02.02.2016 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ షిరిడీ సాయి వైభవం - బాబా గారి చిలుం మహిమ
నిన్న బాబా వారి మహిమ గల చిలుం గురించి చదివాం. ఈ రోజు మరొక మహిమ తెలుసుకుందామా? ఆ మాహాత్మ్యం చిలుములో ఉందా? కాదు, బాబా వారి హస్త స్పర్శలొ ఉంది. ఆయన పవిత్ర హస్త స్పర్శద్వారా ఆ మహత్తు చిలుము ద్వారా భక్తులకు ప్రసరించేది అవునంటారా? ఈ రోజు 'ద గ్లోరీ ఆఫ్ షిరిడీ సాయి ' ఆగస్ట్ 20, 2015 వ. సంచికలో ప్రచురింపబడిన ఈ వైభవం మనందరి కోసం...
1901వ.సంవత్సరంలో నానా చందోర్కర్ జనాభా లెక్కల పర్యవేక్షణాధికారిగా ఉన్నాడు. అతనివద్ద వాసుదేవ జనార్ధన్ గుమాస్తాగా ఉండేవాడు. నానా వాసుదేవునితో తన కూడా షిరిడీకి రమ్మన్నాడు.
ఒక రోజు ఉదయం 8 గంటలకి, వాసుదేవు, నానా, ఇంకా ఇరవై మంది కలిసి షిరిడీ యాత్రకు బయలుదేరారు. వారంతా ద్వారకామాయిలోకి అడుగుపెట్టారు. అప్పుడు బాబా చిలుము పీలుస్తూ ఉన్నారు.
అందరిలోకి వాసుదేవుది చిన్న వయసు పైగా అసలు పొగ త్రాగటం అలవాటు లేనివాడు. మిగిలినవారు మాత్రం, బాబా చిలుము ఎప్పుడిస్తారా దానినెప్పుడు పీల్చుదామా అని ఎంతో అతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాని, బాబా వాసుదేవుకు చిలుమునిచ్చి పీల్చమన్నారు. అసలు పొగ త్రాగనివాడు కాబట్టి సహజంహంగానే వాసుదేవు సంకోచించాడు. చిలుము తీసుకుని పీల్చమని, ఆ తరువాత అద్భుతం జరుగుతుందని నానా అతనితో మెల్లగా అన్నాడు. అతను చిలుము తీసుకుని మూడు సార్లు పీల్చి తిరిగి బాబాకి ఇచ్చాడు. బాబా మరింకెవరికీ చిలుమునివ్వలేదు.
ఈ సంఘటన తరువాత వాసుదేవుకి ఉద్యోగంలో తను కోరుకున్న ప్రమోషన్స్ అన్నీ లభించాయి. హాయిగా జీవించడానికి సరిపడా పింఛనుతో ఉద్యోగ విరమణ చేశాడు. ఉద్యోగ విరమణ తరవాత అతను 'సధ్బాయి వాటర్ సప్లై' పేరుతో స్వంతంగా వ్యాపారం మొదలు పెట్టాడు. బేలాపూర్ - కోపర్గావ్ ఎలక్ట్రిక్ కంపెనీకి మేనేజింగ్ ఏజెంటుగా ఉన్నాడు. బాబా పేరుమీద ఏపని చేసినా అది విజయవంతమవుతుండడంతో అతనికి పూర్తి నమ్మకం ఏర్పడింది.
ఆవిధంగా బాబా చిలుము మహాత్మ్యం , ఆయన అనుగ్రహం అతనికి జీవితాంతం లభించాయి.
-------
మరొక లీల ----
మధుఫాల్సే బాబాకు గొప్ప భక్తుడు. రాత్రింబవళ్ళు అతను బాబాకు సేవ చేస్తూ ఉండేవాడు. ఆ తరవాత బాబా సంస్థానంలో కూడా పని చేశాడు. బాబా అతనికి తనకు ప్రియమైన శ్యామకర్ణ గుఱ్ఱాన్ని చూసే బాధ్యతనప్పగించారు.
బాబా అతనిని ముద్దుగా "ఘోడావాలా' అని పిలిచేవారు. ఒకసారి అకస్మాత్తుగా మధుఫాల్సే జబ్బుపడ్డాడు. శరీరమంతా పాలిపోయి స్పృహతప్పి పడిపోయాడు. అప్పట్లో అతను ద్వారకామాయి వెనకాలే ఉన్న నారాయణ తేలి ఇంట్లో ఉంటున్నాడు. కుమారుడి స్థితి చూసి చనిపోతాడేమోననే భయంతో తల్లి ఏడవసాగింది. ఆమె ఏడ్పులు విని బాబా ఆమె ఇంటికి వచ్చి,
"నువ్వెందుకని ఇలా ఏడుస్తున్నావు? మధుకి ఏమీ కాదు. నేనెప్పుడూ మీ చెంతనే ఉంటాను. పొద్దున్నే అతను రొట్టె అడుగుతాడు. అది అతనికివ్వు" అని ధైర్యం చెప్పారు.
బాబా అన్నట్లుగానే ఉదయాన్నే ఫాల్సే స్పృహలోకి వచ్చాడు. తరువాత రొట్టి కావాలని అడిగాడు. కళ్ళల్లో నీరు నిండగా అతని తల్లి రొట్టెనిచ్చింది. దానితో అతను పూర్తిగా కోలుకున్నాడు. బాబా మాటలు నిజమయ్యాయి.
(మరికొన్ని వైభవాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment