Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, November 23, 2021

బాబా శ్రీ త్రైలింగస్వామి

Posted by tyagaraju on 7:43 AM

 


23.11.2021  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు మరొక గొప్ప అవధూత గురించి తెలుసుకుందాము.  శ్రీ సాయిలీల మాసపత్రిక ఫిబ్రవరి 1972 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.

బాబా శ్రీ త్రైలింగస్వామి

ఆంగ్ల మూలమ్ : శ్రీ జి.ఎన్. పురందరే

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

మన దేశంలో అతి కొద్ది మందికే తెలిసిన తంజావూరులో ప్రముఖ అవధూతయిన సదాశివ బ్రహ్మేంద్ర గారి గురించి కొంతకాలం క్రితం తెలియచేశాను.  ఈ రోజున వారణాశికి చెందిన మరొక గొప్ప అవధూత శ్రీ త్రైలింగస్వామి గారి గురించి మీకు పరిచయం చేస్తాను.  ఆయన రెండువందల సంవత్సరాలకు పైగా జీవించారు.  17 - 18 శతాబ్దాలలో ఆయన వారణాశిలో సుప్రసిధ్ధుడు.  

ఆయన తనకున్న అతీంద్రియ శక్తుల ద్వారాను. సిద్ధులద్వారాను ఎన్నో అధ్భుతాలను చేసారు.  ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ లో ఆయన చేసిన అధ్బుతాలు బాగా ప్రసిధ్ధి చెందాయి. 

ఆయన అవధూతయినప్పటికీ సదాశివ బ్రహ్మేంద్రగారికి ఉన్నట్లుగా సంస్కృతంలోను, శాస్త్రాలలోను ఎటువంటి పాండిత్యం లేదు.  కాని మహాయోగులయిన శ్రీ రామకృష్ణపరమహంస, శ్రీ లాహిరి మహాశయ, పండిట్ గోపీనాధ్ కవిరాజ్ లాంటివారికి ఆయనతో పరిచయం ఉంది.  వాసుదేవానందస్వామి (టెంబేస్వామి) వారణాశిలో ఉన్న రోజులలో ఆయనను కలుసుకున్నట్లు చెబుతారు.

త్రైలింగస్వామి ఆంద్రప్రదేశ్ లోని చిన్న గ్రామంలో 1607 వ.సంవత్సరంలో జన్మించారు.  ఆయన గొప్ప భూస్వాముల కుటుంబంలో జన్మించారు. 

బాల్యంలో త్రైలింగస్వామిగారు తన మాతృమూర్తితోనే ఎక్కువగా అంటిపెట్టుకుని ఉండేవారు.  కాని ఆయన బాల్యంలోనే తల్లి మరణం ఆయన జీవితాన్ని మొత్తం మార్చేసింది.  ఆవిడ అంత్యక్రియలు ఊరిబయట స్మశానంలో పూర్తయిన తరువాత ఆ పిల్లవాడు అక్కడినుండి ఇంటికి రాలేదు.  పదిసంవత్సరాలపాటు స్మశానంలోనే ఉండిపోయారు.  ఆయన అన్నగారు స్మశానంలోనే తన తమ్ముడు ఉండేందుకు చిన్న గుడిసెను నిర్మించారు.  వంటినిండా బూడిద పూసుకుని చిరిగిన బట్టలతోనే ఉండేవాడు. పది సంవత్సరాల తరువాత దేశయాత్రకు బయలుదేరాడు.  కైలాసపర్వతం, హిమాలయాలలోని మానస సరోవరాలను దర్శించారు.  ఆయన టిబెట్ కూడా వెళ్లారు.  నర్మదానదికి చేరుకుని అక్కడ మహాత్ముడయిన భగీరధస్వామి అనుగ్రహాన్ని పొందారు.  ఆతరువాత కాశీలో స్థిరపడ్డారు.  అక్కడ బిందుమాధవ ఆలయ సమీపంలో ఆయన మఠం ఉంది.  ఆమఠం మధ్యభాగంలో ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్న పెద్ద శివలింగాన్ని మనం చూడవచ్చు.  అంతపెద్ద శివలింగాన్ని శ్రీ త్రైలింగస్వామిగారే స్వయంగా గంగానది ఒడ్డునుండి తన భుజంమీద మోసుకుంటూ తీసుకువచ్చారు.  ఈ ఆలయమే త్రైలింగదేశంగా ప్రసిద్ధి చెందింది.

త్రైలింగస్వామిగారు కాలకూటవిషాన్ని కూడా మింగేసేవారు.  ఆయినా ఆయన శరీరానికి ఎటువంటి హాని జరిగేది కాదు.  ఆయన గంగానదిలో ఒక తెప్పలాగా తేలియాడుతూ వెళ్ళడం వేలాదిమంది కాశీ ప్రజలు ప్రత్యక్షంగా చూసారు.  ఎన్నోరోజులపాటు ఆయన నీటి అడుగున కూడా ఉండగలిగేవారు.

ఘాట్ ల ప్రక్కన ఉన్న ఇసుకలో మండుటెండలో కాళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా నడిచేవారు.  ఆయనది భారీ శరీరం.  ఆయన బరువు 300 పౌండ్లకు పైగా ఉండేది.  కాని విచిత్రమేమిటంటె అంతటి భారీ కాయులయినా ఆయన చాలా మితంగా భుజించేవారు.  ఆయన పూర్తి దిగంబరంగా సంచరిస్తూ మౌనంగానే ఉండేవారు.  ఆయన ఆవిధంగా దిగంబరంగా తిరుగుతూ ఉండటం వల్ల బెనారస్ పోలీసులు ఆయనను పట్టుకుని జైలులో పెట్టి తాళం వేశారు.  అంతటి భారీకాయుడు దిగంబర అవధూత ఆవెంటనే జైలుగదికి పైన ఉన్న డాబామీద కనిపించారు.  జైలుగది తాళం వేసి ఉన్నా ఆయన బయటకు ఎలా వచ్చారన్నది అంతా అనూహ్యం.

ఆయన భారతదేశమంతా యాత్రలు చేసుకుంటూ ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించారు  నేపాల్ లోని పశుపతినాధ్ ఆలయ ప్రాంగణంలో నివసించారు.  అక్కడ సమాధిలోకి వెడుతూ ఉండేవారు.  హిమాలయాలపైన ఉన్న మానససరోవరాన్ని కూడా దర్శించారు  అక్కడినుండి నర్మదానది ఒడ్డుకు తిరిగి వచ్చి కొంతకాలమున్న తరువాత ప్రయాగకు చేరుకొన్నారు.  తిరిగి వింధ్య పర్వతాల వద్దకు వచ్చి చివరికి వారణాశిలో స్థిరపడ్డారు.  ఆయన సంచరిస్తున్న కాలంలో ఎన్నో అధ్బుతాలను చేసారు.  నయంకాని జబ్బులను నయం చేసారు. మరణించినవారిని బ్రతికించారు.  చిరంజీవులయిన శ్రీ దత్తాత్రేయులవారిని, పరశురాములవారిని, వ్యాసుడు, అశ్వధ్ధామలను కలుసుకుంటూ ఉండేవారు.

వారణాశిలో ఆయనకు రామకృష్ణపరమహంస, దయానందసరస్వతిలతో పరిచయం కలిగింది.  ఒకసారి రామకృష్ణపరమహంస, త్రైలింగస్వామిని కలుసుకోవడానికి బయలుదేరగా దారిలో మణికర్ణికాఘాట్ మీదుగా వెళ్ళడం జరిగింది.  మణికర్ణికా ఘాట్ లో శవదహనాలు జరుగుతుంటాయి.  అక్కడ దహనమయినవారికి కాశీవిశ్వనాధుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.  అక్కడ ఆఘాట్ కి చేరుకోగానే రామకృష్ణపరమహంస సమాధి స్థితిలోకి వెళ్లారు.

ఆసమాధిలో ఆయనకు ఆదిదంపతులయిన శివపార్వతులు ఎదురుగా నిలబడి దర్శనమిచ్చారు.  పార్వతీదేవి ఒక గిన్నెనిండా మధువును శివునియొక్క శంఖంలో పోస్తూ ఉంది.  శివుడు ఆమధువును చితిలో కాలుతున్న శవాల యొక్క చెవులలో పోస్తూ వారికి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు.  ఈ విషయాన్ని రామకృష్ణ పరమహంస గారి ఆత్మకధను రచించిన ఆయన శిష్యుడు శ్రీశారదానందస్వామి గారు వ్రాయడం జరిగింది.

రామకృష్ణపరమహంస, మరియు త్రైలింగస్వామి గార్ల మధ్య జరిగిన చిన్న సంభాషణ.

రామకృష్ణ ---   దేవుడు ఒకరా ఇద్దరా?

త్రైలింగస్వామి దానికి సమాధానంగా తన చూపుడు వేలును చూపించారు.

రామకృష్ణ  ---   మతమనగా ఏమిటి?

త్రైలింగస్వామి  ---   యదార్ధము తప్ప మరేమీ కాదు.

రామకృష్ణ ---   మానవుని యొక్క ధర్మం ఏమిటి?

త్రైలింగస్వామి  ---  తన ఆత్మలోనే ఉన్న భగవంతుని లేక ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినటువంటి ఆ పరమాత్ముని దర్శి చి ఆయన సేవ చేసుకోవడం.

రామకృష్ణ   ---   ప్రేమ అనగా ఏమి?

త్రైలింగస్వామి   ---   నవవిధ భక్తులతో తను ఆరాధించే భగవంతుడిని త్రికరణశుధ్ధిగా తన్మయత్వంతో కనులవెంబడి నీరు కారేంతవరకు పూజించడమే.

అటువంటి గొప్ప అవధూత తాను ఎప్పుడు కాలగర్భంలో కలిసిపోయేది ముందుగానే చెప్పారు.  ఆసమయం వచ్చినపుడు ముందుగానే పండితులను పిలిచి వారిని సమావేశపరిచారు.  వారితో చర్చించి ఒక చెక్క పెట్టెను తీసుకురమ్మని పురమాయించారు.  ఆయన తన శిష్యులకి తాను ఏవిధంగా జలసమాధి అవబోయేది వివరించారు.  ఆయన ఆ చెక్కపెట్టెలో పద్మాసనంలో కూర్చుని మూత వేయించేశారు.  ఆపెట్టెపైన అవధూతగారు చెప్పినట్లుగా పెద్ద బండరాయిని పెట్టారు.  అపుడాపెట్టెను గంగానదిలోకి వదిలారు.  కాని ఆపెట్టే నీటిలో మునిగిపోకుండా తేలుతూ ఉంది.  కొంతసేపటి తరువాత ఆపెట్టెలో నుండి ఒక దివ్యజ్యోతి వెలువడి పైన ఆకశంలోకి పయనించింది.  గంగానది ఒడ్డుకు చేరుకున్న వేలాదిమంది ప్రజలు ఆకాశంలో అతిపెద్దదయిన దివ్యమయిన కాంతిరేఖను ప్రత్యక్షంగా చూసారు.  ఈ సంఘటన 1881 వ.సం.లో జరిగింది.

శ్రీ త్రైలింగస్వామిగారి గురించిన కధలన్నీ ఉత్తరప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలుసు.  బెనారస్ జిల్లా గెజెట్ పాత సంచికలలో కూడా వీటిగురుంచి ప్రస్తావించబడింది.  యూరోపియన్ ప్రజలకి ఆయన లీలల అనుభవాలు ఎన్నో ఉన్నాయి.

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

1 comments:

sam on December 1, 2021 at 2:29 AM said...

Very interesting , good job and thanks for sharing such a good blog.

Online Breaking News Telugu
Suryaa News
Telangana Districts News
Andhra Pradesh Districts News

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List