11.06.2014 బుధవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నానాసాహెబ్ చందోర్కర్
బాబాను సన్నిహితంగా సేవించిన భక్తులలో ఈ రోజు నానాసాహెబ్ చందోర్కర్ గురించి తెలుసుకుందాము.
(బాబాను పూర్తిగా అవగాహన చేసుకొని, ప్రగాఢమయిన భక్తితో ఆయన గురించి అందరికీ తెలియచేసిన మొట్టమొదటి వ్యక్తి)
నానాసాహెబ్ పూర్తి పేరు నారాయణ్ గోవింద్ చందోర్కర్. బాబా ఆయనను నానా అని పిలుస్తూ ఉండేవారు. ఆయన బొంబాయిలోని కళ్యాణ్ నివాసి. జనవరి 14, 1860 వ.సంవత్సరంలో మకర సంక్రాంతి నాడు జన్మించారు.
20 సంవత్సరాల వయసులో బీ.ఎ.తత్వ శాస్త్రంలో పట్టభద్రుడయి, భగవద్గీతలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకొన్నారు. డిగ్రీ అయిన తరువాత 1880 లో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించి, ఏడు సంవత్సరాలలోనే డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. మొట్టమొదట ఆయన చిట్నీస్, తరువాత మామల్తదారు, ఆతరువాత డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఆయన తండ్రిగారు గోవింద పంత్. నానా చందోర్కర్ తన తండ్రి డిప్యూటీకలెక్టర్ గా పనిచేసిన కార్యాలయంలోనే ఆయన కూడా డిప్యూటీ కలెక్టర్ గా పని చేశారు. ఆయన బాగా విద్యనభ్యసించారు. సంస్కృతం లో మంచి ప్రావీణ్యం ఉంది. విస్తృతంగా పర్యటనలు చేశారు. 1878 లో ఆయన జమీదార్ నానా సాహెబ్ ఓఝా కుమార్తె బాయజాబాయిని వివాహమాడారు. ఆయనకు యిద్దరు కుమార్తెలు, మైనతాయి, ద్వారకామాయి, యిద్దరు కొడుకులు వాసుదేవ్ అనే బాబూరావు, మహదేవ్ అనే బాపురావు. ఆయనకెంతో మంది ముస్లిం స్నేహితులు ఉన్నారు. ఒకసారి ఆయన తండ్రిగారికి ఒక ముస్లిం వ్యక్తితో భేదాభిప్రాయం కలగడంతో, యిక ఏముస్లిం తోను ఎటువంటి స్నేహబాంధవ్యాలు పెట్టుకోవద్దని తన యింటిలోని వారందరికీ చెప్పారు. నానాసాహెబ్ చందోర్కర్ కి యిది ఒక సమస్య అయింది. నానాసాహెబ్ తండ్రిగారి గురువు శ్రీసమర్ధ శకరం. ఆయన బ్రాహ్మణుడు. నానా సాహెబ్ తన తండ్రితో తన గురువు శ్రీసాయిబాబా అనీ, ఆయన స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాపుణ్య పురుషుడని, ముస్లిం అని చెప్పారు. ఆయన షిరిడీలో ఉంటారనీ తాను ఆయన దర్శనానికి తరచూ వెళ్ళి వస్తూ ఉంటానని చెప్పారు. ఆయన తండ్రి, "సాయిబాబా నీగురువు కాబట్టి నువ్వు ఆయన దర్శనానికి వెడుతూఉండు" అని ప్రశాంతంగా జవాబిచ్చారు. బాబా ఆయన తండ్రి మనసుని చాలా చమత్కారంగా మార్చేశారు.
నానాసాహెబ్ తానెక్కడికి వెళ్ళినా ఎల్లప్పుడు తన వెంట గుండ్రటి భరిణె, బాబా స్వయంగా యిచ్చిన ఊదీ, చిన్న ఫొటో కూడా తీసుకొని వెడుతూండేవారు. తరువాత ఈ భరిణ, ఫొటో పూనాలో ఉన్న ఆయన మనవడు ప్రభాకర్ వద్ద ఉన్నాయి. బహుశ 1887 సంవత్సరంలో బాబా షిరిడీ వాస్తవ్యుడయిన కులకర్ణి ద్వారా, నానా సాహెబ్ ని షిరిడీని రమ్మనమని వర్తమానం పంపించారు. అయితే నానాసాహెబ్ మొట్టమొదటిసారిగా 1892లో షిరిడీ సందర్శించారు. అక్కడ బాబా చేసే అద్భుతాలకి ఆయన శక్తులని చూసి ముగ్ధుడయారు. బాబా చేసే అద్భుతాలన్నీ కూడా ప్రత్యేకించి కాకుండా వాడుకగా చేసేవని గ్రహించారు. కాని వాటినెవరూ అప్పట్లో రాసి ఉంచలేదు. అందుచేతనే ఆయన భక్తులందరికీ యింకా షిరిడీలోని ముఖ్యమయిన వారికి డైరీలు పంచిపెట్టి బాబా ఎప్పుడు ఏ చమత్కారాలు చేసినా, బాబాకు సంబంధించి ముఖ్యమయిన సంఘటనలు ఏవి జరిగినా వాటినన్నిటినీ డైరీలో రాయమని చెప్పారు. ఆరోజునుండి భక్తులు/స్థానికంగా ఉండే ముఖ్యమయినవారు అందరూ బాబా చేసే లీలలను వ్రాయడం ప్రారంభించారు. కాని, అంతకు ముందు జరిగిన ఎన్నో లీలలు, చమత్కారాలు, ఏవో కొన్ని మరచిపోలేని ముఖ్యమయిన అద్భుతాలు తప్ప ఏవీ కూడా వ్రాయబడి ఉండలేదు.
నానాసాహెబ్ ఎప్పుడు షిరిడీకి వెళ్ళినా చాలా ఉదారంగా డబ్బు ఖర్చు పెట్టేవారు. తన వద్దకు వచ్చే భక్తులకు పంచడానికి బాబా చేసిన అప్పులను కూడా కొన్నిసార్లు తీరుస్తూ ఉండేవారు. ఇంకా భక్తులు తాము కోరుకొన్న వస్తువులను బాబా కొని వారికి పంచుతూ ఉండేవారు. వాటికి కూడా డబ్బు చెల్లించేవారు. 1904-05 సంవత్సర కాలంలో నానాసాహెబ్ జామ్నేర్ కు మామల్తదారుగా ఉన్నారు. ఆసమయంలో ఆయన పెద్దకుమార్తె మైనతాయి కువలెకర్ గర్భవతి. ఆమెకు నొప్పులు అధికంగా ఉన్నాయి. ఆసమయంలో నానాసాహెబ్ వద్ద బాబా ఊదీ లేదు.
అక్కడ షిరిడీలో బాబా, రాం గిరి బువాను పిలిచి జామ్నేర్ వెళ్ళి నానాసాహెబ్ కు ఊదీ పొట్లం ఆరతిపాట యిచ్చి రమ్మని చెప్పారు. తనవద్ద రెండే రూపాయలున్నాయని షిరిడీనుండి 100 మైళ్ళ దూరంలో ఉన్న జామ్నేర్ కు తానెలా వెళ్ళగలనని రాం గిరి బువా బాబాతో అన్నాడు. బాబా అతనితో ఏవిధమయిన ఆందోళన పడవద్దని అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. ఆరోజు శుక్రవారం. రాం గిరి బయలుదేరి జల్ గాం చేరుకునేటప్పటికి మరునాడు ఉదయం గం.2.45ని.అయింది. అక్కడికి చేరుకునేటప్పటికి అతని వద్ద రెండు అణాలు మిగిలాయి. జల్గావ్ నుండి జామ్నేర్ యింకా 30మైళ్ళ దూరంలో ఉంది. సరిగా ఉదయం 3గంటలకు బూట్లు, తలకు పాగా,మంచి దుస్తులు ధరించిన ఒక బంట్రోతు అకస్మాత్తుగా ఆయన వద్దకు వచ్చాడు. రాంగిరిని జామ్నేర్ కు టాంగాలో తీసుకొనిరమ్మని టాంగాతో సహా తనను నానాసాహెబ్ పంపించినట్లుగా చెప్పాడు. దారిలో భగూర్ వద్ద బంట్రోతు తెచ్చిన ఫలహారాలు తీసుకొని జామ్నేర్ చేరుకొన్నాడు. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొనడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చి చూసేటప్పటికి, బంట్రోతు, టాంగా తోలేవాడు, టాంగా, గుఱ్ఱాలు ఏమీ లేవు. అన్నీ ఒక్కసారే అదృశ్యమవడంతో చాలా ఆశ్చర్యపోయాడు. ఏమయినప్పటికీ నానా సాహెబ్ ను కలుసుకొని ఆయనకు బాబా యిచ్చిన ఊదీ, ఆరతి పాట అందచేశాడు. మాటల సందర్భంలో తనకు నానాసాహెబ్ వస్తున్నట్లు తెలీయదనీ, అందుచేత తాను టాంగాను గానీ బంట్రోతును కాని పంపలేదని చెప్పారు. బాబా చేసిన సహాయానికి నానాసాహెబ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఇది బాబా చేసిన లీల అని యిద్దరికీ గట్టి నమ్మకం ఏర్పడింది. నానాసాహెబ్ తనకుమార్తెకు బాబా పంపిన ఊదీ యిచ్చిన తరువాత ఆమెకు నొప్పులు లేకుండా సుఖప్రసవమయింది. ఆమెకు మగపిల్లవాడు జన్మించాడు.
ఒకసారి నానాసాహెబ్ బాబా కాళ్ళు ఒత్తుతూ ఏవో సంస్కృత శ్లోకాలు నోటిలో గొణుగుకొంటూ ఉన్నాడు. బాబా నానాని ఏమిటి గొణుగుకొంటున్నావని అడిగారు. భగవద్గీత 4వ.అధ్యాయంలోని 34వ.శ్లోకం చదువుతున్నానని నానా సమాధానం చెప్పాడు. బాబా దాని అర్ధం వివరించమని అడిగారు. నానా చెప్పిన వివరణకి బాబా సంతృప్తి చెందలేదు. భగవద్గీత 4వ.అధ్యాయంలోని 34వ.శ్లోకానికి సరియైన అర్ధం వివరించారు. బాబా నోటివెంట వివరణను విన్న నానాసాహెబ్ ఎంతో అదృష్టవంతుడు. సంస్కృతంలో బాబా పాండిత్యానికి భగవద్గీతలో ఆయనకున్న పరిజ్ఞానానికి నానా ఎంతో ఆశ్చర్యపోయాడు.
ఈ సంఘటన 1900-1902 మధ్యకాలంలో జరిగింది. యాదృచ్చికంగా జరిగిన ఈ సంఘటన అంతవరకూ తాను సంస్కృతంలో మహాపండితుడిననీ, భగవద్గీతలో తనకెంతో ప్రావీణ్యమున్నదనీ అనుకుంటున్న నానాసాహెబ్ లోని గర్వాన్ని అణచివేసింది. బాబా ఈ సంఘటన ద్వారా అతనిని అహంకారరహితునిగా చేసి ఆధ్యాత్మిక ప్రగతికి మార్గాన్ని సుగమం చేశారు.
నానాసాహెబ్ ప్రోద్బలంతో నూల్కర్ షిరిడీ దర్శించాడు. ఎన్.బీ.నింబోల్కర్ చేసిన ఒక పరిశోధన ఆధారంగా షిరిడీలో మొట్టమొదటి గురుపూర్ణిమ ఉత్సవాలను 1909 సం.జూలై 3వ.తేదీన నూల్కర్ ప్రారంభించాడని తెలుస్తోంది. ఉత్సవాలను తిలకించడానికి నానాసాహెబ్ షిరిడీ రానందువల్ల నానాసాహెబ్ కి, ఉత్సవాలను గురించి నూల్కర్, నవంబరు 16వ.తేదీ 1910 సంవత్సరంలో వివరంగా ఉత్తరం వ్రాశాడు. ఆ ఉత్తరంలో, బాబా ఒక సామాన్య ఫకీరని, ఉత్సవాలలో ఆయనకు ఎటువంటి ఆడంబరాలు ప్రదర్శించడం యిష్టం ఉండదని ప్రముఖంగా వ్రాశారు. 1910వ.సం.నుండి భక్తులందరి సహకారంతో షిరిడీని ఒక సంస్థానంగా మార్చడానికి నానాసాహెబ్ ఎంతగానో శ్రమించారు. నానాసాహెబ్ అభిప్రాయం ప్రకారం ఆడంబరాలు ప్రదర్శనలు ఏవైనాసరే అవి ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డంకి. దానికి ఉదాహరణ బాబావారి జీవితమే. బాబా ఎటువంటి బాహ్యాడంబరాలను ప్రదర్శించలేదు. బాబా తనకోసం సమర్పించబడ్డ ఖరీదయిన వస్తులు వేటినీ ఉపయోగించలేదు.ఢృఢమయిన భక్తితో చేసిన సాధారణ పూజనే బాబా కోరుకొన్నారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment