27.04.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బంధువులందరూ మాతాజీ కృష్ణప్రియ గారి గురించి తెలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నారు కాబట్టి ఆవిడ గురించి ప్రచురిస్తున్నాను. శ్రీ భారం ఉమా మహేశ్వరరావుగారి అనుభవాలు ఇంకా ఉన్నాయి. శ్రీసాయిలీలా తరంగిణి 31 వ.భాగా చాలా పెద్దది. దానిని ఇంకా అనువాదం చేయాలి. ఈలోగా మాతాజీ కృష్ణప్రియ గారి గురించి ప్రచురిస్తున్నాను. శ్రీ సాయి లీలా తరంగిణి ఇది అయిన తరువాత ప్రచురిస్తాను.
మాతాజీ కృష్ణప్రియ - 1 వ.భాగమ్
సద్గురు
మాతాజీ కృష్ణప్రియ 1923వ. సంవత్సరం, నవంబరు నెల 18వ.తేదీ ఆదివారమునాడు పర్లాకిమిడి (ఇపుడు ఒరిస్సా
రాష్ట్రంలో ఉంది) లో జన్మించారు. ఆవిడ తల్లిదండ్రులు
శ్రీ ఆరాధి హనుమంతరావు, శ్రీమతి జోగుబాయి.
శ్రీమతి జోగుబాయి ప్రసవానికి ముందు భాగవతాన్ని 18 సార్లు పారాయణ చేసింది. అందువల్లనే తన కుమార్తెకు ‘కృష్ణ’ అని నామకరణం చేసింది.
‘కృష్ణ’ ని చాలా అల్లారు ముద్దుగా పెంచారు.
ఆమె మిగిలిన పిల్లలకన్నా భిన్నంగా ఉండేది.
చిన్న తనంనుంచే ఆమె కృష్ణుని యొక్క చిత్రాన్ని అన్నివేళలలోను తన కూడా ఉంచుకునేది.
చదువుకునే సమయంలోను, ఆటలాడుకునే సమయంలోకూడా తన వెంటే ఉండాల్సిందే.
ఆమె భజనపాటలు పాడుతుంటే వినేవాళ్ళందరూ తన్మయత్వంతో
ఆలకిస్తూ ఉండేవారు. ఆమె ఎనిమిది సంవత్సరాల
వయసులో విజయనగరంలో ఉన్న తన అమ్మమ్మ ఇంటిలో ఉంది.
అక్కడ ఆమెకు షిరిడీ సాయిబాబావారి మొట్టమొదటి దర్శన భాగ్యం కలిగింది. అంత లేతవయసులోనే బాబా ఆమెకు మార్గదర్శకుడయి ఆధ్యాత్మిక
ప్రబోధం చేశారు. ఆమెది చాలా చిన్న వయసవడం వల్ల
ఆమె హావభావాలు ఎవరికీ అర్ధమయేవి కావు.
ఆమె
అమ్మమ్మ ఇష్టప్రకారం పిన్న వయసులోనే ఆమెకు శ్రీకొడుగంటి శేషగిరిరావుగారితో వివాహం జరిగింది. ఆమెకు వివాహమయినా గాని తన సమయమంతా భగవంతుని పూజలోనే
గడిపేది. శ్రీశేషరిగిరావుగారు నాగపూరులో పోస్టల్
డిపార్ట్ మెంటులో పనిచేసేవారు. ఈ సమయంలోనే
ఆమెకు శ్రీమంగళంపల్లి శ్రీరామమూర్తి గారు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు. ఆమె ఆ మంత్రాన్ని ఎన్నిమార్లు పఠించాలో అన్ని మార్లు
పఠించింది.
అనేక
జన్మలనుండి ఆమె శ్రీసాయిబాబాని తన సద్గురువుగా గుర్తించింది. శ్రీసాయిబాబా ఆమెను “బిడ్డా” (మై చైల్డ్) అని సంబోఢిస్తూ
ఉండేవారు. ఆమె కృష్ణభక్తురాలవడం వల్ల తనకు
తాను ‘కృష్ణప్రియ’ గా పిలుచుకునేది.
అనారోగ్యకారణాలవల్ల
ఆమె తరచు తన తల్లిదండ్రులవద్దనే ఉండేది. ఆమె సంసార బాధ్యతలలో నిమగ్నమయిపోయింది. 1948 వ.సంవత్సరంలో మూడవ సంతానం కలిగాక ఆమె ఆరోగ్యం
మరింతగా పాడయింది. శ్రీ శేషగిరిరావుగారు ఆమెను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో
ఉంటున్న ఆమె తల్లిదండ్రుల వద్దనే ఉంచి తను నాగపూర్ వెళ్ళిపోయారు. 1950 వ.సంవత్సరంలో ఆమె ఆరోగ్యం చాలా ప్రమాదకర పరిస్ఠితిలో
పడింది. 1950 జూలై 14వ.తేదీ అర్ధరాత్రి ఆమె
పరిస్థితి మరీ దిగజారిపోయింది. తల్లిదండ్రులు
ఆమె మీద ఆశ వదిలేసుకున్నారు. వారంతా ఆమె గురించి
ఆందోళన పడుతున్న సమయంలో శ్రీషిరిడీ సాయిబాబా, వారి కులదైవమయిన మంత్రాలయ రాఘవేంద్రస్వామి
(శ్రీ రాఘవేంద్రస్వామి మధ్వ బ్రాహ్మణులకి కుల దైవం) ఇద్దరూ దర్శనమిచ్చి ఆమెకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు.
ఆమె యోగ క్షేమాలు చూస్తూ ఎల్లపుడు రక్షణగా ఉంటామని
చెప్పారు. వారు వచ్చారన్న దానికి నిదర్శనంగా
ఎన్నో అద్భుతమయిన సంఘటనలు జరిగాయి. శ్రీకృష్ణప్రియ
నుదుటిమీద ప్రతిరోజు మూడు విభూది రేకలు కనిపిస్తూ ఉండేవి. భక్తులందరికీ పంచడానికి విభూది, ఒక విభూతి పొట్లం,
కొన్ని తులసిదళాలు, మంత్రాలయం బృందావనంలోని మృత్తిక ఇవన్నీ ఆమె పడుకున్న తలగడ క్రింద
కనిపిస్తూ ఉండేవి.
శ్రీసాయిబాబా
చూపించే మహిమలు సర్వసాధారణంగా ఆమెకు చూపిస్తూ ఉండేవారు. బాబా చూపే మహిమలను చూడటానికి ఎంతోమంది కృష్ణప్రియ
వద్దకు వస్తూ ఉండేవారు. ఆమెను ఒక దివ్యమాతగా
అభిమానిస్తూ ఉండేవారు. పూజించడానికి ఉద్దేశ్యించిన
గులాబీ రేకుల మీద, మల్లెపూవు రేకల మీద, అరటిపండ్లమీద సాయిబాబా సుందరమయిన అక్షరాలతో
దివ్యమయిన సందేశాలను అధ్భుతంగా ఇస్తూ ఉండేవారు.
కొంతమంది భక్తుల పూర్వజన్మ సంస్కారాలను బట్టి బాబా వారిని ప్రత్యేకమయిన పేర్లతో
సంబోధిస్తూ ఉండేవారు. వారు తమ పూర్వజన్మ సుకృతాలను
బట్టి కూడా ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభించేవారు.
శ్రీసాయిబాబావారి ఆదేశానుసారం శ్రీకృష్ణప్రియ’సద్గురుమాతాజి’ అయ్యారు. ఎంతోమంది సాధకులకి ఆవిడ సద్గురు మాతాజీ. వారందరి చేత ఆవిడ ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభింపచేశారు. ప్రారంభంలో ఆవిడకు శిష్యులయినవారు ప్రముఖ న్యాయవాది
శ్రీ జోశ్యుల రామచంద్రరావు, ప్రముఖ రాజకీయనాయకుడు, సామాజిక కార్యకర్త శ్రీ బిక్కిని
వెంకటరత్నం (మద్రాసు/ఆంద్ర రాష్ట్రములకు కొంతకాలం మంత్రిగా పనిచేశారు), కో ఆపరేటివ్
రిజిష్ట్రారయిన శ్రీ విశ్వనాధమ్ చెట్టి. ఈ
శిష్యులని జ్ఞాని, శ్యామభక్త, శ్రవణ అని పిలిచేవారు. రామచంద్రపురంలో బాబా మందిరాన్ని నిర్మించమని శ్రీ
శ్యామభక్తని ప్రోత్సహించారు. మాతాజీ కృష్ణప్రియ
తీవ్రమయిన ఆధ్యాత్మిక సాగరంలో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా నిమగ్నమయి ఉన్నపుడు శ్రీసాయిబాబా
మాతాజీ రూపంలో వచ్చి ఇంటిపనులన్నీ చేసేవారు. ఆయనకు టీ పెట్టి ఇవ్వడం, తమలపాకు అందించడం
లాంటి పనులు బాబా మాతాజీ రూపంలో చేసేవారు. ఒకరోజున ఆమె భర్త ఆఫీసునుండి ఇంటికి రాగా కృష్ణప్రియ
తన బిడ్డల పనులతో మునిగి ఉంది. భర్త ఆమె తనకు
టీ ఇచ్చే స్ఠితిలో లేదని నీరసంగా కుర్చీలో కూర్చున్నారు. ఇంతలో కృష్ణప్రియ తన భర్తకు టీ ఇచ్చింది. ఆయనకి ఆ టీ రోజూకన్న రుచి ఎక్కువగా ఉండి మరొక కప్పు
తెమ్మని చెప్పారు. అంతవరకు తన భర్త ఇంటికి
వచ్చినట్లే కృష్ణప్రియకు తెలియదు. ఇప్పుడే టీ పెట్టి ఇస్తానని చెప్పింది. ఇప్పుడే కదా టీ ఇచ్చావు, అంతకు ముందు ఇచ్చిన టీ చాలా రుచిగా ఉండటం వల్ల మరొక కప్పు తెమ్మని చెప్పాను
నీకు అన్నారు. అప్పుడామె మీరు వచ్చినట్లే నాకు
తెలీదు, నేను పిల్లలవద్ద ఉన్నాను, నేను మీకు టీ పెట్టి ఇవ్వలేదు అని సమాధానమిచ్చింది. కృష్ణప్రియ రూపంలో బాబాయే వచ్చి తనకు టీ ఇచ్చారని
అర్ధమయింది. వారంతా ఆనందాశ్చర్యాలలో మునిగిపోయారు. 1951వ.సంవత్సరంలో బాబా ఆదేశానుసారం మాతాజీ కుటుంబ
జీవితాన్ని త్యజించారు. ఆవిడ మూడవ సోదరిని
శ్రీశేషగిరిరావుగారు వివాహమాడారు. ఆమె తన పిల్లల
బాధ్యతలను కూడా తన సోదరికి అప్పగించింది. ఆవిధంగా
కృష్ణప్రియ తన జీవితాన్ని పూర్తిగా భగవంతుని సేవకే అర్పించి, భక్తుల ఆధ్యాత్మికోన్నతికి
తన జీవితాన్ని వెచ్చించింది. 1951వ.సంవత్సరంనుండే
మాతాజీ శ్రీరామనవమి రోజుననే బాబా జన్మదిన ఉత్సవాన్ని జరిపించడం ప్రారంభించింది. అదే విధంగా గురుపూర్ణిమను కూడా జరిపించేది. రామచంద్రపురంలో జరిగే ఈ ఉత్సవాలకి ఎంతోమంది భక్తులు
పాల్గొనేవారు. ఇప్పటికీ అక్కడ ఈ ఉత్సవాలు జరుగుతు
ఉన్నాయి.
బాబా
ఆమెకు 1953 లో ఒక సంవత్సరంపాటు ‘మౌనవ్రతమ్’ తో సహా ఎన్నో ఆధ్యాత్మిక సాధనలను నేర్పారు. తీవ్రమయిన ఆధ్యాత్మిక సాధనలో ఉఛ్ఛస్తితిని చేరుకున్న
తరువాత ఆమెకు శ్రీకృష్ణపరమాత్మ దర్శనమిచ్చారు.
అంతే కాదు. ఇతరులకు కూడా బోధలు చేసి భగవంతుని దగ్గరకు తీసుకునివెళ్లగలిగే సద్గురువుగా
అవతరించింది.
రామచంద్రపురంలో
తన తండ్రి వీలునామా ద్వారా సంక్రమించిన భూభాగంలో మాతాజీ శ్రీబిక్కిని వెంకటరత్నంగారి
సహకారంతో 1953వ.సంవత్సరంలో బాబా మందిరాన్ని నిర్మించింది.
మాతాజీ
తన భక్తులను, శిష్యులను తన స్వంత బిడ్దలుగా భావించి, వారందరికి అతి సరళంగా బోధలు చేస్తూ
ఉండేది. ఆమె సమక్షంలో వారంతా ఎంతో ఆనందాన్ననుభవించేవారు. అప్పట్లో ఆవిడ దీవెనలందుకున్నవారు ఎంతో అదృష్టవంతులు. సాయంత్రంవేళ గుడిలో శ్రీకృష్ణునికి అలంకారం చేసి,
బాబామీద కృష్ణుని మీద సామాన్యమయిన భక్తిపాటలను, పద్యాలను పాడుతూ ఉండేది. కృష్ణుడిని అత్యంత సుందరంగా అలంకారం చేయడం ఆమె ప్రత్యేకత.
భగవంతునికి ఆమె చేసే పూజావిధానం చూసేవాళ్ళకి ఒక
ఉదాహరణగా ఉండేది. మాతాజీ భగవంతుని పూజలో పూర్తిగా
నిమగ్నమయిపోయి ఒక విధమయిన సమాధి స్ఠితిలోకి వెళ్ళినపుడు, బాబా భగవద్గీతలోని శ్లోకాలను,
ఉపనిషత్తుల సారాంశాన్ని నిగూఢ అర్ధాలని ఆవిడ ద్వారా మాట్లాడుతూ ఉండేవారు. ఆసమయంలో ఆమె స్వరం ఎపుడూ మాటలాడేకన్నా పూర్తిగా
భిన్నంగా ఉండేది. అది వినేవారి హృదయంలోకి సూటిగా
చొచ్చుకుని వెళ్ళేది.
మాతాజీ
ఆధ్యాత్మిక సాధనలను అభ్యాసం చేసే సమయంలో బాబా ఆమెకు దివ్యమయిన అనుభూతులను ప్రసాదిస్తూ
ఉండేవారు. శ్రీకృష్ణపరమాత్ముని స్వర్గధామమయిన
గోలోకానికి చెందినదిగా మాతాజీ గుర్తింపబడింది.
శ్రీకృష్ణునితో మరలా అనుబంధం కలిగి ఉన్నట్లుగ ఎన్నో దివ్యమయిన అనుభూతులను అనుభవించింది
ఆమె. ఆమె వాటినన్నిటినీ తన సన్నిహిత శిష్యులకి
వివరించి చెప్పింది. ఆమె ధ్యానం చేసుకునేటప్పుడు
ఒకే భంగిమలో కదలకుండా మూడు గంటలపాటు ఉండేది.
ఆమెకు శ్రీకృష్ణుని దర్శనం కలిగినపుడు స్పృహ తప్పి పడిపోతూ ఉండేది. ఆ సమయంలో అక్కడ ఉన్న శిష్యులు ఆమె స్పృహతప్పి పడిపోతున్న
సమయంలో జాగ్రత్తగా పట్టుకున్నప్పటికి, క్రిందపడిపోయినపుడు ఒక్కొక్కసారి గాయాలు అవుతూ
ఉండేవి. ఆవిధంగా బావావేశం కలిగినపుడు అప్పుడప్పుడు
ఆమె కొన్ని గంటలపాటు నవ్వడం, ఏడవడం చేసేది.
అటువంటి సమయంలో ఆమె మానసిక స్థితి ఏవిధంగా ఉంటుందో ఆమె గురువు బాబా తప్ప మరెవరూ
వివరించలేరు. అటువంటి సందర్భాలలో ఆమె గురించి
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో భక్తులకి బాబా సూచించారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment