23.11.2013 శనివారము (దుబాయ్ నుండి )
శ్రీసాయితో మధురక్షణాలు - 28
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
నిన్ననే 22వ.తారీకున హైదరాబాదునుండి దుబ్బాయ్ కి రావడం జరిగింది..మనబ్లాగులో సాయితో మధురక్షణాలలోని మధురక్షణాలను అనువాదం చేసిన వెంటనే ప్రచురిస్తూ ఉంటాను.
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 95వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: అనంత హుతభుగ్భోక్తా సుఖదోనైకజో గ్రజః |
అనిర్విణ్ణః సదామర్షీ లోకాధిష్టాన మద్భుతః ||
తాత్పర్యం: పరమాత్మను అంతులేనివానిగా, నిరంతరమూ తినువానిగా, హవిస్సును భుజించువానిగా, సుఖము నిచ్చువానిగా, సృష్టి సమస్తమునకూ పెద్ద సోదరునివంటి వానిగా ధ్యానము చేయుము. ఆయనకు సంభ్రమము లేదు. ద్వేషము లేదు. ఆయన సమస్త లోకములకూ నివాసమై యున్నాడు. అది అద్భుతమై యున్నది.
నువ్వు, నేను వేరుకాదు
ఇప్పుడు చెప్పబోయే వృత్తాంతం కీ.శే. శ్రీ విఠల్ రావ్ మరాఠే గారు వివరించి చెప్పిన.ది ఆయన షిరిడీ సంస్థాన్ వారి ఆస్థాన విద్వాంసులు. షిర్దీలో సత్యనారాయణ వ్రతాలు చేసే చోట కీర్తనకారుడు.
ఒకరోజున యిద్దరు పఠాన్ లు బాబావారి దర్శనం కోసం ప్రొద్దుటే తెల్లవారుతుండగా షిరిడీ చేరుకొన్నారు. బాబాగారికి నమస్కారం చేసి ఆయన ఎదురుగా కూర్చొన్నారు. అది చలికాలం కావడంతో చాలా చలిగా ఉంది. వణికించే చలిలో వారక్కడ కూర్చొని ఉన్నారు. ఆయిద్దరిలో ఒకరికి "ఈ సమయంలో వేడి వేడి టీ త్రాగితే ఎంతబాగుండును? " అనే ఆలోచన వచ్చింది కాని మరుక్షణంలోనే "యింత చిన్న గ్రామలో టీ దొరుకుతుందనుకోవడం తెలివితక్కువ ఆలోచన, పైగా యిక్కడ కొంతమందికి టీ అంటే తెలియకపోవచ్చు" అనుకొన్నాడు.
అప్పుడే అక్కడికి బాబా దర్శనం కోసం సగుణ నాయక్ వచ్చాడు. అతను అక్కడికి వచ్చే భక్తుల కోసం చిన్న హొటలు నడుపుతున్నాడు. సగుణ నాయక్ బాబాకి నమస్కరించి పొద్దుటే ఫలహారానికి ఏమితెమ్మంటారని అడిగాడు. "సగుణా! ఒక పాత్రనిండుగా వేడి వేడి టీ పట్టుకురా" అన్నారు బాబా. సగుణ బాబాకి అంకిత భక్తుడు, క్రమశిక్షణ గలవాడు. బాబా టీ అడగటంతో చాలా ఆశ్చర్యం వేసింది. బాబా టీ త్రాగడం అతను ఎప్పుడూ చూడలేదు. బాబాని మరింకేమీ ప్రశ్నించకుండా వెంటనే వెళ్ళి ఒకపాత్ర నిండుగా పొగలు కక్కే వేడి వేడి టీ తెచ్చాడు.
పఠాన్ లు ఇద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. హాయిగా వేడి వేడి టీ తాగారు. వారు ఎవరితోనూ తమకు టీకావాలని చెప్పడం గాని, టీ ఎక్కడ దొరుకుతుందని గాని అడగలేదు. కాని బాబా, వారి మనసులోని ఆలోచనను గ్రహించారు. బాబా సామాన్యమైన మహావ్యక్తి కారని, వారిలో అతీతయమైన శక్తులు ఉన్నాయనీ, ఆయన అందరి హృదయాలలోనూ ఉన్నారనీ వారికి అర్ధమయింది.
శ్రీసాయి లీల
అక్టోబరు 1979
శోభనా టీ.మార్వంకర్
బొంబాయి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment