03.12.2013 మంగళవారం (దుబాయి నుండి)
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
శ్రీసాయితొ మధురక్షణాలు - 31
సాయి బంధువులందరూ సాయితో మధురక్షణాలు చక్కగా చదివి ఆనందిస్తున్నారు కదూ! మీరు చదివే ప్రతీ క్షణంలోను, ముఖ్యంగా కావలసినది నమ్మకం, సహనం అని గుర్తించేఉంటారు. ఈ రోజు కూడా మీరు చదివే క్షణంలో నమ్మకమే మనకు కావలసినది అని గ్రహిస్తారు. ఇంతకుముందు మా అమ్మాయి స్వీయ అనుభవం," ఆ చేతులు ఎవరివి" చదివే ఉంటారు. ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 98వ.శ్లోకం , తాత్పర్యం.
శ్రీవిష్ణు సహస్రనామం
శ్లోకం: అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణ కీర్తనః ||
తాత్పర్యం: భగవంతుని క్రూరత్వము తొలగించువానిగా, మధురమైనవానిగా, మృదువైనవానిగా, ధ్యానము చేయుము. ఆయన అందరికన్నా మించిన సామర్ధ్యము కలవాడు. యజ్ఞము చివర పంచి పెట్టబడు దక్షిణగా తానే యున్నాడు. క్షమించువారియందు ఉత్తముడు. తెలిసినవారియందు అనగా జ్ఞానులయందు శ్రేష్టుడు. ఆయన భయమును తొలగించి తనను గూర్చి స్తోత్రము చేయువారిని మరియూ ఆ స్తోత్రములను వినువారిని పవిత్రమొనర్చుచున్నాడు.
నమ్మకమే ఎప్పుడూ జయిస్తుంది
నంద్యాల తాలూకా దేష్ పురం నివాసి వెంకటరామయ్యగారు, తమ కుమార్తె ప్రసవ సమయం దగ్గిర పడటంతో నంద్యాల వచ్చారు. అది 1985వ.సంవత్సరం డిశంబరు 2వ.తే. దీ తమ కుమార్తెకు పురిటినొప్పులు రాత్రి 10గంటలకు మొదలయి ఉదయం 2గంటలవరకూ తగ్గకపోవడంతో భార్యభర్తలిద్దరికీ చాలా భయం వేసింది. ఉదయాన్నే ఆమెని తమ యింటికి దగ్గరలోనే ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోం కి తీసుకొనివచ్చారు. వారితో పొరిగింటిలోనే ఉంటున్న కొండయ్యగారి భార్య కూడా తోడుగా వెళ్ళింది. సాయంత్రం 4 గంటలయినా నర్సింగ్ హోం నించి ఎవరూ రాక అసలు విషయం ఏమీ తెలియకపోవడంతో కొండయ్యగారు చాలా ఆత్రుతతో ఉన్నారు. తన భార్య కూడా ఆస్పత్రినుండి రాకపోవడంతో ఏమయిందోననే ఆందోళనతో కొండయ్యగారు సాయంత్రం ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ వెంకటరామయ్యగారి అమ్మాయికి యింకా పురిటి నొప్పులు తగ్గకపోవడంతో అందరూ చాలా విచారంగా ఉన్నారు. అమ్మాయి పురిటినొప్పులు భరించలేక శోషించిపోయింది.
కానుపు అవడం చాలా కష్టమని వెంటనె ఆపరేషన్ చేయాలని లేడీ డాక్టర్ చెప్పింది . వెంటనే రూ.2000/- కట్టమని లేకపోతే తానేమీ చేయలేనని చెప్పింది. అపుడు కొండయ్యగారికి సాయినాధులవారే గుర్తుకు వచ్చారు. ఇటువంటి యాంత్రిక జీవితంలో బాబా తప్ప మరెవరూ సహాయం చేయలేరనుకున్నారు. ఆయన దయే కనక లేకపోతే మనుగడే కష్టం. ఆకలి వేసే పిల్లవాడికి ఆహారం కావాలి, దాహంతో ఉన్నవారికి మంచి నీరు చాలు, కష్టాలలో ఉన్నపుడు మాతృప్రేమ కావాలి. బాబా ఎప్పుడూ తన బిడ్దలకు ఎంత చిన్న కష్టమొచ్చినా తన మాతృప్రేమను కురిపిస్తారు. కొండయ్యగారు తన భార్యతో అమ్మాయికి ఊదీ పెట్టమని అన్నపుడు ఆవిడ కాస్త సందేహిస్తూ చూసేసరికి, "ఊదీ యొక్క శక్తినే శంకిస్తున్నావా"? అని గట్టిగా అరిచారు.
కొండయ్యగారి భార్య, అమ్మాయి నుదుటిమీద ఊదీరాసి కొంత నోటిలో వేసింది . ఇదంతా చూసిన లేడీ డాక్టరు అసహ్యించుకొని, మూఢ నమ్మకాలతో అటువంటి పిచ్చి పనులు ఏమీ చేయవద్దని చెప్పింది. ఇటువంటివాటి వల్ల ఏవిధమయిన ఉపయోగం లేదు వెంటనే ఆపరేషన్ కి డబ్బు కట్టమని చెప్పింది. కొండయ్యగారు వెంటనే యింటికి వెళ్ళి బాబా ముందు కూర్చొని అమ్మాయికి సుఖప్రసవం కలిగేలా చేయమని ప్రార్ధించారు.
అపుడు సమయం మధ్యాన్నం గం.2.30ని.అయింది. సాయంత్రం 4.గంటలు అవుతుండగా వెంకట రామయ్యగారి అమ్మాయి వచ్చి తన సోదరికి ఆపరేషన్ లేకుండా మగపిల్లవాడు జన్మించాడనీ , బాబు మంచి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పింది.
కొండయ్యగారు వెంటనే బాబును చూడటానికి ఆస్పత్రికి వెళ్ళారు. ఇదంతా చూసిన డాక్టర్ కి చాలా అద్భుతమనిపించింది. వెంకటరామయ్యగారితో కనీసం 600 రూపాయలయినా బిల్లు కట్టమని చెప్పింది.
సాయిసుధ మాసపత్రిక
కొండయ్య
నంద్యాల
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment