07.01,2014 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నేనుండ నీకు భయమేల
ఈ రోజు మరొక బాలా లీల తెలుసుకొందాము. దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అనేది సామెత. బాబా ని నమ్ముకున్నవాళ్ళకు బాబాయే దిక్కు అవుతారు.మనం మన్స్పూర్తిగా ఆయన మీద భారం వేయాలే గాని, తన భక్తునికి సహాయం చేయడానికి తక్షణం ప్రత్యక్షమవుతారు.
బొంబాయి, 8/352, వసంత్ బిల్డింగ్ మాతుంగా లో నివసిస్తున్నశ్రీ ఆర్. రామచంద్రన్ గారు రైల్వే ఉద్యోగి. బాబా గురించి ఆయనకు మొట్టమొదటగా 1950వ.సంవత్సరంలో శ్రీ సాయి సత్ చరిత్ర చదివినప్పటినుంచి తెలిసింది. ఆయనకు శ్రీసాయిబాబా మీద సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది. "నేనుండ నీకు భయమేల" అన్న బాబా మాటలు ఆయన హృదయానికి బాగా హత్తుకొన్నాయి.
శ్రీరామచంద్రన్ భార్య కు తొమ్మిదవ నెల. నెలలు నిండాయి. ఆసమయంలో ఆయన అత్తగారు ఫోన్ చేసి తనకు చాలా జబ్బుగా ఉందని అమ్మాయిని చూడాలని ఉందని పంపించమని అడిగింది. శ్రీరామచంద్రన్ గారు డాక్టర్ తో అన్ని విషయాలు మాట్లాడి, భారమంతా బాబాపై వేసి, అత్తగారి ఊరికి చెన్నై మెయిల్ లో బయలుదేరారు. ఆయన సోదరుడి కుమారుడు చెన్నయ్ లో ఉంటున్న తన తండ్రికి యిమ్మని 100 రూపాయలు యిచ్చాడు. శ్రీరామచంద్రన్ గారు ఆడబ్బు తీసుకుని రైలులో బాబా ని ప్రార్ధిస్తూ కూర్చొన్నారు. మరునాడు ఉదయం 8 గంటలకు ఆయన భార్యకు రైలులోనే నొప్పులు ప్రారంభమయ్యాయి. రైలు ఒక చిన్న స్టే షన్ లో ఆగింది. అపుడు రైలు లోకి ఒక ముస్లిం ఫకీరు ఎక్కాడు. చూడటానికి అతను ఒక డాక్టర్ లా ఉన్నాడు. బోగీలో యింకెవరూ లేరు . శ్రీరామచంద్రన్, తన భార్యకు సుఖప్రసవం అవడానికి అతని వద్ద మందులేమయినా ఉన్నాయా అని అడిగారు. ఫకీరు మూడు మందు పొట్లాలను తయారు చేసి రెండు శ్రీరామచంద్రన్ కు యిచ్చాడు. మూడవ పొట్లంలోని మందును తనే స్వయంగా ఆయన భార్యకు యిచ్చాడు. మిగిలిన రెండు పొట్లాలు రెండుగంటలకొక మోతాదు చొప్పున వేయమని చెప్పి, ఫకీరు షోలాపూర్ స్టేషన్ లో దిగిపోయాడు. మూడు పొట్లాలలోని మందులను వేసుకోగానే అంతకు ముందున్న పురిటినొప్పులు ఆగిపోయాయి. రైలు ఆదోని స్టేషన్ కు చేరుకొనే ముందు ఆమె లావెటరీ లో కి వెళ్ళింది. రైలు వెడుతుండగానె ఆమెకు లావెటరీలోనే ప్రసవమయి మగబిడ్డ జన్మించాడు.రైలు ఆదోని స్టేషన్ లో ఆగింది. లావెటరీ తలుపుదగ్గిర బయట ఆమె భర్త చాలా కంగారుగా నిలబడి ఉన్నారు. అకస్మాత్తుగా లావెటరీలోనండి ఆయనను కంగారు పడవద్దనీ సహాయం చేయడానికి తను ఉన్నానని ఒక ఆడ గొంతు వినపడింది. తన భార్యకు అక్కడే ప్రసవం అయిందని చెప్పాడు. ఆమె అతని వద్దనుండి ఒక చాకు తీసుకొని మరొక స్త్రీ సహాయంతో చేయవలసిన కార్యక్రమమంతా చేసింది. ఆమె చేసిన సహాయానికి శ్రీరామచంద్రన్ గారు ఆమెకు 5 రూపాయలు ఇచ్చారు. ఆమె ఆడబ్బు తీసుకొని వెళ్ళిపోయింది.
ఆసమయంలో ఆస్త్రీ బోగీలోకి వచ్చి అవసరమయిన సాయం చేసి వెళ్ళిపోవడం ఆయనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. రైలు ఆదోని స్టేషన్ లో ఆగిన వెంటనే స్టేషన్ మాస్టారి కి అంతా వివరించారు. ఆయన ఆదోని లోని ఆస్పత్రిలొ ఆమెను చేర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెకు ఆస్పత్రిలో 13 రోజులు వుంచి సరియైన వైద్యం చేశారు. అమెరికన్ మిషన్ నించి ఒక లేడీ డాక్టర్ చాలా సహాయం చేసింది. తెలియని ప్రదేశంలో వారికి అన్ని సౌకర్యాలు అమరడంతో వారు చాలా సంతోషించారు. తన సోదరుడి కొడుకు యిచ్చిన 100 రూపాయలు వారి ఖర్చులకెంతో ఉపయోగపడ్డాయి. మొట్టమొదటగా రైలులో ఫకీరులా వచ్చి తమను ఆదుకున్నందుకు బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. ఆదోని లో ఒక అనామిక స్త్రీగా వచ్చి చేసిన సహాయం, ఆదోని ఆస్పత్రిలో జరిగిన చక్కని వైద్యం, వీటి ఖర్చులన్నిటికి 100 రూపాయలు ఉపయోగపడటం యివన్నీ కూడా బాబా అనుగ్రహం.
ఈసంఘటనలన్ని చూస్తూంటే బాబా తాను మహాసమాధి చెందిన తరువాతకూడా తన భక్తులకోసం అవసరమైనపుడు సహాయం కోసం వస్తారనే విషయం అర్ధమవుతోంది కదూ.
శ్రీసాయిలీల ద్వైమాసపత్రిక
నవంబరు-డిసెంబరు 2003 సంచిక
ఆంబ్రోసియా ఇన్ షిరిడీలోని 57వ.లీల(శ్రీరామలింగస్వామి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment