26.06.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి అంకిత భక్తులలో ఒకరయిన సగుణమేరు నాయక్ గురించి తెలుసుకుందాము.
సగుణమేరు గురించిన సమాచారమ్ శ్రీ సాయి సురేష్ గారు పంపించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
సాయి భక్తులు - సగుణమేరు నాయక్
శ్రీ సగుణమేరు నాయక్ పూనా తాలూకాలోని బోరి మర్మాగోవా గ్రామానికి చెందినవాడు. అతని మాతృభాష కన్నడ. అతనికి పశువులు ఉండేవి, వాటిని మేతకు తీసుకొని వెళ్తూ ఉండేవాడు. తరువాత కొంతకాలం బెల్గాంలో ఉంటూ వివిధ ప్రాంతాలకు సంచరిస్తూ ఉండేవాడు.
సగుణమేరు నాయక్ నర్సోబావాడి అనే క్షేత్రానికి వెళ్ళి, టెంబే మహారాజ్ (శ్రీ వాసుదేవానంద సరస్వతి) అను మహనీయుని దర్శించుకున్నాడు. అతడిని చూస్తూనే ఆ యతి, "నీవొక
మహనీయుని దర్బారుకు చెందినవాడివి, నీకంతకంటే యేం కావాలి?" అన్నారు. అతడికి ఆ మాటలర్థం కాలేదు. అతను 2 సంవత్సరాల పాటు నర్సోబావాడి లో ఉన్నాడు. తర్వాత కొంతకాలం అజుంకర్ మహారాజ్ తో కలిసి ఉన్నాడు. తరువాత అతను గాణుగాపూర్ సందర్శించాడు. అతను అనారోగ్యంతో హుబ్లీలోని సిద్ధారూఢ మహారాజ్ తో నివసించాడు. తర్వాత రామేశ్వర్, పండరీపూర్ మొదలైన పుణ్యక్షేత్రాలు సందర్శించి
1911-12 లో శిరిడీకి వచ్చాడు. ఈమధ్యలో అతడు కొంత నాస్తిక ప్రభావానికి గురయ్యాడు. అతని సందేహాలు తీర్చలేక అతడి తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు. శిరిడీ వచ్చేటప్పటికి అతని వయస్సు 23 సంవత్సరాలు. అప్పుడు బాబా అతనిని చూసి “నీవు ఒక గొప్ప దర్బారు నుండి వచ్చావు” అని అతడు సిద్ధారూఢ మహారాజ్ దర్బారు నుండి వచ్చిన విషయాన్ని సూచించారు. అంతేగాక, అతనిని చూస్తూనే అతని మాతృభాషయైన కన్నడంలో, "దేవుడు
లేడంటావేమి? నిశ్చయంగా వున్నాడు!" అంటూ అతని కళ్ళలోకి చూచారు బాబా.
ఒక్క వాక్యంతో, చూపుతో అతని సంశయాలన్నీ తీరిపోయాయి. తర్వాత అతడు మశీదుకెళ్ళి బాబా యొక్క దివ్యవర్ఛస్సుకు తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు. సాయి నవ్వి, "ఏమిటి, పిచ్చివాడిలా అలా చూస్తావ్? నీవు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా! మరచిపోయావా? మన తల్లిదండ్రులిక్కడే వున్నారు, మనమిక్కడే వుండాలి!" అన్నారు. తర్వాత కొంతకాలానికి సగుణ్ ఇంటికి వెళ్ళినప్పుడు, తన తల్లితో సాయి తనతో చెప్పిన విషయాన్ని వివరించాడు. అప్పుడు ఆమె "నీ 9వ ఏట నీవు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కన్పించి నిన్ను పిలిచారు. నీవు నాతో చెబితే నేను గూడ వారికి సీదా(ఒకరకమైన పప్పు తో చేసిన వంటకం) యిచ్చాను. అపుడు ఆయన నీతో , "నీవు నా చెంతకు ఎప్పుడొస్తావు?” అంటూ ఆశీర్వదించి వెళ్ళిపోయారు"
అన్నది. అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు. అప్పుడుగానీ శ్రీ వాసుదేవానందులు చెప్పిన మాటలకర్ధం సగుణ్ కు తెలియలేదు. తర్వాత అతడు జీవితాంతం శిరిడీలో వుండిపోయాడు.
అతను 1911-12లో శిరిడీకి వచ్చినప్పుడు రెండు అద్భుత సంఘటనలు జరిగాయి. అవి అతనిపై చాలా ప్రభావాన్ని చూపాయి. అతను హైదరాబాదు రాష్ట్రం నుండి ఒక ధనవంతుడైన ఒక వైశ్యునితో కలిసి శిరిడీ వచ్చాడు. ఆ వైశ్యుడు బాబాకు భక్తుడు, తరుచుగా సాయి దర్శనానికి వస్తూ ఉండేవాడు. అతడు ఈసారి తనతోపాటు తన కుమార్తెను తీసుకుని వచ్చాడు. ఆమె కాళ్ళ మీద నిలబడి నడవలేదు. ఆమె బలహీనమైన కాళ్ళ స్థానంలో తన చేతులను ఉపయోగించి నేలపై నడవటానికి ప్రయత్నించేది. అతడు ఆమెను ఎత్తుకొని తీసుకొని వెళ్లి మొదటిసారిగా బాబా యొక్క దర్శనం చేయించారు. రెండవరోజు కూడా ఆమెను అలాగే ఎత్తుకునివెళ్ళి బాబా దర్శనం చేయించారు. మూడవ రోజున, ఆమె తన కాళ్ళతో చిన్నగా అడుగులు వేయడం ప్రారంభించింది. ఎనిమిదవ రోజుకు ఆమె పూర్తిగా నడవగలిగింది. బాబా దయవలన ఆమెకు పూర్తిగా నయం అయ్యింది. ఇది ఒక అద్భుతమైన సంఘటన.
అలాగే మిస్టర్ గయాసిస్ అనే అతను తన భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చారు. అతను గతంలో G.I.P. రైల్వే
ఉద్యోగి. అతని భార్య పక్షవాతంతో బాధపడుతూ ఉంది. శిరిడీ వచ్చిన కొన్ని రోజులలో బాబా అనుగ్రహం వలన ఆమె పక్షవాతం నుండి స్వస్థత పొందింది.
సగుణ్ మొదట శిరిడీ దర్శించి 5 నెలలు అక్కడే ఉన్న తరువాత శిరిడీని
విడిచిపెట్టేందుకు బాబా అనుమతిని అడిగినప్పుడు, బాబా "ఏదో పని చేస్తూ ఇక్కడే ఉండు. దేవుని ఆశీర్వాదం లభిస్తుంది" అని చెప్పారు. అతను బాబా మాటను విశ్వసించి శిరిడీని జీవితపర్యంతం తన నివాసంగా చేసున్నాడు.
అప్పటినుండి అతను మశీదుకు ఎదురుగా టీ షాప్ మరియు ఫలహార దుకాణాలను నడుపడం ప్రారంభించాడు. ఆ షాప్ లో బాబా యొక్క చిత్రాలు, ఆరతి పుస్తకాలు మరియు ఇతర పూజ వస్తువులను అమ్ముతుండేవాడు.
‘శ్రీ సాయి సచ్చరిత’ గ్రంథంగా వెలువడినపుడు, ఆ గ్రంథాలను తన దుకాణంలో వుంచి అమ్మేవాడు సగుణ్. చివరికి షోలాపూర్ కి చెందిన ఫొటోగ్రాఫర్ నుండి బాబా ఫొటో ప్రింట్ లు సంపాదించి ఫ్రేం కట్టించి అమ్మేవాడు. అతను శిరిడీలో ఆవిధంగా జీవితం ప్రారంభించిన నాటి నుండి సంపన్నుడయ్యాడు. దుకాణం ప్రారంభించినరోజు సగుణ్ ఒక లడ్డూ మరియూ కొంచెం ‘చివ్ డా’ (మరాఠి వంటకం) ఓ పళ్ళెంలో వుంచి బాబాకి సమర్పించాడు. బాబా కొంత రుచి చూసి, “బాగుంది. ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనే వుండాలి. చింతపడకు, నేను నీ దుకాణంలోనే వుంటాను” అని సగుణ్ ని ఆశీర్వదించారు.
(ఛివ్ డా.. అటుకులతో చేసే మరాఠీ వంటకం)
(దానిని ఏ విధంగా చేయాలో యూ ట్యూబ్ లో చూడండి)
https://www.youtube.com/watch?v=OHnYVU_yzK0
శిరిడీకి భక్తులు రావడం ఎక్కువ కావడంతో, సగుణ్ భోజన హోటల్ ని ప్రారంభించాడు. బాబాకి నైవేద్యం సమర్పించడం సగుణ్ ఎప్పుడూ మర్చిపోలేదు.
సగుణ్ దయాగుణం ఎంతటిదంటే, షిరిడీలో ఎవరూ ఆకలితో బాధ పడకుండా చూసేవాడు. దారిన పోయేవాడయినా, సాధువయినా, భిక్షగాడయినా, లక్షాధికారయినా సగుణ్ వారికి భోజనం పెట్టేవాడు. అతడు ప్రతి ఒక్క భక్తునికి వారు భోజనం కోసం ధనం చెల్లించారా, లేదా అనే దానితో సంబంధం లేకుండా భోజనం పెట్టేవాడు. ఏ భక్తుడినీ అతడు తినకుండా పంపలేదు. బాబా ఒకసారి సగుణ్ తో “భుకేల్యా జీవాచీ భుక్ జాణావి! రిక్తహస్తె దారాతూన్ కుణాలా పాఠవూ నయే!” (ఇతరుల ఆకలిని నీ ఆకలిగా భావించుకో, ఎవరినీ రిక్తహస్తాలతో నీ గుమ్మం ముందునుండి పంపవద్దు) అన్నారు.
ప్రతిరోజూ భోజనాలయ్యాక సగుణ్ మేరు నాయక్ మశీదు శుభ్రంచేసి, సాయి యథాస్థానంలో కూర్చున్నాక, ఆయనకు తాంబూలం ఇచ్చేవాడు. బాబా అది తిన్నాక గ్లాసుడు మంచి నీళ్లు ఇచ్చి 2 రూపాయల దక్షిణ ఇచ్చేవాడు. అప్పుడు బాబా కొంతసేపు మౌనంగా గడిపేవారు.
అతను ఒకసారి బాబాను తనకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని అర్థించాడు. అందుకు బాబా సరేనన్నారు. అతను మశీదులోని దీపాలను చమురుతో నింపడం వంటి చిన్న చిన్నసేవలను చేస్తూ ఉండేవాడు.
ఒకప్పుడు బెతల్ నుండి టెండూల్కర్ అనే భక్తుడు శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొని, ఆయనను భోజనానికి ఆహ్వానించాడు. బాబా నవ్వి ఊరుకున్నారు. అతడు నిత్యమూ ఇద్దరికీ భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకటి తాను తినేవాడు, వేరొకదానిపై మూతపెట్టి ఉంచమని సగుణ్ తో చెప్పేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు సగుణమేరు నాయక్ పాత్రలు తోముకుంటుండగా ఒక సాధువువచ్చి, "నా అన్నం నాకివ్వు" అన్నారు. అతడు భోజనమివ్వగానే, "ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలు" అన్నారా సాధువు. టెండూల్కర్ గాఢనిద్రలో వుండి, కబురుచేసినా రాలేదు. "మాది నాథ సాంప్రదాయం. నీవెప్పుడూ యిలాగే ఆకలిగొన్నవారికి అన్నం పెడుతూ వుండు!" అన్నారాయన. మరుసటిరోజు, ఆ సాధువు తామేనని టెండూల్కర్ తో చెప్పి, "ఎవరైనా
అన్నమడిగితే వ్యర్థంగా తిప్పి పంపకూడదు. ఏమీ లేకుంటే బెల్లం ముక్కయినా యివ్వాలి" అన్నారు
బాబా.
ఒకరోజు సగుణమేరు నాయక్ బాబా దర్శనం కోసం వెళ్ళినప్పుడు బాబా చాలా కోపంగా ఉన్నారు. బాబా సగుణ్ ను తను చెప్పినట్లు అనుసరించట్లేదని తిట్టారు. సగుణ్, “తానేమైనా తప్పు చేసానా, బాబా ఇలా కోప్పడుతున్నార”ని కలవరపడ్డాడు. సగుణ్ అకస్మాత్తుగా ఎవరైనా ఆకలితో ఉండి ఉండాలి అని గ్రహించాడు. అతను వాడాకు వెళ్లి, “ఎవరైనా భోజనము చేయకుండా ఉన్నారా?” అని అడిగారు. అప్పుడు భక్తులలో ఇద్దరు భుజించలేదని తెలిసింది. అతను వారిని భోజనానికి ఆహ్వానించాడు. వారు సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత అతను ద్వారకామాయికి మళ్ళీ వెళ్ళాడు. ఈసారి బాబా నవ్వి, "నా మాటల అర్థం తెలుసుకున్నావా? ఎల్లప్పుడూ ఇలాగే అర్ధం చేసుకొని నడుచుకో" అని చెప్పారు.
1912లో వేపచెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన తరువాత మొదటి ఐదు సంవత్సరాలు పాదుకల నిత్యపూజను దీక్షిత్ చేసేవారు. అతని తర్వాత ఈ ఆరాధన లక్ష్మణ్ కచేశ్వర్ జఖడే కొనసాగించారు. తరువాత సగుణ్ ఈ ఆరాధనను నిర్వహించేవాడు. మొదటి ఐదు సంవత్సరాలు డాక్టర్ కొఠారే ప్రతి నెలా దీపాలు వెలిగించడం కోసం 2 రూపాయలు పంపేవారు. అంతేగాక, కొఠారే పాదుకల వద్ద పైకప్పు మరియు చుట్టూ ఫెన్సింగ్ చేయడానికి కావలసిన సామగ్రిని పంపించారు. వాటిని రైల్వే స్టేషన్ నుండి శిరిడీకి తీసుకురావడానికి అయిన ఖర్చు సగుణ్ చెల్లించాడు. బాబా ఆజ్ఞ ప్రకారం ఇతను రోజూ వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించిన చోట నైవేద్యం, దీపం పెడుతుండేవాడు. బాబా నుండి ఆజ్ఞను పొంది తన సేవనందించిన ఇతడు ధన్యుడు.
1914లో బాబా ఇతనికి కలలో కనిపించి “మెత్తగా ఉడికించిన అన్నం తమకోసం తెమ్మ”ని చెప్పారు. అప్పటినుండి అతడు అలాగే తెచ్చి కొంచెం ధునిలో వేసి, మిగతాది ‘కొలంబా’లో ఉంచేవాడు. ఇలా రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత అన్నంలో కొంచెం నెయ్యి కలపమని బాబా ఆదేశించారు. అప్పటినుండి అతడలానే చేసేవాడు.
ఒకసారి శిరిడీలో నీటి కొరత గురించి ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు, బాబా ఒక ప్రత్యేక స్థలం సూచించి అక్కడ బావి త్రవ్వితే పుష్కలంగా నీరు వస్తుందని హామీ ఇచ్చారు. సగుణ్, కాకా దీక్షిత్, బూటీ తదితరులు బావి త్రవ్వించే పనిలో సహాయపడ్డారు. బాబా చెప్పినట్లే పుష్కలంగా నీరు పడింది. ఇది శిరిడీలో త్రవ్వబడిన మూడో బావి.
సగుణ్ తన జీవిత కాలంలో ఏరోజూ బాబాకి నైవేద్యం సమర్పించకుండా వుండలేదు. బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా ద్వారకామాయికి ప్రతిరోజూ నైవేద్యం తీసుకుని వస్తూనే వుండేవాడు.
బాబా సగుణ్ ని ’ఠకీ’ (మోసగాడు) అని పిలిచేవారు, అయితే ఈ అద్భుతమైన భక్తుడ్ని అలా ఎందుకు పిలిచేవారో బాబాకే తెలియాలి. బాబా మహాసమాధి తర్వాత కూడా సగుణ్ విష్ణుదేవుని పూజని కొనసాగించాడు. బాబా ఎందరో భక్తులకు ఎంతో డబ్బుని యిచ్చేవారు, కానీ సగుణ్ కి ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు, సగుణ్ ఎన్నడూ ఫిర్యాదూ చేయలేదు, బాబాని ఎప్పుడూ ఎందుకు తనకి డబ్బు ఇవ్వడం లేదని అడగనూలేదు. సగుణ్ ది నిష్కామ సేవ (ప్రతిఫలాపేక్షలేని
సేవ).
సగుణ్ ప్రత్యక్షంగా చూసిన ఒక సంఘటన ను యిలా తెలియజేసారు. ఒకప్పుడు మార్తాండ్ అనే పిచ్చి బ్రాహ్మణుడు శిరిడీ వేపచెట్టు క్రింద పాదుకలను పెద్ద బండతో రెండు ముక్కలుగా పగలగొట్టాడు. ఆ తర్వాత పార్వతి-మహాదేవుని ఆలయానికి వెళ్లి అక్కడి విగ్రహాలను కూడా పగలగొట్టాడు. భక్తులు పగిలిపోయిన పాదుకల స్థానంలో క్రొత్త పాదుకలు ప్రతిష్టించడానికి బాబా అనుమతి కోరారు. అందుకు బాబా అంగీకరించక అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం ప్రకారం అన్నదానం చేయబడింది.
తనకి విపత్తులెదురయినప్పుడు కూడా సగుణ్, “మంచైనా, చెడైనా అది బాబా నిర్ణయం” అనేవాడు. బాబా బోధనాశైలిలోని శ్రద్ధకి సగుణ్ ప్రత్యక్ష ఉదాహరణ.
సగుణ్ కు బాబా వారి బోధనలు:
1. దేనినీ ఆశించకు; ఎవరినుండీ ఏమీ ఆశించకు.
2. వున్నదానితో తృప్తిపడు.
3. నీ శక్తికొలదీ ఇతరులకు సహాయపడు.
4. ఇతరులకి సహాయపడిన తర్వాత ప్రతిఫలాన్ని కానీ, బహుమానాన్ని కానీ ఆశించకు.
5. ఇతరుల ఆకలిని నీ ఆకలి గా భావించి, వారికి ఆహారం అందించు.
6. నీ గుమ్మం నుండి ఎవరినీ ఉత్తి చేతులతో పంపవద్దు.
1922-23లో సగుణ్ కి బాబా కలలో కనిపించి, సంస్థాన్ వారు తమకు నెయ్యితో నైవేద్యం పెట్టడం లేదని, అది తమకు ఎంతో ఇష్టమని చెప్పారు. సగుణ్ మళ్ళీ తన సొంత వ్యయంతో బాబా చెప్పినట్లుగా నైవేద్యం పెట్టడం మొదలుపెట్టాడు. ఇది చూసి సంస్థాన్ వారు కూడా ఆవిధంగానే నైవేద్యం పెట్టడం మొదలుపెట్టారు.
బాబా మహాసమాధి తర్వాత ఒకసారి సగుణ్ చాలా జబ్బుపడ్డాడు, మరణం అంచుకి చేరుకున్నాడు. శిరిడీ గ్రామస్తులు ఎంతో వ్యాకులపడ్డారు, ఆయనకి నయమవుతుందని అనుకోలేదు. కానీ ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా సగుణ్ కి బాబా పట్ల వున్న విశ్వాసం అణువంతయినా తగ్గలేదు. సగుణ్ కోలుకుని, నడవగల్గిన స్థితికి వచ్చినప్పుడు, సరాసరి ద్వారకామాయి లోపలికి వెళ్ళి, కన్నీటితో బాబా చిత్రపటం ముందు నిలబడి, “నాధా, దేవా, నాకోసం ఎంతటి బాధని అనుభవించావు, నా బాధల్ని నువ్వు స్వీకరించి ఎన్ని కష్టాలు పడ్డావు” అని బిగ్గరగా ఏడ్చాడు. సగుణ్ దుఖాన్ని చూసిన వారందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
సగుణ్, బాబా ప్రసాదం మరియు ఊదీలను దూర ప్రాంతాలలో ఉండే భక్తులకు చాలా కాలం పాటు పోస్ట్ ద్వారా పంపుతూ ఉండేవాడు. అతను శిరిడీలో తన బసను కొనసాగిస్తూ, 1974
వరకు బాబా పేరుతో సేవను అందించాడు. 1974లో సగుణ్ తన 85 వ ఏట శిరిడీలో సమాధి చెందారు. దురదృష్టవశాత్తూ సగుణమేరు నాయక్ సమాధి శిరిడీలో నిర్మించబడలేదు.
బాబాలో ఐక్యమైన ఈ అద్భుతమైన భక్తుని సంక్షిప్త చరిత్ర ఇది.
(Source: Devotees Experiences of Sri Saibaba by Poojya
Sri.B.V.Narasimha Swamiji
and http://bonjanrao.blogspot.in/2012/09/saguna-meru-naik.html)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment