18.11.2013 సోమవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 94వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం : విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః |
రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ||
తాత్పర్యము: పరమాత్మను కాంతితో కూడిన వాయు మార్గముగా తేజోవంతునిగా, తన కాంతిచే సమస్తమును నియమించువానిగా, హవిస్సును స్వీకరించువానిగా, ధ్యానము చేయుము. ఉచ్చరింపబడిన వాక్కే తన కాంతిగా సమస్తమును దర్శించి ధరించువానిగా, మరియూ సృష్టించువానిగా నున్నాడు. సూర్యుడే తన నేత్రముగా కలిగియున్నాడు.
శ్రీసాయితో మధుర క్షణాలు - 27
కుట్టడం మరచిన తేలు
శ్రీ సాయి సత్ చరిత్ర 22వ.అధ్యాయములో పామును గాని, తేలును గాని, చంపుట న్యాయమేనా అన్న విషయం మీద చర్చ జరిగింది. దానికి బాబా చాలా సరళంగా సమాధానమిచ్చారు. భగవంతుడు అన్ని జీవులలోను నివసిస్తున్నాడు. అవి పాములైనా సరే, తేళ్ళయినా సరే. ఈ ప్రపంచాన్ని నడిపించేది భగవంతుడు. అన్ని జీవులు, పాములు, తేళ్ళు అన్నీ కూడా ఆయన ఆజ్ఞకు బధ్ధులయి ఉంటాయి.
ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరూ ఎవరికీ హని తలపెట్టలేరు. ప్రపంచమంతా కూడా ఆయన మీదనే ఆధారపడి ఉంది. ఎవ్వరూ కూడా స్వతంత్రులు కాదు. అందుచేత సకల జీవరాసుల మీద మనం దయ చూపాలి. ఏవిధమయిన శతృత్వాలు, ఘర్షణలు, చంపుకోవడాలు, లేకుండా అన్నిటినీ వదలిపెట్టి ఓరిమి వహించాలి. అందరినీ రక్షించేది ఆభగవంతుడే. ఇప్పుడు మీరు చదవబోయే లీలలో ఒక తేలు, తన కుట్టే స్వభావాన్ని ఎలా మరచిపోయిందీ వివరిస్తుంది. ఈ లీల మనలని మంత్రముగ్థుల్ని చేస్తుంది.
బాబా వారి మాతృప్రేమను వివరించే ఈలీలను మీతో పంచుకోవడం తప్ప ఏవిదంగా మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోగలం?
జూలై 1వ.తేదీ, 1988 వ.సంవత్సరం. ఆరోజున జె.వసుంధరాదేవి గారి సోదరుడు ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు. ఆయన తల్లి అతనికోసం వంట చేస్తోంది. వండిన అన్నాన్ని ఒక పళ్ళెంలో పెట్టి కొద్ది క్షణాలు వంట గదిలోనుండి బయటకు వెళ్ళింది. తరువాత మరలా వంటగదిలోకి వచ్చి చూసేటప్పటికి పళ్ళెంలో పెట్టిన వేడి వేడి అన్నంలో రెండు పెద్ద ఖాళీలు (ఎవరో అన్నం చేతితో తీసినట్లుగా)కనిపించాయి. ఆమె అందరినీ పిలిచి ఆవింత చూపించించింది. అందరూ ఆపళ్ళెంలోకి చూసి అంత వేడి వేడిగా ఉన్న అన్నాన్ని బాబావారు స్వీకరించి, తమ లీలను చూపించారని, ఆయన అనుగ్రహపు జల్లులు తమందరిమీద కురిపించినందుకు ఎంతో సంతోషించారు. బాబాను ప్రార్ధించారు.
సింధియాలో ఉన్న సాయి మందిరానికి వెళ్ళి ఆయనకు తమ కృతజ్ఞతలు తెలుపుకుందామని నిర్ణయించుకొన్నారు. సాయి మందిరం వారి యింటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. వారక్కడికి అరుదుగా వెడుతూ ఉంటారు. తమతో పాటుగా తమ స్నేహితులు కొంతమంది ఎవరయిన వస్తారేమో అడిగి వారిని కూడా తీసుకొని వెడదామనుకొన్నారు. వారి యింటి ప్రక్కనఉన్నవారి బాబు రాహుల్ ని కూడా తమతో తీసుకుడదామనుకొన్నారు. బాబు వయస్సు 3 సంవత్సరాలు. చాలా తెలివైనవాడు. బాబుకి బాబా అంటే చాలా యిష్టం. ఎప్పుడూ బాబా ఊదీ పెట్టుకుంటాడు. బాబా పాటలు వినడమన్నా ఎంతో యిష్టం. బాబు తెలివితేటలు చూసి 6 మాసాల ముందునుండే స్కూల్ లొ వేశారు.
ఆరోజున రాహుల్ ఎప్పటిలాగే ఉదయం 7.45 కి స్కూలుకు వెళ్ళాడు. మరలా తిరిగి ఉదయం 11.15 కి యింటికి వచ్చాడు. పెద్దవాళ్ళెవరి సాయం లేకుండానే తనబూట్లు, సాక్సు తనే విప్పుకున్నాడు. పొరుగింటిలో మరొకరు ఉంటున్నారు. వారి అబ్బాయి శివబాబు ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. రాహుల్ విప్పిన సాక్సు చేతిలో ఉంది. ఆ సాక్సులో ఏదో ఒకవిధమైన గడ్డలాంటిది ఉండటం శివబాబు చూశాడు. అదేమిటో చూద్దామని రాహుల్ చేతిలో నుండి సాక్సు తీసుకొని చూశాడు. సాక్సులో ఒక తేలు ఉంది. అదింకా బ్రతికే ఉంది. వెంటనే ఆతేలుని చంపేశారు. రాహుల్ తల్లి చాలా భయపడిపోయి "కాలికి ఏమయినా నొప్పి గాని, మంటగాని ఉందా"అని అడిగింది. తనకి ఏవిధమయిన మంట, నొప్పి లేవని చెప్పాడు. అంత పసివయసులోనే బాబా భక్తుడయిన ఆబాబుకు నొప్పి, మంట ఎందుకు ఉంటాయి? కుట్టడమే తన సహజ గుణమయిన ఆతేలుకి కుట్టడమే మరచిపోయేలా చేశారు బాబా. ఆయన ఎల్లప్పుడూ తన భక్తులమీద ప్రసరించే మాతృప్రేమ అది.
అంతకుముందు వారు మందిరానికి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. రాహుల్ చిన్నపిల్లవాడవడం వల్ల బాబుని ఎత్తుకొని గుడివరకూ నడచి వెళ్ళడం కష్టమని రాహుల్ని ఇంటివద్దే వదలి వెడదామనుకొన్నారు. కాని యిప్పుడు బాబా బాబుని ఏవిధంగ రక్షించారో చూసిన తరువాత మనసు మార్చుకొని బాబుని కూడా తమతో మందిరానికి తీసుకొని వెళ్ళడానికి నిశ్చయించుకొన్నారు. బాబు బస్సు స్టాండునుంచి మందిరంవరకూ ఎటువంటి అలసట లేకుండా నడిచాడు. బాబుని కాపాడినందుకు వారంతా కృతజ్ఞతలతో బాబాని ప్రార్ధించారు. ఎవరయితే మనస్ఫూర్తిగా, త్రికరణశుధ్ధిగా ఆయన సహాయంకోసం అర్ధిస్తారో వారికి బాబా వెంటనే సహాయం చేస్తారని స్వామి శ్రీసాయి శరణానందజీ గారు చెప్పారు. త్రికరణశు ధ్ధికి ఎటువంటి కొలమానాలు లేవు. కాని భక్తుడు పిలచిన వెంటనే బాబా వెంటనే స్పందించి, వెన్వెంటనే తన భక్తుని సహాయం కోసం వస్తారు.
సాయి ప్రభ
జనవరి 1989
జె.వసుంధరాదేవి
ఆంధ్ర ప్రదేశ్
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment