24.05.2014 ఆదివారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీమతి తారాబాయి తార్ఖడ్ గారి గురించి రెండవ మరియు ఆఖరి భాగం అందిస్తున్నాను. చదవండి.
శ్రీమతి తారాబాయ్ తార్ఖడ్ - 2 వ.(ఆఖరిభాగం)
(ప్రముఖ సినీనటి శ్రీమతి నళినీ జయవంత్ తల్లి)
(నళినీ జయవంత్ )
ఆమె భర్త సదాశివ్ పూనాలోని ఒక బట్టల మిల్లులో మానేజర్ గా కొంతకాలంగా పని చేస్తూ ఉండేవారు. తరువాత ఉధ్యోగం పోవడంతో చాలా కాలం ఖాళీగా ఉన్నారు. మరలా ఉద్యోగం కోసం ప్రయత్నాలుచేస్తూ బాబా దీవెనలు అందుకుందామని షిరిడీ వచ్చి అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. ఒకరోజు బాబా, తాత్యాపాటిల్ కొంత మందితో కలిసి సినిమా చూడటానికి అహ్మద్ నగర్ వెడుతున్నాడనీ, సదాశివ్ ని కూడా వారితో కలిసి వెళ్ళమన్నారు. అహ్మద్ నగర్ లో సినిమా చూసిన తరువాత పూనా వెళ్ళి అక్కడినుండి యింటికి వెళ్ళమని చెప్పారు. బాబా నోటివెంట ఈ మాటలు విన్న సదాశివ్ కలవర పడ్డాడు. బాబా ఎందుకిలా అంటున్నారు? ఇప్పుడు వినోదకార్యక్రమాలలో పాల్గొని ఆనందించడానికి తగిన సమయమా? కాదే? అనుకొన్నాడు.
ఏమయినప్పటికీ సదాశివ్ కి బాబా పై పూర్తి విశ్వాసం ఉండటంవల్ల, బాబా ఆదేశం ప్రకారం తాత్యాతో కలిసి సినిమా చూసిన తరువాత పూనా వెళ్ళి అక్కడ ఒక స్నేహితుని యింటిలో బస చేశాడు. అదే సమయంలో పూనాలో తాను అంతకు ముందు పనిచేసిన బట్టల మిల్లులో యాజమాన్యానికి కార్మికులకు మధ్య సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమస్యలను సదాశివ్ ఒక్కడే సమర్ధుడయిన మానేజరుగా పరిష్కరించగలడని యాజమాన్యం భావించింది. అందుచేత అతనిని తక్షణం రమ్మనమని యాజమాన్యం బొంబాయిలోని అతని యింటికి యింకా యితర ప్రదేశాలకు వర్తమానం పంపించింది. ఆవిధంగా బాబా దయవల్ల పూనాలోని అదే మిల్లులో అతనికి మరలా ఉద్యోగం లభించింది. మొదటిదాని ప్రకారం బాబా అదేశాలు అసంబంధ్ధంగాను, నిగూఢంగాను ఉంటాయి. కాని వాటిలో చాలా అర్ధం ఉంటుంది. కాని అవన్నీ కూడా చివరికి భక్తుల సంక్షేమం కోసమే.
1963 వ.సంవత్సరంలో శ్రీ బీ.వీ.నరసిం హ స్వామీజీగారు ఆమెను యింటర్వ్యూ చేశారు. ఆమెను శ్రీమతి మానేజర్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాబా ఉదయాన్నే ధుని ముందు కూర్చొని ఎవరికీ అర్ధంకాని విధంగా చేతులతోను, వేళ్ళతోను సంజ్ఞలు చేస్తూ ఉండేవారని ఆమె నరసిం హ స్వామీజీ గారికి యిచ్చిన యింటర్వ్యూలో చెప్పారు. కాని, వాస్తవానికి ఆయన చేసే ఆ సంజ్ఞలు సామాన్యంగా ప్రజానీకానికి ముఖ్యంగా భక్తుల సంక్షేమం కోసం పంచభూతాలకు ఆదేశాలనివ్వడం. చివరగా బాబా 'హక్' అనగా భగవంతుడే సర్వాధికారి అంటూ ఉండేవారు. బాబా తన భక్తులకు తన్మయత్వాన్ని ప్రసాదించదలచుకొన్నప్పుడు ఆయన వారిపై తమ దృష్టిని సారించి (దృష్టిపాతం) వారిని ఎక్కువ సమయం ఆ తన్మయస్థితిలో ఉంచేవారు.
మహాసమాధి అయిన తరువాత కూడా బాబా తన భక్తులను ఆదుకొంటూనే ఉన్నారు. ఒకసారి 1927 సంవత్సరంలో తారాబాయి భర్త సదాసివ్ గారితో కలసి యాత్రలకు వెడుతూ షిరిడీ కూడా వెళ్ళారు. ఆమె అప్పుడు గర్భిణి. నెప్పులు వచ్చాయికాని శిశువు గర్భంలోనే మృతి చెందింది. కాని కొద్దిరోజుల వరకు ప్రసవం కాలేదు. రక్తం విషతుల్యమయిందేమో అని అనుకునే విధంగా ఆమె శరీరం నీలం రంగులోనికి మార సాగింది. తరువాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. తరువాత జరిగిన విషయాలేమీ ఆమెకు తెలియవు. సదాశివ్ ఆమెని సాకోరీలో ఉన్న ఉపాసనీ బాబా వద్దకు తీసుకొని వెళ్ళి సహాయం చేయమని ప్రార్ధించాడు. ఆసమయంలో ఉపాసనీ బాబాగారి ఖ్యాతి ఉన్నత స్థితిలో ఉంది. సాకోరీలో సద్గురువుగా చలామణీ అవుతున్నారు. కాని, అత్యున్నతమైన ప్రముఖ వైద్యుడు, నర్సు, షిరిడీలోనే ఉన్నాడనీ, షిరిడీ వెళ్ళి బాబా సమాధిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందమని ఉపాసనీ బాబా అన్నారు. వారు షిరిడీకి బయలుదేరి వెళ్ళారు. షిరిడీలో కూడా తారాబాయి యింకా అపస్మారక స్థితిలోనే ఉంది. ఆస్థితిలోనే ఆమె తనను రక్షించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ సూచనలు చేసింది. ఆమె చెప్పినట్లుగానే వారు అక్షరాలా చేశారు. ఆమె నుదుట బాబా ఊదీని రాసి, తీర్ధాన్నిచ్చారు. ఈవిధంగా చేయడంతో ఆమె గర్భంలో ఉన్న మృత శిశువు గర్భం నుండి బయట పడింది. క్రమంగా ఆమె కోలుకోవడం మొదలయి నెల రోజులలో సామాన్య స్థితికి వచ్చి ఆరోగ్యవంతురాలయింది. బాబా మహాసమాధి చెదిన తరువాత కూడా ఆయన చేసిన అధ్బుతమయిన ఈ సంఘటనే ఒక ఉదాహరణ.
ఇతర సాధు సత్పురుషులకన్నా బాబా చాలా విలక్షణమయిన, ప్రత్యేకమయిన మహాపురుషుడనీ, ఆయన సర్వజ్ఞులు, సర్వాంతర్యామి, సర్వ శక్తిమంతుడని ఆమె చెప్పారు. ఆమె ఎంతోమంది సాధువులను, సన్యాసులను చూశారు, వారిని కలుసుకొన్నారు. ఆమె తాను గమనించినదాని ప్రకారం వీరందరూ కూడా కొన్ని విషయాలను తెలుసుకొనడానికి సమాధిస్థితిలోకి వెడుతూ ఉండేవారని కాని, బాబా విషయంలో మాత్రం ఆవిధంగా ఉండేది కాదని, ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళకుండానే ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటనలు జరిగినా వాటిని తక్షణమే తెలుసుకొనగలిగేవారని వారికా శక్తి ఉందని చెప్పారు.
బాబా కళ్ళు ఎంతో అద్భుతంగాను, శక్తివంతంగాను ఉండేవి. బాబా ఎవరిమీదనయినా తమ దృష్టిని సారించినపుడు వారి కళ్ళు ఎదటివారి మనోభావాలని చేదివేటంత శక్తివంతమయినవి. వారి దృష్టి తీక్షణంగా ఎదటివారి మనసు లోతులలోకి చొచ్చుకొని పోయేవి. ఎవరూ కూడా ఆయన కళ్ళలోకి కొద్దిసేపు తప్ప తదేకంగా నిరంతరం చూడలేకపోయేవారు. కొద్దిసేపటికే తలదించుకొని నేల చూపులు చూసేవారు.
తారాబాయి ఎపుడు షిరిడీ వెళ్ళినా రాధాకృష్ణ ఆయీ యింటిలో బస చేసేది. తారాబాయి రాధాకృష్ణ ఆయీని చాలా నిశితంగా గమనించింది. రాధాకృష్ణ ఆయీ బాబా సేవకు పూర్తిగా అంకితమయి బాబా నడిచే వీధులను శుభ్రం చేస్తూ ఉండేది.
బాబాకు ఎన్నో సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఆమె చేసిన ఈ సేవకి తారాబాయి ఘననివాళులు అర్పించింది. షిరిడీ ప్రజలందరూ రాధాకృష్ణ ఆయీకి అత్యున్నతమైన గౌరవాన్నిచ్చారు.
రాధాకృష్ణ మాయిలో దివ్యదృష్టి నైపుణ్యం ఉంది. ఎదుటివారి ఆలోచనలను గ్రహించగలడంలో సమర్ధురాలు. కాని మాట మాత్రం కరకుగా ఉండేదని తారాబాయి చెప్పారు. షిరిడీలో జరిగిన సంఘటనలను నిశితంగా గమనించిన తారాబాయి బాబా వారి అమోఘమైన శక్తులను గురించి ఎంతో ప్రముఖంగా చెప్పారు. వాటిలో కొన్ని బాబా దినచర్య, భక్తుల సమస్యలను నిగూఢంగా పరిష్కరించే విధానం, ఆయన చేసే బోధనల తీరు. బాబా మహాసమాధి చెందిన తరువాత కూడా ఆయన శక్తి, బాబా జీవితం, ఆయన లక్ష్యం, వారి బోధనలను గురించి మనకెంతో ఉన్నతంగా వివరించిన ఆమె ధన్యజీవి.
**********
కేవలం సాయిబాబా వారి ప్రేరణ వల్లనే ఈ సంఘటనలన్నీ రచయిత వ్రాయగలిగారు. శ్రీసాయిబాబాకు సంబంధించిన వాస్తవాలు, అభిప్రాయాలు, ప్రతిచోటా జరిగిన సంఘటనలు,వీటికి సంబంధించినవన్నీ కూడా అందుబాటులో లభించిన ఆధారాలను అనేక పుస్తకాలనుండి సేకరించడం జరిగింది. ఆరచయితలందరికీ ధన్యవాదములు. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమయిన సంఘటనలు, బాబా వారి లీలలు కాలక్రమానుసారం సమాచారం సేకరించడానికి గట్టి ప్రయత్నం జరిగింది. కాని సంఘటనలు జరిగిన సమయం తెలపాలంటే ఖచ్చితమయిన చారిత్రక ఆధారాలు వివరాలు లేకుండా తెలుసుకోవడం చాలా కష్టం.
ఈ అధ్యాయంలో రచయిత తనకు బాగా తెలిసున్నంతవరకు అన్ని రకాలుగాను విషయ సేకరణ జరిపి వాటినాధారం చేసుకొని వ్రాయడం జరిగింది. ఈ అధ్యాయానికి రచయిత కర్తృత్వం వహించటంలేదు. అనగా దీనికి ఆయన కర్త కారు. పాఠకులు దీనియందలి విషయాలన్నిటినీ స్వేచ్చగా ఉపయోగించుకోవచ్చు. వీటిపై రచయిత కి ఏవిధమయిన హక్కు లేదు. విషయ సేకరణ ఖచ్చితంగా సేకరించడానికి ప్రతిచోట గట్టి ప్రయత్నం జరిగింది. ఇందులోని విషయాల వాస్తవికతకు రచయిత బాధ్యుడు కాడు.
ఇందులోని విషయ సంకలనానికి/సంఘటనలు జరిగిన కాలానికి అనుగుణంగా ఏర్పరచి అందించడానికి సహాయపడినవారందరినీ రచయిత అభినందిస్తున్నారు. ఈ అధ్యాయం సమీక్షకు/పరిశోధనకు మాత్రమే ఉద్దేశ్యింపబడినది తప్ప వ్యాపార రీత్యా ఉపయోగించడానికి కాదు. దీనికి కాపీ రైట్ కూడా లేదు. ఇది ప్రచారం కోసం బ్లాగులో ఉంచబడింది. ఈ అధ్యాయంలో యింకా ఏవిధమయిన సమీక్షలు/వ్యాఖ్యలు/సలహాలు/దిద్దుబట్లు/ఏమయినా చేయవలసినచో తెలియ చేయవలసినదిగా ఆహ్వానిస్తున్నాను.
అందరికీ బాబా దీవెనలు
రచయిత
బొండాడ జనార్ధనరావు
సాయిప్రచారక్
బెంగళురు - 560 068
(bonjanrao.blogspot.in నుండి గ్రహింపబడినది )
శ్రీ జనార్ధనరావుగారికి కృతజ్ఞతలు
(అయిపొయింది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment