందింప చేస్తూ ఉండేవారు. బాబాపై ఎంతో స్పూర్తిదాయకంగాను, ఆకట్టుకునే విధంగాను ఆయన ఉపన్యాసాలు యిస్తూ ఉండేవారు.
కోర్టు పనిదినాలలో ఒకరోజు ఆయన తన బంధువుల పనిమీద అత్యవసరంగా తన స్వగ్రామానికి వెళ్ళవలసివచ్చింది. కాని, అదేరోజున రేపల్లె జిల్లా మున్షిఫ్ కోర్టులో ఆయన ఒక సివిల్ కేసును వాదించవలసి ఉంది. కాని అత్యవసరంగా వెళ్ళవలసినందువల్ల తాను లేని సమయంలో యింకెవరికీ పని అప్పగించడానికి తగిన ఏర్పాట్లు చేయలేకపోయారు. కాని, అయన క్లయింటుకు ఆయన లేరనే విషయం తెలీదు. అతను రేపల్లె వచ్చి ఆయన యింటికి వెళ్ళి లేరనే విషయం తెలిసి, తన లాయరుగారు ఊరిలో లేరని కేసు వాయిదా వేయమని కోరడానికి వెంటనే కోర్టుకు వెళ్ళాడు. కాని, అక్కడ శ్రీవెంకటేశ్వర్లుగారు తన కేసుని చాలా బలంగా వాదిస్తుండటం చూసి ఆశ్చర్యపోయాడు.
ఆరోజున కోర్టులో ఆయన వాదన చాలా అసాధారణంగా ఉంది. కోర్టులో ఆయన చేసిన బలమైన వాదన జిల్లా మున్సిఫ్ గారిని ఎంతో ఆకట్టుకొంది. ఆయన చాలా సంతోషించారు. తీర్పు ఆయన క్లయింటుకు అనుకూలంగా వచ్చిందని వేరే చెప్పనక్కరలేదు. అబ్బురపరచిన తన లాయరు వాదన విన్న ఆక్లయింటు ఉబ్బితబ్బిబ్బయి ఈ విషయం వెంకటేశ్వర్లుగారి భార్యకు చెప్పడానికి ఆయన యింటికి వెళ్ళాడు. కోర్టులో శ్రీవెంకటేశ్వర్లుగారు వాదించిన అద్భుతమయిన వాదన, తను కేసు గెలవడం అక్కడి తోటి లాయర్లు అందరూ వెంకటేశ్వర్లుగారిని పొగడ్తలతో ముంచెత్తి అభినందించడం అన్నివిషయాలు తలా తోకా లేకుండా ఎంతో సంబరంతో ఆవిడకు చెప్పాడు.
మరుసటిరోజు వెంకటేశ్వర్లుగారు స్వగ్రామం నుండి తిరిగి వచ్చి యధావిధిగా కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు రాగానే, లాయర్లందరూ క్రిందటి రోజున సివిల్ కేసులో ఆయన చేసిన అద్భుతమయిన వాదనకు, అందరినీ ఆకట్టుకొన్న ఆయన వాగ్ధాటికి అభినందిస్తూ ఆయనని ఆకాశానికెత్తేశారు. వారు చేస్తున్న ఆపొగడ్తలకి శ్రీవెంకటేశ్వర్లుగారు స్థాణువయ్యి, క్రిందటిరోజున తాను స్వంతపని మీద స్వగ్రామానికి వెళ్ళానని అసలు కోర్టుకే రాలేదని చెప్పారు. ఇదివినగానే తోటి లాయర్లందరూ, చాలా ఆశ్చర్యపోయారు. వెంటనే శ్రీవెంకటేశ్వర్లుగారు యింటికి పరుగెత్తుకొని వెళ్ళి శ్రీసాయిబాబా ఫొటోముందు నిలబడి ఆనందభాష్పాలతో "ఓ! దేవా! షిర్దీలో నువ్వు సశరీరంతో ఉండగా నాకు నీదర్శన భాగ్యం కలుగలేదు. ఇప్పుడు నువ్వు నారూపంలో వచ్చి నన్నుగ్రహించావు. నేను లేని సమయంలో కోర్టుకు వచ్చి నాక్లయింట్ తరఫున ఎంతో అద్భుతంగా వాదించి నాక్లయింటు కేసులో గెలవడానికి సహాయం చేశావు"
ఈ విషయమంతా శ్రీసాయిబాబా భక్తురాలయిన శ్రీమతి కామేశ్వరమ్మగారు 1968 సంవత్సరంలో ఆమె షిర్దీలో ఉన్నప్పుడు వివరించారు. ఈ లీల ఆమె హైదరాబాదు వాస్తవ్యులయిన శ్రీకె. సుబ్బారావుగారికి వివరించారు.
సాయిప్రభ
జనవరి, 1986
సీ.సుబ్బారావు
అడ్వొకేట్ & నోటరీ
ఒంగోలు
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment