19.07.2017 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మసద్గురువయిన శ్రీ సాయిబాబాకు అత్యంత ప్రియతమ భక్తుడయిన శ్రీ మాధవరావు దేశ్ పాండే (శ్యామా) గురించి పూర్తిగా తెలుసుకుందాము. మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. బాబాకు శ్యామా అంటే ఎందుకంత అభిమానమో ఈ వ్యాసమ్ చదివితె మనకర్ధమవుతుంది. ఈ వ్యాసం శ్రీసాయి లీల ద్వైమాస పత్రిక మార్చ్ - ఏప్రిల్ 2006 సంచికలో ప్రచురింపబడింది.. మరాఠీ మూలం శ్రీమతి ముగ్ధా దివాద్కర్. ఆంగ్లంలోకి అనువాదమ్ శ్రీ సుధీర్
తెలుగు అనువాదమ్ ః ఆత్రేయపురపు త్యాగరాజు
మాధవరావు దేశ్ పాండే (శ్యామా) - 1 వ.భాగమ్
మాధవరావు దేశ్ పాండే
గురించి పరిశోధించి వ్రాసిన వ్యాసంలో బాలాసాహెబ్ దేవ్ అన్న మాటలు “శ్రీసాయిబాబాను శ్రీకృష్ణపరమాత్మునిగా
భావిస్తే,
మాధవరావుని అర్జునుడని అనుకోవాలి”.
శ్రీసాయి సత్ చరిత్రలో హేమాడ్ పంత్ బాబాని శంకరునిగాను, మాధవరావుని నందిగాను
అభివర్ణించారు.
శ్రీసాయి సత్ చరిత్రను
పారాయణ చేసేవారందరూ గమనించే విషయం ఏమిటంటే బాబా అంకిత భక్తులందరిలోకి మాధవరావు మొట్టమొదటి
స్థానంలో ఉంటాడు. సాయిని అనుసరించే వారందరిలోను
మాధవరావు అంటే తెలియనివారెవరూ ఉండరు.
మాధవరావు తన జీవితాంతం
వరకు బాబాకు సేవ చేసుకున్నాడు. బాబా అతనిని
తనకు అత్యంత ఆప్తుడయిన స్నేహితునిగా అర్జునునిగా గౌరవమిచ్చారు. ఇది భక్తుడు – స్నేహితుడు అన్నదానికి చాలా స్పష్టమయిన
ఉదాహరణ.
గొప్ప ధర్మపరాయణుడు,
దైవభక్తి కలిగిన మాధవరావు 1860 వ.సంవత్సరం (శక సం. 1872 మార్గశిర శుధ్ధపంచమి) యజుర్వేద
దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన
షిరిడీకి పశ్చిమంగా 20 మైళ్ళ దూరంలో ఉన్న నిమోన్ (సంగమనేర్ తాలూకా, అహ్మద్ నగర్ జిల్లా) గ్రామంలో
జన్మించారు.
మాధవరావు తల్లి, ఆయన
తండ్రయిన బల్వంతరావుకు నాలుగవ భార్య. ఆయన తండ్రి
మొదటి ముగ్గురు భార్యలకి సంతానం కలుగలేదు.
అందుచేత ఆయన షిరిడీ వాస్తవ్యుడయిన లక్ష్మణ్ మామా కులకర్ణి సోదరిని వివాహం చేసుకున్నారు. నాలుగవ భార్యద్వారా ఆయనకు నలుగురు సంతానం కలిగారు. వారిలో మాధవరావు పెద్దవాడు. అతని తరువాత పుట్టినవాడు కాశీనాధ్. ఇతనిని మరొక కుటుంబంవారు దత్తత తీసుకుని గణేష్ శ్రీధర్
దేశ్ పాండే అని నామకరణం చేశారు. మాధవరావు చిన్న
తమ్ముడు బాపాజీ. (ఇతని గురించి మనకు శ్రీసాయి సత్ చరిత్రలో ప్రస్తావన వస్తుంది)
మాధవరావుకి 2 -3 సంవత్సరాల
వయసులో అతని తండ్రి కుటుంబంతో సహా వచ్చి షిరిడీలో స్థిరపడ్డాడు. 5 నుంచి 6 వ.తరగతి వరకు మాధవరావు షిరిడీలోనే చదివాడు. అతని జీవితకాలమంతా షిరిడీ గ్రామీణ వాతావరణంలోనే గడిచిపోవడం వల్ల
అతను మాట్లాడే భాష స్వచ్చంగా ఉండేది కాదు.
అతను మాట్లడే మాటలన్నీ కూడా పల్లెటూరు వాళ్ళు మాట్లాడుకునే పదాలు.
మాధవరావుకి రెండు సార్లు
వివాహమయింది. అతని మొదటి భార్యపేరు ‘సావిత్రిబాయి”. ఆమె ద్వారా ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు ఏక్ నాధ్ పంత్. ఇతని భార్యపేరు ఉషాబాయి. ఉషాబాయి నిఘాజ్ గ్రామనివాసి అయిన గోపాల్ కాషేశ్వర్
కులకర్ణి కుమార్తె. మాధవరావు రెండవ భార్య ద్వారకాబాయి. ఆమెద్వారా యిద్దరు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. వారు జగన్నాధ్ పంత్, ఉధ్ధవరావు, బబితాయి. నగర్ జిల్లా పార్నర్ గ్రామానికి చెందిన
నారాయణ నగేష్ వాందేని బబితాయి వివాహమాడింది.
(శ్యామా గృహం)
మాధవరావు పొడవుగా మంచి
బలిష్టంగాను ఆరోగ్యంగాను ఉండేవాడు. మేని ఛాయ గోధుమ వర్ణమ్. అతను మంచి బలమైన
పౌష్టికాహారం తీసుకునేవాడు. మంచి జీర్ణశక్తి
కూడా ఉంది. అతనికి 72 సంవత్సరాల వయసు వచ్చేంత
వరకు ఎటువంటి అనారోగ్యం కలగలేదు. అంతే కాదు
చిన్న చిన్న రోగాలయిన జ్వరం, తలనొప్పిలాంటి వాటితో కూడా ఎప్పుడూ బాధపడలేదు.
అతను ఎప్పుడూ అనాదినుంచి
వస్తున్నటువంటి మతాచారాలను పాటిస్తూ ఉండేవాడు.
మతపరమయిన ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తూ చాలా పవిత్రంగా ఉండేవాడు. కొన్ని యింటి కట్టుబాట్లను అతిక్రమించి ఎప్పుడూ
బయట ఎవరింటిలోను భోజనం కూడా చేసేవాడు కాదు.
అతను మంచి పాకశాస్త్ర ప్రవీణుడు. అందుచేత
స్వయంగా తనే వంట చేసుకునేవాడు.
(శ్యామా పాఠశాల్)
తన విద్యాభ్యాసం పూర్తయిన
తరువాత అక్కడే షిరిడీలో తను చదువుకున్న పాఠశాలలోనే కొన్ని సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పని చేశాడు. ఈ పాఠశాల ద్వారకామాయికి ప్రక్కనే ఉంది. ఉపాధ్యాయుడవడం వల్ల గ్రామప్రజలందరూ అతనిని ఎంతో గౌరవభావంతో చూసేవారు. ఆ తరువాత తన జీవితం ఆఖరి వరకు గ్రామీణ వైద్యుడిగా
పనిచేశాడు. బాబా పేరును స్మరిస్తూ రోగులకు
మందులిచ్చేవాడు.
మొదటినుండి బాబా మాధవరావును
‘మజా శ్యామా’ ( నా శ్యామా) అని పిలుస్తూ ఉండేవారు. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ ఎంతో ఉద్వేగంతో బాబాదగ్గరకు
వచ్చాడు.
బాబా కాతో “నీకేంకావాలి” అని అడిగారు. అప్పుడు కాకా, “బాబా నేనెప్పుడూ నీదగ్గరే ఉండాలి. అదే నాకోరిక” అన్నాడు. అప్పుడు బాబా “కాకా, ఈ శ్యామాని ఎప్పుడూ నీతోడుగా
ఉంచుకో. అన్నారు. దానియొక్క అర్ధం ఏమిటంటే
నేనే నీతోనే ఉన్నాను”. ఆరోజునుంచి కాకా సాహెబ్, బాబాకి తను ఎంతటి గౌరవం యిస్తూ వస్తున్నాడో అదే విధంగా శ్యామాకి కూడా ఎంతో గౌరవాన్ని
యివ్వసాగాడు.
బాపూసాహెబ్ బుట్టీ, మరియు
నార్కేలాంటివారు వయసులో పెద్దవారయినా వాళ్ళు సయితం మాధవరావు ఎడల అంతే గౌరవభావంతో మెలగేవారు.
బాబా మాధవరావుని ‘శ్యామా’
అని పిలుస్తూ ఉండేవారు. శ్యామా బాబాని ‘దేవా’
అని సంబోధిస్తూ ఉండేవాడు. చాలామంది భక్తులు
తాము బాబాని అడగదలచుకొన్న విషయాలను గాని, సందేహాలను గాని ముందుగా మాధవరావు ద్వారా అడిగించేవారు. బాపూ సాహెబ్ బుట్టీ, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి
వారు కూడా తాము మాధవరావుకంటే వయసులో పెద్దవారయినా కూడా మాధవరావు ద్వారానే బాబాని కలుసుకొనేవారు.
బాపూసాహె బుట్టి జీవితం ఆఖరి క్షణాలలో ఉంది. ఆ సమయంలోమాధవరావు అతని ప్రక్కనే
ఉన్నాడు. అపుడు బుట్టీ యింకా స్పృహలోనే ఉన్నాడు. బుట్టీ మాధవరావును దగ్గరకు పిలిచి, “మాధవరావూ, యింక
నేనీ బాధను భరించలేను. బాబా నన్ను తన పాదాల
చెంతకు తీసుకునివెడితే బాగుంటుంది. నీగురించి
నాకు బాగా తెలుసు. నేను నీదగ్గర ఉంటే, నేను
బాబా పాదాలవద్దనే ఉన్నట్లుగా భావిస్తాను.”
ఈ మాటలు అంటుండగా బాపూ సాహెబ్ కళ్ళనుండి కన్నీళ్ళు ధారగా కారసాగాయి. తీవ్రమయిన ఉద్వేగంతో మాధవరావు పాదాలనే బాబా పాదాలుగా
భావించి తన శిరస్సును ఆనించి ప్రాణాలు విడిచాడు.
బాపూసాహెబ్ బుట్టీ మరణానంతరం,
అతని కొడుకు శ్రీమంత్ కేశవరావు బుట్టీ కూడా మాధవరావుని తన తండ్రి గౌరవించినట్లే గౌరవించాడు. తీర్ధ యాత్రలకు వెళ్ళేటపుడు తనతో కూడా మాధవరావుని
తీసుకుని వెడుతూ వుండేవాడు. నాగపూర్ లో ఉన్న
తన యింటికి మాధవరావును ఆహ్వానిస్తూ అతిధి సత్కారాలు ఎన్నో చేస్తూ ఉండేవాడు. మాధవరావు జీవించి ఉన్నంతవరకు ప్రతినెల కొంత సొమ్ము
పింఛనుగా యిస్తూ ఉండేవాడు. మాధవరావు మరణించినపుడు
అతని అంత్యక్రియలకి కేశవరావు బుట్టీ మాధవరావు కొడుకు ఏకనాధ్ కొంత డబ్బు సాయం చేశాడు.
ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్
షిరిడీలో ఉన్నపుడు ‘నవజ్వరం’ తో (చాలా ప్రమాదకరమయిన జ్వరం – అది తొమ్మిది రోజులపాటు ఉండేది)
బాధపడ్డాడు. ఆ కాలంలో యిది చాలా హానికరమయిన
జబ్బు. చాలాసార్లు అది ప్రాణాంతకంగా కూడా పరిణమించింది. బాబా కాకాతో పార్లేలో ఉన్న అతని యింటికి వెళ్ళిపొమ్మని
చెప్పారు. బాబా ఆవిధంగా అనడంతో కాకాకి బాబా
మాటలు అర్ధం కాలేదు. బాబా తనను ఆయన వద్ద ఉండమని
చెప్పేబదులు నన్ను యింటికి వెళ్ళిపొమ్మంటారేమిటి అనుకున్నాడు. అపుడు బాబా, “జాగ్రత్త, ఈ ఊదీ తీసుకో. నీతో కూడా శ్యామాను తీసుకుని వెళ్ళు” అన్నారు. కాకా సాహెబ్ జబ్బుతో బాధపడుతున్నప్పటికీ తనతో కూడా
మాధవరావు వస్తున్నందుకు చాలా సంతోషించాడు.
ఆ తొమ్మిది రోజులు కాకాసాహెబ్ కి చాలా గడ్డురోజులు. అయినప్పటికీ ఆయనకు బాబా మీద ఉన్నటువంటి ధృఢమయిన
భక్తి, మాధవరావు సాహచర్యం వీటివల్లనే బ్రతికి బయటపడ్డాడు.
మాధవరావు షిరిడీలో లేనప్పుడు
గాని, మసీదులో లేని సమయాలలో గాని, కొంతమంది భక్తులు తమ సమస్యలను నేరుగా బాబాతోనే విన్నవించుకునేవారు.
అయినప్పటికి అటువంటి సమయాలలో బాబా యిచ్చిన సమాధానాలు కొంతవరకు భిన్నంగా వుండేవి.
ఒకసారి నార్కేకి బ్రహ్మదేశ్
లో ఉద్యోగానికి రమ్మని పిలుపు వచ్చింది. ఆ
ఉద్యోగం తాత్కాలికం, స్థిరమైనది కాదు. ఆ ఉద్యోగంలో చేరవచ్చా లేదా అని బాబాని మాధవరావు ద్వారా సలహా అడుగుదామంటే అతను లేడు. అపుడు నార్కే డా.పిళ్ళే ద్వారా బాబాని అడిగించాడు. అపుడు బాబా “బ్రహ్మదేశ్ కి వెళ్ళు. అది మనదే” అన్నారు. డా.పిళ్ళే మరలా బాబాని అడిగాడు. “బాబా అక్కడ ఈ ఉద్యోగం అతనికి లాభదాయకమేనా? అతడికి ఈ ఉద్యోగం ఖాయమవుతుందా? “ అపుడు బాబా “అవుతుంది”
అన్నారు.
ఖచ్చితంతా అవుతుంది అని
బాబా చెప్పిన సమాధానం విన్న తరువాత నార్కేకి
బ్రహ్మదేశ్ లో స్థిరమయిన ఉద్యోగం వస్తుందని ప్రతివారు భావించారు. అయినా బాబా అంతకుముందు
నార్కే పూనాలోనే స్థిరపడతాడని చెప్పారు. నార్కే
యింటికి వెళ్ళిన తరువాత మాధవరావుతో జరిగిన విషయాలన్నీ చెప్పాడు. అపుడు మాధవరావు బాబాని ఈ విధంగా ప్రశ్నించాడు. “దేవా!
మీరు చెప్పిన విషయాలలో ఏది నిజం? మీరు
నాకు చెప్పిన విషయమా లేక భావూతో చెప్పిన విషయమా? (బాబా డా.పిళ్ళేని భావూ అని సంబోధిస్తూ
ఉండేవారు)” డా.పిళ్ళే తన నోటిని చేతితో మూసుకుని
నవ్వుతూ తిరిగి అదే ప్రశ్నని అడిగాడు.
“నేను శ్యామాకి ఏదయితే చెప్పానో అదే నిజం” అన్నారు
బాబా.
1913 వ.సంవత్సరంలో నార్కే
మొట్టమొదటిసారిగా షిరిడీకి వచ్చాడు. అపుడు
శ్రీబుట్టీ, శ్రీధుమాల్ యిద్దరూ మాదవరావుని అతనికి పరిచయం చేస్తూ “ఈయన షిరిడీలో అందరికీ
సహాయపడే వ్యక్తి” అని మాధవరావు గురించి చెప్పారు.
వాస్తవానికి మాధవరావు షిరిడీలో అందరికీ ఉపకారం చేసే వ్యక్తి. అతను ఒక పల్లెటూరినుంచి వచ్చిన భిక్షుక్ బ్రాహ్మిన్
అయినప్పటికి అతని ముఖం పట్టణాన్నుంచి వచ్చిన గొప్ప విద్యావంతుని ముఖంలా తేజస్సుతో వెలిగిపోతూ
ఉండేది.
బాబా నిగూఢార్ధాలతో మాట్లాడుతూ
ఉండేవారు. మాధవరావు ఎక్కువ సమయం బాబా వద్దనే
గడుపుతూ ఉండటం వల్ల బాబా మాటలలోని నిగూఢార్ధాలని చాలా తొందరగానే గ్రహించుకునేవాడు.
(రేపటి సంచికలో తర్ఖడ్ గారు షిరిడీకి రెండవసారి రావడానికి కారణమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment