13.06.2014 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నానాసాహెబ్ చందోర్కర్ -(3వ.ఆఖరి భాగం)
నానాసాహెబ్ తన మొహాన్ని దిండు మీద పెట్టుకొని సర్జన్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ బోర్లా పడుకొన్నాడు. ఆసమయంలో గది పైకప్పునుండి ఒక పెంకు ముక్క జారి సరిగా ఆయన వీపుమీద లేచిన వ్రణం మీద పడింది. అలా పడటంతోనే వ్రణం పగిలి చీము, నెత్తురు మెల్లగా బయటకు కారసాగింది . దాంతో నొప్పి కూడా తగ్గడం ప్రారంభమయింది.
తరువాత సర్జన్ వచ్చి ఆ అధ్బుత సంఘటనను చూసి ఆశ్చర్యపోయాడు. ఆపరేషన్ అవసరం లేకుండ వ్రణం పగిలి నానాసాహెబ్ కి బాధ లేకుండ పోయింది. సర్జన్ యిక ఆపరేషన్ అవసరం లేదని చెప్పాడు. చిన్న విషయమయినా సరే, ప్రార్ధించకపోయిన బాబా తన అంకిత భక్తులకోసం వెంటనే వచ్చి కాపాడతారన్నదానికి యిదే ఒక ఉదాహరణ. కొద్దిరోజుల తరువాత నానాసాహెబ్ షిరిడీ వెళ్ళారు. అప్పుడు బాబా "ఎవరైనా, నన్ను యిబ్బంది పెట్టడమెందుకని భావించినా, ఆఖరికి నేనే స్వయంగా నాచేతులతో పుండును చిదిమివేస్తాను" అన్నారు.
1913-1914 లో నానా సాహెబ్ చందోర్కర్ అనారోగ్యం వల్ల దీర్ఘకాలిక శలవు పెట్టాడు. భార్యతో సహా షిరిడీలోనే ఉండి బాబా సేవ చేసుకోసాగాడు. నానాసాహెబ్ బాబా గురించి, బాబా యిచ్చిన సందేశాలను , బాబా మీద భక్తిని పెంపొందించుకున్నందువల్ల కలిగే ప్రయోజనాలు వీటన్నిటి గురించి ప్రజలలో ప్రచారం చేశాడు. ముఖ్యంగా పూనా, బొంబాయి వంటి పట్టణాలలో ప్రచారం చేసిన ఫలితంగా కులమత భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా ప్రజలందరూ బాబా దర్శనానికి షిరిడీకి రావడం ప్రారంభించారు. భక్తులందరికీ బాబావారి మహిమలు అనుభవమయ్యాయి. అలా అనుభవాలను పొందిన భక్తులందరూ తమకు బాబాని పరిచయం చేనందుకు నానా సాహెబ్ కి ధన్యవాదాలు తెలుపుకొన్నారు.
బాబా గురించి ఆయన మహిమలను వ్యాప్తిలోనికి తెచ్చినవాళ్ళలో నానాసాహెబ్ మొదటివాడు. ఆయన తరువాతే దాసగణు, దీక్షిత్, బీ.వీ.దేవ్, బీ.వీ.నరసిం హస్వామీజీ గార్లు. నానాసాహెబ్ యిచ్చిన ప్రోద్బలంతో బీ.వీ.నరసిం హస్వామీజీ గారు షిరిడీ వెళ్ళి బాబా తత్వం మీద, ఆయన జీవితం మీద ఎంతో పరిశోధన చేశారు. ఆయనకు నానాసాహెబ్ అంటే ఎంతో గౌరవం. నానాసాహెబ్ వల్లే దీక్షిత్, ధబోల్కర్, దాసగణు, రాధాకృష్ణమాయి, మోరేశ్వర్ ప్రధాన్, తాత్యా సాహెబ్ నూల్కర్, బాలాసాహెబ్ దేవ్, మాధవరావ్ అడ్కర్ లాంటి ఎంతో మంది భక్తులు షిరిడీకి రావడం తటస్థించింది.
ఆయన కృషి వల్ల దాదాపు 2000 మంది యాత్రికులు బొంబాయినుండి బాబాదర్శనం కోసం షిరిడీ వచ్చారు. మహారాష్ట్రలో బాబా గురించి ప్రచారం చేసి ప్రజాదరణ చేసిన మొదటి భక్తుడు ఆయన. ఆయన బంధువయిన బాలభావ్ చందోర్కర్ 1911నుండి షిరిడీ దర్శించే యాత్రికుల కోసం చిన్న హోటలు నడుపుతు ఉండేవాడు. ఆయన పెద్ద కుమారుడు బాబూసాహెబ్ చందోర్కర్ వివాహం 1912లో గాలియర్ లో జరిగింది. రెండవకుమారుడయిన బాపూరావు చందోర్కర్ వివాహం 1921 లో నానా మరణించిన తరువాత 1922 లో జరిగింది. నానాసాహెబ్ 61సం.వయసులో ఆగస్టు, 21, 1921 సం.ఏకాదశిరోజున కళ్యాణ్ లో ప్రశాంతంగా కన్నుమూసాడు. మహాభక్తుడయిన నానాసాహెబ్ చందోర్కర్ ధన్యుడు.
(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
ఆంగ్లమూలం
శ్రీబొండాడ జనార్ధనరావు
సాయి ప్రచారక్
బెంగళూరు - 560 068
వారి బ్లాగునుండి సంగ్రహింపబడినది.
bonjanrao.blogspot.com
ఆంగ్లమూలం
శ్రీబొండాడ జనార్ధనరావు
సాయి ప్రచారక్
బెంగళూరు - 560 068
వారి బ్లాగునుండి సంగ్రహింపబడినది.
bonjanrao.blogspot.com
0 comments:
Post a Comment