16.08.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ లీల సాయిలీల ద్వైమాసపత్రిక జనవరి – ఫిబ్రవరి 2107 వ.సంవత్సరం సంచికనుండి గ్రహింపబడింది.
శ్రీ లారెన్స్ డిసౌజా వివరింపగా శ్రీమతి మయూరి మహేష్ కదమ్ గారు వ్రాసారు. మరాఠీనుండి ఆంగ్లంలోకి అనువాదం చేసినవారు శ్రీ మీనల్ వినాయక్ దాల్వి.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
షిరిడీకి పాదయాత్ర -2 వ.భాగమ్
వారు షిరిడీ చేరుకునేటప్పటికి
సాయిబాబా జీవించి లేరనీ, సమాధి చెందారనే విషయం కూడా తెలీదు వాళ్ళకి. వారందరూ సమాధి మందిరంలోకి ప్రవేశించారు. ప్రవేశించినంతనే ఒక అధ్బుతం జరిగింది. అందరికీ ఆశ్చర్యం కలిగించే సంఘటన.
డిసౌజా సాయిబాబాకు నమస్కరించుకుని ఆయన పాదలను స్పృశించగానే
అతనికి ఉన్న నత్తి నశించిపోయింది. అంతకుముందు
వరకు డిసౌజాకి ఉన్న నత్తి కారణంగా ప్రతిమాటనీ స్పష్టంగా ఉఛ్ఛరించడానికి చాలా కష్టపడాల్సివచ్చేది. (ఆరోజుల్లో షిరిడీకి వచ్చే భక్తులందరూ సాయిబాబా
విగ్రహానికి దగ్గరగా వెళ్ళి ఆయన పాదాలను కూడా స్వయంగా చేతులతో తాకి, ఆయన మెడలో పూలదండను
కూడా వేసే అవకాశం ఉండేది) సాయిబాబా తాను చెప్పిన
పదకొండు వచనాలలో ఒక వచనాన్ని ఆక్షణంలో నిజం చేశారు.
లాకప్ లో బాబా సమక్షంలో చిత్తమంతా చుట్ట మీదనే పెట్టుకున్న డిసౌజా సాయిబాబాకు అంకిత భక్తునిగా మారిపోయాడు.
“షిరిడీ ప్రవేశమే సర్వ
దుఃఖ పరిహారము”
డిసౌజా విషయంలో అది నూటికి
నూరు శాతం యదార్ధమయింది. ఆయన సమాధిని దర్శించిన
వెంటనే ఎటువంటి కష్టం లేకుండా మాటలాడే శక్తి వచ్చింది. అతను సాయిబాబా చెవిలో తన కోరికను వెళ్ళడించాడు. అదేమిటంటే తన పేరులో సాయిబాబా పేరును కలుపుకుంటానని
చెప్పాడు. ఆవిధంగా తన పేరును లారెన్స్ బాబాగా
మార్చుకున్నాడు. అంతేకాదు, ప్రతిసంవత్సరం బొంబాయినుండి
షిరిడీకి కాలినడకన వస్తానని తన స్థిర సంకల్పాన్ని వెల్లడించాడు. ఆ సంవత్సరం బొంబాయినుండి షిరిడీకి వెళ్లవలసిన మార్గాలు,
దారిలో వచ్చే గ్రామాలు మొదలయినవాటినన్నీ బాగా ఆకళింపు చేసుకున్నాడు.
1980 జనవరి 11 వ.తారీకున
15 మంది సాయిభక్తులతో కలిసి మరలా షిరిడీకి పాదయాత్ర చేపట్టాడు. సాయిపల్లకీని మోసుకుంటూ షిరిడీ యాత్ర చేయడం అదే
మొట్టమొదటిసారి. ఇపుడు ఆవిధంగా పాదయాత్రకు
700 నుండి 800 వందలమంది దాకా భక్తులు తయారయ్యారు.
ఈ విధంగా ఆయన అంతమంది చేత పాదయాత్ర చేయించడంలో ఒక మంచి ఉద్దేశ్యం ఉంది. యువతలో ఉన్న చెడు లక్షణాలని, నేరప్రవృత్తిని, వ్యసనాలని
తొలగించి వారందరినీ సన్మార్గంలో పయనింపచేయడమే ముఖ్యోద్దేశం.
అతను తన స్నేహితుల జాబితాలో
మత్తుమందులకు బానిసలయినవారిని కూడా చేర్చుకున్నాడు. సాయిబాబా అనుగ్రహం వల్ల వారంతా చెడువ్యసనాలనుంచి
బయటపడి మంచి మార్గంలోకి వస్తారనే ప్రగాఢమయిన నమ్మకం అతనికి ఉంది. సాయిబాబా అతని నమ్మకాన్ని వమ్ముచేయలేదు. అతని నమ్మకాన్ని బాబా నిజం చేసారు. డిసౌజా 80 శాతం యిందులో విజయాన్ని సాధించాడు.
దానిఫలితంగా ఆయనకు ప్రేరణకలిగి,
చెడువ్యసనాలకి అలవాటుపడ్డవారిని తీసుకునివచ్చి మంచి మార్గంలో పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. అప్పటి ముంబాయి పోలీస్ కమీషనర్ అయిన శ్రీకాంత్ బాపట్
గారి సహాయంతో నేరస్థులందరినీ ఒకచోటకు చేర్చి వారిచేత చిన్న తరహా పరిశ్రమలను ప్రారంభింపచేశారు. వారందరినీ కూడా తన షిరిడీపాదయాత్రలో పాల్గొనేలా
ప్రోత్సహించారు. ఇపుడు డిసౌజా పూర్తిగా సాయిబాబా
సేవలోనే నిమగ్నమయ్యారు. అంతేకాదు, ఆయన దృష్టంతా
పాదయాత్ర చేసే భక్తుల మీదనే కేంద్రీకరించారు.
పాదయాత్రలో పాల్గొనబోయే భక్తుల సంఖ్యను పెంచడానికి బదులు, వారందరినీ సరియైన
దారిలో పెట్టి, యాత్ర చేసే సమయాలలోను, ఆ తరువాత కూడా వారికి సరైన మార్గదర్శకత్వం లభించేదానిమీదనే
దృష్టిపెట్టారు. అతను లారెన్స్ బాబా ట్రస్టుని
ఏర్పాటుచేయడమే కాక, యితరప్రాంతాలనుండి వచ్చి చేరిన యువతకి కూడా మార్గదర్శకత్వం వహించసాగారు. మనకున్నటువంటి సమస్యలను ఏవిధంగా అధిగమించాలో, సాయిబాబా
చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన మీద ఏవిధంగా నమ్మకాన్ని వృధ్ధిపరచుకోవాలో మొదలయిన
విషయాలన్నిటినీ వివరించి చెప్పేవాడు. సాయిబాబా
మానవజాతినంతా ఏవిధంగా ప్రేమించేవారో ఏవిధంగా వారికి సేవ చేసేవారో యిటువంటి విషయాలను
కూడా తెలియచెప్పి మనమందరం కూడా ఆవిధంగానే ప్రవర్తించాలని చెప్పేవాడు. తను యింకా యిటువంటి పాదయాత్రలను ఎన్నింటినో నిర్వహిస్తానని
నమ్మకంగా వారందరికీ చెప్పాడు.
ఈవిధంగా డిసౌజా పూర్తిగా
సాయిబాబా సేవకు అంకితమయ్యాడు. బాబా దయవల్ల
అతనికి ఎన్నో అనుభవాలు కలిగాయి. 22 సంవత్సరాలనుండి
అతను శ్రావణమాసంలో (సాధారణంగా జూలై – ఆగస్టు) షిరిడీయాత్ర చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఉన్న సాయి భక్తులందరితోను కలిసి శ్రీసాయి
సత్ చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాడు. 22 సంవత్సరాల
క్రితం వారింటిలోని వారెవరూ మరాఠీభాష సరిగా మాట్లాడలేకపోయేవారు. అటువంటిది ఆధ్యాత్మిక గ్రంధం పఠించడమంటే అది ఒక
పెద్ద సవాలులాంటిదే. ఒకసారి ముంబాయిలో KEM
వారు శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ నిర్వహించారు.
ఆ సందర్భంగా అక్కడికి, సాయిబాబా భక్తుడయిన శ్రీకాశీరామ్ షింపీ మునిమనుమడయిన శ్రీశాంతారామ్
మిరానీ వచ్చారు. ఆయన డిసౌజాకు మరాఠీ భాషలో
ఉన్న శ్రీసాయి సత్ చరిత్రను ఎలా చదవాలో నేర్పారు.
ఆతరువాతనుంచి అతను శ్రీసాయి సత్ చరిత్రను సులభంగా చదవడం అర్ధం చేసుకోవడం జరిగింది. ఇపుడు అతను మరాఠీ భాష చాలా చక్కగా అనర్గళంగా మాట్లాడగలడు. అతనికి శ్రీసాయి స్ఠవన మంజరి కంఠతా వచ్చు. ఇదంతా సాయిబాబా అనుగ్రహం వల్లనే సాధ్యమయిందని అతని
ప్రగాడ విశ్వాసం.
ఈరోజున అతనికి లభించినదంతా
సాయి అనుగ్రహం వల్లనేనని అతని నమ్మకం. ఆయన
అనుగ్రహం ఆశీర్వాదాలు ఉండబట్టే తాను ప్రతిసంవత్సరం ఎటువంటి కష్టాలు లేకుండా పాదయాత్రలు
చేస్తూ అందరికీ సేవచేసే భాగ్యం కలిగిందని చెప్పాడు.
ప్రస్తుతం ఈపల్లకీ యాత్రలో
స్త్రీలు కూడా పాలుపంచుకొంటున్నారు. ఈయాత్రలో
స్త్రీలు కూడా ఉన్నందువల్లనే యాత్ర మంచి క్రమశిక్షణతోను, మాట్లాడేటపుడు గాని, నడక సాగించేటపుడు
గాని ఎటువంటి అసభ్యతకు తావులేకుండా జరుగుతూ ఉందని అతని అభిప్రాయం. అందుచేతనే ఈయాత్రలో మరింతగా మహిళలు పాల్గొనేలా అందరినీ
ప్రోత్సహించాడు.
లారెన్స్ డిసౌజాతో సహా
అతని కుటుంబ సభ్యులందరూ ఇపుడు సాయిబాబాకు ప్రగాడమయిన భక్తులుగా మారిపోయారు. వారి యాత్రలో పూర్తిగా ఏసాయి భక్తుడినీ ఒక్క పైసా
కూడా అడగకపోవడం గమనించదగ్గ విషయం.
ఈ యాత్రలో ఎంతోమంది సభ్యులు
తమ వంతుగా ఎనలేని సహాయసహకారాలను అందిస్తూ ఉన్నారు.
(సమాప్తమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment