15.01.2014 బుధవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ రోజు బాబా చేసిన మరొక అద్భుతమైన లీల గురించి తెలుసుకొందాము.
బాబా శారీరక, మానసిక బాధలను నివారించుట
షిరిడిసాయిబాబా అనుమతితో బాబా మాకుటుంబానికి వచ్చిన కష్టాలను బాధలను ఎలా నివారించారో వివరిస్తాను. ఆ అనుభూతిని మీ అందరితోను పంచుకొంటాను.
కొన్ని సంవత్సరాల క్రితం నేను నాస్వంత పనులు, ఉద్యోగం, బ్యాంక్ బాలన్స్ యిటువంటి విషయాలలోనే పూర్తిగా నిమగ్నమైపోయాను. ఇక మిగిలిన విషయాలేమీ పట్టించుకునేవాడిని కాదు. ఆసమయంలోనే నాకు షిరిడి దర్శించాలని బాబా వల్ల ప్రేరణ కలిగింది. బహుశ ప్రస్తుతం నేను ఉన్న మార్గాన్నించి నన్ను తప్పించి మంచి మార్గంలో పెట్టి నన్ను చక్కదిద్దేందుకు అయి ఉండవచ్చు.
2003వ.సంవత్సరం అక్టోబరు 5వ.తారీకున మేము షిరిడీకి బయలుదేరాము. నాభార్యకు ఆసమయంలో కాస్త అస్వస్థతగా గుంది. కాని నేను దానినేమీ పట్టించుకోలేదు.
మేము కోపర్ గావ్ చేరుకొన్నాము. అక్కడినుండి షిరిడీ వెళ్ళడానికి ఆటో 60రూపాయలకు మాట్లాడుకొన్నాము. కాని, షిరిడీ చేరుకొన్నాక ఆటో డ్రైవరు 80రూపాయలు ఇమ్మన్నాడు. నాకు కోపం వచ్చి పోలీసులకు రిపోర్ట్ చేస్తానని బెదిరించాను. "అయితే మీడబ్బు మీరే ఉంచుకోండి. బాబా పేర ఒక బిచ్చగాడికి దానం చేశాననుకుంటాను" అన్నాడు ఆటో అతను.
మేము షిరిడీ రావడం యిదే మొదటిసారి కావడంతో ప్రతి పనీ కూడా తొందర తొందరగా చేస్తున్నాము దాంతో మేము మసీదు మూడు మెట్లు ఎక్కడం మర్చిపోయాము. బాబా అనుమతి లేనిదే ఎవ్వరూ కూడా మసీదు మెట్లు ఎక్కలేరనే విషయం గుర్తుకొచ్చింది. బాబా అనుమతితో షిరిడి ప్రవేశించినవారందరి కోరికలు తీరతాయి.
షిరిడీనుంచి తిరిగి వచ్చాక నాపనులలో నేను మునిగిపొయాను. రోజు రోజుకి నాభార్య ఆరోగ్యం క్షీణించసాగింది. అయినా కాని నేను ఆమె ఆరోగ్యం గురించి ఏమీ పట్టించుకోలేదు. డిసెంబరు 2003, 4వ.తారీకున నాభార్య ఏడుస్తూ ఫోన్ చేసింది. వెంటనే నేను ఆఫీసునించి యింటికి బయలుదేరాను. వెంటనే నాభార్యను వాఖార్ట్ ఆస్పత్రికి తీసుకొని వెళ్ళాను. డా.చంద్రశేఖర్ కాలనోస్కోపీ, బయాప్సీ చేసి కాన్సరని అనుమానం వచ్చి వెంటనే సి.టి. స్కాన్ కూడా చేయించమన్నారు. మా కుటుంబానికి కష్టాలు ప్రారంభమయ్యాయి. డా.చంద్రశేఖర్ మలయా ఆస్పత్రిలో డా.నందకుమార్ ని కలవమని చెప్పారు. నాభార్యను 9వ.తారీకున మలయా ఆస్పత్రిలో చేర్పించాను. అక్కడ ఆపరేషన్ చేశారు. ఆరోజు నుండి నేను "ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి" అని సాయినామం జపం మొదలుపెట్టాను. ఆపరేషన్ తరువాత కెమోథెరపీ, రేడియో థెరపీలు చేయించాలి. కాని బెంగళురులో నాకు సహాయం చేయడానికి, బంధువులుగాని పరిచయస్తులు గాని లేరు. ఒంటరిగా నిస్సహాయంగా ఉన్నాను. ఇక తరువాతి వైద్యం కలకత్తాలో చేయించడానికి నిర్ణయించుకొన్నాను. మాకున్న వస్తువులన్నిటినీ అమ్మేసి ఆడబ్బు పట్టుకొని కలకత్తా చేరుకొన్నాము. రేడియో థెరపీ కలకత్తాలో కన్నా బెంగళురులోనే బాగా చేస్తారని చెప్పడంతో తిరిగి మళ్ళీ బెంగళూరు వచ్చాము. మలయా ఆస్పత్రిలో చేయించడానికి కొద్దిరోజులలోనే పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఆసమయంలో నాకు షిరిడీలో ఆటో డ్రైవరు అన్న మాటలు గుర్తుకు వచ్చి పశ్చాత్తాపం కలిగింది. ఆరోజునుండి మేము పగలు రాత్రి సాయి సాయి అని సాయినామస్మరణ చేయసాగాము.
డా.నందకుమార్ జయరాం కెమోథెరపీ గురించి డా.కిలారాగారిని కలవమని చెప్పారు. కెమోథెరపీ చేయించినా కాన్సర్ నయమవుతుందనే గ్యారంటీ లేదని, ఆపరేషన్ తరువాత కూడా వైద్యం వల్ల కూడా లాభం లేదని డా.కిలారాగారు చెప్పారు.
ఏదయినా అద్భుతం జరిగితే తప్ప కాన్సర్ నివారణ సాధ్యం కాదని డాక్టర్ ధృధంగా చెప్పారు.
నాభార్య మానసికంగా ధైర్యం కోల్పోయి తనకసలు వైద్యం వద్దని చెప్పింది. అధ్బుతాలు జరుగుతాయని, నాకు వాటిలో నమ్మకం ఉందని నాభార్యకు ధైర్యం చెప్పాను. మేము యిక భారమంతా బాబా మీదే వేశాము. దారులన్ని మూసుకొని పోయినపుడు బాబాయే కొత్త మార్గం చూపిస్తారు.
కెమోథెరపీ ఆరు సార్లు చేయవలసి ఉంది. వాటిలో మూడు పూర్తి అయ్యాయి. తరువాత రక్త పరీక్షలో కాన్సర్ 75.9 శాతం నుంచి 1.9 శాతానికి వచ్చింది. డాక్టర్ కి చాలా ఆశ్చర్యం వేసింది. ఇది చాలా వింతగా ఉందని ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచాడు.
పూర్తిగా వైద్యం జరిగాక సి.టి.స్కాన్ చేశారు. ఆశ్చర్యం ఒక్క కాన్సర్ కణం కూడా కనపడలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, కెమోథెరపీ వల్ల జుట్టు ఊడిపోవడం, బరువు తగ్గిపోవడం యిటువంటి సమస్యలన్ని ఉంటాయి. బాబా దయవల్ల నాభార్యకు యిటువంటి సమస్యలేమి రాలేదు.
ఈరోజు నేను నాభార్య, నాకుమార్తె అందరం కూడా బాబా అనుగ్రహంతోనె జీవిస్తున్నాము చాతనయినంత వరకు మనం సమాజానికి సేవ చేయాలని కూడా నాకు జ్ఞానోదయం అయిది.
ఈ అనుభవాన్ని చెప్పినవారు : సుబ్రతో బెనర్జీ
ఆంగ్లానువాదం. రోహిణి త్రిబువన్
సాయి లీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు-అక్టోబరు, 2013
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment