18.07.2011 సోమవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మనము ఒకానొక సాయి భక్తురాలి బాబా అనుభూతిని తెలుసుకుందాము. దీనిని నెల్లూరునించి సుకన్యగారు సేకరించి పంపించారు.
సాయి బంథువులారా ఈ రోజు ప్రచురించే బాబా లీల పేరు వెల్లడించవద్దని కోరిన ఒక భక్తురాలి బాబా అనుభూతి. బాబా చూసేది బాహ్య శుథ్థిని కాదు, మన అంత హ్ కరణ శుధ్ధిని మాత్రమేనని ఈ లీల చదివితే తెలుస్తుంది.
ఈ రోజు నేను నరసాపురం నించి బెంగళూరు వెడుతున్నాను. తరువాత ప్రచురించేవన్నీ కూడా బెంగళూరునించి ప్రచురిస్తూ ఉంటాను. ప్రస్తుతం అధ్బుతమైన బాబా లీలలు గల 18 అథ్యాయాల పుస్తకాన్ని ఆంగ్లమునుండి తెలుగులోకి అనువాదము చేస్తున్నాను. అవి పూర్తికాగానే క్రమానుసారంగా అన్నిటినీ ప్రతీరోజూ ప్రచురిస్తాను. అందుచేత ఈ లోపు ప్రతీరోజు ప్రచురించేవాటికి కొంచెం ఆలశ్యం కావచ్చు. అన్యథా భావించవద్దు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
_______________
సాయిదేవాతో నా అనుభవం
బాబా గాను నన్ను మరలా రప్పించుకుంటున్నారు. రామనవమి ఉత్సవాలకు నేను షిరిడీ వెడుతున్నాను. నా ప్రియమైన సాయి (నా తండ్రి) తొ నా అనుభవాన్ని ఆయన భక్తులందరితోనూ పంచుకోవాలని యెప్పటినుంచో నా కోరిక.
నాకు 4 సంవత్సరాల వయసప్పుడు మా తండ్రిగారు చనిపోయారు. 2003 సంవత్సరం మథ్యలో నాకు బాబాగారి గురించి తెలిసింది. నేను సాయి దేవా కి బాగా దగ్గిరయి 2006 నుంచి ఆయనను నేను నా తండ్రిగా భావిస్తూ వచ్చాను. అప్పటినుంచి నేను ప్రతీదీ నా సాయిదేవాతో పంచుకుంటూ ఉంటాను (సంతోషం, దుహ్ ఖం). నేను చెవి రింగులు, బొట్టు, గోళ్ళ రంగు, యేమి కొన్నా గానిమొదటగా వాటిని బాబా ముందు పెట్టి, బాబా చూడు, ఈ చెవిరింగులు కొనుక్కున్నాను, బావున్నాయా అని బాబాతో అంటు ఉండేదానిని.
నా మదిలో ఉన్నది అంతా మీఅందరితో పంచుకోవాలనుకుంటున్నాను, ఆయన నా తండ్రి, తాత అమ్మమ్మ (యెందుకంటే వారెవరిలో యెవరూ నాకు లేరు).
ఇది ఈ మథ్య నా సాయి దేవాతో 29 డిసెంబరు, 2010 లో జరిగినది.
మొట్టమొదటగా నేను మీకు చెప్పదలచుకునేదేమిటంటే, నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి నాకు భయంగా ఉంది, యెందుకంటే నేను యెవరి ఆలోచనలను కాని, భావాలని గాని గాయపరుద్దామనే ఉద్దేశ్యం కాదు నాది. అందుచేత నేను బాబా దయని అనుగ్రహాన్ని అనుభవాన్ని మీతో పంచుకోవడానికి ఆశీర్వదించమని బాబా ముందు వినమ్రంగా మోకాళ్ళమీద కూర్చుని ప్రార్థిస్తున్నాను.
బాబా నాయందు తండ్రిగా భావించేలా చేస్తున్నందుకు, బాబా అనుగ్రహము, కోరికే నన్ను ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి పురి గొల్పింది. (నేను ఆయనని నాతండ్రిగాను, అన్నీ ఆయనే అని భావిస్తున్నాను)
నేను నవంబరు 2010 లో షిరిడీలో ఉన్నాను. షిరిడీని వదలి వెళ్ళేముందు, నేను ద్వారకామాయి కి వెళ్ళి యెంత వీలయితే అంత తొందరగా మరలా నన్ను షిరిడీకి పిలిపించుకోమని ప్రార్థించాను, యెందుకంటే నా తండ్రి సాయిదేవాయొక్క ద్వారకామాయిని విడిచి వెళ్ళాలనిపించలేదు. (నాకళ్ళంబట కన్నీరు కారుతోంది). అప్పుడు నేను ఏప్రిల్ రామనవమి కి వస్తానని నన్ను నేనే ఊరడించుకున్నాను.
ఇది డిసెంబరు 28, 2010 న సాయంత్రం 6.30 కి నేను ఆఫీసునించి యింటికి వెడుతున్నప్పుడు జరిగింది. హటాత్తుగా నా దగ్గరి స్నేహితురాలు, ఫోన్ చేసి కిందటి వారం వాళ్ళ నాన్నగారికి జరిగిన హార్ట్ సర్జరీ గురించీ ఆరోగ్య పరిస్తుతుల గురించి చెప్పడం మొదలుపెట్టింది. తన తండ్రికి నయం కావడం కోసం బాబాని ప్రార్థించడానికి షిరిడీ వెడదామనుకుంటున్నట్లుగా చెప్పింది. హటాత్తుగా నా మనసులోకి ఆలోచన వచ్చి నేనుకూడా తనతో షిరిడీ వస్తానని చెప్పాను. తను కూడా యెంతో సంతోషించింది, నేనప్పుడే షిరిడీ వెళ్ళడానికి తయారయిపోయాను. మేము అప్పటికప్పుడు అనుకున్నాము కాబట్టి, అది డిసెంబరు నెలాఖరు కాబట్టి, మరునాటి ప్రయాణానికి టిక్కెట్టులు దొరకడం కూడా చాలా కష్టం.
నా మనసు ఆలోచన దీనినేమీ పట్టించుకోలేదు. షిరిడీ వెళ్ళడానికి తయారయిపోయంది, నాకు తెలుసు బాబా గారు ఉన్నారు ఆయనే షిరిడీ తీసుకువెడతారు. అప్పుడు నేను యింటికి వెళ్ళేటప్పటికి రాత్రి 8.30 అయింది, మా అమ్మగారి అనుమతి తీసుకున్నాను. ఆమె ఒప్పుకున్నాక నా సోదరుడితో టి క్కట్టులు ఉన్నాయేమో చూడమన్నాను. కాని మరునాడు ప్రయాణానికి దొరకడం చాలా కష్టం.
కాని బాబా అనుగ్రహం, లీలతో వెళ్ళడానికి టిక్కట్టులు దొరికాయి, కాని తిరిగి రావడానికి మాత్రం దొరకలేదు. కాని యిప్పటికీ అంతా ఆయనే చూసుకుంటారనే ధీమాతో ఉన్నాము. మరునాడు మేము బెంగళూరునించి షిరిడీకి బయలుదేరాము.
రెండు సంవత్స్రాలనుంచి, తినే పదార్థాలయినటువంటి పళ్ళు, యింట్లో చేసిన స్వీట్లు, ముఖ్యంగా ద్వారకామాయిలో బాబా కి నివేదించడానికి తీసుకువెళ్ళడం నాకలవాటు. ఈ సారి నేను కమలాపళ్ళు తీసుకున్నాను.
బాబాని చూడాలనే ఆత్రుతతో నేను 29 తారీకయిన నా బహిష్టు రోజు గురించి ఆలోచించలేదు. నేను బాబాని ఆ రోజుని వాయిదా వేయమని ప్రార్థించాను. అది సాంప్రదాయానికి విరుథ్థం కాబట్టి ఈ విషయాన్ని నేను మా అమ్మగారితోను, నా స్నేహితురాలితోను చెప్పలేదు. అటువంటి పరిస్థితిలో అంత నమ్మకంగా నూ, స్థిరనిర్ణయంతోనూ షిరిడీ వెళ్ళడానికి యేది కారణమో నాకు తెలియదు. యిదంతా ఆయన అనుగ్రహం ఆయన కోరిక అని నేను నమ్ముతున్నాను. అదే మనలని ఆయన యెప్పుడు పిలిస్తే అప్పుడు షిరిడీ రప్పించుకుంటుంది.
షిరిడీ కి వెళ్ళాలన్నా, షిరిడీనించి తిరిగి రావాలన్నా అంతా బాబా ఇష్టప్రకారమే జరుగుతుందని మనకందరకూ తెలుసు.
అప్పుడు 29 తారీకున బస్సు లోనే నాకు బహిష్టు పీరియడ్తో బాథపడ్డాను. నేను బస్సులో ప్రయాణిస్తున్నాను, ఈ విషయం నా స్నేహితురాలికి తెలిస్తే యేమవుతుందోనని భయ పడ్డాను. నేను కనక ఈ విషయాన్ని తనతో చెప్పినట్లయితే ఈ పరిస్థితిలో తను నాతో రావడానికి ఖచ్చితంగా ఒప్పుకోదని నాకు భయం వేసింది. బెంగళూరు తిరిగి వచ్చేంతవరకూ అంతా సవ్యంగా జరిగేలా చూడమని బాబాని ప్రార్థించడం మొదలుపెట్టాను. యిదంతా ఆయన కోరిక ప్రకారమె జరుగుతోంది కాబట్టే అంత తొందరగా టిక్కట్లు వెంటనే దొరికాయి కాబట్టి నా మనసుకు కొంచెం శాంతి లభించింది. నేను ఆయనని నా తండ్రిగా భావిస్తునందందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా నామీద ఒక తండ్రిలా ప్రేమను అందిస్తున్నారు. సాయిదేవ తన బిడ్డలనెప్పుడు ఆచార వ్యవహారాలనుంచి వేరు చేయరు.
ఆఖరికి మేము షిరిడీ చేరుకుని అక్కడ 2011 జనవరి ఒకటవ తారీకు వరకు ఉండి నా తండ్రి సాయిదేవాతో కొత్త సంవత్సరం జరుపుకున్నాము. షిరిడీలో ఉన్న ఈ మూడు రోజులు నేను ప్రతీ చిన్న విషయంలోనూ తరుచుగా సాయి దేవా తండ్రి ప్రేమను అనుభవించాను. షిరిడీలో వసతి కూడా ఆయనే చూసుకున్నారు యెందుకంటే షిరిడీలో కొత్త సంవత్సరం రద్దీ వల్ల గదులు దొరకటం కూడా కష్టం.
బహిష్టు సమయంలో ఒక స్త్రీ గుడిలోకి ప్రవేశించడం సాంప్రదాయానికి విరుథ్థమని, నేను ఆయనని ప్రార్థించాను, కాని నువ్వు నా తండ్రివి, నేను అడుగుపెట్టే ప్రతీచోటా నువ్వే నాకు దారి చూపించాలి, అదే ప్రకారంగా, నేను ద్వారకామాయిని, సమాథి మందిరాన్ని, చావడిని దర్శించాను.
ఈ ప్రదేశాలు తప్ప మరి యింక వేరేచోటకి యెక్కడికీ వెళ్ళాలనుకోలేదు. (హనుమాన్ మందిర్, గణేష్, శివ, శని, ఖండొబా మందిర్, గురుస్థాన్ ఇలాంటివి).
ఆయన దయ కోరికే నాకు మార్గం చూపించింది. ఆయన గృహమైన ద్వారకామాయిలో ప్రవేశించడానికి ఆయన అనుమతినిచ్చారని నేను గాఢంగా అనుకున్నాను. ఆయన నివసించిన ద్వారకామాయి నన్ను తన స్వంత కూతురిని ఆహ్వానిస్తున్నట్లుగా వ్యవహరించింది. యెలా జరిగిందంటే నేను ద్వారకామాయిలో కి ప్రవేశించడానికి చాలా భయపడ్డాను. ద్వారకామాయి ప్రవేశం వద్ద నేను అడుగుపెట్టగానె ఒక భక్తుడు నావద్దకు వచ్చి కోవా ప్రసాదం ఇచ్చాడు. యిది నాకు యెంతో తృప్తినిచ్చింది, ఆయన పితృభావాన్ని అనుభవించాను.
నాకిది, నా మనసులో ఉన్న ఆలోచనలన్నిటినీ పటాపంచలు చేస్తూ, యెటువంటి భయంలేకుండా ఆయన సన్నిథానంలోకి నన్ను ప్రవేశించడానికి అనుమతి ఇచ్చారనడానికి గుర్తుగా అనిపించింది. మేము బాబా వారి పల్లకీ సేవకి, కాకడ హారతికి హాజరయాము. ఒకటవ తారీకు ఉదయాన్నే అనగా కొత్త సంవత్సరమునాడు ఉదయం 5 గంటలకే దర్శనం చేసుకున్నాము, కొత్త సంవత్సరం సందర్భంగా బాబాని బంగారు నెక్లస్ తో అలంకరింపబడి ఉండటం చూశాము. ఆయన కిరీటం థరించి ఉండగా చూడాలనే నా చిరకాల కోరిక , ఈ కోరిక కూడా 31 వ తేదీ శుక్రవారమునాడు కాకడ ఆరతి తరువాత తీరింది. నేను ఆయన కోసం తెచ్చిన కమలాపళ్ళని సమర్పించాను. ఈసారి ఆయన నేను సమర్పించిన వాటిని సమాథి మందిరంలోనే స్వీకరించారు. పూజారి వాటిని తీసుకుని సమాథి మీద పెట్టారు. నాకు చాలా అనందం వేసింది యెందుకంటే ఆయన బాహ్య శుద్ధి ని చూడరనటానికి సంకేతంగా భావించాను.
బెంగళురుకు తిరుగు ప్రయాణం టిక్కెట్లు లభించడం కూడా బాబా గారి లీల. మేము షిరిడీ నుంచి తిరిగి వచ్చాక నా స్నేహితురాలి తండ్రికి తొందరలోనే నయమయింది. నాకు నేను పనిచేసేచోట టీం వర్క్ ఎక్స్ లెన్స్ అవార్డ్ వచ్చింది. (నాకీ ఉద్యోగం ఆయన అనుగ్రహంతోనే వచ్చింది). నా తండ్రి సాయిదేవా నీకు నా థన్యవాదములు.
సాయిదేవా యే మన తండ్రి, తల్లి అని చెపుతూ ముగించదలచుకున్నాను. మీరు ఆయనని యేభావంతో భావిస్తూ ఉంటారో అదే విథంగా ఆయన కూడా మిమ్మలిని రక్షిస్తూ ఉంటారు. మన తల్లి తండ్రి తల్లి కూడా అటువంటి పరిస్థితుల్లో కట్టుబాట్లను పాటించాలి కాబట్టి మనలని గుడికి వెళ్ళనిచ్చేవారు కాదు. కాని మన సాయిదేవా అన్నిటికీ అతీతుడు. యెటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనలని తననించి వెళ్ళనివ్వడు. ఆయన దయ, ఆశీర్వాదములు మనందరిమీద ఉండుగాక.
జై సాయినాథ్
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment