Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, January 3, 2023

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –9 వ.భాగమ్

Posted by tyagaraju on 6:49 AM

 



03.01.2023 మంగళవారమ్

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఓమ్ శ్రీ గణేశాయనమః

శ్రీ మాత్రేనమః


             ఓమ్ శ్రీ సాయినాధాయనమః

             శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర –9 వ.భాగమ్

ప్రేరణ ;  గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు

ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్

సమన్వయ కర్త  ;  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట్, హైదరాబాద్

ఫోన్.  9440375411  &  8143626744వ.

శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 6 ఆత్మసంయమ యోగము (1)



శ్లోకమ్ – 6

బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైనాత్మనా జితః

అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్

మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు, తనకు తానే మిత్రుడు.  అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు.  అనగా జితేంద్రియమునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము, భగవత్ప్రాప్తి సిధ్ధికై మిత్రునివలె, సహకరించును.  అట్లుగాక జితేంద్రియుడు కానివానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువులవలె ప్రవర్తించి లక్ష్యసాధనకు అవరోధములుగా నిలుచును.


శ్లోకమ్ – 7

జితాత్మనః ప్రశాంత్యస్య పరమాత్మా సమాహితః

శీతోష్ణ సుఖ దుఃఖేషు తధా మానావమానయోః

శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా (చలింపక) ఉండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ణానమునందు సచ్చిదానంద ఘనపరమాత్మ చక్కగా స్థితుడైయుండును.  అనగా పరమాత్మ తప్ప అతని జ్ణానమునందు అన్యమేదియు ఉండదు.

ఎవడు వివేక వైరాగ్యాదులచే తన మనస్సును తాను జయించుకొనునో అట్టిమనస్సు తనకు ఉపకారము చేయును,.  జయింపనిచో అదియే తనకు అపకారము చేయును.

మనస్సును జయించినవానికి పరమశాంతితో ఉన్న మానవునికి శీతోష్ణ సుఖదుఃఖములయందు, మానావమానములయందు పరమాత్మయందు ఆత్మానుభవము చెక్కు చెదరదు.

సుఖము కలిగినపుడు, పొంగిపోవుట, దుఃఖము కలిగినపుడు కృంగిపోవుట, ఎవరయినను తనను పొగిడినపుడు పొంగిపోవుట, నిందించినపుడు దిగులుపడుట, వీటన్నిటికీ అతీతుడు మనస్సును జయించినవాడు.

శ్రీ సాయి సత్ చరిత్ర – అధ్యాయమ్ -8

బాబా సామాన్య ఫకీరువలె సంచరించుచున్నప్పటికి వారెప్పుడూ ఆత్మానుసంధానమునందే నిమగ్ల్నులగుచుండిరి. *** దైవభక్తి గల పవిత్రహృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు.  వారు సుఖములకు ఉప్పొంగువారు కాదు.  కష్టములు వలన క్రుంగిపోవువారు కాదు.

రాజైననూ నిరుపేదయిననూ వారికి సమానమే.  తమ దృష్టిమాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికి బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తెడివారు.

***శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 3

రోహిలా కధ విన్నచో బాబా ప్రేమ యెట్టిదో బోధపడును.  బాబా కీర్తిని విని అతడు షిరిడీలో స్థిరనివాసము ఏర్పరచుకొన్నాడు.  రాత్రింబగళ్ళు వారి మతానుసారంగా ప్రార్ధనలను చేస్తూ ఉండేవాడు. దానివల్ల పగలంతా పొలములలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము అసౌకర్యము కలుగుతూ ఉండేది.  కొన్నాళ్ళవరకు వారు ఓర్చుకున్నా ఇక అతని బాధ పడలేక బాబా దగ్గర తమ బాధను చెప్పుకున్నారు.  కాని బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్ధనలయందు మిక్కుటమగు ప్రేమ.  అందుచేత రోహిలా తరఫున వాదించి ఊరిలోనివాళ్ళనందరినీ ఓపికతో ఉండమని, అసౌకర్యమును సహింపవలసినదని, అది త్వరలో తగ్గునని బాబా బుధ్ధి చెప్పారు.

శ్త్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 4

బాబా వేపచెట్టు క్రింద ఆసనములో ఉండి, శీతోష్ణములను లెక్కచేయక చిన్న బాలునిగా ఉన్న సమయంలోనే కఠినతపమాచరించారు.

శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 10

 బాబా ఎల్లప్పుడు తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై యుండువారు.  బాబా ఎల్లప్పుడు ఆత్మానుసంధానమునందే మునిగి యుండెడివారు.

అంతరంగమున వారు పరమనిరీహులు, నిస్పృహులైనప్పటికి బాహ్యమునకు లోకహితము కోరువానిగ కనిపించువారు.  అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికి, బాహ్యదృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్నవారి వలె కనిపించెడివారు.

ఎల్లప్పుడు ఆత్మానుసంధానమందే మునిగియుండెడివారు.  చింతారహితులై, ఎప్పుడూ శాంతముగా నుండేవారు.  సిరిసంపదలను గానీ, కీర్తిప్రతిష్టలను గానీ లక్ష్యపెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించెడివారు.

ఒకప్పుడు ***శాంతి (శమము), దాంతి, ఉపరతి, తితీక్షాదులతో ఆత్మస్థితియందుండి భక్తులను ప్రసన్న చిత్తులను చేసేవారు.

***(శమము – అంతరింద్రియ నిగ్రహము, విషయవాంఛలనుండి అంతరింద్రియాలనుండి దోషదృష్టితో విరక్తి చెంది నిగ్రహించుట.

దమము - బాహ్యేంద్రియ నిగ్రహము.  ఇంద్రియాలను వాటి వాటి విషయాలనుండి మళ్ళించి, వాటి స్థానాలలో వాటిని నిలిపివేయుట.

ఉపరతి – కర్మలను పరిత్యజించటము.  బాహ్యవిషయాలను చిత్త వృత్తులతో ఆశ్రయించకుండా ఉండటము.  విహితకర్మలను విధిపూర్వకంగా పరిత్యజించటము.

తితీక్ష – శీతోష్ణ, సుఖదుఃఖాలను సహించే శక్తి.  చింత, దుఃఖము మొదలైనవి లేకుండా, ప్రతీకారము లేకుండా, సమస్తదుఃఖాలను, కష్టాలను సహించటము.  ఎదుర్కొనగలిగిన సామర్ధ్యం ఉండి కూడా ఇతరులు చేసిన అపకారాలను సహించటం.)

సాయి సన్న్యాసి వేషంలో ఉన్న ప్రత్యక్ష యతీశ్వరుడు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List