Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, May 23, 2014

శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్

Posted by tyagaraju on 9:59 PM
                   
                  
24.05.2014 ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్

రెండు సంవత్సరాల క్రితం మన బ్లాగులో శ్రీసాయితో తార్ఖడ్ కుటుంబంవారి ప్రత్యక్ష అనుభవాలు చదివారు.  మీకు గుర్తుండి ఉండే ఉంటుంది.  ఈ రోజు తార్ఖడ్ కుటుంబములోని వారి మరొక ప్రత్యక్ష అనుభవాలను మీకందిస్తున్నాను.  పాఠకులకి మరొక బాబా లీల ఏమి అందిద్దామని ఆలోచిస్తూ వెబ్ సైట్ వెతుకుతుండగా బాబా ప్రేరణతో యిది కనిపించింది. ఇక చదవండి. 
 (bonjanrao.blogspot.in)

శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్
(ప్రముఖ సినీనటి శ్రీమతి నళినీ జయవంత్ తల్లి) 


(శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్  బాబాగారిని, యింకా యితర మహాపురుషులను, సాధువులను నిశితంగా గమనించారు.  బాబా లో ఉన్న అతీంద్రియ శక్తులను గురించి, బాబావారి కళ్ళలో ఉన్న అధ్బుతమయిన శక్తి మరియు తాననుభవించిన అనుభవాలను తెలియచేస్తున్నారు)    

రామచంద్ర ఆత్మారాం గారి సోదరుడయిన సదాశివ తార్ఖడ్ గారి భార్య తారాబాయి.  రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ గారు బొంబాయిలోని ప్రముఖ ఖటావు మిల్స్ కి సెక్రటరీ.  ఒకసారి ఆర్.ఎ. తార్ఖడ్ గారు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొన్నారు.  షిరిడీనుండి తిరిగి వచ్చిన తరువాత ఆయన శ్రీమతి తారాబాయి సదాశివ గార్కి బాబావారి యొక్క అధ్బుతమైన శక్తులను గురించి చెప్పారు.  ఆసమయంలో తారాబాయి గారి 15 నెలల పాప నళినీ తార్ఖడ్ కి బాగా జబ్బు చేసి ప్రమాదకరమయిన పరిస్థితిలో ఉంది.  బాబా శక్తులను గురించి విన్న ఆమె  "బాబాయే కనక నిజంగా మహాత్ముడే అయితే తన పాపకు వచ్చిన జబ్బుని వెంటనే నయం చేయగలిగితే పాపతో సహా షిరిడీ వచ్చి బాబాను దర్శించుకుంటానని" వెంటనే బాబాకు మ్రొక్కుకొంది.   


విచిత్రంగా పాపకు వెంటనే నయమయి ఆరోగ్యం చేకూరింది.  ఆమె వెంటనే తన పాపతో సహా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొంది.  ఆపాపే పెరిగి పెద్దదయి తరువాత ప్రముఖ సినీనటి అయింది.  ఆమే నళినీ జయవంత్.  

  

రామచంద్ర ఆత్మారాం తర్ఖడ్, సదాశివ తార్ఖడ్ ల కుటుంబ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ గారు ప్రార్ధనాసమాజ్ కి చెందినవారు.  ఆయనకు విగ్రహారాధనలో నమ్మకం లేదు.  వారిది గొప్ప చరిత్ర కలిగిన సంపన్న కుటుంబం.  బొంబాయికి 50 కి.మీ.దూరంలో ఉన్న ధానే జిల్లాలోని వాసాయ్ కోటను పోర్చుగీసువారినుంచి స్వాధీనం చేసుకోవడానికి పీష్వాల తరపున యుద్ధం చేశారు జరిగిన యుధ్ధంలో వారి కుటుంబంలోని 21మంది ప్రాణాలు పోగొట్టుకొన్నారు.  వారి ధైర్యానికి గుర్తుగా దగ్గరలోనే ఉన్న తార్ఖడ్ గ్రామాన్ని పీష్వాలు జాగీరుగా బహూకరించారు.  19వ.శతాబ్దం చివరిలో ఆత్మారాం గారి తండ్రి, పినతండ్రి బొంబాయికి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు.  ఆరోజుల్లో వారికి రెండు స్టుడ్ బేకర్ కార్లు ఉండేవి.  అటువంటి కారు ఉండటమంటే సమాజంలో ఎంతో ఉన్నతమైన హోదాగా పరిగణించేవారు.  వారు ఆకార్లలో  ఉన్నతాధికారులతోను, బ్రిటిష్ గవర్నర్ లతోను తిరుగుతూ ఉండేవారు.  ఆరోజుల్లో ఆత్మారాం తార్ఖడ్ గారికి ఖటావూ మిల్స్ కు సెక్రటరీగా జీతం నెలకు 4,000/- వరకూ వచ్చేది.  ఇటువంటి కుటుంబ నేపధ్యం ఉన్న తార్ఖడ్ కుటుంబంవారికి సనాతన ధర్మం, ఆచార వ్యవహారాలంటే యిష్టం ఉండేది కాదు.  సాధువులను, సన్యాసులను దర్శించడమన్న విగ్రహారాధనన్నా వారికి యిష్టం ఉండేది కాదు.  కాని భార్య తారాబాయి ప్రోద్బలం  వల్ల సదాశివం గారు బాబాకు అంకిత భక్తుడయారు.

ఒకసారి తారాబాయి షిరిడీ వెళ్ళారు. అది ఒక చిన్న గ్రామం. అప్పట్లో షిరిడీలో కనీస సౌకర్యాలేమీ లేవు. వీధులన్ని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉండేవి.  రాత్రులందు వీధి దీపాలు కూడా లేక చీకటిగా ఉండేది.  ఒకరోజు రాత్రి ఆమె వీధిలో నడుస్తూ ఉండగా అకారణంగా ఒక్కసారిగా ఆగిపోయింది.  అంత అకస్మాత్తుగా తనెందుకాగిపోయిందో ఖచ్చితంగా ఆమెకే తెలీదు.  కొంతసేపటికి ఎవరో దీపం తీసుకొని వచ్చారు. అప్పుడే ఆమెకు ఎదురుగా ఒక పాము కనపడింది.  ఆమే కనక ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే పరిణామం చాలా విపరీతంగా ఉండేది.  తనంత హటాత్తుగా ఎందుకాగిపోయిందో, ఏప్రేరణ చేత ఆగిపోయిందో ఆమెకేమాత్రం తెలీదు.  ఎవరు చెపితే వీధిలోకి దీపం తేబడిందో తెలీదు.  ఇవన్నీ వివరణకందనివి.  ఇదంతా కూడా బాబా మెలకువగా నిరంతరం తన భక్తులను కాపాడుతూ ఉంటారని ఆమె గ్రహించుకొంది.

ఒకసారి ఆమె షిరిడీ లో ఉన్నపుపుడు ఆమెకు కళ్ళు నొప్పిగా ఉండి కళ్ళంబట నీరు కూడా కారసాగింది.  ఇలా కొంత సేపు బాధపడింది.  అపుడామె మసీదుకు వెళ్ళి బాబా ముందు కూర్చొంది.  బాబా ఆమె వంక చూశారు.  ఆయన దృష్టి ఆమె మీద పడగానే విచిత్రంగా కళ్ళనొప్పి తగ్గి పోయి నీరు కారడం కూడా ఆగిపోయింది.
 ఒకరోజు ఆమె మసీదులో బాబా ముందు కూర్చొని ఉండగా, ఒక కుష్టురోగి వచ్చాడు.  అప్పటికే అతని వ్యాధి బాగా ముదిరిపోయి ఉంది.  అతని శరీరం నుండి దుర్గంధం వస్తూ ఉంది.  అతనిలో శక్తి సన్నగిల్లింది.  అతి కష్టం మీద మెల్లగా మసీదు మూడు మెట్లు ఎక్కి బాబా వద్దకు వచ్చి ఆయన పాదాల వద్ద తన తలను ఆనించాడు.  


బాబాని దర్శిస్తూ ఎక్కువ సమయం అక్కడే ఉన్నాడు. అతను అక్కడ ఉన్నంత సేపూ ఆమెకు అతని నుంచి రోతకలిగేలా దుర్గంధం  వస్తూనే ఉంది.  అతను తొందరగా అక్కడినుండి వెళ్ళిపోతే బాగుండును అని ఆమె మనసులో అనుకొంది.  ఆతరువాత అతను ఒక మురికి గుడ్డలో చుట్టిపెట్టి ఉన్న చిన్న పొట్లం పట్టుకొని నెమ్మదిగా క్రిందకి దిగి వెళ్ళాడు. ఆమె హమ్మయ్యా రక్షించావు దేవుడా అని మనసులో అనుకొని వెసంటనే ఉపశమనం పొందింది.  ఆకుష్టువాడు అక్కడినుండి వెళ్ళగానే బాబా ఒక్కసారి ఆమె వంక చూశారు.  తన మనసులోని ఆలోచనలను బాబా అప్పటికే గ్రహించేశారని ఆమెకు అర్ధమయింది.  కుష్టువాడు యింకా ముందుకు వెడుతూ ఉండగా బాబా మసీదులో ఒకరిని ఆకుష్టువాడిని తిరిగి వెనుకకు తీసుకొని రమ్మని పంపించారు.  మరలా ఆకుష్టువాడు వచ్చి యింతకు ముందులాగే నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు.  అతను వస్తున్నంత సేపు అతని శరీరం  నుండి దుర్గంధం వ్యాపిస్తూనే ఉంది.  అతను మెల్లగా వంగి బాబాకు నమస్కరించాడు.  బాబా అతనివద్ద ఉన్న పొట్లం తీసుకొని అదేమిటని అడుగుతూ విప్పి చూశారు.  అందులో కొన్ని పేడాలు ఉన్నాయి. బాబా ఒక పేడా తీసి, అక్కడ మసీదులో ఉన్నవారికెవరికీ కాకుండా ఆమెకి మాత్రమే యిచ్చి తినమన్నారు.  కంపుకొడుతూ ఉన్న ఒక కుష్టురోగి తెచ్చిన ఆపేడాను ఎలాగ తినడం అనే  గందరగోళంలో పడింది ఆమె.  కాని అది బాబా ఆజ్ఞ.  జవదాటడానికి వీలు లేదు.  బాబా ఆజ్ఞను శిరసా వహించి ఆమె ఆపేడాను తింది.  బాబా మరొక పేడాను తీసుకొని తిని మిగిలినవి అతనికిచ్చి పంపించేశారు.  బాబా మరలా అతనిని ఎందుకని పిలిచారు? పేడా అమెకొక్కదానికే ఎందుకిచ్చారన్నది అక్కడున్నవారెవరికీ అర్ధం కాలేదు.  కాని, బాబా తన ఆలోచనలను పూర్తిగా చదివినట్లు ఆమెకు బాగా అర్ధమయింది.  పరిశుభ్రత, పారిశుధ్ద్యం గురించి ఆమెకున్నటువంటి సొంత అభిప్రాయాల కన్నా బాబా పై పూర్తి విశ్వాసముంచి, వినయం, సానుభూతి, ఓర్పు, వీటి విలువలను పాటించాలని ఆమెకు ఒక మంచి గుణపాఠం చెప్పాలనుకొన్నారు.  బాబా సమక్షంలో ఎవరికీ ఎటువంటి ఆపదా రాదనే అత్యున్నతమైన సిద్ధాంతాన్ని ఈ సంఘటన ఋజువు చేస్తుంది.    

ఒకసారి తారాబాయి, భర్త సదాశివ్ తో కలిసి షిరిడీ వెళ్ళారు.  వారితో కూడా వారి పనివాడుకూడా ఉన్నడు. ఆతను ఎంతో కాలం నుంచీ నడుము వద్ద విపరీతమయిన నొప్పితో బాధపడుతున్నాడు.  సదాశివ బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినపుడు అక్కడ యింకా యితర భక్తులు కూడా ఉన్నారు.  వెంటనే బాబా తనకి కాలు బాగా నొప్పిగా ఉందని చెప్పారు.  లెండీబాగ్ నుండి కొన్ని కలబంద ఆకులను తెచ్చి వాటిని రెండుగా చేసి కాస్త వెచ్చ చేసి బాగా నొప్పిగా ఉన్నచోట ఆ ఆకులను పెడితే నొప్పి తగ్గిపోతుందని అక్కడ ఉన్న భక్తులలో ఒకరికి చెప్పారు.  సదాశివకి బాబా వివరించినదంతా తమ గురించేనని అర్ధమయింది.  బాబాగారు సూచించిన ప్రకారం తమ పనివాడికి నడుము ప్రాంతంలో కలబంద ఆకులను కట్టారు.  వెంటనే అతనికి నొప్పి తగ్గిపోయింది.  

1915వ.సంవత్సర కాలంలో తారాబాయి నరాలకు సంబంధించిన విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేది.  రకరకాల వైద్యాలు చేయించినా ఏమీ గుణమివ్వలేదు.  విడవకుండా వస్తున్న ఆతలనొప్పికి ఆమె చాలా విరక్తి చెందింది.  ఇక జీవితేచ్చ నశించి షిరిడీలో తనజీవితాన్ని అంతం చేసుకొందామని నిర్ణయించుకొంది.  ఆమె ఎలాగో తన భర్తను కూడా ఒప్పించి షిరిడీకి ప్రయాణమై యిద్దరూ కోపర్ గావ్ చేరుకొన్నారు.  చనిపోయేముందు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరిద్దామనుకొంది.  చన్నీటి స్నానం తలనొప్పిని  మరింత అధికం చేస్తుందని ఆమెకు తెలుసు.  త్వరలోనే చనిపోదామని నిర్ణయించుకొన్న ఆమె చన్నీటి స్నానంతో అధికమయ్యే తలనొప్పి గురించి పట్టించుకోలేదు.  గోదావరి నదిలోకి దిగి ఆచల్లని నీటిలో స్నానం చేసింది.  విచిత్రంగా ఆమె తలనొప్పి తీవ్రం అవకపోవడమే కాక తక్షణమే పూర్తిగా మాయమయిపోయింది.  ఇదంతా బాబా చేసిన అధ్బుతమయిన లీల.  తన తలనొప్పి శాశ్వతంగా నయం చేసినందుకు యిద్దరూ షిరిడీ వెళ్ళి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.  

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

(నళినీ జయవంత్ హిందీ సినిమాలలో నటించింది. మీరు గూగుల్ లొ వెతికి ఆమె నటించిన సినిమాలను చూడవచ్చు. పైన ఒక చిత్రం దేవానంద్ తొ కలిసి నటించిన మునింజీ చిత్రంలోనిది)  


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment