27.11.2013 బుధవారం (దుబాయి నుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధుర క్షణాలు - 29
ఈ రోజు శ్రీసాయితో మధుర క్షణాలలోని మరొక మధుర క్షణాన్ని మనం తెలుసుకొందాము. ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా సరే బాబా నీదే భారం అని మొత్తం వ్యవహారమంతా ఆయన భుజాల మీదే వేస్తే కనికరించకపోరు. కావలసినదల్లా మనకి ఆయన మీద సంపూర్ణ విశ్వాసం, మొక్కవోని ధైర్యం..ఇక చదివేముందు శ్రీవిష్ణుసహస్ర నామ స్తోత్రంలోని 96వ.శ్లోకం, తాత్పర్యం.
శ్రీవిష్ణుసహస్ర నామ స్తోత్రం
శ్లోకం: సనాత్సనతనతమః కపిలః కపిరవ్యయః |
స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః ||
తాత్పర్యం: పరమాత్మను మిక్కిలి పూర్వీకునిగా, బ్రహ్మ, కుమార సర్గములకన్నా ముందున్నవానిగా, మరియూ కపిలావతారముగా, సృష్టియందలి సాంఖ్య శాస్త్రమున కదిపతిగా ధ్యానము చేయుము. అతడు భూమి యందలి నీటిని ఆవిరి చేసి పరిశుధ్ధ మొనరించు సూర్యునిగా, అవ్యయునిగా లేక తరిగిపోనివానిగా, శుభమును కలిగించువానిగా మరియూ తానే శుభమైనవానిగా నున్నాడు. మరియూ శుభమును అనుభవించువానిగా, సత్కర్మాచరణ చేసినవానికి శుభమును పంచిపెట్టువానిగా ధ్యానము చేయుము.
అచేతనావస్థలో ఉన్న కుమార్తెను బాబా వారి రాతి వద్ద వదలి వెళ్ళుట.
1982 మే నెలలో శ్రీమురళీధర్ భికా సోనావనె తమ కుమార్తెకు వ్యాధి సోకడం వల్ల శ్రీసాయినాధ్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్ష చేసి ఆమె జబ్బు మందులతో నయం కాదని, యిక చేసినా ఫలితం లేదని యింటికి తీసుకొనిపొమ్మని చెప్పారు. ఎంతో బాధతో తల్లిదం డ్రులుఆమెను తిరిగి యింటికి తీసుకొని వచ్చారు.
మరలా యింకొక డాక్టరు వద్దకు తీసుకొని వెళ్ళి ఆయన అభిప్రాయం కూడా తెలుసుకొందామని డా.గొడేకర్ గారి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఆయన పరీక్షించి బాబా దయతోనే ఆ అమ్మాయి బ్రతకాలి తప్ప యిక చేయగలిగిందేమీ లేదని చెప్పారు. తల్లిదండ్రులు అమ్మాయిని యింటికి తీసుకొని వచ్చారు. యింటికి తీసుకొని రాగానే ఆ అమ్మాయి అచేతనంగా కళ్ళు తెరచుకొని ఉండిపోయింది. అమ్మాయి పరిస్థితి చూసి తల్లిదండ్రులు భయపడిపోయి ఏడుస్తూ ఆమెని ద్వారకామాయికి తీసుకొని వచ్చారు. ఆమెను, బాబావారు ఎప్పుడూ కూర్చునే రాయి వద్ద క్రింద పడుకోబెట్టారు.
నాడి కోట్టుకోవడం మెల్లగా తగ్గిపోతూ యిక ఆగిపోయే స్థితికి వచ్చింది. బరువెక్కిన హృదయంతో వారు ఊదీ కలిపిన నీటిని, తీర్ధాన్ని ఆమె నోటిలో పోశారు గాని, ఫలితం లేదు. పోసిన తీర్ధం బయటకు రాసాగింది. ఆమె శరీరాన్ని అక్కడే ఉంచి యిద్దరూ కూడా ధుని వద్ద ఉన్న బాబా ఫొటో వద్దకు వెళ్ళి ప్రార్ధించసాగారు.
ఆమెని బాబావారి ద్వారకామాయికి తీసుకునిరావడంతోనే అనారోగ్యంతో ఉన్న అమ్మాయికి కాస్త ఉపశమనం కలిగింది. ఒక నిజమైన భక్తునిగా చేసిన ప్రయత్నాలన్న్నీ చేసి ఆఖరి ప్రయత్నంగా భారమంతా సాయి మీద వేశారు. నీటిలో మునిగేవాడికి గడ్డిపరక అధారంగా దొరికినట్లుగా ఉంది వారి పరిస్థితి.
అరగంట తరువాత వారు తమ కుమార్తెని పడుకోబెట్టినచోటుకి, బాబా వారి రాతివద్దకు వచ్చి చూశారు. కాని అక్కడ వారికుమార్తె లేదు. ఆనందం పట్టలేకపోయారు. వారి కుమార్తె ద్వారకామాయికి దక్షిణం వైపు వున్న గోడవద్ద అక్కడ ఉన్న పిల్లలతో కలిసి ఆడుకొంటు కనపడింది. వారి ఆనందానికి అవధులు లేవు. బాబావారు 15 అక్టోబరు 1918 న మహాసమాధి అయిన తరువాత, ఇప్పుడు మే నెల 1982 లో ద్వారకామాయిలో ఆ పాపని కాపాడారు.
ఆంబ్రోసియ ఆఫ్టర్ సమాధి (ఆధారం)
రామలింగస్వామి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment