06.03.2017 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక అధ్బుతమైన సంఘటన గురించి తెలుసుకుందాము.
తెలుగు అనువాదం ః ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్, దుబాయి
ఆశావరి
వైకుల్
బొంబాయిలో
నివసించే ఆశావరి వైకుల్ సాంప్రదాయ జానపద పాటలు పాడటంలో మంచి పేరుప్రఖ్యాతులు గాంచింది. మహారాష్ట్రలో ఆమె శ్రావ్యంగా పాటలు పాడటమే కాదు
లావణి నృత్యం కూడా చాలా అద్భుతంగా చేసేది.
లావణి నృత్యాలు చేయడంలో ఆమె మహారాణిగా ప్రసిధ్ధి చెందింది.
బాబాపై భక్తి గీతాలను మనోరంజకంగా ఎంతో భక్తి భావంతో
ఆలపిస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె పాటలు
పాడుతుంటే అవి ఎంతో మధురంగాను, శ్రావ్యంగాను ఉండేవి. శ్రోతలందరూ ఆనందసాగరంలో ఓలలాడడమే
కాదు, తన్మయత్వంతో పరిసరాలను కూడా మైమరచి విని ఆనందించేవారు. ఆశావరి గొంతు కూడా చాలా మధురంగా ఉండేది. బాబా మీద ఆమెకు ఎంత భక్తి ఉందో ఆమె పాడే పాటలలోను, ఆమె చేసే లావణి నృత్యంలోను ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఒకరోజున ఆశావరి నృత్యకార్యక్రమం ముగిసిన తరువాత
ఇంటికి వచ్చి బాబా పటంముందు సాష్టాంగనమస్కారం చేసుకుంది. ఆతరువాత ప్రశాంతంగా నిద్రించింది.
తెల్లవారుఝామున
ఆమెకు బాబా కలలో దర్శనమిచ్చారు. ఆ కలలో ఆశావరి
ద్వారకామాయిలో ఉన్నట్లుగా కన్పించింది. బాబా
ద్వారకామాయిలో ఎప్పుడూ కూర్చొనేచోటే చెక్కరైలింగ్ మీద తన చేతిని ఆన్చి కూర్చుని ఉన్నారు.
ఆయన తెల్లని కఫనీ ధరించి, తలకు తెల్లని గుడ్డ చుట్టుకొని
ఉన్నారు. ఆయన నుదిటిమీద చందనంతో త్రిపుండ్రం
(మూడు అడ్డగీతలు) ఉంది.
ఈవిధంగా ఆయన ద్వారకామాయిలో
ఆశీనులయి ఉన్నారు. ఆయన ప్రక్కన నేలమీద చిలుము,
సటకా ఉన్నాయి. ఏకాగ్రతతో ధునివైపే చూస్తూ ఉన్నారు. ఆశావరి మెట్లు ఎక్కి, ఒక్క క్షణం అక్కడే నిలబడింది. బాబా తలతిప్పి ఆమెవైపు చూశారు. ఆసమయంలో ద్వారకామాయిలో బాబా ఒక్కరే ఉన్నారు. ఆమెవైపు చూసి లోపలికి రమ్మని సైగ చేశారు. బాబా నవ్వుతూ “అమ్మాయి! లోపలికి రా” అన్నారు. ఆశావరి సంతోషంగా బాబా పాదాలవద్ద కూర్చుంది. బాబా నవ్వుతూ ఆమె తలమీద చిన్నగా కొట్టి, “అమ్మాయి,
నువ్వు ఇపుడు భక్తితో పాటలు పాడుతున్నట్లుగానే ఇక ముందు కూడా నాపాటలను గానం చేస్తూ
ఉండు. జీవితాంతం గానం చేస్తూ ఉండు. అల్లా నీకు మేలు చేస్తాడు” అని దీవించారు. బాబా మాటలకు ఆశావరి ఎంతో ఆనందాన్ని పొందింది. గొంతు గాద్గదికమయి నోట మాట రాలేదు. బాబా ఆమెవైపు తదేక దృష్టితో ఎంతో అబిమానంగా చూస్తూ
ఉన్నారు. ఆశావరి కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి.
బాబా ఆమెని ఒక చిన్న పిల్లను దగ్గరకు తీసుకున్నట్లుగా
దగ్గరకు తీసుకున్నారు. ఆమె తలమీద కొట్టి,
“ఎందుకు ఏడుస్తున్నావు? నీకేంకావాలి?” అన్నారు. ఆశావరి చాలాసేపు మౌనంగా ఉంది. ఆఖరికి ఆమె బాబాతో, “బాబా, నాజీవితం ఇలాగే తృప్తిగా
ఆనందంగా గడిచిపోవాలి. అంతకు మించి నాకింకేమీ
అవసరం లేదు” అంది.
బాబా మృదువయిన స్వరంతో
“అల్లామాలిక్, అల్లామాలిక్” అని వెంటనే అదృశ్యమయిపోయారు. ఆశావరి నిద్రలోనే ‘బాబా” అని గట్టిగా అరిచింది. వెంటనే ఆమెకు మెలుకువ వచ్చింది. తనకెదురుగా గోడమీద ఉన్న బాబా చిత్రపటానికి మనసులోనే
ధన్యవాదాలు అర్పించుకొంది.
బాబా
పై తాను పాడే భక్తిగీతాలను బాబా ఆమోదించినందుకు ఆశావరి ఎంతో సంతోషించింది. నిజానికి నవవిధ భక్తులలో మొదటివయిన భజనకు, కీర్తనకు,
చింతనకు ప్రాధాన్యతనిచ్చారు. మిగిలినవాటికి
అంతగా ప్రాముఖ్యతనివ్వలేదు. భజనల ద్వారా మనం
ఆయననుంచి వందలకొద్దీ దీవెనలను అందుకుంటామని ఆశావరి గట్టి నమ్మకం.
ఈ
విధంగా బాబా తన ఆధ్యాత్మిక సంపదను స్వీకరించడానికి తమ అనుమతిని ఒసంగినందుకు ఆశావరి
ఎంతగానో సంతోషించింది.
శ్రీసాయి
సత్ చరిత్ర 3వ. అధ్యాయం ఓ.వి. 12 :
“నాయొక్క
ఈ అవతారం సార్ధకం. సదా నాయందు ధ్యానముంచువారి
యోగక్షేమాలు నేను వహిస్తాను. ప్రేమతో నా నామాన్ని
స్మరించువారి సకల కోరికలను తీర్చి వారి ప్రేమను వృధ్ధి పరుస్తాను. నా లీలలను, నా చరిత్రలోని గాధలను గానం చేయువారికి
ముందూ, వెనుకా, నలుదిక్కులా నిలబడి ఉంటాను.
హృదయపూర్వకంగా మనో ప్రాణాలు నాకంకితం చేసేవారికి నా ఈ కధాశ్రవణం ఆనందాన్ని కలిగించటం
సహజం. నా కధాసంకీర్తన చేసేవారికి అనునిత్యం
సుఖశాంతులను ఆనందాన్ని ప్రసాదిస్తాను. ఇది
నా సత్యవచనం. అనన్యంగా నా శరణు జొచ్చి విశ్వాసంతో నాభజన, నా చింతన, నా స్మరణ చేసేవారినుధ్ధరిస్తాను.”
శ్రీ
సాయి సత్ చరిత్ర 21వ. అధ్యాయంలో ఆనందరావు పాటంకర్ వేదాంత శ్రవణమెంతగా చేసినా ఉపనిషత్తులన్నీ
టీకాతో సహా చదివినా మనసుకు శాంతి లభించలేదు.
అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించుకున్నపుడు బాబా అతనికి ఒక కధను చెపుతూ, ఒక వ్యాపారి ఎదుట ఒక గుఱ్ఱం తొమ్మిది లద్దెలను వేయుట,
అతడు వాటిని తన చెంగులో కట్టుకొనుటను గురించి వివరించారు. బాబా చెప్పిన తొమ్మిది ఉండలయొక్క గూఢార్ధం నవవిధ
భక్తుల గురించే. మొదటి మూడు శ్రవణం, కీర్తనం,
విష్ణుస్మరణ. ఇవి భక్తిమార్గమనే నిచ్చెనకు
మెట్లు. బాబా తానే స్వయంగా ఆశావరి గానం చేసే భక్తిపాటలకు తన సమ్మతిని స్పష్టాతిస్పష్టంగా తెలియచేశారు.
దీనిని బట్టి మమందరం గ్రహించవలసినదేమిటంటే మనం భగవంతునియొక్క లీలలను వినాలి. ఆయన గాధలను కీర్తించాలి. ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అందుచేతనే బాబా సత్సంగాలలో మనమ్ ముందుగా ఆయన నామాన్ని స్మరిస్తాము.
ఆయన భక్తి గీతాలను ఆలపిస్తాము. ఆయన చరిత్రను చదువుతాము.
శ్రీ సాయిలీలా సంచిక వాల్యూమ్ 63 నం. 8- 9 నవంబరు 1984
సాయిలీలా వాట్ స్ ఆప్ గ్రూప్ నుండి సేకరణ.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment