07.03.2017 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక అత్యద్భుతమైన సాయి లీలా విలాసం గురించి తెలుసుకుందాము.
తెలుగు అనువాదం ః ఆత్రేయపురపు త్యాగరాజు, ఆల్ ఖైల్ గేట్, దుబాయి
నా పిల్లలను ఆకలితో ఉంచగలనా???
బొంబాయి
నివాసియైన వివేక్ మజ్ గావకర్ గొప్ప సాయి భక్తుడు.
బాబా అనుగ్రహం లేకపోయినట్లయితే జీవితమే వ్యర్ధమని భావించే వ్యక్తి. అతని జీవితమమంతా బాబా చుట్టూరా పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఒకసారి అతని జీవితంలో చాలా దయనీయమయిన పరిస్థితి
ఎదురయింది. బాబా ఆసమయంలో అతనిని ఆపరిస్థితినుంచి
ఏవిధంగా గట్టెక్కించారో చాలా అధ్భుతంగాను, ఆశ్చర్యకరంగాను ఉంటుంది. ఇపుడు బాబా దయవల్ల అతను చాలా సంతోషంగాను, తృప్తిగాను
జీవిస్తున్నాడు.
ఒకసారి
అతనిని బంధువులు షిరిడీకి తీసుకునివెళ్ళమని కోరారు. బంధువుల్లో కొంతమంది ఆడవారు, పిల్లలు ఉన్నారు. వారి కోరికమేరకు అతను ఒక పెద్ద వ్యాను ఏర్పాటు చేసాడు. అందరూ కలిసి ఎటువంటి కష్టం లేకుండా షిరిడీ చేరుకున్నారు. ఆరాత్రికి షిరిడీలోనే బస చేసి మరుసటి రోజు ఉదయాన్నే
కాకడ హారతికి వెళ్ళారు. తనివితీరా బాబా దర్శనం
చేసుకున్నారు. ఉదయం అందరు ఫలహారాలు కానిచ్చిన
తరువాత బంధువులందరూ అక్కల్ కోట కూడా చూద్దామని అక్కడికి తీసుకుని వెళ్ళమని అడిగారు. వివేక్ సరేనని ఒప్పుకోవడంతో అందరూ సామాన్లు సద్దుకొని
తయారయ్యారు. అపుడు సమయం ఉదయం 11 గంటలయింది. షిరిడీనుండి అక్కల్ కోట చాలా దూరమనే విషయం పాపం
వివేక్ కి తెలీదు. అక్కల్ కోట ఎంత దూరంలో ఉందని
డ్రైవర్ ని అడిగాడు. “ఆ, ఎంతండీ, రెండు గంటల్లో మన అక్కల్ కోట వెళ్ళిపోవచ్చు” అన్నాడు
డ్రైవరు. అక్కల్ కోటకి ఏమార్గంలో వెళ్ళాలో
అది షిరిడీనుండి ఎంత దూరంలో ఉందనే విషయం డ్రైవర్ కి కూడా తెలీదు. డ్రైవర్ కి తెలీదనే విషయం ఆసమయంలో వివేక్ కి తెలీదు. సరే 11 గంటలకి బయలుదేరితే అక్కల్ కోటకి
మధ్యాహ్నం ఒంటిగంటకల్లా చేరుకోవచ్చు, అక్కల్ కోటలో భోజనాలు చేసేయవచ్చనుకున్నారు అందరూ.
అందరూ
కలిసి వానులో బయలుదేరారు. రెండుగంటలు ప్రయాణం
చేసినా ఎక్కడా అక్కల్ కోటకి చేరుకుంటున్న సూచనలు ఏమీ కనపడలేదు. అసలు వారు ఏప్రదేశంలో ఉన్నారో కూడా తెలీని పరిస్థితిలోను,
అయోమయంలోను పడిపోయారు. డ్రైవర్ని అడిగితే అక్కల్
కోటకి దగ్గరలోనే ఉన్నాము ఇక కొద్దిసేపట్లోనే చేరుకుంటామని చెప్పాడు. ఎన్నిమార్లు అడిగినా అదే సమాధానం చెప్పేవాడు. రోడ్డుప్రక్కల ఉన్న సూచికలను బట్టి డ్రైవర్ ఆఖరికి అక్కల్ కోట వెళ్ళడానికి
షోలాపూర్ మీదుగా వెళ్ళాలని తెలుసుకునేటప్పటికి సాయంత్రం అయింది. ఇక ఆ దారిలో వెళ్ళసాగాడు. అడిగిన ప్రతిసారీ ఇక కాసేపట్లోనే అక్కల్ కోట చేరుకుంటామనే
చెపుతున్నాడు డ్రైవరు. ఆఖరికి వారంతా అక్కల్
కోట చేరేటప్పటికి రాత్రి బాగా పొద్దుపోయింది.
ఆసరికి అందరూ అలసిపోయి చాలా ఆకలితో ఉన్నారు.
అక్కల్
కోట ఎక్కడో మారుమూలనున్న చిన్న గ్రామం. అక్కడ
ఉండటానికి ఎటువంటి సౌకర్యాలు గాని, హోటళ్ళు గాని లేవు. ముందర ఆడవాళ్ళు, పిల్లలు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి
ఒక గది ఏమన్నా దొరుకుతె వాళ్ళని అందులో బస చేయించి ఈలోపులో అందరికీ భోజనాలకి ఎక్కడ
ఏర్పాటు ఉందో వెతకచ్చు అనుకున్నాడు వివేక్.
సంస్థానం వారి భక్తినివాస్ ఇంకా నిర్మాణదశలోనే ఉంది. అక్కడ బసకి గాని, భోజనాలకిగాని ఇంకా ఎటువంటి ఏర్పాట్లు
లేవు. లాభం లేదు. బాగా రాత్రివేళ కావడంతో అన్నీ మూసేసి ఉన్నాయి. కనీసం బసచేయడానికి ఒక్క గదిగాని, ఏదన్న తిందామన్నా
కనీసం ఒక్క హోటలు గాని లేవు. ఏమి చేయాలో పాలుపోని
పరిస్థితి. చిన్న పిల్లలందరూ ఆకలి, ఆకలి, అంటూ
ఏడుస్తున్నారు. వారి పరిస్థితి చాలా దయనీయంగా
ఉంది. పెద్దవాళ్ళే ఆకలికి తట్టుకోలేకుండా ఉంటే
పిల్లలపరిస్థితి మరీ ఘోరంగా ఉంది. తినడానికి
కాస్తయినా ఏదన్న దొరుకుతుందేమో, చిన్న హోటలు ఏదయినా కనిపిస్తుందేమో చూద్దామని కారుని
మెయిన్ రోడ్ మీదే పోనిస్తూ ఉండమని చెప్పాడు డ్రైవర్ కి వివేక్. కాని ప్రతిచోట రోడ్డంతా చీకటిగాను, నిర్మానుష్యంగాను
ఉంది. ఎంత ముందుకు వెళ్ళినా ఏమీ కనపడలేదు.
ఆఖరికి ఒక చోట తమలపాకులు అమ్మే చిన్నదుకాణం, దాని
ప్రక్కనే రేకుల షెడ్డుతో చిన్న హోటలు కనిపించాయి.
కడుపులో ఆకలి కరకరమని నమిలేస్తూ ఉంది.
తినడానికి ఏమయినా దొరుకుతుందా అని ఆ చిన్న హోటల్ యజమానిని అడిగాడు వివేక్. "అన్నీ మూసేసి ఉన్నాయి. ఈ సమయంలో దొరకడం చాలా కష్టం, ప్రొద్దున్నయితే భోజనం
దొరుకుతుందని" చెప్పాడు హోటలతను. ఆకలి విపరీతంగా
ఉండటంతో తినడానికి ఇంకేమయినా దొరుకుతుందనే ఆశతో మరలా ముందుకు వెళ్ళారు. కాని నిరాశే ఎదురయింది. కారుని మళ్ళీ వెనక్కి త్రిప్పి బయలుదేరారు. మరలా అంతకు ముందే ఆగిన హోటల్ దగ్గరకు వచ్చి అతనిని
బ్రతిమాలాడు. కాని పాపం ఆ హోటల్ యజమాని మట్టుకు
ఏంచేయగలడు? వారి బాధను విని ఊరుకోవడం తప్ప
ఏమీ చేయలేకపోయాడు.
ఆఖరికి
ఇంకేదయినా హోటల్ కనబడుతుందేమో చూద్దామనే ఆశతో ఊళ్ళోకి బయలుదేరారు. కాని ఊళ్ళో కూడా అతనికి నిరాశే ఎదురయింది. అన్ని దార్లు మూసుకుపోయాయి. ఏదారి కనబడలేదు. ఆఖరికి బాబాని శరణు వేడుకున్నాడు.
(బాబా
షిరిడీలో ఎంతోమందికి తానే స్వయంగా వండి అన్నదానం చేసారు. మరి ఈ సమయంలో అన్నార్తులను ఆదుకోరా???)
బాబాని
ఆర్తితో ఎలా ప్రార్ధించాడు.
“బాబా,
నాకింతటి విషమ పరీక్ష పెడుతున్నావేమిటి? నాతోపాటుగా
చిన్న పిల్లలు కూడా వచ్చారు. అకలితో అలమటిస్తూ
ఉన్నారు. పసిపిల్లలు ఆకలితో బాధపడుతూ ఉంటే
వారి స్థితిని చూడలేకుండా ఉన్నాను. కనీసం పిల్లలకోసమయినా
తినడానికి ఏమయినా దొరికేటట్లు చేయి బాబా” అని కన్నీళ్ళతో వేడుకున్నాడు. వివేక్ డ్రైవర్ ని మరలా అంతకు ముందు తాము ఆగిన హోటల్
వద్దకే మెల్లగా కారుని వెనక్కే పోనిమ్మని చెప్పాడు. ఆతరువాత జరిగిన సంఘటనకి అతనికి నోటంబట మాట రాలేదు.
వారంతా
ఆ హోటల్ వద్దకు చేరుకుంటుండగా ఆహోటల్ యజమాని చేతులు ఊపుతూ కారుని ఆపమన్నట్లుగా పరిగెత్తుకుంటూ
వచ్చాడు. “అయ్యా, ఆగండి హోటల్ లోపలికి రండి”
అని ఎంతో ఉద్వేగంతో లోపలికి అందరినీ ఆహ్వానించాడు. ఏమి జరుగుతోందో వివేక్ కి అసలేమీ అర్ధం కావటల్లేదు. ఊహకందడంలేదు.
అందరూ హోటల్ లోకి వచ్చారు. అక్కడ వారికి
కనిపించిన దృశ్యం.
నాలుగు
స్టీల్ బకెట్లు వరుసలో పెట్టబడి ఉన్నాయి. వాటన్నిటిలో
ఘుమఘుమలాడుతూ వేడి వేడి పదార్ధాలున్నాయి. అన్నీ
కూడా చాలా సమృధ్ధిగా ఉన్నాయి. ఒకదానిలో జీడిపప్పుతో
పలావు, మిగిలిన వాటిలో బంగాళాదుంప కూర, పూరీలు, అన్నం, పప్పు ఉన్నాయి.
ఆశ్చర్యంతో
అడిగాడు వివేక్ “ నీ హోటల్లో అసలేమీలేవని ఇంతకు ముందే చెప్పావుగా. మరి ఇంతలోనే ఇన్ని
మధురమయిన వేడివేదీ పదార్ధాలు ఎలా వచ్చాయి”?
హోటల్
యజమాని కూడా అంతే ఉద్వేగంతో సమాధానమిచ్చాడు.
“అయ్యా, నేనేమి చెప్పను? చెబుతుంటేనే
నా శరీరమంతా రోమాంచితమవుతోంది. మీరు ఇక్కడినుంచి
వెళ్ళగానే ఒక వయసుమీరిన వ్యక్తి ఎంతో వేగంగా ఇవన్నీ పట్టుకుని వచ్చాడు. ఇచ్చి “నా పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. మళ్ళీ తొందరలోనే ఇక్కడికి తిరిగి వస్తారు. వారికి కడుపునిండా భోజనం పెట్టి వారి ఆకలి తీర్చు”
అని చెప్పి వెళ్ళిపోయాడు” అని జరిగినదంతా వివరంగా
చెప్పాడు.
బాబా
తప్ప మరెవరూ ఆవిధంగా చేయలేరనే విషయం వివేక్ కి అర్ధమయింది. అందరూ భోజనాలు చేయడానికి క్రింద కూర్చున్నారు. బాబా స్వయంగా తీసుకుని వచ్చిన అమృతమయమయిన ఆ మధుర
ప్రసాదాన్ని అందరూ తనివితీరా భుజించారు.
నోటిలో
పెట్టుకుంటున్న ముద్ద ముద్దకి బాబా తమ మీద కురిపించిన ప్రేమకి వివేక్ కళ్ళంబట కన్నీరు
బుగ్గలమీదుగా జాలువారసాగింది. వివేక్, అతని
బంధువులు అక్కల్ కోటలో రెండు రోజులున్నారు.
తిరుగు ప్రయాణంలో ఆ హోటల్ యజమానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి హోటల్ దగ్గర ఆగారు. ఆయజమాని చెప్పిన విషయం ఏమిటంటే ఆ స్టీలు బకెట్లు తెచ్చిన వ్యక్తి వాటిని
తీసుకుని వెళ్ళడానికి మరలా రాలేదని.
(చదివారు కదా బాబా స్వయంగా వండి తెచ్చిన పదార్దాలు, తన భక్తుల ఆకలిని తీర్చిన అధ్బుతమైన లీల)
సాయి
సాగర్ మ్యాగజైన్ వాల్యూమ్ – 7 నం. 2 ఏప్రిల్ – మే, 2009.
సాయి లీలా వాట్ స్ ఆప్ గ్రూప్ నుండి సేకరణ
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment