18.05.2014 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధురక్షణాలు - 42
బాబా ఊదీ యొక్క అమోఘమైన శక్తి
ఈ రోజు మీరు మరొక బాబా లీల ఆయన ఊదీ కి కూడా ఉన్న శక్తి గురించి చదవబోతున్నారు. బాబా ఊదీ మానవులకే కాదు, ఆఖరికి జంతువులకు కూడా అమోఘంగా పనిచేస్తుందని ఈ లీల ద్వారా మనకి తెలుస్తుంది. కాని మనకి ప్రముఖంగా కావలసినది పూర్తి నమ్మకం. అదే లేకపోతే మనం దేవుడిని ఎంత ప్రార్ధించినా నిష్ప్రయోజనం...ఇక చదవండి...
భగవంతునిమీద భక్తి ఎంత బలంగా ఉంటుందో అంతే బలంగా నమ్మకం ఉన్నప్పుడు అది భగవంతుని యొక్క శక్తిని నిర్ధారిస్తుంది. అది మానవులు కానివ్వండి, జంతువులు కానివ్వండి అందరూ కూడా సద్గురుని దృష్టిలో సమానులే. ఇప్పుడు చెప్పబోయే ఈ లీల శ్రీసాయినాధులవారు సమస్త జీవులను ఏ విధంగా రక్షిస్తారో ఋజువు చేస్తుంది.
"నావద్ద ఒక ఆల్సేషియన్ జాతికి చెందిన పెంపుడు కుక్క వుంది. అది ముఖ్యంగా పాలుఅన్నం లేక మజ్జిగ అన్నం తింటూ ఉండేది. ఎప్పుడైనా దానికి ఎముకను యిస్తూ ఉండేవాళ్ళము. ఒకసారి దానికి జూలై 30 తేదీ 1978 నించీ విరోచనాలు పట్టుకున్నాయి. ఏది తిన్నా జీర్ణించుకోలేక చాలా ప్రమాదకరంగా తయారయింది పరిస్థితి. నీళ్ళ విరోచనాలు రక్త విరోచనాలలోకి దింపింది. ప్రతి అరగంటకి విరోచనాలలో రక్తం కూడా పోవడం మొదలయింది. అందరూ చాలా భయపడి వెంటనే ఆస్పత్రికి తీసుకొని వెళ్ళమని సలహా ఇచ్చారు. నా డాక్టరు (సాయినాధుడు) నాకు సులభంగా అందుబాటులోనే ఉన్నప్పుడు నేను మరొక డాక్టర్ వద్దకు వెళ్ళడమేమిటి అని అనిపించింది నాకు. శ్రీసాయినాధులవారి పాదాల వద్ద నేను కొన్ని ఊదీ పొట్లాలు ఉంచాను.
రోజుకి మూడు సార్లు పాలలో గాని, గంజిలో గాని, దానికి పెట్టే ఏఆహారమయితే అందులో ఊదీ కలిపి యివ్వసాగాను. మొదట్లో అది చాలా ప్రమాదకరంగా పరిణమించింది. నాకున్న నమ్మకం వల్ల కుక్క బ్రతకనైనా బ్రతకాలి లేక చావనైనా చావాలి ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే నమ్మకం తో ఒక నిర్ధారణకు వచ్చేశాను. నా స్వభావాన్ని మీరు మొండిపట్టుదల అనుకున్నా సరే, గుడ్డి నమ్మకం అనుకున్నా సరే నా నిర్ణయం నాది.
ఒక వారం రోజుల తరువాత ప్రతిరోజూ చేస్తున్న ఈ వైద్యానికి ఒడిదుడుకులు ఉన్నా గాని, దాని జబ్బు తగ్గుతూ మెల్లగా నియంత్రణలోకి వచ్చింది. సాయినాధులవారిని ప్రార్ధిస్తూ ధైర్యంగా ఊదీ వైద్యాన్నే మానకుండా చేస్తూ వచ్చాను. నా పెంపుడు కుక్క కోలుకొని మళ్ళీ ఆరోగ్యంగా తయారయింది. ఎవరయితే నమ్మకంతో ఉంటారో వారికి దేవునియొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు మీరు ఊదీ యొక్క శక్తి, సామర్ధ్యం బాగా గ్రహించారనుకొంటాను. ఆవిధంగ మనకు దైనందిన జీవితంలో కొన్ని సమయాలలో ఎదురయే కష్ట పరిస్థితులలో ఊదీ వల్ల కలిగే మేలు, దాని సామర్ధ్యం అన్నీ బాగా గ్రహించారనుకుంటాను.
శ్రీసాయిలీల
జనవరి 1979
రామచంద్రన్
బెంగళురు
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment