27.06.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి భక్తుడయిన ముక్తారామ్ గురించిన సమగ్ర సమాచారం శ్రీ సాయి సురేష్ గారు పంపించారు.
వారికి నా ధన్యవాదాలు.
సాయి భక్తులు - ముక్తారామ్
కొంతమంది సాయి భక్తులు వారి మొత్తం జీవితము భక్తితో బాబాకు సమర్పించుకున్నారు. అటువంటి వారిలో ముక్తారామ్ ఒకరు. అతను మొదట ఖందేశ్ కు చెందినవాడు. అతని ఇల్లు రావెర్ నుండి సుమారు ఒకటిన్నర మైళ్ళు ఉండేది. అతను మొదట 1910-11 సమయంలో షిర్డీకి వచ్చాడు. కొంతకాలం గడిచిన తరువాత, అతను తన సొంత భూమిని, ఇల్లు, తల్లి, భార్య మరియు పిల్లలు (సర్వ-సంగ్-పరిత్యాగ్) అందరిని విడిచిపెట్టి, శాశ్వతంగా బాబా సన్నిదిలో గడపాలని షిర్డీకి వచ్చేసాడు. బాబా అతనికి ముక్తారామ్ అనే పేరు పెట్టారు.
ఆ సమయంలో, షిర్డీలో మరొక సాయి భక్తుడు పూర్తిగా విరక్తి మార్గంలో నడిచేవాడు. అతని పేరు బలరామ్ అనబడే బాలక్ రామ్ మాన్కర్. బలరాం సహచర్యంలో ముక్తారాం తన సమయాన్ని గడిపేవారు. బాబా ఈ యిద్దరి ఆధ్యాత్మిక పురోగతికి మార్గదర్శకత్వం చేస్తూ, కేవలం షిర్డీలో ఈ యిద్దరినీ కూర్చుని ఉంచకుండా వివిధ ప్రాంతాలకు పంపుతుండేవారు. కానీ షిర్డీ వారి ప్రయాణానికి ప్రధాన కేంద్రంగా ఉండేది, ఎప్పటికప్పుడు వారు షిర్డీకి తిరిగి వస్తూ ఉండేవారు. అలా వారిని షిర్డీకి తిరిగి రప్పించడంలో, తాము వారికి ఆత్మాత్మిక మార్గదర్శకత్వం యివ్వడం మరియు వారు ఆత్మ వికాసం (స్వీయ-అభివృద్ధి) సాధించాలనేది బాబా వారి ఉద్దేశ్యం.
1914-15 నుండి,
ముక్తారామ్ శాశ్వతంగా తన నివాసాన్ని షిర్డీకి తరలించాడు. అతను సమయం అంతా బాబా చెంతనే గడిపేవాడు. అతను మసీదులో ధుని దగ్గర కూర్చునేవాడు. ఉదయాన్నే ద్వారకామాయి చేరుకొని మధ్యాహ్నం ఆరతి వరకూ అక్కడే గడిపేవాడు. అతను బాబాతో కలిసి తన అల్పాహారం మరియు భోజనం తీసుకొనేవాడు. అతను బాబా యిచ్చిన ఆహారంతోనే జీవనం సాగించేవాడు.
భోజనానంతరం బాబా ఆదేశానుసారం దీక్షిత్ వాడాకు ప్రక్కన ఉన్న ఒక చిన్న రేకుల షెడ్ కు వెళ్ళేవాడు. అక్కడ అతను ఒక ధునిని ఏర్పాటు చేశాడు. బాబా యొక్క సూచనల ప్రకారం, బాబా అతనిని బయటకు రావాలని చెప్పేంతవరకు అతను ఈ ధునికి సమీపంలోనే కూర్చొని ఉండేవాడు. వేసవికాలం వేడిలో కూడా, అతను ఆ చిన్న షెడ్ లో ధుని వద్ద గంటలు పాటు కూర్చుని ఉండేవాడు. అది చూసి అతని చుట్టూ ఉన్న ప్రజలు ఆయన ఆ వేడిని ఎలా తట్టుకోగలుగుతున్నాడో అని ఆశ్చర్యపడేవారు. దానికి కారణం నిశ్చలమైన భక్తి నుండి అతను పొందిన ఆధ్యాత్మిక శక్తి. ముక్తారామ్ తన అంతరంగ మరియు బాహ్యరంగ శక్తులను ఆధ్యాత్మిక మార్గములో మళ్ళించారు. జీవితంలో అతని ఏకైక లక్ష్యం సద్గురు చూపించిన విధంగా జీవించడమే.
బాబా అతనికి కఫ్ని మరియు తన తల చుట్టూ కట్టుకునే ఒక వస్త్రం ఇచ్చారు. అదే అతని రోజువారీ వస్త్రధారణ. తన జీవన విధానంలో, ప్రసంగం మరియు హావభావాలు బాబాతో పోలికలు ఉండేవి. అయితే కొంతమంది బాబాను అతడు అనుకరించాలని ప్రయత్నం చేస్తున్నాడని భావించారు, అందువల్ల ముక్తారాం పట్ల వారికీ ఉండే గౌరవం క్రమంగా అతనిపై అపార్థం మరియు ద్వేషంగా మారాయి. ముక్తారాం గురించి ప్రచారం చేయబడిన కొన్ని కథనాల్లో అలాగే ఈ కథలు వ్యక్తీకరణను పొందాయి.
అటువంటి ఒక కధనం మనకు ఓవి టూ ఓవి సాయి సచ్చరిత్రలో ఈ క్రింది విధంగా ఉంది.
శ్రీ ముక్తారాం బాబా యొక్క గొప్ప భక్తుడు.
శ్రీ సాయినాధులు సమాధి చెందిన కొన్ని రోజుల తరువాత, ఈ గృహస్తుడు అక్కడి ప్రజలతో శ్రీ సాయి బాబా తమ ద్వారకామాయి లోని తమ స్థలంలో నన్నే కూర్చోమని అజ్ఞాపించారు, నేనే వారి వారసుణ్ణి అని చెప్పి, తాత్యా పాటీల్, శ్రీ రామచంద్ర పాటీల్ మొదలగు గ్రామస్తులు ఎంతగా ఆవిధంగా చేయవద్దని చెప్పినప్పటికీ ఎవరి మాట వినకుండా వారిని విదిలించుకుని అతడు వెళ్లి ద్వారకామయిలో బాబా వారి యొక్క గద్దెపై కూర్చున్నాడు. కాసేపటికి అతనికి క్రింద నుండి సూదులు గ్రుచ్చుకొని రక్తం కారసాగింది. అతనిని అతని నివాసం అయిన దీక్షిత్ వాడకి తీసుకువెళ్లారు. చివరకి 7 – 8 రోజుల్లోనే భయంకరమైన స్టితిలో అతడు శ్రీ సాయిని క్షమాబిక్ష వేడుకుని ప్రాణం విడిచారు. ఇట్లే అధికారాన్ని చాటుకొనేవారు మరో ముగ్గురు నలుగురు గృహస్తులు ముక్తారాం కి జరిగినది చూచి వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఇలా ఎవరైనా తాను ఏదో గొప్ప మహారాజు అనుకొని పెత్తనం చెలాయించబోతే నాతో సమానంగా ప్రవర్తించాలని చూస్తావా? అని శ్రీ సాయి తగిన శాస్తి చేసేవారు. అయినా ఈనాడు కొందరు శ్రీ సాయియే నాలో అవతరించారు అని ప్రజలను మోసపుచ్చి తమ పాదాలపై పడేలా చేసుకుంటున్నారు. సద్గురువుతో సమానంగా ఉండాలన్న సాహసం చేసిన వారి పరిస్థితి చివరికి ఏమౌతుందో తెలియడానికి ముక్తారాం కి జరిగిన సంఘటనే ఉదాహరణ.
భక్తులు అతన్ని కోపర్ గావ్ హాస్పిటల్ కి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని కోపర్ గావ్ తీసుకొని వెళ్లబోయే ముందే, అతను దీక్షిత్ వాడలోనే మరణించాడు. అతని సమాధి లెండీ బాగ్ లో ఉంది. ఈ ఘటన ద్వారా బాబా తన గద్దెపై ఎవరినీ అనుమతించటానికి సిద్ధంగా లేరని నిరూపిస్తున్నది.
శ్రీ ముక్తారాం బాబా స్థానం లో కూర్చోవాలి అని అనుకున్నందుకు ఈ విధంగా మూల్యం చెల్లించ వలసి వచ్చింది.
ఈ విధమైన కధనం చదివన తర్వాత ముక్తారాం పై ఎవరికైన చెడు అభిప్రాయాలు కలగడం సహజం. ఈ కధనం ముందుగా H. V. సాఠె అధ్యక్షతన నడుపబడే దక్షిణ బిక్ష సంస్థ ద్వారా వెలువడే సాయినాధ ప్రభ అనే పత్రికలో ముద్రించబడింది. కానీ ఈ కధనం చదివిన తరువాత ముక్తారాం వంటి గొప్ప భక్తుడు పై ఇటువంటి అపవాదు రావడం తట్టుకోలేక ఈ కధనంలోని వాస్తవికత గురించి నాటి ఒక సాయి భక్తుడు సాయినాధ ప్రభ మ్యాగజైన్ వారికి మిత్ర అనే కలం పేరుతో ఒక లేఖ వ్రాసాడు.
దాని సారాంశం: ముక్తారాం అనే భక్తుడి మరణానికి సంబంధించి ప్రచురించిన కథ వాస్తవం కాదు. ... శ్రీ సాయి సమాధికి మూడు నెలల ముందు నుండే ముక్తారామ్ జ్వరం మరియు దగ్గుతో బాధపడుతూ, అనారోగ్యముతో తన గదిలోనే ఉంటుండేవాడు.. శ్రీ సాయి సమాధి చెందిన 8-9 రోజుల తర్వాత మసీదుకు వెళ్ళాడు. కానీ 24 గంటల కంటే తక్కువ సమయంలో తన గదికి తిరిగి వచ్చాడు. అతను బాబా గద్దె మీద కూర్చోలేదు. అతను మధ్యలో ఒక స్తంభానికి సమీపంలో ఒక గోనెపై కూర్చున్నాడు. అప్పుడు బాబా గద్దెపై కూర్చోవలెనని ముక్తారాం ప్రణాళిక చేస్తున్నాడని చాలామంది భావించారు. (పై కధనం రచించిన రచయిత అలాంటి వ్యక్తులలో ఒకరు.) ముక్తారాం త్వరలో తన గదిలోకి తిరిగివచ్చినప్పుడు,
అన్ని సందేహాలు తీరిపోయాయి.
ముక్తారాం తన గదికి తిరిగి వచ్చిన తరువాత, రచయిత అతనిని 'మీరు ఎందుకు మశీదుకు వెళ్లి, మళ్ళి మీరు ఎందుకు త్వరగా తిరిగి వచ్చారు?' అని ప్రశ్నించారు. 'నాకు ఆరోగ్యం బాగాలేదు. అందువల్ల చాలా భాదపడుతూ ఉన్నాను. నేను మసీదుకు వెళ్లి కూర్చుని శ్రీ సాయిని ప్రార్థిస్తే, నేను కొంత ఉపశమనం పొందుతాను. అందువలనే వెళ్ళాను. కానీ ఎక్కువ సమయం నేను కూర్చోవడం సాధ్యపడదు ఎందుకంటే నా జబ్బు కారణంగా ఎక్కువగా కఫం బయటకు ఉమ్మి వేయవలిసి వస్తుంది. అందువలన నేను తిరిగి నా గదికి వచ్చేసాను అని చెప్పారు. తరువాత, అక్టోబర్ నెల నుండి, అతని ఆరోగ్యం వేగంగా క్షీణించింది మరియు రెండున్నర నెలల తరువాత అతను జనవరి 1919 లో TB తో మరణించారు.
ఈ లెటర్ తోపాటు ముందు ముక్తారాం గురించి వచ్చిన కధనానికి తగిన సవరణ సాయినాధ ప్రభ పత్రికలో ఆ కాలంలోనే ఇచ్చారు.
ఆ తర్వాత సాయి లీల మ్యాగజైన్ లో కూడా ఈ లెటర్ తో పాటు క్రింది వివరణ ఇచ్చారు.
ముక్తారాం మరణ విషయంలో ఈ లెటర్ వ్రాసిన వ్యక్తే ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే అతడు ముక్తారాం ద్వారకామాయి నుండి తన గదికి వెళ్ళిన తర్వాత యితడు ప్రత్యక్షంగా అతనితో మాట్లాడారు. సచ్చరిత్రలో కధనం నిజమైతే ముక్తారాం మరణం అక్టోబర్ 1918 అయ్యిండాలి, కాని ముక్తారాం జనవరి 1919 లో మరణించిన సంగతి వాస్తవం.
ఎప్పుడు అన్నాసాహెబ్ దభోల్కర్ (శ్రీ సాయి సచ్చరిట్ రచయిత) షిర్డీని సందర్శించిన, అతను దీక్షిత్ వాడ యొక్క పై అంతస్తులోనే ఉండేవారు. అతని పరుపు ఒక కిటికీ క్రింద ఉంచబడేది. ఒకసారి, ఒక పాము కిటికీ రంధ్రం నుండి వచ్చి దభోల్కర్ యొక్క పరుపులో ప్రవేశించింది. పామును చంపడానికి అందరూ కఱ్ఱలు సేకరించారు. ఒక వ్యక్తి దానిని చంపబోయాడు; కానీ అది తప్పించుకొని వచ్చిన దారినే వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న ముక్తారామ్ మాట్లాడుతూ, “మంచియే జరిగినదని, క్రూర జంతువులను చంపవలిసిన పనిలేదని” అనెను. కానీ హేమాడ్ పంత్ ఒప్పుకొనక పామును చంపుటే మంచిదనెను. అలా ఆ చర్చ చాలాసేపు జరిగెను. కాని వారి చర్చ సంపూర్తి కాకుండా ఆ రోజుకు ముగిసెను. తదుపరి రోజు బాబా ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని లేవనెత్తారు - "నిన్న
ఏం జరిగింది?" అని అడుగగా దభోల్కర్ జరిగినదంతా చెప్పగా అప్పుడు బాబా “అన్ని జీవుల యందు భగవంతుడు కలడు. సకల జీవులను నడిపించువాడు అతడే. అవి పాములుకాని, తేళ్ళు కాని మరి ఏవియైన భగవంతుని ఆజ్ఞను శిరసావహించి నడుచును. భగవంతుని ఆజ్ఞ అయిన తరువాతనే ఎవరికైన ఏమైనా చేయును. అతని అజ్ఞాలేనిది ఏమియు జరగదు. ఎవరును స్వతంత్రులు కారు. ప్రపంచమంతయు ఆయన ఆజ్ఞపై ఆధారపడి యున్నది. అందుచే వాటికి ఏ హాని కలుగజేయక ఓపికతో యుండవలెను. జీవులన్నింటిని ప్రేమించు చుండవలెను. దైవమొక్కడే అందరిని రక్షించువాడు” అని వారి సందేహం తీర్చిరి. ముక్తారాం స్వభావం యితరుల నుండి ఎలా భిన్నమైనదో ఈ సంఘటన వివరిస్తుంది.
1915వ సంవత్సరంలో బాబా ముక్తారాం యొక్క స్వగ్రామమైన రావేర్ లోని అతనిని ఇంటిలో వున్న తమ పోటోను హార్దా లోని సాధుభయ్యా నాయక్ కు అందజేయమని ముక్తారాం, బాలక్ రాం లను పంపించారు.
(సద్దు భయ్యాకు పంపబడ్డ బాబా ఫొటో)
ఈ విషయం కాకసాహేబ్ దీక్షిత్ సాధుభయ్యాకు ఉత్తరం ద్వారా తెలియజేసారు. అదే సమయంలో హర్దా నివాసి గౌరవ మేజిస్ట్రేట్ అయిన చోటుబాయి పర్లుకర్ కి కలలో బాబా కనిపించి , "నేను సాధుభయ్యా ఇంటికి వస్తున్నాను. నువ్వు అక్కడికి వచ్చి నా దర్శనం చేసుకో" అని చెప్పారు.
కాకాసాహెబ్ ఉత్తరము ద్వారా విషయం తెలుసుకొని, సాదుభయ్యా వేరే ఎవరినీ స్టేషన్ కి పంపకుండా తానే స్వయంగా వెళ్లారు. అతను రైలు కంపార్ట్ మెంట్ లో బాలక్ రాం మరియు ముక్తారాం యిద్దరూ తమ మధ్య బాబా ఫోటో పెట్టుకొని కూర్చొని ఉండటం గమనించి కంపార్ట్ మెంట్ లోనికి వెళ్లి ముందుగ బాబా యొక్క ఫోటో ముందు సాష్టాంగ నమష్కారం చేసి, బాలారామ్ మరియు ముక్తారాం లను పలకరించి, తన ఇంటికి తీసుకువెళ్ళాడు.
అది ఫిబ్రవరి 8వ తేది దాసనవమి రోజు. చాలామంది ప్రజలు వారిని ఆహ్వానించడానికి వచ్చారు. గొప్ప అభిమానంతో, సాయంత్రం ఆరతి జరిపారు. మరుసటి రోజు గురువారం. బాలారాం మరియు ముక్తారామ్ మార్గదర్శకత్వంలో ఈ ఫోటోకి రుద్రాభిషేక పూజ జరిగింది. ఆ తరువాత ఫోటోని సింహాసనంపై వుంచి, హారతి మరియు మంత్ర పుష్పాంజలి చేసారు.
పూజలు చేసిన తరువాత, ముక్తారాం జండాలు కట్టడానికి యింటి పైకి ఎక్కాడు. అది కట్టే పని పూర్తి కాకముందే అతని చెయ్యి నొప్పి పుట్టింది. అదే సమయంలో షిర్డి మశీదులో వున్న బాబా తన చేతికి మాలిష్ చేయమని “పేదలకు దేవుడే దిక్కు, వారికి అతనిని మించి ఎవరు లేరు” అన్నారు. బాబా అలా అక్కడ చేయడంతో యిక్కడ ముక్తారాం ఏ బాధ లేకుండా జండా జయప్రదంగా ఎగురవేశాడు. బాబా తన భక్తుడు ఎక్కడ ఉన్నా యిలానే ఆదుకొంటూ ఉంటారు.
ఇక్కడ బాబా యొక్క ఫోటో సాదుభయ్యా యింటిలో స్థాపించబడింది మరియు అదే రాత్రి జల్గావ్ లో ఉన్న సాదుభయ్యా భార్య, అలాగే అతని కజిన్ సోదరునికి రెండు కలలు వచ్చాయి. అతని భార్యకు కలలో మాధవరావు దేశ్ పాండే ఒక కొబ్బరి, జాకెట్టు ముక్క మరియు పసుపు-కుంకుమ యిచ్చి "బాబా మీకు వీటిని పంపారు" అన్నారు.
సాదుభయ్యా కజిన్ సోదరుడు శ్రీ నారాయణ్ దాదాజీ బాబా ఎదుట నిలబడి ఉన్నట్లు కల కన్నారు. ఆ కలలో బాబా "మేము హర్దాకు వెళతాము. నీవు కూడా మాతో రా!" అని చెప్పారు. ఆ తరువాత వారిద్దరూ గోదావరి నది ఒడ్డున నిలబడి ఉన్నారు. అప్పుడు నది మామూలు కంటే ఎక్కువ నీటి ప్రవాహంతో ఉంది. వారు ఎక్కడ నిలబడి ఉన్నారో అచ్చటికి సమీపంలో రెండు గోనె సంచుల గోధుమలు ఉన్నాయి.
బాబా నారాయణరావును
"ఇప్పుడు ఎలా నదిని దాటబోతున్నాం?"
అని అడిగారు. కానీ, హఠాత్తుగా, 10 ఎద్దులు బరువులను మోసుకెడుతూ కనిపించాయి. మరియు బాగా నిర్మించిన రహదారి కూడా కనిపించింది. ఎద్దులు మరియు బాబా నారాయణరావు తోపాటు హార్దాలో తన యింటి నుండి సాధుభయ్యా (జండా కట్టబడిన) యింటి వరకు వచ్చి
అకస్మాత్తుగా కనిపించకుండా మాయం అయిపోయారు.
ఆ విధంగా బాబా హర్దాలో తమ సంస్థానాన్ని స్థాపించారు మరియు ఈ ప్రయోజనం కోసం ముక్తారామ్ ను మాధ్యమంగా ఉపయోగించారు.
(ముక్తారామ్ గురించిన ఈ సమాచారం సాయి సందేశ్ డిశెంబరు 2014 సంపుటి 12 సంచిక
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment