29.01.2017 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
షిరిడీ సాయి వైభవమ్ – సహాయం చేయకుండా ఉండగలనా?
నెలరోజులనుండీ
కొన్ని అనుకోని సంఘటనల వలన ప్రచురణకు పెద్ద ఆటంకమే కలిగింది. ప్రతిరోజూ మన సాయి బంధువులకు బాబా లీల ఒక్కటయినా
ప్రచురిస్తే ఎంతో తృప్తిగా ఉండేది. మీరందరూ
బాబా లీలలను ప్రతిరోజూ చదువుతూ ఆయన మనకందరకూ దగ్గరగా ఉన్నారనే భావంతో ఉంటూ ఉంటారని
తెలుసు. కాని ఏమీ చేయలేని పరిస్థితులలో ప్రచురించలేకపోయాను. ఈ రోజు సమయం చూసుకుని ఒక చిన్న లీల ప్రచురిస్తున్నాను.
ఓమ్
సాయిరామ్
శ్రీ
ఎమ్.ఆర్. తగారే షిరిడీకి దగ్గరలో ఉన్న సాకర్ వాడీ చక్కెర కర్మాగారానికి సంబంధించి డాక్టర్ గా
పనిచేస్తున్నారు. 1914 వ.సంవత్సరంలో ఆయన తన
వద్దనున్న 2,500 రూపాయల విలువగల వార్-బాండ్స్ ను అమ్మేయడానికి కోపర్ గావ్ లో ఉన్న పోస్ట్
ఆఫీసుకు ఎడ్లబండిలో బయలుదేరారు.
వార్-బాండ్స్
ఉన్న సంచీని తన వద్దనే పెట్టుకున్నారు. బండిలో
తోటి ప్రయాణీకుడితో మాట్లాడుతూ ఉండిపోయారు.
కొంతసేపటి తరువాత చూసుకుంటే తన ప్రక్కన బాండ్స్ పెట్టిన సంచీ కనపడలేదు. బండిలో అంతా వెతికారు. కాని కనపడలేదు. బహుశా దారిలో ఎక్కడయినా పడిపోయిందనుకుని బండిని ఆపించారు. ప్రయాణం చేసిన దారంతా ఒకటి రెండు మైళ్ళ వరకు చాలా
జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళారు. కాని సంచి
మాత్రం ఎక్కడా కనపడలేదు. చాలా దుఃఖం వచ్చింది. అనారోగ్యంతో ఉన్న తన స్నేహితుని చూడటానికి కోపర్
గావ్ వెళ్ళారు. ఆ రాత్రంతా ఆయనకు నిద్రపట్టక
మంచంమీద పడుకుని కలిగిన నష్టాన్ని తలుచుకుంటూ అటూ ఇటూ దొర్లుతూనే ఉనారు. అర్ధరాత్రివేళ లేచి బాబా చిత్రపటంముందు కూర్చుని
తనకు సహాయం చేయమని ప్రార్ధించారు. అప్పుడాయనకు
“చింతించకు” అన్న స్వరం వినపడింది. ఆస్వరం
ఆయనకు అభయం ఇస్తున్నట్లుగా అనిపించింది. తరువాత
ఆయన ప్రశాంతంగా నిద్రించారు.
మరుసటి
రోజు ఉదయాన్నే ప్రక్కనే ఉన్న గ్రామంలో ఉన్న తన స్నేహితుని చూడటానికి
అతని ఇంటికి వెళ్ళారు. స్నేహితుని
పరీక్షించి వాడవలసిన మందులు రాసి ఇచ్చి, మాట్లాడుతూ
కూర్చున్నారు. ప్రయాణం
మధ్యలో తన వార్-బాండ్స్
ఉన్న సంచి పోగొట్టుకున్నట్టు చెప్పారు. దగ్గరలో
నుంచున్న చిన్న పిల్ల ఒకామె
పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సంచీని
తీసుకుని వచ్చి “ఇదేనా ఆసంచీ”? నిన్న
నాకు రోడ్డు ప్రక్కన ఈ సంచి దొరికిందని
చెప్పింది. వెంటనే
ఉద్వేగంతో సంచి అందుకుని అందులో
బాండ్స్ ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అన్నీ
సక్రమంగానే ఉన్నాయని నిర్ధారణ చేసుకున్నారు. తనకు
సహాయం చేసిన బాబాకు మనసులోనే
కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment