Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, November 12, 2021

శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి

Posted by tyagaraju on 3:52 AM

 12.11.2021  శుక్రవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మనం ఒక గొప్ప అవధూత గురించి తెలుసుకుందాము.  ఆయన పేరు శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి.  శ్రీ సాయి లీల మాసపత్రిక 1971 వ.సం. సెప్టెంబరు నెలలో ప్రచురితమయింది.  ఆయన గురించి చదివిన తరువాత దీనిని ప్రచురిద్దామా వద్దా అని ఆలోచించాను గాని అనువాదం ప్రారంభించలేదు. బ్లాగులో ప్రచురించడానికి ఏదయిన చెప్పమని ధ్యానంలో     అడిగినప్పుడు అవధూత గురించి వ్రాయమన్నట్లుగా సూచించారు.  మనలో కొంతమంది పూర్వకాలంలో ఆల్ ఇండియా రేడియోలో భక్తిరంజని కార్యక్రమంలో సదాశివ బ్రహ్మెంద్ర గారి కీర్తనలు వినే ఉంటారు.  ఈ రోజు ఆయన గురించి కొంతవరకు తెలుసుకుందాము.

ఆంగ్ల మూలమ్ : శ్రీ జి. ఎన్. పురందరె, అడ్వొకేట్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి

శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి గారుపరిపూర్ణుడయిన అవధూత, బుద్దిశాలి, కవి, భక్తుడు మరియు వేదాంతి.  భారత దేశ చరిత్రలో బహుశ ఇటువంటి మహాపురుషుడు మరొకరు ఉండి ఉండకపోవచ్చు.  ఆయన తంజావూరు దగ్గరనున్న షజిరాజపురానికి చెందినవారు.  


ఆయన శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.  ఆకాలంలో (1684-1711) తంజావూరుకు చెందిన షహాజీ రాజు పరిపాలిస్తుండేవారు.  సమర్ధ రామదాసు స్వామిలాగానే సదాశివ బ్రహ్మేంద్రగారు కూడా తనకి వివాహము జరగబోయే రోజునే సంసార జీవితాన్ని కాదనుకుని ఇంటినుండి వెళ్ళిపోయారు.  సన్యాసిగా మారి గురువును అన్వేషించుకుంటూ అడవులలో తిరగసాగారు.  ముందుగానే నిర్ణయింపబడినట్లుగా ఆయన ఒక గొప్ప యోగి అయిన పరమ శివేంద్రస్వామి వారిని కలుసుకునే భాగ్యం కలిగింది.  ఆ గురువు ఆయనకి సన్యాసదీక్షనిచ్చారు.  ఆయన గురువు గొప్ప సాహితీ పండితుడు.  సంస్కృతభాషలో ఆయన ‘శివగీతా భాష్యమ్’ 'దహర్ విద్యాప్రకాశిక’ అనే గ్రంధాలను రచించారు.  మహాపండితులయిన తన గురువు సాహచర్యంతోను, ఆయన మార్గదర్శకత్వంలోను సదాశివబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా బ్రహ్మసూత్రాలమీద “బ్రహ్మ తత్త్వప్రకాశిక” పతంజలి దర్శనంపై ‘యోగ సుధాకర్’ ‘సిధ్ధాంత కల్పవల్లి’ ‘దక్షిణామూర్తి స్తోత్త్ర ‘ఆత్మవిద్యావిలాస్’ అనే పుస్తకాలను రచించారు.

ఆయన మౌనంగా ఉండేవారు.  ఆయన ఒక అవధూత (దిగంబర సన్యాసి). విశేషమయిన శాస్త్రపరిజ్ఞానం కలిగిన వేదాంతి, నిర్గుణోపాసకులు.  ఆయన ఒక యోగిలాగ క్రమబధ్ధమయిన జివనాన్ని కొనసాగించారు.  కొద్దిపాటి ప్రయత్నంతోనే ఆయన సమాధిస్థితిలోకి వెడుతూండేవారు.  ఆయనకు బయటి ప్రపంచంతో వ్రాతల ద్వారాను, సంజ్ఞల ద్వారా మాత్రమే సంబంధం ఉండేది తప్ప మాటలు మాట్లాడేవారు కాదు.

ఆయన ఎన్నో అధ్బుతాలు చేసారు.  చనిపోయినవానిని తిరిగి బ్రతికించారు.  రామానంద్ లో విపరీతంగా కుష్టువ్యాధి సోకిన ఒక బ్రాహ్మణుడికి విభూతినిచ్చి నయం చేసారు.  ఒకే సమయంలో రెండు ప్రదేశాలలో కనిపించేవారు.  తన శిష్యుని నాలుక మీద దర్భతో బీజాక్షరమంత్రాలను వ్రాయగానే ఆశిష్యుడు వెంటనే పండితుడయ్యాడు.  ఆయన ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ విగ్రహం ముందు ధ్యానంలో కూర్చునేవారు.  ఆ సమయంలో పైనుండి ఆయన మీద పుష్పాలు పడుతూ ఉండేవి.  ఆయనలో మంచి కళానైపుణ్యం ఉంది.  ‘కధాకళి’ కి ఆయన ఎన్నో కధలను రచించి స్వరాలను సమకూర్చారు.  ఆయనకి సంగీతంలో విశేషమయిన అభిరుచి, పాండిత్యం ఉన్నాయి.  ఆయన ప్రతిభ ఎటువంటిదో ‘బాలరామ్ భారత్’ ద్వారా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.  ఆయన ‘లక్ష్మీ కళ్యాణం’ అనే నాటకాన్ని రచించారు.  తంజావూరు పరిపాలకుడయిన షహాజీ రాజు, మరియు ట్రావాన్ కోర్, పుదుకొట్టయ్ లో ఉండ్ ఆయన తమ్ముడు సర్పోజీ ఇద్దరూ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి గారిమీద ఎంతో గౌరవం పూజ్యభావం కనబరిచేవారు.  ఒకసారి ఆయన టిప్పుసుల్తాన్ గారి అంతఃపురంలోకి దిగంబరంగా వెళ్ళారు.  


అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు.  సుల్తాన్ గారి పరిచారికుడొకడు సదాశివ బ్రహ్మేంద్రగారి చేతిని నరికేశాడు.  

ఆ గొప్ప యోగి తనకు అంతటి గాయమయినా ఏమీ జరగనట్లే ఓర్పు వహించారు.  సుల్తాన్ చాలా విస్మయం చెంది. యోగి వెనకాలే వెళ్లి క్షమించమని ప్రార్ధించాడు. 

సదాశివ బ్రహ్మేంద్ర గారు తనకు గాయమయిన చేతిని రెండవ చేతితో తాకగానే ఖండింపబడిన చేయి మునుపటివలే యధాస్థితికి వచ్చింది.  ఆయన జీవితంలాగానే ఆయన నిర్యాణం కూడా సమానంగానే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన తను ఎపుడు ఎక్కడ ఏసమయంలో నిర్వాణం చెందుతారన్న విషయాన్ని తన సహచరులకు ముందే చెప్పారు.  ఆయన ఒక బిల్వవృక్షం క్రింద సజీవ సమాధి అయ్యారు.  ఆయన తన అనుచరులతో వారణాశి నుండి ఒక బ్రాహ్మణుడు శివలింగం తీసుకుని వస్తాడనీ అవసరమయిన శాస్త్రసంబంధమయిన సంస్కారాలతో ఆ శివలింగాన్ని తన సమాధి మీద ప్రతిష్టించమని చెప్పారు.  గొప్ప అవధూతయిన సదాశివబ్రహ్మేంద్ర స్వామి గారు ఒక గోయిని త్రవ్వించి అందులోకి దిగి పద్మాసనంలో కూర్చున్నారు.  కొంతసేపటికి ఆగోతిలో నుండి పెద్ద శబ్దం వెలువడి అందులోనుండి ఒక కాంతిరేఖ బయటకు వచ్చి ఆకాశంలో లీనమయింది.  ఆయన చెప్పినట్లుగానే వారణాశినుండి ఒక బ్రాహ్మణుడు శివలింగాన్నితీసుకుని వచ్చాడు.  అతను ఆలింగాన్ని సమాధిమీద ప్రతిష్టించాడు.  ఈ ప్రదేశం దక్షిణ భారతదేశంలోని నెరూరులో ఉంది.                        (నెరూర్ శ్రీ సదశివ బ్రహ్మేంద్రస్వామి సమాధి)

ప్రతిష్ట జరిగిన వెంటనే అక్కడినుండి ఆబ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు.  ఆవచ్చినది సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడేనని, ఆయనే వచ్చి ఆప్రదేశాన్నిపవిత్రం చేసారని ప్రజల నమ్మకం.  తొమ్మిది, పదవ శతాబ్దంలో గొప్ప మహాత్ముడయిన శ్రీ గోరక్ నాధ్ గారికి ప్రతిరూపమా అనేట్టుగా సదాశివ బ్రహ్మేంద్రులవారిలో అన్ని కళలూ ఉన్నాయి.  ఆయన మహోన్నతమయిన వ్యక్తి.  ఆయన ఒక గొప్ప యోగి, అవధూత, గొప్ప పండితుడు, భక్తుడు, కళాకారుడు.  దక్షిణభారత దేశంలో సదాశివ బ్రహ్మేంద్రగారికి సంబంధించిన గాధలన్నీ అందరికీ తెలుసు.  కాని కావేరి నది దాటి ఆయన గురించి ఎవరికీ తెలియదు.  ఒక గొప్ప యోగి గురించి సంగ్రహంగా పాఠకులకు తెలియచేయాలన్నదే ఈ చిన్ని ప్రయత్నం.

సదాశివ బ్రహ్మేంద్రగారు ఎన్నో కీర్తనలను రచించారు.  ‘పిబరే రామరసం, సర్వం బ్రహ్మమయం, భజరే గోపాలం, మానస సంచరరే, ఖేలతి మమ హృదయే లాంటి ఎన్నో కీర్తనలను వ్రాసారు.  


                       (శ్రీ జేసుదాసు గారు పాడిన మానస సంచరరె)

ఆత్మ తత్త్వాన్ని, బ్రహ్మజ్ఞాని యొక్క వైభవాన్ని ‘ఆత్మ విద్యా విలాసము, అనే గ్రంధం ద్వారా తెలియచేసారు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్రస్వామి చరిత్ర పఠనం మంగళదాయకం. ఆత్మ విద్యావిలాసము పఠనం జ్ఞానదాయకం మరియు మోక్షదాయకం.  

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment