28.11.2013 గురువారం (దుబాయి నుండి)
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయితో మధురక్షణాలలో మరొక మధురక్షణం తెలుసుకుందాము. నిన్న మధురక్షణం చదివారుకదా.. ధైర్యం కోల్పోకుండా బాబా మీదనే భారం వేసిన దంపతుల గురించి చదివారు. ఈ రోజు కూడా ఆపద సమయం లో కూడా ఎంత సహనంతో ఉండాలో వివరిస్తుంది. ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 97వ.శ్లోక, తాత్పర్యం.
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం : అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ||
తాత్పర్యం : పరమాత్మను భయంకరము కానివానిగా, చుట్టలుగా చుట్టుకొని యున్నవానిగా, చక్రమును ధరించినవానిగా, ధ్యానము చేయుము. ఆయన సమస్తమునూ జయించి ఆక్రమించును. ఆయన వాక్కు శాసనము. ఆయన తన వాక్కుకతీతముగా నుండి తానుచ్చరించిన ప్రపంచమును తనయందే ధరించును. చల్లదనము, మరియు రాత్రి కూడా ఆయన రూపములే.
శ్రీసాయితో మధుర క్షణాలు - 30
నాయందెవరి దృష్టో వారియందే నా దృష్టి
సాయి సుధ మాసపత్రికనుండి
నవంబరు 7వ.తేదీ 1986 సంవత్సరంలో నేను మాబంధువుల యింటికి వెడదామని విశాఖపట్నం బయలుదేరబోతుండగా కాకినాడనుండి నామేనల్లుడు ఫోన్ చేశాడు. అతని రెండవ కొడుకు శీరం సాయి కల్యాణ్ (వయస్సు 22 సం.) కు సీరియస్ గా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించామని చెప్పడంతో కాకినాడకు బయలుదేరి 8వ.తారీకు ఉదయానికి చేరుకున్నాను.
వెంటనే కల్యాణ్ ని చూడటానికి ఆస్పత్రికి వెళ్ళాను. బీ.పీ.తగ్గిపోయి స్పృహ లేకుండా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడు. నన్ను చూడగానే నా మేనల్లుడు "బాబాతో చెప్పి నాకొడుకు వద్ద కూర్చొని వాడిని బ్రతికించమను" అని నాచేతులు పట్టుకొని ఏడ్చాడు. బాబా మనలని ఎల్లప్పుడూ రక్షిస్తారు ధైర్యంగా ఉండు అని ఓదార్చాను. నేను బాబా సమాధికి తాకించి తెచ్చిన శాలువాను కల్యాణ్ తలగడ క్రింద పెట్టి నుడుటిమీద ఊదీ రాశాను.
కల్యాణ్ పరిస్థితిలో ఎటువంటి మార్పులేదు. కల్యాణ్ కి తప్పకుండా నయమవుతుందనే ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాను. నామేనల్లుడికి కూడా ధైర్యం చెబుతూ బాబా వారు చెప్పిన సహనం(సబూరీ) తో ఉండమని చెప్పాను. నేను కూడా ఓపికగా వేచి చూస్తున్నాను. 9వ.తారీకు ఉదయం డాక్టర్స్ కల్యాణ్ ని పరీక్షించి అవి ఆఖరి క్షణాలని ధైర్యంగా ఉండమని చెప్పారు. డాక్టర్స్ ఆవిధంగా చెప్పినా, కల్యాణ్ పరిస్థితిని చూసికూడా నేను ఆశ కోల్పోలేదు. ధైర్యంగానే ఉన్నాను. 10వ.తేదీన కల్యాణ్ లో కొంత కదలిక వచ్చింది. 12వ.తారీకు ఉదయం 4 గంటలకు కల్యాణ్ హటాత్తుగా కళ్ళు తెరచి, "తెల్లటి దుస్తులలో బాబా వచ్చి చిన్న కఱ్ఱ తో నాగుండెల మీద కొట్టారు. నేను ఇప్పుడు మామూలుగానే ఉన్నాను" అని చెప్పాడు.
"నన్ను శరణు జొచ్చినవారిని, నన్నే ఆశ్రయించువారిని నేను వదలి పెట్టను" - బాబా
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment