12.06.2014 గురువారం
ఓం సాయిశ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
నానాసాహెబ్ చందోర్కర్ - 2 వ.భాగము
షిరిడీ దర్శించే భక్తుల కోసం నానాసాహెబ్ ఒక భోజనశాలను ప్రారంభించాడు. దీని నిర్వహణ బాధ్యతను తన మేనల్లుడయిన బాలభావ్ చందోర్కర్ కి అప్పగించాడు. 1911 సంవత్సరంలో భక్తులకోసం ప్రారంభింపబడ్డ మొట్టమొదటి హోటల్ బహుశా యిదే.
ఒకసారి నానాసాహెబ్ మసీదులో బాబా సమక్షంలో కూర్చొని ఉన్నపుడు మేలిముసుగులు ధరించి కొంతమంది ముస్లిం వనితలు బాబా దర్శనం కోసం వచ్చారు. నానాసాహెబ్ లేచి వెళ్ళబోతుండగా బాబా వెళ్ళవద్దని వారించారు. ముస్లిం స్త్రీలు బాబాను దర్శించుకొన్నారు. ఆసమయంలో వారిలో ఒకామె తన ముసుగును తొలగించి బాబాకు నమస్కరించింది. ఆమె అందానికి ముగ్ధుడయిన నానాసాహెబ్ కి మనస్సు చలించింది. బాబా వెంటనే అతని మనసులోని భావాలను గ్రహించారు. భగవంతుడు సృష్టించిన సృష్టిలోని అందాలను చూచి ఆనందించవలసినదే గాని మనసులో ఎటువంటి చెడు భావాలను రానీయరాదని బాబా బోధించారు.
బన్ను మాయి ప్రముఖ సన్యాసిని. నానాసాహెబ్ కు ఆమెకు పూజ చేయాలనే సంకల్పం కలిగింది. బాబా అనుగ్రహం లేకుండా ఆమె దర్శనం దొరకడం దుర్లభం. ఆ సన్యాసిని 20 సంవత్సరాల వయసుగల ముస్లిం మహిళ. ఆమెలో ఆధ్యాత్మిక శక్తి ఉఛ్ఛ స్థితిలో ఉది. ఆమె తల్లి భోడేగావ్ లో తన యింటిలోనే ఉంటోంది. బన్నుమాయి యిల్లువదలి పూర్తిగా దిగంబరంగా అన్ని చోట్లా తిరుగుతూ ఉండేది. ఎక్కువగా అడవులలోను, ముళ్ళపొదలలోను రహస్యంగా ఉండేది. ఆమె శరీరంనిండా ముళ్ళు గుచ్చుకొని ఉన్నా వాటినెన్నడు తొలగించుకోవాలనె ఆలోచన కూడా ఆమెకి ఉండేది కాదు. నిద్రాహారాల గురించి కూడా ఆలోచించేది కాదు. ఆమె తల్లి యింకా యితరులు అందరూ ఆమె ఒక పిచ్చిపిల్ల అనుకునేవారు. కాని నానాసాహెబ్ యింకా కొందమందికి మాత్రమే ఆమె ఆధ్యాత్మిక స్థితిలో ఎంతో ఉన్నతంగా ఉన్న సన్యాసిని అని నమ్మేవారు. ఆసన్యాసినిని దర్శించడానికి అనుమతి కోరడానికి నానాసాహెబ్ బాబా వద్దకు వెళ్ళాడు. మొదట్లో బాబాకు యిష్టం లేనప్పటికీ తరువాత ఆమె దర్శనానికి నానాసాహెబ్ ను దీవించారు. ఆయన సన్యాసిని ఉండే గ్రామానికి వెళ్ళి ఆమె ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు కాని లాభం లేకపోయింది. ఆమె ఆచూకీ లభించలేదు. పైగా, దిగంబర సన్యాసిని గురించి వాకబు చేస్తున్నందుకు ఆయనను గ్రామస్తులు అసహ్యించుకొన్నారు. అపుడాయన కొంతసేపు బాబాని ధ్యానించారు. కళ్ళు తెరచి చూసేటప్పటికి ఆయనకెదురుగా బన్నుమాయి రోడ్డుమీద నుంచొని దర్శనమిచ్చింది. ఆయన ఆమె కాళ్ళమీద పడగానె ఆమె ప్రక్కనున్న ముళ్ళపొదలలోకి అదృశ్యమయింది. మరొక్కసారి ఆమె దర్శనం చేసుకొని ఆమెకు పూజ చేద్దామనుకొన్నాడు. ఆకారణంగా ఆయన ఆమె కోసం ఒక గుడారం వేసి అందులో ఆమె స్నానం చేయడానికి వేడినీళ్ళు, కొత్తచీర, జాకెట్టు యింకా ఆమెకవసరమయినవన్నీ ఏర్పాటు చేశాడు. మరలా బాబాను ప్రార్ధించాడు. వెంటనే ఆసన్యాసిని ప్రత్యక్షమయి తనంతతానుగా గుడారంలోకి ప్రవేశించి స్నానం చేసి క్రొత్త బట్టలు ధరించింది. నానాసాహెబ్ ఆమె పాదాలకు నమస్కరించి పూజించాడు. అపుడామె వెంటనే లేచి ధరించిన బట్టలన్ని తీసి విసిరేసి అదృశ్యమయిపోయింది. ఆయన తనున్న గ్రామంలోనే బసచేసిన గదిలో లోపల తలుపు గడియ వేసుకొని ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామంనించి బయలుదేరేముందు మరలా ఆసన్యాసిని దర్శన భాగ్యం కలిగించి పూజించుకొనే అదృష్టాన్నిప్పించమని బాబాని ప్రార్ధించాడు. ఆ వెంటనే గదిలో బన్నుమాయి కూర్చుని ఉండటం చూశాడు. గడియవేసి ఉన్న గదిలోకి ఆమె ఎలా ప్రవేశించిందో దానికెవరూ సమాధానం చెప్పలేరు. ఆయన ఆసన్యాసిని పూజించిన వెంటనే ఆమె అదృశ్యమయిపోయింది. ఇదంతా బాబా అనుగ్రహంతోనే సాధ్యమయింది. నానా సాహెబ్ మనస్సు సహజంగానే స్వచ్చమయినదని బాబాకు తెలుసు. నానా కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నాడని తెలుసు. ఆందుకే ఆయనకు ఆసన్యాసిని దర్శనం చేయించి ఆమెకు పూజచేసే భాగ్యాన్నిచి దీవించారు.
మసీదుకు మరమ్మత్తులు చేయించి, దానిని పునర్నిర్మించే బాధ్యతను బాబా నానాకు మాత్రమే యిచ్చారు. ఆ ఉత్తమమైన కార్యానికి నానాకు బాబానించి అనుమతి లభించింది. నానా ఒక ప్రభుత్వ ఆఫీసరుగా తీరిక లేకుండా ఉండటంచేత ఆకార్యభారాన్ని నానాసాహెబ్ నిమోంకర్ కు అప్పచెప్పాడు. ఆసమయలో బాబా నీం గావ్ లో ఉన్నారు. పునర్నిర్మించిన మసీదులోకి బాబాని రాచమర్యాదలతో, మేళతాళాలతో వైభవంగా తీసుకొని వచ్చారు.
మసీదు పునర్నిర్మాణం 1912 లో పూర్తయింది. కాకాదీక్షిత్ మసీదుని రాళ్ళతో పరిచే పనిని ఒక్క రాత్రిలో పూర్తి చేయగలిగాడు. ఆతరువాత బాబా గోనెపట్టాలను మాని మెత్తని దిండ్లను ఉపయోగించసాగారు.
మసీదు పునర్నిర్మాణం 1912 లో పూర్తయింది. కాకాదీక్షిత్ మసీదుని రాళ్ళతో పరిచే పనిని ఒక్క రాత్రిలో పూర్తి చేయగలిగాడు. ఆతరువాత బాబా గోనెపట్టాలను మాని మెత్తని దిండ్లను ఉపయోగించసాగారు.
1906-1908 మధ్యకాలంలో నానా పండరీపురంలో ఉన్నాడు. అంతకు ముందు నందుర్ బార్ లో ఉన్నాడు. నానాసాహెబ్ పండరీపురంలో ఉన్నపుడు ఆయన రెండవ కుమార్తె ద్వారకామాయికి 1906వ.సంవత్సరంలో సుఖప్రసవమయింది. నానా షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొంటూ ఉండేవాడు. ఒకసారి నానా తన నాలుగు సంవత్సరాల వయసుగల కుమారుడు మహదేవ్ అనే బాపూరావు చందోర్కర్ తొ బాబాను దర్శించుకొన్నాడు. ఆ పిల్లవాడు స్వతంత్రంగా బాబా శిరసు మీద పుష్పాలనుంచి పూజించాడు. ఇది 1900 సంవత్సరంలో జరిగింది. నాలుగు సంవత్సరాల వయసులో బాబానుదుటిమీద చందనం కూడా రాయడం మొదలు పెట్టాడు. ఆతరువాతనుంచి యిదే సాంప్రదాయంగా మారింది. బాపూరావుకి మాత్రమే బాబాను పూజించడానికి అనుమతినివ్వబడింది. ఒకసారి నానాసాహెబ్ కి వీపుమీద పెద్ద వ్రణం లేచి, వ్రణం ఏర్పడ్డ ప్రదేశంలో విపరీతంగా బాధ పెట్టసాగింది. ఆ బాధతో నానాకి చాలా అసౌకర్యంగాను, యిబ్బందిగాను ఉండేది. ఎంతోమంది వైద్యులవద్ద వైద్యం చేయించుకున్న ఎటువంటి గుణం కనపడలేదు. ఆఖరికి బొంబాయి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోమని వైద్యులు సలహా యిచ్చారు. అది చాలా చిన్న విషయం కాబట్టి ప్రతీ చిన్న విషయానికి బాబాకు చెప్పి ఆయనను యిబ్బంది పెట్టడమెందుకని, తన బాధ ఏదోతనే పడదామనే ఉద్దేశ్యంతో బాబాకు తన బాధను చెప్పలేదు. ఆపరేషన్ చేయవలసిన రోజు నిర్ణయించడం జరిగింది. ఆరోజున నానాసాహెబ్ ఆస్పత్రికి వెళ్ళాడు. ఆస్పత్రిలో మంచం మీద పడుకొన్నాడు. గడ్డ వల్ల విపరీతమయిన నొప్పితో బాధపడసాగాడు. బాధ భరింపలేనంతగా ఉంది. అప్పటికీ ఈ అగ్నిపరీక్షనుండి బయట పడవేయమని బాబాని వేడుకోలేదు. అయినప్పటికీ తన తలగడ వద్ద బాబా ఫొటో పెట్టుకొని, కొద్ది సేపట్లో వచ్చే సర్జన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment