12.12. 2013 గురువారము
శ్రీసాయితో మధుర క్షణాలు - 32
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
వారం రోజులు పైన అయింది. బ్లాగులో ప్రచురణ చేసి. దుబాయిలో ప్రదేశాలు చూడటం, ఇంకొక పుస్తకం అనువాదం చేయడంలోను కాస్త, కాదు ఎక్కువే ఆలశ్యమయింది. ఎప్పుడూ ఏదో వంక చెపుతున్నారనుకోకండి. ఈ రోజు మరొక మధురాతి మధురమైన క్షణాన్ని తెలుసుకుందాము. మనం బాబాకి గాని ఏ భగవంతునికయినా సరే కోరిక తీరగానే మొక్కిన మొక్కును వెంటనే తీర్చివేయాలి. బాబాని తలచుకొని ఒక పని చేస్తానని అనుకున్నప్పుడు ఆపని కూడా పుర్తి చేయాలి. ఒకవేళ మనము మొక్కును మరచి పోయినా అశ్రధ్ధ చేసినా భగవంతుడే ఏదొ విధంగా మనకి గుర్తు చేస్తాడు. ఇక చదవండి..చదివేముందు శ్రీవిష్ణుసహస్ర నామం 99వ.శ్లోకం తాత్పర్యం.
శ్రీవిష్ణుసహస్రనామం
శ్లోకం: ఉత్తారణొ దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్ననాశనః |
వీరహా రక్షణ స్సంతో జీవనః పర్యవస్థితః ||
తాత్పర్యం: పరమాత్మ చెడ్డపనులను తన మంచి పనుల రూపమున నశింప చేయుచూ జీవులను సం హరించి సత్కర్మ ఫలితములను మరియూ సత్పురుషులను రక్షించువానిగా, జీవనమే తానైనవానిగా యితరుల ఆలోచనలకు, పనులకు ఫలితముగా వారికిచ్చు జీవనము తానేయైనవానిగా, ధ్యానము చేయుము.
మాట ఇచ్చి తప్పినచో భగవంతుడే స్వయంగా గుర్తు చెస్తాడు
తీర్ధ యాత్రలు చేయడానికి వెళ్ళే ప్రతీ సామాన్యునిలాగానే శ్రీరామస్వామి అయ్యంగారు నారాయణమొదలియార్ (డాక్టరు) షిరిడీ కి వెడదామని నిర్ణయించుకున్నారు. అందరిలాగానే తను కూడా తనకిష్టమయిన ఆహార పదార్ధాన్ని గాని, అలవాటును కాని వదలివేయాలనుకున్నారు.
శ్రీ షిరిడీ సాయిబాబావారి గొప్పతనాన్ని విని, రామస్వామి అయ్యంగారు నారాయణ్ మొదలియార్ (డాక్టర్) గారు, రావు సాహెబ్ సుబ్బయ్య చెట్టియార్ గారితో కలసి 1938 సంవత్సరం, ఏప్రిల్, 27వ.తేదీన షిరిడీకి ప్రయాణమయ్యారు. కాశీ, రామేశ్వరం పుణ్యక్షేత్రాల యాత్రలాగా తన షిరిడీ యాత్ర కూడా ఒక మధురానుభూతిగాను, ఫలప్రదంగాను మిగిలిపోవాలనుకొన్నారు. ఈ విధంగా అనుకొని ఆయన, తనకు ఉన్న విపరీతమయిన అలవాటయిన కిళ్ళీ నమలడం మానివేస్తానని భీకరమయిన ప్రతిజ్ఞ చేశారు. ఇక చివరిసారిగా ఆక్షణం నుండి షిరిడీ విడిచి వెళ్ళేవరకు తాంబూలం వేసుకోరాదనె నిర్ణయం తీసుకొన్నారు. కిళ్ళీ వేసుకోవడం ఆయనకు చిన్న తనం నుండీ ఉన్న అలవాటు. అటువంటిది కిళ్ళీ మానేయడమంటే ఆయన దృష్టిలో అది పెద్ద త్యాగమే.
అలా అనుకోగానే కిళ్ళీ వేసుకోవడం మానివేసి, 1938, ఏప్రిల్, 28 తేదీన చెట్టియార్ గారితో కలసి, ఒక ఎడ్లబండిలో షిరిడినుండి తిరుగు ప్రయాణమయ్యారు. వారిద్దరూ బండిలో కూర్చొగానె చెట్టియార్ గారు కిళ్ళీ నమలడం మొదలుపెట్టారు. షిరిడీలో అంతవరకు కిళ్ళీ వేసుకోవాలని కోరికతొ మనసు లాగినా దానిని జయించారు. కాని యిప్పుడు చెట్టియార్ గారిని చూసిన తరువాత ఒట్టు కాస్తా గట్టున పెట్టి మద్రాసు చేరుకున్న క్షణం నుండీ మానేయవచ్చులే అనే ఆలోచన కలిగింది. ఆకులు,వక్క ఉంఛే చిన్న పెట్టెలోనుండి ఆకులు,వక్క, సున్నం తీసుకొని ఆనందంగా నమలడం మొదలు పెట్టారు. ఎప్పుడయితే కిళ్ళీ నమలడం మొదలు పెట్టారో నాలిక వెంటనే పొక్కిపోయింది. ఎన్నో దశాబ్దాలనుండి కిళ్ళీలు నమిలి నమిలి ఆయన నాలుక బండబారిపోయి బండలాగ తయారయింది. ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. కాని దానినేమీ పట్టించుకోకుండా తనివితీరా నమిలారు. ఒక అరగంట గడిచాక తన నాలుక, నోరు బాగా ఎఱ్ఱ బారి ఎన్నడు లేని విధంగా చాలా అసాధారణంగా కందిపోయాయి. అప్పటినుండీ తమలపాకులే కాదు ఘనపదార్ధాలేమి నమలలేకపోయారు. ఆయనకు కనీసం గ్యాస్ ప్రోబ్లెం కూడా లేదు. ఆరోజునుండి 18 రోజులదాకా తమలపాకులతో సహా మిగిలిన ఘనపదార్ధాలన్నిటినీ, నోటిపూత కారణంగా ఆయన మానుకోవలసి వచ్చింది. ఒట్టిపాలు మాత్రమే త్రాగేవారు.
చెట్టియార్ గారిని చూస్తుంటే ఆశ్చర్యం అంతకంతకూ పెరగసాగింది. తామిద్దరూ ఒకే తమలపాకులు, సున్నం తో కిళ్ళీలు వేసుకొన్నారు. మరి ఆయనకు లేని సమస్య తనకెందుకు వచ్చినట్లు? కాని నేను వాగ్దానం చేసినట్లుగా ఆయన చేయలేదు. కిళ్ళీ నమిలిన గంట తరువాత ఆయనకు మరొక అనుభవం ఎదురయింది. ఆయన తనతో కుడా తమలపాకులు వేసుకొనే చిన్న బుట్ట, వక్కలు, సున్నం పెట్టుకొనేందుకు చిన్న వెండి కప్పు, ఈ సరంజామానంతా తెచ్చుకొన్నారు. (తమిళులు ఇటువంటివన్నిటినీ ఒక చిన్న పెట్టెలో పెట్టుకొని కూడా పట్టుకెడుతూ ఉంటారు)
వాటిని చెట్టియార్ గారి వద్ద పెట్టి కొన్ని తమలపాకులు, యింకా కొన్ని సరుకులు కొనుక్కొని రావడానికి రత్నా బజారుకు వెళ్ళారు. కొద్ది నిమిషాలలోనే తిరిగి వచ్చారు. తను పెట్టిన తమలపాకులు,సున్నం డబ్బా కోసం చూశారు. వావ్! ఏముంది? అక్కడ తన సరంజామా ఏమీ కబపడలేదు. అక్కడికి దొంగ ఎవరూ రాలేదు. వాటినన్నిటినీ చెట్టియార్ గారి దగ్గరే పెట్టారు. ఎంత వెతికినా గాని అవి కనపడలేదు.
పై రెండిటి సంఘటనలు జాగ్రత్తగా గమనిస్తే బాబా గారు యింకా జీవించే ఉన్నారని ఆయనకర్ధమయింది. ఆయన తన భక్తులనందరినీ స్వంత బిడ్డలవలె చూసుకొంటారు. అంతే కాక క్రొత్తగా వచ్చిన భక్తులని కూడా ఎంతో ప్రేమతోను చాలా జాగ్రత్తగాను కనిపెడుతూ రక్షిస్తున్నారని గ్రహించారు.
శ్రీసాయినాధులవారికి భయభక్తులతో ఏదయినా మాట యిచ్చి తప్పితే, అలా మాట ఇచ్చి తప్పినవారిని శిక్షించి క్రమశిక్షణలో పెడతారు. ఆయన తన భక్తులు ఉన్న పరిస్థితులు, పరిసరాలు అన్నిటినీ ఎల్లప్పుడు గమనిస్తూ ఉంటారు. తనభక్తులు ఎప్పుడు ఏవిషయంలోను అతిక్రమించి దారి తప్పకుండా నిత్యం గమనిస్తూ ఉంటారు.
బాబా ఆయనకి మంచి గుణపాఠం నేర్పారు. ఆరోజునుండి ఆయన యిక ఎప్పుడూ యిచ్చిన మాట తప్పలేదు.
ఆవిధంగా బాబా ఆయనలో విశ్వాసాన్ని పెంచి, ఆయన చేసిన వాగ్దానాన్ని అమలు పరచే మనోధైర్యాన్ని ప్రసాదించారు. ఆయన షిరిడి దర్శనానికి ముందు బాబా ఔన్నత్యాన్ని గురించి, ఆయన దయాగుణం గురించి విన్నారు, కాని అవి ఆయన మదిలో ఒక అస్పష్టమయిన ముద్రను వేసింది. కాని వాస్తవంగా పొందిన ఈ అనుభవం బాబా మీద ఆయనకున్న అభిప్రాయం మరింత స్పష్టంగాను, శక్తివంతంగాను ఆయన జీవితాంతం వరకు నిలబడిఉంటుంది. ఆయన తన దృష్టినంతా బాబా మీదనే కేంద్రీకరించారు.
ఆంబ్రోసియా ఆఫ్ షిరిడీ నుండి
రామలింగస్వామి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment