02.05.2014 శుక్రవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధురక్షణాలు - 37
ఈ రోజు మనం మరొక అధ్బుతమయిన బాబా లీలను తెలుసుకుందాము. బాబా తన అంకిత భక్తులను ఏ విధంగా కాపాడుతూ వస్తారో దానికి ఉదాహరణ శ్రీబాపట్ల హనుమంతరావుగారి జీవితం. ఇంతకు ముందు అనగా 12.03.2011వ.సంవత్సరంలో "ఏమీ నిన్నుపేక్షింతునా" అనే పేరుతో ప్రచురించాను. ఈరోజు మరింత సమగ్రంగా అందిస్తున్నాను, చదవండి.
నువ్వు భగవాన్ సాయిబాబాకు ప్రియపుత్రుడవు
జీవితాంతం సాయినాధుల వారి మార్గదర్శకత్వం, ఆయన అనుగ్రహం పొందే అదృష్టం కలిగిన భక్తులు కొద్దిమంది ఉన్నారు. బాబా మహాసమాధి చెందిన తరువాత, బాపట్ల హనుమంతరావుగారి జీవితమే దీనికి ఒక దృష్టాంతం. బాబా తన భక్తులను యిప్పటికీ కాపాడుతూ వస్తున్నారు.
సాయినాధులవారు మహాసమాధి చెంది 20 సంవత్సరాలయింది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక మారుమూల ప్రాంతం అయిన చిన గంజాంలో హనుమంతరావుగారు తెలుగు పండితులుగా పని చేస్తున్నారు. జీవన సాగరంలో ఆయన ఎన్నోకష్టనష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా కూడా ఎంతో నిరాశా నిస్ఫృహలకు లోనయ్యి జీవన సమరాన్ని కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయునిగా తనకు వచ్చే జీతం తన పిల్లలకు కాస్త మంచి చదువు చెప్పించడానికి కూడా సరిపోవకపోవడంతో హనుమంతరావుగారు పొగాకు వ్యాపారాన్ని చేపట్టారు. కాని ఆవ్యాపారంలో చాలా నష్టాలు వచ్చి అధహ్ పాతాళానికి చేరుకొనే దశకి వచ్చారు. దాంతో తీవ్రనిరాశకు గురయ్యి తన జీవితాన్ని అంతం చేసుకుందామనే నిర్ణయానికి వచ్చారు. డిశెంబరు 27, 1944 సంవత్సరంలో శ్రీసాయినాధులవారు ఆయన కలలో దర్శనమిచ్చి " నేను సాయిబాబాను. నీలో పాండిత్యం, కవిత్వంలో ప్రావీణ్యం ఉన్నాయి. గతంలో నీవు చేసినట్లుగానే నువ్వు సాహిత్య రంగంలో నిమగ్నమయి క్రొత్త జీవితంలోకి అడుగు పెట్టు. నీకు వచ్చిన కష్టాలు, సమస్యల గురించి చింతించకు. ఏసమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదు" అని చెప్పి బాబా ఆయనకు రామునిగా, శ్రీకృష్ణునిగా, శివునిగా, హనుమంతునిగా, దత్తాత్రేయునిగా వివిధ రూపాలలో దర్శనమిచ్చి అనుగ్రహించారు. కాని, అప్పట్లో హనుమంతరావుగారికి బాబా గురించి తెలియదు. అందుచేత తనకు వచ్చిన ఆకలకు అంతగా ప్రాధాన్యమివ్వలేదు. మరుసటి రోజు చీరాలనుండి ఆయన స్నేహితుడు ఆదినారాయణ ఆయనకోసం వచ్చారు. శ్రీసాయినాధులవారి తత్వ ప్రచారకులు, అఖిలభారత సాయిసమాజ్ అధ్యక్షులయిన శ్రీ బీ.వీ నరసిమ్హస్వామి గారు చీరాల వస్తున్నారని, అందుకోసం హనుమన్తరావుగారిని ఆహ్వానించడానికి వచ్చినట్లు చెప్పారు. హనుమంతరావుగారిని కలుసుకొని ఆయనకు సహాయం చేయమని సాయిబాబా నరసిమ్హ స్వామీజీగారిని ఆదేశించారని, ఈ విషయం హనుమంతరావుగారికి చెప్పి తీసుకురమ్మని తనను పంపించారని చెప్పాడు ఆదినారాయణ. తనతో కూడా వచ్చి స్వామీజీ ని కలుసుకొని బాబా దీవెనలు అందుకోమని హనుమంతరావుగారికి చెప్పారు. హనుమంతరావుగారి జీవీతంలో అది ఒక సంతోషకరమయిన సంఘటన. చీరాల చేరుకొని నరసిమ్హ స్వామీజీ ని కలుసుకోగానే ఆయన హనుమంతరావుగారిని ప్రేమగా కౌగలించుకొని అంధమయిన సాయిబాబా చిత్రపటాన్ని బహూకరించారు. నరసిమ్హ స్వామి గారు ఆయనతో "హనుమంతరావూ, నువ్వు భగవాన్ సాయిబాబాకు ప్రియపుత్రుడవు. ఆయన నిన్ను తన ఆస్థాన కవిగా ఎంచుకొన్నారు. ఆయన నాకలో దర్శనమిచ్చి సాయి చరిత్రను తెలుగు భాషలో తీసుకొచ్చే బాధ్యతను నీకప్పగించమని నన్నాదేశించారు. ఆంధ్ర ప్రాంతంలో సాయి తత్వాన్ని వ్యాప్తి చేయడానికి అది దోహద పడుతుంది. ఈ పరిణామం హనుమంతరావుగారి జీవితాన్నే మార్చేసింది. ప్రారంభంలో ఆయన నరసిమ్హ స్వామిగారు ఆగ్లంలో వ్రాసిన కొన్నింటిని తెలుగులోకి అనువదిదంచారు. తరువాత ఆయన చాలా పుస్తకాలను వ్రాశారు. ఆయన వ్రాసినవన్నీ చదివిన తరువాత బాబాతో ఆయనకు ఎంతటి ప్రగాఢమయిన బంధం ఏర్పడిందో అర్ధమవుతుంది. తెలుగులో ఆయన వ్రాసినవాటిలో ప్రముఖమయినవి 1) ఏమీ! నిన్నుపేక్షింతునా 2) శ్రీసాయి బోధామృతం 3) శ్రీసాయిబాబా కూడా దేవుడేనా 4) శ్రీ సాయి అనుసరణము. ఆయన రచించిన సాయి తత్వంలో సాయి తత్వ కవితాస్తా వైభవం, సాయిబాబా జానపద సాహిత్య భాగాలు, సాయి తత్వాన్ని చాటి చెప్పే వీధి నాటకాలు ఉన్నాయి. ఇవి తెలుగులో సాయి తత్వాన్ని చాటి చెప్పే మూల గ్రంధాలుగా ప్రజాదరణ పొందాయి.
ఎప్పుడయితే ఆయన సాయిని గుర్తించారో అప్పటినుండి ఆయన జీవితంలో క్లిష్ట పరిస్థితులను సమస్యలను ఎదురొంటున్నపుడు, సాయినాధులవారు ఆయన జీవితం సాఫీగా సాగిపోయేలా అనుగ్రహించారు.
బాబా తన అంకిత భక్తులను ఏవిధంగా అనుగ్రహిస్తారో, హనుమంతరావుగారు బాబా వారి అధ్బుతమయిన లీలలను ప్రత్యక్షంగాను, స్వప్నాలలోను అనుభవించారు. ఆయన పదవీ విరమణ చేసినప్పుడు ఆయనకు నెలకు 37 రూపాయలు పెన్షన్ వచ్చేది. 1962 వ.సంవత్సరంలో ఆయన యింటికి చాలామంది స్నేహితులు, బంధువులు వచ్చారు. అందరూ రోజంతా, రాత్రివరకూ భోజనాలకు ఉండిపోయారు. ఇంటిలో సరుకులన్నీ నిండుకున్నాయి. యింతకుముందు బాకీ ఉన్నందున ఆయనకు బియ్యం, యితర సరుకులు యివ్వడానికి దుకాణదారుడు నిరాకరించాడు. ఈకష్టాన్నుండి గట్టెంక్కించమని హనుమంతరావుగారు బాబా పటం ముందు నిలబడి వేడుకొన్నారు. అరగంటలోనే, యింతకుముందు సరుకులు యివ్వడానికి నిరాకరించిన దుకాణుదారుడే హనుమంతరావుగారి యింటికి వచ్చి బియ్యం బస్తా, యితర సరుకులు తెచ్చి, "రావూజీ! మీ ఎడల అమర్యాదగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించండి. దయచేసి ఈసరుకులు తీసుకోండి. డబ్బు గురించి మీరు చింతించకండి" అన్నాడు. జరిగిన ఈ సంఘటన గురించి ఆయన తెలుగులో అధ్బుతమయిన కవిత్వాన్ని రచించారు. ఒకసారి ఆయన జీవితంలో తాననుభవించిన పేదరికాన్ని తలుచుకొంటూ చిన గంజాం రైల్వే పట్టాల ప్రక్కనే నడచుకొంటూ వెడుతున్నారు. అదే సమయంలో ఒక రైలు వస్తూ ఉంది. సహజంగానే ఆయన చెవిటివారు. ఆలోచనలో నిమగ్నమయి ఉండటం చేత రైలు వస్తున్న చప్పుడు ఆయనకు వినిపించలేదు. యిక రైలు ఆయన మీదకు వచ్చేస్తూ ఉంది. సరిగ్గా రైలు ఆయనను గుద్దేసే క్షణం. వెంట్రుకవాసిలో రైలు ఆయనకు ఢీకొనబోయే క్షణంలో బాబా భౌతికంగా ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను ప్రక్కకు లాగేశారు. హటాత్తుగా జరిగిన ఈ సంఘటనకి ఆయన నిర్ఘాంతపోయారు. వెళిపోతున్న రైలును కొంతసేపటి వరకూ అలా చూస్తూ ఉండిపోయారు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఈ లోకంలోకి వచ్చారు. వెంటనే సాయి కోసం చూశారు, కాని ఆయన అప్పటికే అదృశ్యమయిపోయారు. బాబా తనమీద చూపించిన దయకి ఆయన కవి హృదయం ఉప్పొంగి కళ్ళనుండి ధారగా ఆనంద భాష్పాలు జాలువారాయి.
ఒకసారి ఆయన రచనా వ్యాసంగంలో మునిగి ఉండగా ఒక కుక్క వచ్చి ఆయన చెప్పుల జతలోని ఒక చెప్పును నోటకరచుకొంది. నోట కరచుకొన్న చెప్పును వదలి వేస్తుందనే ఉద్దేశ్యంతో హనుమంతరావుగారు రెండవ చెప్పుని కోపంగా ఆకుక్కమీదకు విసిరారు. ఆకుక్క రెండవ చెప్పును కూడా నోటకరచుకొని పరుగెత్తుకొని వెళ్ళింది. వెంటనే ఆయనకు సర్వత్రా సాయిబాబా వ్యాపించి ఉన్నారని, సకల జీవులలోను సాయి ఉన్నారని జ్ఞానోదయమయింది. తాను చేసిన పనికి ఎంతో విలపించారు. కన్నీళ్ళతో "సాయినాధా, నేను నిన్ను గుర్తించలేక నీమీదకు చెప్పు విసిరాను. ఇంతటి ఘోరాతి ఘోరమయిన తప్పు చేసినందుకు ఈ రోజునుండి నేను చెప్పులు ధరించను" అని శపధం చేశారు. అప్పటినుండి ఆయన మండువేసవిలో కూడా కాళ్ళకు బొబ్బలెక్కుతున్నా లెక్కచేయక చెప్పులు లేకుండా నడిచేవారు. ఒకరోజున ఆయన బస్సునుండి దిగారు. వేసవి కాలం వల్ల ఆరోజు చాలా ఎండగాను, వేడిగాను ఉంది. ఆయన కాలు కింద పెట్టి నడవలేక చెట్టునీడకు పెరుగెత్తుకొని వెళ్ళి బాబాను యిలా ప్రార్ధించారు, "బాబా, విపరీతమయిన ఎండవల్ల నేను నడవలేకున్నాను. దయచేసి నన్ను క్షమించు". ఆయన అలా ప్రార్ధించారో లేదో వెంటనే ఒక అపరిచిత యువకుడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ముందు ఒక చెప్పుల జత పెట్టి "అయ్యా!ఈ చెప్పులు మీకు సరిగ్గా సరిపోతాయి. చెప్ప్లులు లేకుండా మీరు నడవలేని స్థితిలో ఉన్నారు. మీజేబులో ఉన్న రెండు రూపాయలిచ్చి ఈ చెప్పులు ధరించండి" అన్నాడు. తన జేబులో రెండే రెండు రూపాయలున్నయనే విషయం అతనికెలా తెలిసిందని ఆశ్చర్యపోతూ రెండురూపాయలిచ్చారు. తరువాత ఆయనకు తాను సాయిబాబాను ప్రార్ధించిన విషయం గుర్తుకు వచ్చింది. తనకు చెప్పుల జతను యిచ్చినది సాయిబాబాయేనని గ్రహించుకున్నారు. సాయి తత్వాన్ని ఆయన మధించారు. నేటి సాయి భక్తులందరి ప్రేరణకి ముఖ్యంగా భారతదేశంలో తెలుగు మాటలాడే సాయిభకతులందరికి అదే మూలాధారం.
సంధ్యా ఉడతా
హైదరాబాదు
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment