Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, January 7, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 26 వ.భాగమ్

Posted by tyagaraju on 7:49 AM

 




07.01.2020  గురువారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 26 .భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీకోపర్ గావ్ – షిరిడీ

శనివారమ్ – అక్టోబరు, 19, 1985

నేను నా మార్గదర్శి (గైడ్) దుబాసీ స్వామిశేఖర రావు ఇద్దరం సాకూరీ, షిరిడీ రహదారిమీద సగం దూరం నడుచుకుంటూ వెళ్ళాము.  పైన నిర్మలంగా ఉన్న ఆకాశం.  రహదారికి ఇరుప్రక్కలా పూర్వకాలంనాటి బ్రహ్మాండమయిన వృక్షాలు.  రహదారికి కుడి ఎడమలవైపు విశాలమయిన పచ్చని పంట పొలాలు.  ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది.  ఆ రహదారిమీద మా నడక ఎంతో ఆనందంగా సాగింది. 


రైతులు పొలాలలో తమతమ ఎడ్లతో పనులు చేసుకుంటూ ఉన్నారు.  ఎంతో అధ్బుతమయిన దృశ్యం.  అలా నడుచుకుంటూ వెడుతున్న సమయంలో రహదారి మీద ఒక ట్రక్కు కనపడింది.  అందులో ఎక్కి సాహస యాత్రగా మేమిద్దరం తిరిగి కొద్ది నిమిషాలలోనే షిరిడీకి చేరుకొన్నాము.

స్వామి శేఖరరావు, సంస్థానంలోని ఇద్దరు కార్యదర్శులతోను మూడవసారి సంభాషించాను. రేపు ఇంటర్వ్యూ కోసం వారు నాకు సమయం కేటాయిస్తారని అనుకుంటున్నాను.  రేపు ఉదయాన్నే గం.5.30 కు లేచి ఖచ్చితంగా 6 గంటలయ్యేసరికల్లా గురుస్థానం దగ్గరకు వెళ్ళాలి.  సాయిబాబా చిత్రపటంతో ఊరేగింపు మొదలయి పుణ్యతిధి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.  రేపు రెండు టెలిగ్రాములు పంపించాలి.  ఒకటి ఇంటికి, మరొకటి ఖామ్ గావ్ లో ఉన్న హెచ్.జి. అగర్వాల్ గారికి.  అవి రెండు మూడు రోజులలో అందుతాయి.  స్నానంచేసి వెంటనే హోటల్ రెస్టారెంటులొ ఫలహారం చేయాలి.  ఈ రోజు చాలా చారిత్రాత్మకమయిన రోజు.  ఎంతోమందిని చూశాను. చాలా విషయాలను నేర్చుకొన్నాను.  ఇంతవరకు జరిగిన నాపరిశోధనకి నిజంగానే కృతజ్ఞుడను.  అంతా చాలా ఆశాజనకంగానే ఉంది.

షిరిడిలో చావడిలో ఉదయం గం. 8-15

59 సంవత్సరాల వయసుగల శివనేశన్ స్వామితోను, అప్పుడప్పుడు దుబాసీగా నాకు పనిచేస్తున్న నగేష చూర్య, బొంబాయి, వీరిద్దరితో సుదీర్ఘంగా జరిపిన సంభాషణ.

ప్రశ్న   ---   మీరు షిరిడికి మొట్టమొదటిసారి వచ్చినప్పటికి, ఇప్పటికీ జీవితం ఇక్కడ ఎలా ఉంది?  ఈరోజుకి అప్పటికి చాలా తేడా ఉందా?  జనాభా  తక్కువగా ఉందా  లేక ఎక్కువగా ఉందా?

జవాబు   ---   అప్పట్లో ఇప్పుడున్నంతగా ప్రజలు గుంపులు గుంపులుగా లేరు.  ఇపుడు బాబా అంటే అందరికీ బాగా తెలిసింది.  ప్రతిచోటా ఆయన గురించి తెలిసింది.  అందువల్ల రోజురోజుకి భక్తులు ఎక్కువయ్యారు.  ఆయన అందరినీ తనవద్దకు రప్పించుకుంటున్నారు.

ప్రశ్న   ---   ఇక్కడ చావడిలో మీదినచర్య ఏమిటి?

జవాబు   ---   నేను ఉదయం 5 గంటలకు చావడిని తెరుస్తాను.  చావడిని శుభ్రం చేసి పూజ చేసి బాబా చిత్రపటాల ఎదురుగా ప్రార్ధించుకుని ఇక్కడే కూర్చుంటాను.  స్త్రీలు చావడి కుడివైపు లోపలికి వెళ్ళకుండా చూడటానికే నేను రోజంతా ఇక్కడె కాపలాగా ఉంటాను.

తుకారామ్   ---   ఈవిధంగా ఉదయం జరుగుతుంది.  బాబా నాలుగుమందిరాలలో చావడి ఒకటి.  ద్వారకామాయి అని ఒకటి ఉంది.  బాబా తన జీవితకాలమంతా అంటే సుమారు 52 సంత్సరాలపాటు అందులోనే నివసించారు.  అది మసీదు.  బాబా దేహాన్ని విడిచిన తరువాత ఆయన శరీరాన్ని బూటీవాడలో మహాసమాధి చేసారు.  అదే సమాధిమందిరం.  బాబా కోరిక మేరకే ఆయన శరీరాన్ని అక్కడ సమాధి చేసారు.  బాబా కాలం చేసిన తరువాత ఆ భవనమే మందిరమయింది.  సమాధిమందిరం వెనుక గురుస్థానం ఉంది.  బాబా ఇక్కడే షిరిడిలో వేపచెట్టుక్రింద మొట్టమొదటిసారి పదిహేనుఏండ్ల బాలునిగా ఆ వేపచెట్టుకింద తపస్సు చేసుకుంటూ ప్రకటమయ్యారు.  ఆతరువాత ఆయన సాయిబాబాగా ప్రసిధ్ధి చెందారు.

ఈ చావడి నాలుగవ మందిరం.  బాబా రాత్రి విఢిచి రాత్రి ఇక్కడికి వచ్చి నిద్రిస్తూ ఉండేవారు. బాబా ఒకరోజు రాత్రి ద్వారకామాయిలో నిద్రిస్తే మరుసటిరోజు రాత్రి చావడిలో నిద్రించేవారు.  ఈవిధంగా ఆయన సమాధి చెందేవరకు జరిగింది.  మొట్టమొదట్లో అనగా 1912 వ. సంవత్సరంలో బాబాను  చావడిలోనే పూజించేవారు.  భక్తులందరూ ఆయనను వైభవంగా ఊరేగిస్తూ ఇక్కడికి తీసుకువస్తుండేవారు. 


ఆయనను పూజించి అరతినిచ్చేవారు.  ఆతరువాత ఆయన పీల్చడానికి చిలుమును ఇచ్చేవారు.  చిలుము మట్టితో చేసినది.  బాబా అందులో పొగాకును నింపి పొగ పీల్చేవారు.  ఆయన ఒకసారి పీల్చిన తరువాత మిగిలిన భక్తులందరికీ పీల్చడానికి ఇచ్చేవారు.  ఆఖరికి భక్తులందరూ బాబాను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయేవారు.  అపుడు  పడుకోవడానికి బాబా తన ప్రక్కను సిధ్ధం చేసుకునేవారు.  ఆయన తన ప్రక్కను కూడా ఒక ప్రత్యేకమయిన పద్ధతిలో చేసుకునేవారు.  ఒకదాని మీద ఒకటి 50 దుప్పట్లను పరిచి ప్రక్క వేసుకునేవారు.  ఇదంతా ఆయన తనే స్వయంగా చేసుకుని నిద్రించేవారు.  మరుసటిరోజు ఉదయం అన్ని కార్యక్రమాలు ఎప్పటిలాగానే యధావిధిగా జరిగేవి.  భక్తులందరూ ఉదయాన్నే 5 గంటలకు ముందుగానే ఇక్కడికి చేరుకునేవారు.  చావడిలో కాకడ ఆరతినిచ్చేవారు.  ఆతరువాత అందరు బాబాను తిరిగి ద్వారకామాయికి తీసుకువెళ్ళేవారు.  అక్కడ బాబా దర్బారు మొదలయేది.  హిందీలో దర్బారు అంటే రాజ దర్బారు, సభ.  భక్తులందరూ బాబా ఆశీర్వాదం కోసం, ఆయన అనుగ్రహం కోసం ఆయనను దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చేవారు.  ఆవిధంగా బాబా చావడిలో ఉన్నపుడు ఒంటరిగాను, ద్వారకామాయిలో ఉన్నపుడు ప్రజలందరినీ కలుసుకుంటూ ఉండేవారు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List