11.05.2014 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధురక్షణాలు - 41
నేను నిన్ను మరువకుండా ఉండే వరాన్ని ప్రసాదించు
ఈ రోజు శ్రీసాయితో మధురక్షణాలలో మరొక మధుర క్షణం తెలుసుకుందాము. వ్యాధి గ్రస్తులకు వ్యాధిని తగ్గించడంలో బాబా చేసే చర్యలు, వైద్యం చాలా వింతగా ఉండేవి. కాని ఆయన చేసినట్లుగా భక్తులు చేయడానికి ప్రయత్నించినప్పుడు అవి వికటిస్తూ ఉండేవి. ఈ లీలలో బాబా వ్యాధిని ఏ విధంగా తగ్గించారో చూడండి.
నేను నిన్ను మరువకుండా ఉండే వరాన్ని ప్రసాదించు
ఇప్పుడు వివరింపబోయే ఈ లీల ఒక ప్రముఖ సంగీత కారునిది. ఆయన తన గాన మాధుర్యంతో బాబాని ఆనంద పారవశ్యంలో ముంచెత్తారు. ఆయన పేరు అబ్దుల్ కరీం ఖాన్. ఆయన ఉత్తర ప్రదేశ్ లోని కైరన గ్రామంలో నవంబరు 11 వ.తేదీ 1872వ.సంవత్సరంలో జన్మించారు.
ఆయన కుటుంబం కైరానాలోని సున్నీ కుటుబానికి సంబంధించి దానిలో ఒక అంతర్గత భాగం. వారికి చిస్టీ సూఫీ సన్యాసులంటే ఎంతో గౌరవభావం. ముఖ్యంగా మధ్య ఆసియా ద్వారా ప్రయాణించి రాజస్థాన్ అజ్మీర్ లో స్థిరపడిన పెర్షియన్ సన్యాసి మౌనుద్దీన్ చిస్టి పట్ల వారికెంతో గౌరవ భావం.
అబ్దుల్ కరీం వారి సోదరులు చిన్నతనంనుంచే వారి తండ్రిగారివద్ద సంగీతాన్ని అభ్యసించారు. వారంతా ఆధ్యాత్మిక సూఫీ జానపద సంగీత కళాకారులుగాను, సారంగీ వాయిద్యకారుల కుటుంబంగా తమజీవితాన్ని ప్రారంభించి, తరతరాలుగా వస్తున్న సంగీతాన్ని కొనసాగించారు
1975వ.సంవత్సరంలో ఆ సంగీత కళాకారుల బృందం సంచారం చేస్తూ సంగీత కార్యక్రమాలకు వెడుతున్నారు. అబ్ధుల్ కరీం ఖాన్ గారు ఆసమయంలో వారితో పాటుగా ఆజ్మీర్ లో ఉన్నారు. అప్పుడే వారికి బాబా గురించి తెలిసింది. ఆయనకి సాధువులు, సన్యాసుల యందు ప్రేమ భక్తి ఉన్నాయి. ప్రతాప్ సేఠ్ గారి స్వగృహంలోజరుగుతున్న ఒక శుభ కార్యక్రమానికి వీరి బృందం హాజరయింది. ఆసమయంలో అక్కడ బూటీ కూడా ఉన్నారు. సాయిబాబా వారి లీలలు, బాబా వారి శక్తి వారి ద్వారా అబ్ధుల్ కరీం ఖాన్ గారు విన్నారు. అవి ఆయనని మంత్రముగ్ధుడ్ణి చేశాయి. అక్కడ జరిగిన కార్యక్రమానికి సాయి భక్తులు చాలా మంది వచ్చారు. వారంతా కూడా అబ్దుల్ కరీం గారిని షిరిడీ వచ్చి సాయి మహరాజ్ గారి సమక్షంలో గానం చేయమని అభ్యర్ధించారు. ఖాన్ సాహెబ్ గారు వారు చెప్పినదానికి వెంటనే ఒప్పుకొని తన మాలెగాన్ ప్రయాణాన్ని రద్దు చేసుకొని షిరిడీకి ప్రయాణమయ్యారు. ద్వారకామాయి లో బాబా గారు, తాత్యా, షామా యింకా ఇతర భక్తులతో సంభాషిస్తూ ఉన్నారు.
అబ్ధుల్ కరీం ఖాన్ గారు తన సహచరులతోను, వాయిద్య పరికరాలతోను బూటీ తో అక్కడకు చేసుకొన్నారు.
ఆరోజులలో షిరిడీ విస్తారమైన అడవి. అక్కడ పాములు, యింకా యితర ప్రాణులు సంచరిస్తూ ఉండేవి. ఇక్కడే సాయిబాబా గారు ఉండేవారు. ఖాన్ సాహెబ్ గారు షిరిడీకి రాగానే ఆయనకి కోతె పాటిల్ గారి యింటిలో బస ఏర్పాటు చేశారు. కాని ఆయన బాబా దర్శనానికి సాయంకాలం వరకు వేచి ఉండాల్సి వచ్చింది. సూర్యాస్తమానమయేటప్పటికి బాబా తన నివాసం నుండి బయటకు వచ్చారు. ఖాన్ సాహెబ్ గారికి తాను ఒక మహా పురుషుడయిన సాధువు ముందు ఉన్న అనుభూతి కలిగింది. పరిచయాలు అయిన తరువాత బాబా ఆయనను ఒక భజన పాట పాడమన్నారు. ఖాన్ సాహెబ్ గారు సంగీత పరికరాలను వాయించేవారిని పిలిచారు. అప్పుడు బాబా "వాయిద్యాలు ఏమీ అవసరం లేదు. నువ్వు పాట పాడు" అన్నారు.
ఖాన్ సాహెబ్ గారు "హే చి దాన్ దేగా దేవా, తుఝా విసార్ న వ్హవా" (నేను నిన్ను మరవకుండా ఉండే వరమివ్వు) అని చాలా మెల్లగా మృదువుగా ఎటువంటి మేళతాళాలు లేకుండా పాడారు. బాబా ఆయన పాడినది ఎంతో శ్రధ్ధగా పరవశంతో విన్నారు. అప్పుడు బాబా"షామా, పిలు రాగం ఎంత అధ్బుతమైనదో చూడు, ఆయన పాడుతున్నది వాస్తవంగా నాద బ్రహ్మ. అటువంటి సంగీతం భగవంతునికి నిశ్చయంగా సంతోషాన్ని కలుగచేస్తుంది" అన్నారు. బాబా భువికి దిగి వచ్చిన భగవంతుడని ఆయన సం రక్షణలో అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెకు గుణమవుతుందని ఖాన్ సాహెబ్ ఏమాత్రం గ్రహించలేకపోయాడు.
బాబా, ఖాన్ సాహెబ్ గారి వైపు తిరిగి "ఇప్పుడు సంతోషంగా ఉండు. వెళ్ళిపోదామని హడావిడి పడకు. నీకుటుంబాన్ని కూడా యిక్కడకు వచ్చి కొద్ది రోజులు ఉండమను" అన్నారు .
మరునాడు ఖాన్ సాహెబ్ కి ఆయన భార్య (తారాబాయ్) నించి తంతి వచ్చింది. అందులో ఆయన కుమార్తెకి చాలా జబ్బుగా ఉందనీ, వెంటనే యింటికి రమ్మని సందేశం యిచ్చింది. ఖాన్ సాహెబ్ గారు తంతిని పట్టుకొని వచ్చి బాబాకి యిచ్చారు. బాబా ఆయనను ఓదార్చి కుటుంబాన్ని షిరిడీకి తీసుకురమ్మని చెప్పారు. ఖాన్ సాహెబ్ గారు తన భార్యని, కుమార్తెను షిరిడీకి రప్పించారు. ఆయన చావుకు దగ్గరగా ఉన్న తన కుమార్తెను మోసుకొని వచ్చి బాబా పాదాల వద్ద పడుకోబెట్టారు.
బాబా తన చిలుములోనించి కొంత బూడిదను తీసి దానిని బెల్లం లో కలిపారు. దానిని నీటిలో కలిపి ఖాన్ సాహెబ్ గారి కుమార్తె చేత తాగించారు. రెండు రోజుల తరువాత బాబా చేసిన వైద్యానికి ఖాన్ గారి కుమార్తె గులాబ్ కలి లేచి నిలబడగలిగింది. బాబా తానే స్వయంగా ఖాన్ సాహెబ్ గారిని అనుగ్రహించారు. వారు 10రోజులు షిరిడీలోనే ప్రశాంతంగా ఉన్న తరువాత వారికి షిరిడీనుండి వెళ్ళడానికి అనుమతి ప్రసాదించారు.
సంధ్యా ఉడతా
హైదరాబాదు
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment